పెట్టుబడులే లక్ష్యంగా ప్రణాళికలు..

  • దావోస్‌ చేసుకున్న సిఎం రేవంత్‌ బృందం
  • వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ వార్షిక సదస్సుకు హాజ‌రు
  • ప్రపంచ అగశ్రేణి ప‌రిశ్ర‌మ‌లు, సంస్థల అధినేతలతో భేటీ కానున్న రేవంత్‌

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి బృందం దావోస్‌ చేసుకుంది. ఆయనవెంట ఐటి శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు, ఐటి సెక్రటరీ జయేశ్‌ రంజన్‌ ఇతర ప్రతినిధులు ఉన్నారు.  సింగపూర్‌ పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకుని ఆదివారం రాత్రి దావోస్‌ పర్యటనకు బయలు దేరింది. దావోస్‌లో నాలుగు రోజుల పాటు జరిగే వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ వార్షిక సదస్సులో పాల్గొంటారు. వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం వేదికగా తెలంగాణకు ఉన్న సానుకూలతలను చాటి చెప్పి పెట్టుబడులను తెచ్చే లక్ష్యంతో సీఎం రేవంత్‌ రెడ్డి బృందం దావోస్‌ పర్యటనకు వెళ్లింది. పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా దావోస్‌లో రేవంత్‌ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. ప్రపంచ అగశ్రేణి పరిశ్రమలు, సంస్థల అధినేతలతో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి భేటీ కానున్నారు. పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణను ప్రపంచానికి పరిచయం చేసేందుకు దావోస్‌ పర్యటనను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. గత ఏడాది దావోస్‌ పర్యటన సందర్భంగా రాష్ట్రానికి రూ.40 వేల కోట్ల పెట్టుబడులను ప్రభుత్వం సవిూకరించింది.

ఈసారి అంతకు మించి పెట్టుబడులను తేవడమే లక్ష్యంగా తమ పర్యటన కొనసాగుతుందని సీఎం రేవంత్‌ రెడ్డి ఇటీవల అధికారులతో సమీక్షలో వెల్లడించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, రాష్ట్రంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి ప్రాజెక్టులతో అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు పెట్టుబడులకు ఆసక్తి ప్రదర్శిస్తాయనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్లకు హైదరాబాద్‌ అడ్డాగా మారింది. ఐటీ, ఏఐ, ఫార్మా, తయారీ రంగాలకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలతోపాటు ఇటీవల ప్రకటించిన పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి విధానం (క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ ఎనర్జీ పాలసీ)పై ప్రముఖ కంపెనీలు ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి.

గత ఏడాది దావోస్‌ పర్యటనతోపాటు అమెరికా, దక్షిణ కొరియా పర్యటనలతో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వొచ్చాయి. కాగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో మరో భారీ ఐటీ పార్కు ఏర్పాటు కానుంది. రూ.450 కోట్లతో కొత్త ఐటీ పార్కును ఏర్పాటు చేసేందుకు సింగపూర్‌కు చెందిన క్యాపిటల్‌ ల్యాండ్‌ కంపెనీ ముందుకు వచ్చింది. సుమారు 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక సౌకర్యాలతో ఈ ఐటీ పార్కును ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.  దావోస్‌ వేదికగా మంగళవారం నుంచి నాలుగు రోజులపాటు జరిగే ‘ప్రపంచ ఆర్థిక ఫోరం’ వార్షిక సదస్సులో ఈ బృందం పాల్గొననుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కంపెనీలు ఈ సదస్సుకు హాజరు కానున్న నేపథ్యంలో.. ఆ వేదికపై తెలంగాణలో కంపెనీల ఏర్పాటుకు ఉన్న అనుకూలతలను వివరించి, హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి పెట్టుబడుల గమ్యస్థానంగా పరిచయం చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *