13 నుంచి ‘కైట్, స్వీట్ ఫెస్టివల్’

50 దేశాలకు చెందిన 150 మంది కైట్‌ ఫ్లయర్స్ హాజ‌రు
పరేడ్ గ్రౌండ్స్ లో  మూడు రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు
తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
గ్రామాల్లోనూ ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవాలని పిలుపు
అంతర్జాతీయ కైట్, స్వీట్ ఫెస్టివల్ పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి
ఫెస్టివల్ లో వివిధ రూపాల‌లో క‌నువిందు చేయ‌నున్న కైట్స్
పలు రాష్ట్రాల సంప్రదాయ వంటకాల కోసం ప్రత్యేక స్టాల్స్

సంక్రాంతి పండుగను పురస్కరించుకొని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఈనెల 13 నుంచి 15 వరకు 7వ అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ నిర్వహించ నున్నట్టు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. శనివారం బేగంపేటలోని టూరిజం ప్లాజాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర పర్యాటక, భాషా సాంసృతిక శాఖ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించే ఈ అంతర్జాతీయ ఫెస్టివల్ పోస్టర్ ను మంత్రి ఆవిష్కరించారు. అనంతరం మంత్రి జూపల్లి మాట్లాడుతూ స్వీట్ ఫెస్టివల్ లో వివిధ రాష్ట్రాలకు చెందినవారు పాల్గొంటారని తెలిపారు. స్విట్జర్లాండ్‌, ఆస్ట్రేలియా, శ్రీలంక, కెనడా, కంబోడియా, స్కాట్లాండ్‌, థాయిలాండ్‌, కొరియా, ఫిలిప్పీన్స్‌, వియత్నాం, మలేషియా, ఇటలీ, తైవాన్‌, సౌత్‌ ఆఫ్రికా, ఇండోనేషియా, క‌ఠ్మాండూ, ఇటలీ, దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్ తదితర 50 దేశాలకు చెందిన 150 మంది కైట్‌ ఫ్లయర్స్‌ హాజరవుతున్నారు. వారితో పాటు గుజరాత్‌, పంజాబ్‌, తమిళనాడు, కేరళ , హరియాణా, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ తదితర రాష్ర్టాలకుకు చెందిన 60 మంది క్రీడాకారులు తరలిరానున్నారు.

మూడు రోజుల పాటు జరిగే సాంస్కృతిక కార్యక్రమాలలో ఎవరైనా పాల్గొనవచ్చని పేర్కొన్నారు. సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఫెస్టివల్ ఉంటుందన్నారు. సంస్కృతిలో భాగమే ఈ పండుగలు అని, గ్రామాల్లో కూడా సంస్కృతి, సంప్రదాయాలు పెంపొందించేలా పెద్ద ఎత్తున ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణలోని ప్రాచీన కట్టడాలు, దేవాలయాలను పర్యటించాలన్నారు. తెలంగాణ టూరిజం అందుకు తోడ్పాటు అందిస్తుందని మంత్రి తెలిపారు. ధాన్యం ఇంటికి వొచ్చిన సంతోషకర సందర్బంలో మకర సంక్రాంతి జరుపుకుంటారని అన్నారు. హైదరాబాద్ లో సంక్రాంతి సందర్భంగా లక్షలాది పతంగులు ఎగురవేస్తారని అన్నారు. స్వీట్ ఫెస్టివల్ సంబంధించిన స్వీట్స్ చూడ‌గానే కడుపు నిండుతుందన్నారు. కల్చర్ అంటే వే ఆఫ్ లైఫ్ అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అధికారులు స‌ర్వం సిద్ధం చేశారన్నారు.

సంద‌ర్శ‌కుల‌కు ఉచిత ప్ర‌వేశం..
ఈ కైట్స్ ఫెస్టివ‌ల్ లోకి వీక్ష‌కుల‌కు ఉచిత ప్ర‌వేశం క‌ల్పించామని మంత్రి జూప‌ల్లి అన్నారు. ఈ ఫెస్టివల్ కి వొచ్చే వారికి ఎలాంటి ఎంట్రీ ఫీజు లేదని చెప్పారు. ఈ ఉత్సవాలకు సుమారు 15 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వాటిని తిలకించే సందర్శకుల కోసం షామియానా టెంట్లు, తాగునీటి ఏర్పాట్లను చేస్తున్నామని, పిల్లల కోసం ఆట వస్తువులను అందుబాటులో ఉంచామని అధికారులు తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు పతంగుల ప్రదర్శన ఉంతుందన్నారు. వివిధ రూపాల‌లో క‌నువిందు చేయ‌నున్న కైట్స్ తో పాటు తెలంగాణ పిండి వంటలతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన సంప్రదాయ వంటకాలకు సంబంధించిన ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అంతర్జాతీయ, అంతర్ రాష్టాల్లో పతంగులు ఎగురవేసే కైట్‌ ఫ్లయర్స్‌ లకు ఇప్పటికే ఆహ్వానాలు పంపారు. దాదాపు 700 మంది హోం మేకర్స్ ఈ ఫెస్టివల్ లో పాల్గొంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టూరిజం శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ స్మితా సబర్వాల్, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, అధికారులు, నాయకులు, కళాకారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *