రాష్ట్ర అభివృద్ధిలో 2024 ప్రత్యేక అధ్యాయం

రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు
నీటిపారుద‌ల శాఖ‌ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 31 : తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో 2024 సంవత్సరం ప్రత్యేకత చాటుకుందని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి  అన్నారు. ఇదే సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టిందన్నారు. ఈ మేరకు మంగళవారం ఎర్రమంజిల్ కాలనీలోని జలసౌధలో తనను కలిసిన విలేకరులతో మాట్లాడుతూ..  రాష్ట్ర ప్రజలకు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఇదే పారదర్శకతతో 2025 సంవత్సరంలో మరింత పురోగతి సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి-సంక్షేమం కలగలిపి సమపాళ్లలో పరుగులు పెట్టిస్తున్నామన్నారు.

అందుకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీతో పాటు తెల్ల రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ చారిత్రాత్మక అధ్యయాలుగా చరిత్రలో నిలిచిపోయాయన్నారు. అంతేకాకుండా అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేయడం, ముందెన్నడూ లేని రీతిలో సన్నాలకు 500 రూపాయల బోనస్ రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయాలని చెప్పారు. అలాగే రెండు లక్షల రైతురుణమాఫీ ఈ ప్రభుత్వంలో సువర్ణ అధ్యాయమ‌ని అన్నారు. ఖరీఫ్ సీజన్ లో దిగుబడి అయిన ధాన్యం యావత్ భారతదేశంలోనే రికార్డ్ సృష్టించడం రాష్ట్ర ప్రభుత్వం రైతాంగం పట్ల తీసుకున్న విధానాలకు అద్దం పడుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి కింది స్థాయి కార్యకర్త వరకు సామాజిక న్యాయానికి కట్టుబడి పనిచేస్తుందన్నారు. సుప్రీంకోర్టు తీర్పుననుసరించి ఎస్సి వర్గీకరణ ఉంటుందన్నారు.
కులగణన చారిత్రాత్మక ఘట్టంగా మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. తద్వారా వెనుకబడిన తరగతుల వారందరికీ మేలు జరుగుతుందన్నారు.  తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయాకట్టను సేద్యంలోకి తెచ్చే విదంగా నీటిపారుదల శాఖ ప్రణాళికలు రూపొందించుకుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అన్నింటికీ మించి రూ.5వేల కోట్లతో 119 నియోజకవర్గ కేంద్రాలలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన పాఠశాలలను ఏర్పాటు చెయ్యడం కాంగ్రెస్ ప్రభుత్వం ఘనత అని ఆయన కొనియాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *