ముస్లిం రిజర్వేషన్లను సుప్రీంకోర్టే కొట్టేసింది
అయినా మైనారిటీ రిజర్వేషన్ల పేరుతో మోసానికి కుట్ర
కులగణన పేరుతో ప్రజల ఆస్తిపై కన్ను
నాగ్‌పూర్‌లో మీడియా సమావేశంలో
కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్
నాగ్‌పూర్, ప్రజాతంత్ర, నవంబర్ 13 : తెలంగాణలో ‘కమీషన్ల’ పాలన కొనసాగుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ప్రతి పనిలోనూ, కాంట్రాక్టుల్లోనూ 15 శాతం కమీషన్ తీసుకుంటూ తెలంగాణను లూటీ చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలకిచ్చిన ఏ ఒక్క హామీని కూడా ఇప్పటి వరకు పూర్తిగా అమలు చేయలేదన్నారు. అయినప్పటికీ అన్ని హామీలు అమలు చేస్తున్నట్లుగా మహారాష్ట్ర ఎన్నికల్లో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి యాడ్స్ ఇస్తూ మోసం చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. 20 లక్షల మంది రైతులకు రుణమాఫీ ఇవ్వలేదని వ్యవసాయశాఖ మంత్రి ప్రకటించినప్పటికీ…. తెలంగాణలో రుణమాఫీ అమలు చేసినట్లుగా మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటోందన్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో తెలంగాణ సొమ్మును ఖర్చు చేస్తూ తెలంగాణను మరింత దివాలా తీయిస్తున్నారని మండిపడ్డారు. ముస్లిం రిజర్వేషన్ల అమలు చెల్లదని సుప్రీంకోర్టు కొట్టేసినప్పటికీ మైనారిటీ రిజర్వేషన్ల అమలు పేరుతో మహారాష్ట్ర ప్రజలను మోసం చేయాలని చూస్తోంద న్నారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ బుధవారం నాగపూర్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. కర్ణాటక బీజేపీ ప్రతిపక్ష నేత నారాయణస్వామి, హిమాచల్ ప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాజీవ్ బిందాల్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్, బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగడి మనోహర్ రెడ్డి లతో కలిసి బండి సంజయ్ కుమార్ మాట్లాడారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహారాష్ట్రకు వొచ్చి మాట్లాడినవన్నీ పచ్చి అబద్దాలే.. తెలంగాణ సొమ్మును వెచ్చించి మహారాష్ట్రలో యాడ్స్ ఇచ్చారు. కానీ ఆ యాడ్స్ లో ఆరు గ్యారంటీల ఊసే లేదు. తప్పుడు హామీలతో ఇక్కడ ప్రజలను మోసం చేయాలనుకుంటున్నారు. అందుకే వాస్తవాలు చెప్పేందుకే మీ ముందుకొచ్చాను. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలలో ఏ ఒక్కటీ పూర్తి స్థాయిలో అమలు చేయనేలేదు. మేనిఫెస్టోలో పొందుపర్చిన 420 హామీల్లో కూడా ఒక్కటీ అమలు చేయలేదు. ఎందుకంటే కాంగ్రెస్ ఫోర్ ట్వంటీ సర్కార్. తెలంగాణలో ప్రతి మహిళకు ఒక తులం బంగారం, ఒక స్కూటీ, నెలకు రూ. 2,500 నెలసరి పింఛన్ ఇస్తామని హామీ ఇచ్చారు. ఒక్కరికి కూడా ఇవ్వలేదు. నిరుద్యోగ యువతకు ప్రతి నెల రూ.4 వేల నిరుద్యోగ భృతి, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇవ్వలేదు. విద్యార్థులకు రూ.5 లక్షల భరోసా కార్డు ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారు. వృద్ధాప్య పింఛన్‌ను నెలనెలా రూ.4 వేలు ఇస్తామని హామీ ఇచ్చి మాట తప్పారు. పేదలకు ఇండ్ల జాగాతోపాటు ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షలిస్తామని మోసం చేశారు. తెలంగాణలో రైతులను నిండా ముంచారు. రైతులు, కౌలు రైతులకు ప్రతి ఎకరానికి రూ.15 వేలు, రైతు కూలీలకు రూ.12 వేలిస్తామని హామీ ఇచ్చారు. వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తామన్నారు. బోనస్ సంగతి దేవుడెరుగు… కనీస మద్దతు ధర కూడా లభించకుండా చేస్తున్నారు. ఉద్యోగులకు నాలుగు డీఏలు ఇవ్వలేదు. పీఆర్సీ అమలు చేయలేదు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్‌ను 42 శాతం పెంచుతామని బీసీ వర్గాలను కూడా మోసం చేశారు.
హిమాచల్ ప్రదేశ్ లో నూ మోసం
కాంగ్రెస్ పార్టీ తొలుత హిమాచల్ ప్రదేశ్‌లో 10 గ్యారంటీలిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వొచ్చారు. కర్ణాటకలో పాంచ్ న్యాయ్ పేరుతో, తెలంగాణలో ఆరు గ్యారంటీల పేరుతో అధికారంలోకి వొచ్చాక ప్రజలను నిలువునా మోసం చేశారు. హర్యానాలోనూ ఇట్లాంటి హామీలతో అధికారంలోకి రావాలని భావిస్తే… ప్రజలు కాంగ్రెస్‌ను తిప్పి కొట్టారు. ఇప్పుడు మళ్లీ మహారాష్ట్రలోనూ మహిళలకు రూ.3 వేలు, నిరుద్యోగ యువతకు రూ.4 వేలు ఇస్తామని హామీలు గుప్పిస్తున్నారు. కుల గణన వాగ్దానం చేస్తూ మోసం చేయాలని ప్రయత్నిస్తున్నారు. విజ్ఞలైన మహారాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ అబద్ధాలను విశ్వసించరు అని సంజయ్ అన్నారు.. తెలంగాణలో కుల జనగణన పేరుతో ఆస్తిపాస్తుల వివరాలు సేకరించాలని చూస్తుంటే ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కుల గణన సంగతి తరువాత ముందుగా 6 గ్యారంటీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ లూటీ చేస్తోంది.మూసీ పునరుజ్జీవం పేరుతో రూ.1.5 లక్షల కోట్లను దోచుకునేందుకు సిద్ధమయ్యారన్నారు.
మూసీ పునరుజ్జీవానికి బీజేపీ వ్యతిరేకం కాదు. ఆ పేరుతో జరుగుతున్న దోపిడీకి వ్యతిరేకమని స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంతో కలిసి పనిచేస్తూ ఒక వర్గం ఓట్ల కోసం హిందువులపై వివక్ష చూపుతోంది. తెలంగాణలో హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి. గత పది నెలల్లోనే దాదాపు 100కుపైగా దేవాలయాలపై దాడులు జరిగాయి. సల్మాన్, సలీం, ఖుర్షీద్, ఇక్బాల్ వంటి వారు ఇట్లాంటి దాడులకు పాల్పడుతున్నా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని బండి సంజయ్ విమర్శిచారు. మహారాష్ట్ర ఛత్రపతి శివాజీ మహారాజ్ జన్మస్థలం మాత్రమే కాదు. దేశానికి నడిబొడ్డు గానూ నిలిచింది. భక్తి ఉద్యమం, స్వాతంత్య్ర పోరాటం, ఇంకా ప్రతి రంగంలో దేశానికి నాయకత్వం వహించింది. మొగల్స్ కోటను బద్దలు కట్టిన చరిత్ర మహారాష్ట్రది. ముస్లిం రిజర్వేషన్లను అమలు చేయాలనుకుంటున్న కాంగ్రెస్ కు మద్దతిస్తారా? ఆ ప్రశ్నే ఉత్పన్నం కాకూడదని కోరుతున్నా. మహారాష్ట్రను అభివృద్ధిలో అన్ని విధాలా ముందుకు తీసుకెళ్లడానికి, ప్రజలకు సేవ చేయడానికి బీజేపీకి మరో అవకాశం ఇవ్వాలని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కోరారు.





