2025… కాంగ్రెస్ పార్టీ పాలన పై పెరిగిన అసంతృప్తి 

2023 ఆఖరిలో అధికారంలోకి వొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, “ప్రజల పాలన ” అనే నినాదంతో తెలంగాణ ప్రజల్లో భారీ ఆశలు రేపింది. పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు వ్యతిరేకంగా ఏర్పడిన అసంతృప్తి, మార్పు కోరిక – ఇవన్నీ కలిసి కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చాయి. కానీ 2025 నాటికి వొచ్చేసరికి ఆ ఆశలు ఎంతవరకు నిజమయ్యాయి అన్న ప్రశ్న ప్రతి సామాన్యుడి మనసులో మెదులుతోంది.

ప్రభుత్వం మొదట్లో వేగంగా అమలు చేసిన ఆరు గ్యారంటీలు ప్రజల్లో కొంత ఊరట కలిగించాయి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, కొన్ని సంక్షేమ పథకాలు – ఇవన్నీ రాజకీయంగా కాంగ్రెస్‌కు మైలేజీ తీసుకొచ్చాయి. కానీ కాలం గడిచేకొద్దీ, ఈ పథకాల ఆర్థిక భారం రాష్ట్ర ఖజానాపై తీవ్రమైన ఒత్తిడిని తెచ్చిందన్న నిజం బయటపడుతోంది.

ఈ రోజు తెలంగాణ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య–ఆర్థిక అసమతుల్యత. ఒకవైపు ఆదాయ వనరులు పెంచే స్పష్టమైన వ్యూహం లేకపోవడం, మరోవైపు ఖర్చులు పెరుగుతూనే ఉండటం ప్రభుత్వాన్ని చిక్కుల్లో పడేస్తోంది. అప్పులు పెరుగుతున్నాయి. అభివృద్ధి వ్యయానికి కేటాయింపులు కుదించబడుతున్నాయి. పాలనలో సమన్వయ లోపం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. మంత్రుల మధ్య విభేదాలు, అధికారుల బదిలీల్లో గందరగోళం, నిర్ణయాల ఆలస్యం  – ఇవన్నీ ప్రజల్లో ప్రభుత్వ పాలనా  సామర్థ్యంపై సందేహాలు పెంచుతున్నాయి. ఒకప్పుడు ‘ఫాస్ట్ డెసిషన్ స్టేట్’గా పేరు తెచ్చుకున్న తెలంగాణ, ఇప్పుడు ‘ఫైల్ మూమెంట్ స్టేట్’గా మారుతోందన్న విమర్శ వినిపిస్తోంది.

రైతాంగం పరిస్థితి అధికార  కాంగ్రెస్‌కు పెద్ద పరీక్ష. రుణమాఫీ పూర్తిస్థాయిలో అమలు కాకపోవడం, సాగునీటి ప్రాజెక్టుల పురోగతిలో ఆలస్యం , పంటలకు గిట్టుబాటు ధర లభించకపోవడం – ఇవన్నీ రైతుల్లో అసంతృప్తిని పెంచుతున్నాయి. కాళేశ్వరం వంటి కీలక ప్రాజెక్టులపై ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టమైన రోడ్‌మ్యాప్ ప్రకటించలేకపోవడం ఆందోళన కలిగించే విషయం.

యువతకు ఉద్యోగాలే కాంగ్రెస్ ఇచ్చిన అతి పెద్ద హామీ. కానీ 2025 నాటికి నిరుద్యోగ సమస్యకు బలమైన పరిష్కారం కనిపించడంలేదు. కొన్ని నోటిఫికేషన్ లు  వొచ్చినా, నియామకాల ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది. ప్రైవేట్ రంగ పెట్టుబడులు పెరిగితేనే యువతకు ఉద్యోగాలు వొస్తాయి. కానీ ఇన్వెస్టర్లకు అవసరమైన విధాన స్పష్టత ప్రభుత్వం ఇవ్వగలిగిందా?

హైదరాబాద్ అభివృద్ధి విషయంలోనూ అదే ప్రశ్న. నగరం ఇప్పటికీ దేశ ఆర్థిక పటంలో కీలక స్థానంలో ఉన్నా, గతంతో పోలిస్తే ప్రాజెక్టుల వేగం తగ్గిందన్న అభిప్రాయం బలపడుతోంది. మెట్రో విస్తరణ, ఐటీ పెట్టుబడులు, మౌలిక వసతుల అభివృద్ధి – ఇవన్నీ కొత్త ఉత్సాహంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు చేసిన అతిపెద్ద తప్పు – పాలన కంటే రాజకీయాలకు ఎక్కువ సమయం కేటాయించడమే. గత ప్రభుత్వం పై విచారణలు, రాజకీయ ప్రత్యర్థులతో ఘర్షణలు – ఇవన్నీ పాలన దృష్టిని మళ్లించాయి. ప్రజలకు కావాల్సింది ప్రతీకారం కాదు… ఫలితాలు.

సామాజిక వర్గాలకు ఇచ్చిన హామీల అమలు కూడా నెమ్మదిగానే సాగుతోంది. దళితులు, గిరిజనులు, బీసీలకు సంక్షేమం కొనసాగుతున్నా, అది వారి జీవితాల్లో మౌలిక మార్పు తీసుకొస్తుందా అన్న ప్రశ్న ఇంకా అనుత్తరంగానే ఉంది. ప్రజాస్వామ్యంలో విమర్శలు సహజం. కానీ ప్రభుత్వంపై విమర్శ చేసే వారిని రాజకీయ శత్రువులుగా చూడటం ప్రజాస్వామ్య ఆరోగ్యానికి మంచిది కాదు. మీడియా, మేధావులు, పౌరసమాజం – వీరందరి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. 2025 నాటికి తెలంగాణలో కాంగ్రెస్ పాలనను ఒక మాటలో చెప్పాలంటే…” అన్ని వర్గాల్లో పెరుగుతున్న  అసంతృప్తి ..”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *