జనజీవన స్రవంతిలో కలవండి..
అరణ్యవాసం వీడండి.. పునరావాసం పొందండి..
మీ సంక్షేమం….మా బాధ్యత…
22మంది మావోయిస్టు పార్టీ మిలీషియా సభ్యులు లొంగుబాటు: ఎస్పీ రోహిత్ రాజు
చర్ల, ప్రజాతంత్ర, జనవరి 18 : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా ఎర్రపల్లి ఆర్‌పిసి చెందిన 22 మంది మావోయిస్టు పార్టీ మిలీషియా సభ్యులు లొంగుపోయినట్లు ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టుల కుటుంబాలతో మరియు అజ్ఞాతంలో ఉన్న వారి కుటుంబాలతో చర్ల పోలీస్ స్టేషన్లో ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసారు.శనివారం చర్ల పోలీసుల ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పిలుపు మేరకు గత సంవత్సర కాలం నుండి లొంగిపోయిన మావోయిస్టు సభ్యుల కుటుంబాలు మరియు జిల్లా నుండి అజ్ఞాతంలో ఉన్న వారి కుటుంబాలతో ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగానే ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం,సుక్మా జిల్లా ఎర్రపల్లి ఆర్‌పిసి కి చెందిన 22 మంది మావోయిస్టు పార్టీ మిలీషియా సభ్యులు ఈ రోజు జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోవడం జరిగింది.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లొంగిపోయిన వారికి అందిస్తున్న పునరావాస పాలసీకి ఆకర్షితులై ఈ 22 మంది మిలీషియా సభ్యులు లొంగిపోవడం జరిగిందని ఎస్పీ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎస్పీతో పాటు అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ పంకజ్ పరితోష్ •,భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ లు కూడా పాల్గొన్నారు.గత సంవత్సర కాలంలో లొంగిపోయిన 36 మంది మావోయిస్టు పార్టీ సభ్యుల కుటుంబాలకు నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ లొంగిపోయిన మావోయిస్టు సభ్యులకు పోలీస్ శాఖ ఎల్లప్పుడు అండగా ఉంటుందని తెలియజేసారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం లొంగిపోయిన వారికి అందిస్తున్న ప్రతిఫలాలను వెంటనే వారికి అందేలా పోలీస్ శాఖ బాధ్యత తీసుకొని పనిచేస్తుందని తెలిపారు.గత సంవత్సరంలో జిల్లా నుండి మావోయిస్టు పార్టీలో వివిధ కేడర్లలో అజ్ఞాత జీవనాన్ని గడిపి జిల్లా పోలీసులు చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై 36 మంది సభ్యులు లొంగిపోవడం జరిగిందని తెలియజేసారు.ఇంకా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి అజ్ఞాత జీవితాన్ని గడుపుతున్న వారు కూడా లొంగిపోయి కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంత జీవనాన్ని గడపాలని విజ్ఞప్తి చేశారు.మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే ఆదివాసి ప్రజలకు జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడు అందుబాటులో ఉంటూ విద్య, వైద్యం,రవాణా సౌకర్యాలు కల్పించే విధంగా కృషి చేస్తుందని అన్నారు.
జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నివసిస్తూ అక్కడ చదువుకునే యువత ఉద్యోగాలు సాధించే విధంగా మరియు వారికి అవసరమైన సౌకర్యాలను అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.ప్రధానంగా వారు ఎదుర్కొంటున్న కుల ధ్రువీకరణ పత్రాల మంజూరు విషయంలో జిల్లా కలెక్టర్ మరియు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి అట్టి సమస్యను అతిత్వరలోనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ప్రజలకు అన్ని రకాల ప్రభుత్వ పథకాలు అందే విధంగా చేస్తామని అన్నారు.అభివృద్ధి నిరోధకులుగా మారిన నిషేధిత సిపిఐ మావోయిస్టులకు ఎవ్వరూ సహాయ సహకారాలు అందించవద్దని కోరారు.అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న లొంగిపోయిన సభ్యులు మరియు వారి కుటుంబాలకు ఏర్పాటు చేసిన సహాపంక్తి విందులో పోలీస్ అధికారులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన చర్ల సీఐ రాజు వర్మ, దుమ్ముగూడెం సీఐ అశోక్,ఎస్సై నర్సిరెడ్డి మరియు పోలీసు సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.





