మలి దశ తెలంగాణా ఉద్యమానికి ఊపిరి అందించిన భారత రాష్ట్ర సమితి ( బీఆర్ఎస్) తెలంగాణ రాజకీయాల్లో ఒక సాధారణ రాజకీయ పార్టీ కాదు. అది ఒక ఉద్యమ ఫలితం. ప్రత్యేక రాష్ట్ర సాధన లక్ష్యంతో పుట్టిన పార్టీగా, రాష్ట్ర ఏర్పాటుతో అధికారాన్ని చేపట్టి దశాబ్ద కాలం తెలంగాణ పాలనను తన ముద్రతో మలిచిన పార్టీ.. సమైక్య పాలనలో మసక బారిన తెలంగాణ తేజస్సును విశ్వవ్యాపితం చేసింది .! అయితే 2023లో అధికారాన్ని కోల్పోయిన తర్వాత, 2025 నాటికి బీఆర్ఎస్ ప్రభావం ఏ మేరకు మిగిలి ఉంది? అది క్షీణత దిశలో సాగుతున్నదా, లేక పునరుజ్జీవనానికి సిద్ధమవుతున్నదా? ఈ ప్రశ్నకు సమాధానం తెలంగాణ రాజకీయ భవిష్యత్తును కూడా నిర్దేశిస్తుంది.
పొత్తులు లేకుండా ఒంటరిగా పోటీ చేసి 2014, 2018 ఎన్నికల్లో ఘన విజయాలతో అధికారాన్ని చేపట్టిన బీఆర్ఎస్ , 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైంది. దాంతో తొలిసారిగా పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నది . అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి, సంక్షేమ పథకాల ద్వారా ప్రజలతో నేరుగా అనుసంధానం సాధించిన పార్టీకి, అధికార దూరంతో ఆ ప్రత్యక్ష సంబంధం తగ్గింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా సాధించలేకపోవడం బీఆర్ఎస్ కు తీవ్ర రాజకీయ హెచ్చరికగా మారింది. ఈ పరిణామాలు పార్టీ ప్రభావం తగ్గుతున్నదన్న అన్న భావనను కలిగించినప్పటికీ, అది పూర్తిస్థాయి వాస్తవం కాదు. ఎందుకంటే తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ కు ఇంకా బలమైన సామాజిక, ప్రాంతీయ పునాది ఉంది.
బీఆర్ఎస్ బలం ప్రధానంగా రైతులు, వెనుకబడిన వర్గాలు, గ్రామీణ మధ్యతరగతి పై ఆధారపడి ఉండేది. కానీ 2023 తర్వాత ఈ సామాజిక సమీకరణల్లో మార్పు వొచ్చింది. రైతులు ఒకప్పుడు బీఆర్ఎస్ కు గట్టి మద్దతుదారులు. కానీ రైతు అప్పులు, సాగునీటి వివాదాలు, కొత్త ప్రభుత్వ పథకాలు వారిని కాంగ్రెస్ వైపు మళ్లించాయి. దళితులు, గిరిజనులు సంక్షేమ పథకాల్లో మార్పులు, సామాజిక న్యాయం అంశాలపై కాంగ్రెస్ బలమైన ప్రచారం చేయడంతో బీఆర్ఎస్ ప్రభావం తగ్గింది. BC వర్గాలు : ఇంకా బీఆర్ఎస్ కు కీలక ఆధారం. అయితే బీసీ రాజకీయాలను స్పష్టమైన కార్యాచరణతో మలచలేకపోతే ఈ వర్గం కూడా పూర్తిగా నిలబడే అవకాశం లేదు పట్టణ యువతలో ఒక వర్గం బీజేపీ వైపు ఆకర్షితులయ్యారు .
ప్రతిపక్షంలోకి వొచ్చిన తర్వాత బీఆర్ఎస్ పూర్తిగా నిశ్శబ్దంగా లేదు. ప్రభుత్వ నిర్ణయాలపై ధర్నాలు, రహదారి నిరసనలు, సభలు నిర్వహించింది. ముఖ్యంగా ప్రాజెక్టుల విచారణలు, రాష్ట్ర హక్కుల అంశాల్లో ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంది. అయితే ఈ ఉద్యమాలు ప్రజలలో పెద్ద ఎత్తున స్పందనను రేకెత్తించలేకపోయాయి. ప్రతిపక్ష పాత్రలో పార్టీ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య—స్పష్టమైన రాజకీయ విధానం లేకపోవడం. “మేము అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి” అనే గత వాదన మాత్రమే సరిపోదు. ప్రజలు ఇప్పుడు భవిష్యత్తు రాజకీయ దిశను కోరుతున్నారు.
రాబోయే స్థానిక సంస్థలు, అసెంబ్లీ ఎన్నికలు బీఆర్ఎస్ కు నిర్ణయాత్మకంగా మారనున్నాయి. పార్టీ పునర్నిర్మాణం కోసం పలు మార్గాలు ఉన్నాయి:
2025 నాటికి భారత రాష్ట్ర సమితి పూర్తిగా అంతరించిపోయిన రాజకీయ శక్తి కాదు. అదే సమయంలో అది ఒకప్పుడు ఉన్న అప్రతిహత శక్తి కూడా కాదు. ఇది “మార్పు దశలో ఉన్న పార్టీ”. ఈ దశను అది పునర్నిర్మాణంగా మలచుకుంటుందా, లేక మరింత రాజకీయ క్షీణతకు లోనవుతుందా అన్నది పార్టీ నాయకత్వం తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉంది.





