తెలంగాణ ఇచ్చింది ఎవరు.. తెచ్చింది ఎవరు

ఇటీవల తెలంగాణమళ్ళీ చర్చనీయాంశమైంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం  జూన్‌ ‌రెండున ఈ అంశంపైన రాజకీయ వర్గాల్లో మరోసారి చర్చకు వొచ్చింది. దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ రావడానికి తమ పార్టీయే కారణమన్న వాదాన్ని మరోసారి బలంగా వినిపించే ప్రయత్నం చేశాయి. ఇప్పటికే ప్రతీఏట సెప్టెంబర్‌ 17‌పైన వివాదం కొనసాగుతున్నది. నిజామ్  కబంధ హస్తాల నుండి తెలంగాణ ప్రాంతం స్వేఛ్చా వాయువులు పీల్చుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని జరుపుకునే వేడుకను కొందరు విజయోత్సవంగా పిలిస్తే, మరికొందరు విమోచనోత్సవమని, ఇంకొందరు స్వతంత్ర భారత్‌లో ఈప్రాంతం విలీనమైన రోజుగా పేర్కొంటున్నారు. కాగా రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వొచ్చిన తర్వాత రాష్ట్రముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి దీనికి మరో నామకరణచేశారు. ఆ రోజున ప్రజాపాలన దినోత్సవమంటూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వేడుకలను నిర్వహించారు. ఇదిలా ఉంటే జూన్‌ 2‌న తెలంగాణ ఏర్పడడానికి కారణం తామంటే తామని రాజీకీయ పార్టీలు భుజాలు తడుముకుంటున్నాయి.

తెలంగాణ తెచ్చింది తామేనని ఇంతకాలంగా బిఆర్‌ఎస్‌ ‌క్లెయిమ్  ‌చేసుకుంటుంటే, ఇచ్చింది తామని కాంగ్రెస్‌ ‌వాదిస్తున్నది. కాగా అందుకు తాము సహకరించి ఉండకపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడదే కాదంటోంది బిజెపి. కాబట్టి జై తెలంగాణ నినాదానికి తామే హక్కుదారులమంటున్నాయి ఈ పార్టీలు. ఇదిలా ఉంటే వాస్తవంగా తెలంగాణ కోసం మొదటిసారిగా పోరాడిన ఏకైక రాజకీయ పార్టీ తమదేనని సిపిఐ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ రాష్ట్ర ఆవిర్బావ వేడుకల సందర్భంగా పేర్కొనడం గమనార్హం. గతంలో ఒకసారి ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ తెలంగాణకు అందరూ సహకరించినా బ్రాండ్‌ అం‌బాసిడర్‌గా కెసిఆర్‌కు పేరువొచ్చిందని, అయితే దాన్ని ఆయన నిలుపుకోలేకపోయారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సిపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్డూమ్ భవన్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొని మాట్లాడుతూ కెసిఆర్‌ ‌నియంతగా వ్యవహరించి తనకు వొచ్చిన కీర్తిని పోగొట్టుకున్నారని వ్యాఖ్యానించారు.

ఆయన పార్టీలోనే ప్రజాస్వామ్యం లోపించిందనడానికి ఆయన కూతురు లేఖ రూపంలో చేసిన ఆరోపణలు చెప్పకనే చెబుతున్నదన్నారు. కాగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అన్నది ఎవరో ఇస్తే వొచ్చింది కాదని, ప్రజల ప్రాణ త్యాగాలతో సాధించుకున్న రాష్ట్రమని బిజెపి ఎంపి ఈటల రాజేందర్‌ అం‌టే, తెలంగాణ అన్నది ఏ ఒక్కరి సొత్తుకాదు, అలా అనుకోవడం వారి మూర్ఖత్వమని రాష్ట్రమంత్రి, కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నాయకుడు శ్రీధర్‌బాబు అంటున్నారు. అసలు కెసిఆర్‌ ‌పద్నాలుగేళ్ళు నిర్విరామంగా పోరాడకపోతే, ఆమరణ దీక్ష చేయకపోతే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడేదే కాదు. ఆనాటి యుపిఏ ప్రభుత్వం తెలంగాణని ఇచ్చేదేకాదని బిఆర్‌ఎస్‌పార్టీ సీనియర్‌ ‌నాయకుడు, మాజీమంత్రి హరీష్‌రావు అంటున్నారు. నాలుగుకోట్ల ప్రజలకోసం కెసిఆర్‌ ‌జై తెలంగాణ నినాదాన్ని ఎత్తుకున్నారని, ఇది రాష్ట్ర ప్రజల నినాదమేగాని ఎవరూ పేటెంట్‌ ‌తీసుకోలేరంటారాయన. 

    తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడడానికి అన్ని రాజకీయ పార్టీలతో పాటు, ఇక్కడి ప్రజలంతా ఏక కంఠంగా కోరుకోవడం వల్లే తెలంగాణ సాధ్యపడిందన్నది ఎవరూ కాదనలేని విషయం. తెలంగాణ ఫోరంలు, రాజకీయ, ఇతర జాక్‌ల పోరాటాల ఫలితంగా ఏర్పడిందే తెలంగాణ. ఎవరో ఒక్కరి ఘనత ఉందనడానికి వీలులేదు. అయితే ఈ పోరాటంలో ముందువరుసల నిలిచి, రాజకీయ ప్రక్రియతో సాధించడంలో బిఆర్‌ఎస్‌ ‌ముందువరుసల ఉంద న్నది కూడా కాదనలేని నిజం. ఎందుకంటే దేశంలో 36 ప్రధాన రాజకీయ పార్టీలను మెప్పించి, ఒప్పించి వారి అభిప్రాయాలను లేఖ రూపంలో తీసుకోవడంలో ఆపార్టీ అధినేత కెసిఆర్‌ ‌కృషి ఉంది. దానితోపాటు కాంగ్రెస్‌ ‌సాహసోపేత నిర్ణయాన్ని తీసివేయలేనిది. రాష్ట్రాన్ని ఏర్పరిచి రెండు రాష్ట్రాల్లోనూ అధికారానికి దూరం కావాల్సి వొచ్చింది. తెలంగాణలోనైనా పదకొండు ఏళ్ళ తర్వాత అధికారంలోకి రాగలిగింది కాని, ఆంధప్రదేశ్‌లో మాత్రం అధికారాన్ని ఆశించే పరిస్థితి కూడా ఇప్పుడు ఆ పార్టీకి లేకుండా పోయింది.

కాగా ఈ మహా యజ్ఞంలో బిజెపి తన వంతు పాత్రను నిర్వహించింది. ఉభయసభల్లో తెలంగాణ బిల్లు పాస్‌ అయ్యేరీతిలో సమయానుకూలంగా వ్యవహరించింది. ఇలా ఒక్కొక్క పార్టీ ఒక్కో రీతిలో తెలంగాణ ఏర్పడడానికి కారణంగా మారాయి. అందుకే జై తెలంగాణ నినాదం ఏ ఒక్కరి సొంతం  కాదన్న వాదన సరైనదిగానే భావించాల్సి    ఉంటుంది. ఇకపోతే  తెలంగాణ జాతిపిత కెసిఆర్‌ అన్నది కూడా ఇటీవల వివాదంగా మారింది. తెలంగాణ జాగృతి అధినేత కల్వకుంట్ల కవిత ఇటీవల జాగృతి ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న సందర్భంలో తెలంగాణ జాతిపిత కెసిఆర్‌ అం‌టూ మాట్లాడడాన్ని  పలువురు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మన జాతిపిత మహత్మాగాంధీ మాత్రమేనని, మరో జాతిపిత ఉండరని పేర్కొంటున్నారు.

పైన పేర్కొన్నట్లు వివిధ రాజకీయ పార్టీలు ఎలా పోరాటంలో భాగస్వామి అయ్యాయో పలువురు నేతలు, విద్యావంతులు ఈ ఉద్యమంలో పాల్గొన్నారని, చాలామంది 2001 కన్నా ముందునుండే తెలంగాణ కోసం త్యాగం చేసిన వారున్నారంటున్నారు. ముఖ్యంగా ప్రొఫెసర్‌ ‌జయశంకర్‌సార్‌ ‌మూడు తరాలను తట్టిలేపిన వ్యక్తి, అలాగే కొండా లక్ష్మణ్‌ బాపూజీ తెలంగాణ కోసం తన మంత్రి పదవిని వదులుకోడమే కాదు, చనిపోయేవరకు తెలంగాణ నినాదాన్ని వదలని వ్యక్తి. అదే కోవలో భూపతి కృష్ణమూర్తి, కేశవరావు జాదవ్‌ ‌లాంటివారు అనేకులున్నారు. మరి వారిని ఏమని పిలవాలి అని  వారు ప్రశ్నిస్తున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *