సదుద్దేశమే కావచ్చు, దురుద్దేశంతో అమలు చేస్తే?

“దేశంలో చట్టాల తయారీలో ఉన్న పద్ధతి ప్రకారం ఒక బిల్లు మీద శాసనసభలో చర్చ జరిగి, మార్పులు, చేర్పుల సూచనలు జరిగి, తుది ప్రతి ఆమోదం పొందాక, అది గవర్నర్ ఆమోదానికి, సంతకానికి వెళ్తుంది. గవర్నర్ సంతకం అయ్యాక చట్టం అయి, గెజెట్ లో ప్రకటన జరుగుతుంది. ఒకవేళ ఆ చట్టం రాజ్యాంగం ఉమ్మడి జాబితాలోని అంశాలను కూడా ప్రభావితం చేసేదైతే, గవర్నర్ సంతకం తర్వాత రాష్ట్రపతి సంతకానికి కూడా వెళ్లాలి. ఆ తర్వాతనే అది చట్టంగా మారి గెజెట్ లో అచ్చయి అమలులోకి వస్తుంది. ఆశ్చర్యకరంగా ఈ ప్రక్రియ అంతా ఏమీ లేకుండానే, శాసనసభలో ప్రవేశపెట్టిన బిల్లు ప్రతి గెజెట్ రూపంలో దొరుకుతున్నది. ఇది అధికారుల తొందరపాటా, లేక రాష్ట్ర శాసనసభ చర్చ, ఆమోదం, గవర్నర్ సంతకం, రాష్ట్రపతి సంతకం అనే ప్రక్రియనంతా పక్కన పెట్టి గెజెట్ ప్రచురణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడిందా తెలియదు.”

తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ముగింపుకు వస్తున్నాయనగా, మార్చ్ 29న రాష్ట్ర ప్రభుత్వం ‘ది తెలంగాణ హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్స్ (ప్రివెన్షన్) బిల్, 2026’ ప్రవేశపెట్టింది. మర్నాడు జరిగిన చర్చలో ప్రతిపక్షాలు భారతీయ జనతా పార్టీ, మజ్లిస్ ఇత్తెహాదుల్ ముసల్మీన్, భారత కమ్యూనిస్టు పార్టీ ఈ బిల్లును వ్యతిరేకించాయి. సభలో ఈ చర్చ జరుగుతున్నప్పుడు ప్రధాన ప్రతిపక్షం భారత రాష్ట్ర సమితి సభ్యులు సస్పెన్షన్ కు గురై ఉన్నారు.

“నిజమైన ద్వేష ప్రసంగాలను నిరోధించడం, సామాజిక సామరస్యాన్ని కాపాడడం ఏ ప్రభుత్వానికైనా ముఖ్యమైన బాధ్యతే. కాని ప్రస్తుత బిల్లు ప్రమాదకరంగా, అస్పష్టంగా, విశాలంగా, దుర్వినియోగానికి వీలు కలిగించేలా ఉంది” అని బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటి రామారావు ఒక ప్రకటనలో అన్నారు. “ఈ బిల్లు భావప్రకటనా స్వేచ్ఛకు మృత్యు ఘంటిక. ఇది ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడాన్ని కూడా అరికడుతుంది. దీనికి సవరణలు చేయవలసి ఉంది గనుక సభా సంఘానికి నివేదించాలని కోరుతున్నాం” అని బిజెపి సభా నాయకుడు ఎ మహేశ్వర్ రెడ్డి అన్నారు. బిల్లు ఉద్దేశాలను తాము సమర్థిస్తున్నామని, కాని కొన్ని లోపాలున్నాయని, మత ప్రచారాన్ని ద్వేష ప్రసంగంగా పొరపడగూడదని ఎంఐఎం శాసన సభ్యుడు అహ్మద్ బిన్ బలాలా అన్నారు. ఆయన కూడా సభా సంఘానికి నివేదించాలన్నారు. సిపిఐ శాసన సభ్యుడు కూనంనేని సాంబశివరావు బిల్లును వ్యతిరేకిస్తూ, దాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. దానిలోని నిబంధనల ప్రకారం ఒక పార్టీ సభ్యుడు చేసిన వ్యాఖ్యలకైనా మొత్తం పార్టీని బాధ్యురాలిగా చేసి, శిక్షించే అవకాశం ఉందన్నారు. బిల్లు అవసరమని, ఉపసంహరించనక్కరలేదని, కొన్ని సవరణలు చేయవచ్చునని కాంగ్రెస్ శాసన సభ్యుడు దానం నాగేందర్ అన్నారు. మొత్తానికి సభ ఈ బిల్లును సభా సంఘానికి నివేదించాలని తీర్మానించింది. అంటే పాము ఇప్పటికైతే మళ్లీ బుట్టలో పెట్టబడింది.

దేశంలో చట్టాల తయారీలో ఉన్న పద్ధతి ప్రకారం ఒక బిల్లు మీద శాసనసభలో చర్చ జరిగి, మార్పులు, చేర్పుల సూచనలు జరిగి, తుది ప్రతి ఆమోదం పొందాక, అది గవర్నర్ ఆమోదానికి, సంతకానికి వెళ్తుంది. గవర్నర్ సంతకం అయ్యాక చట్టం అయి, గెజెట్ లో ప్రకటన జరుగుతుంది. ఒకవేళ ఆ చట్టం రాజ్యాంగం ఉమ్మడి జాబితాలోని అంశాలను కూడా ప్రభావితం చేసేదైతే, గవర్నర్ సంతకం తర్వాత రాష్ట్రపతి సంతకానికి కూడా వెళ్లాలి. ఆ తర్వాతనే అది చట్టంగా మారి గెజెట్ లో అచ్చయి అమలులోకి వస్తుంది. ఆశ్చర్యకరంగా ఈ ప్రక్రియ అంతా ఏమీ లేకుండానే, శాసనసభలో ప్రవేశపెట్టిన బిల్లు ప్రతి గెజెట్ రూపంలో దొరుకుతున్నది. ఇది అధికారుల తొందరపాటా, లేక రాష్ట్ర శాసనసభ చర్చ, ఆమోదం, గవర్నర్ సంతకం, రాష్ట్రపతి సంతకం అనే ప్రక్రియనంతా పక్కన పెట్టి గెజెట్ ప్రచురణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడిందా తెలియదు. ఆ సాంకేతిక అంశాన్ని పక్కన పెట్టి, ఈ బిల్లులో గుర్తించవలసిన అంశాలు ఇంకా చాలా ఉన్నాయి.

మామూలుగా ప్రతి బిల్లుకూ ఆనవాయితీగా ఉండే స్టేట్ మెంట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అండ్ రీజన్స్ (లక్ష్యాల, కారణాల ప్రకటన) అనేది ఈ ‘తెలంగాణ ద్వేషపూరిత ప్రసంగాల, ద్వేషపూరిత నేరాల (నిరోధ) చట్టం’గా మారనున్న బిల్లులో కూడా ఉంది. “ఇటీవలి కాలంలో ద్వేషపూరిత ప్రసంగాల, ద్వేషపూరిత నేరాల ఘటనలు చెప్పుకోదగినంత ఎక్కువగా, ప్రత్యేకంగా డిజిటల్, సోషల్ మీడియా వేదికల మీద జరుగుతున్నాయి. వాటికి వేగంగా వ్యాపించే శక్తి, ప్రజా భద్రతకు, సామాజిక సామరస్యానికి తీవ్రమైన హాని కలిగించే అవకాశం ఉంది. అటువంటి చర్యలు వ్యక్తుల మధ్య, సమూహాల మధ్య మతం, కులం, జాతి, భాష, స్త్రీపురుష భేదం, తదితర అస్తిత్వాల కారణాల మీద శతృత్వాన్ని, ద్వేషాన్ని, అశాంతిని కలిగిస్తాయి. తద్వారా సమానత్వం, గౌరవం, సోదరత్వం అనే రాజ్యాంగ విలువలను భగ్నం చేస్తాయి” అంటూ, అందువల్ల, అటువంటి ద్వేష ప్రసంగాలను, ద్వేష నేరాలను ప్రోత్సహించే. ప్రచారం చేసే, ప్రచురించే, చర్యలను అడ్డుకోవడానికి, అటువంటి నేరాలు చేయడానికి భయపడేంత శిక్షలు విధించడానికి, అటువంటి చర్యల బాధితులకు తగిన నష్టపరిహారం ఇవ్వడానికి ఈ చట్టం తేవడం అవసరం అయిందని ప్రకటించారు.

“ఇక్కడ ప్రభుత్వం చెప్పిన కారణాలు నిజమైనవే. సమాజంలో, ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా విష, విద్వేష ప్రచారం చాలా ఎక్కువగా సాగుతున్నది. అబద్ధాలు ప్రచారం అవుతున్నాయి. అభూత కల్పనల చరిత్రనే అసలు చరిత్రగా వాట్సప్ యూనివర్సిటీ ప్రచారం చేస్తున్నది. వాస్తవాలు ప్రకటించే వారి మీద విపరీతమైన నిందల, దుర్భాషల, బెదిరింపుల ట్రోలింగ్ జరుగుతున్నది. అయితే ఈ ట్రోలింగ్ సైన్యాలను నడిపిస్తున్నది ఎక్కువగా రాజకీయ పార్టీలే.”

ఇక్కడ ప్రభుత్వం చెప్పిన కారణాలు నిజమైనవే. సమాజంలో, ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా విష, విద్వేష ప్రచారం చాలా ఎక్కువగా సాగుతున్నది. అబద్ధాలు ప్రచారం అవుతున్నాయి. అభూత కల్పనల చరిత్రనే అసలు చరిత్రగా వాట్సప్ యూనివర్సిటీ ప్రచారం చేస్తున్నది. వాస్తవాలు ప్రకటించే వారి మీద విపరీతమైన నిందల, దుర్భాషల, బెదిరింపుల ట్రోలింగ్ జరుగుతున్నది. అయితే ఈ ట్రోలింగ్ సైన్యాలను నడిపిస్తున్నది ఎక్కువగా రాజకీయ పార్టీలే.  దాదాపు అన్నీ పార్టీలూ కార్యాలయాలు ఏర్పాటు చేసి, జీత భత్యాలు ఇచ్చి విష, విద్వేష ప్రచారం నడుపుతున్నాయి. ఆ పనిలో సంఘ్ పరివార్ శక్తి సామర్థ్యాలు, విస్తృతి ఎక్కువ కావచ్చు గాని, ఏ ఒక్క పార్టీకీ మినహాయింపు లేదు. కొన్ని సంవత్సరాలుగా సాగుతున్న ఈ దుర్మార్గం నానాటికీ పెచ్చరిల్లుతున్నది. తప్పనిసరిగా ఈ దుర్మార్గాన్ని అరికట్టవలసిందే. అటువంటి విష విద్వేష ప్రచారానికి పూనుకుంటున్నవారిని కఠినంగా శిక్షించి, ఇక అటువంటి పనులు చేయడానికి ఎవరైనా భయపడే పరిస్థితి నెలకొల్పవలసిందే. ఇది ఒక సామాజిక, చారిత్రక అవసరం. కేవలం లక్ష్య ప్రకటనను మాత్రమే చూస్తే ప్రభుత్వానికి ఆ సదుద్దేశం ఉన్నట్టు అనిపిస్తుంది.

అయితే ప్రభుత్వాలు ఇటువంటి సదుద్దేశాలతో ప్రకటించిన ఎన్నో విధానాలు, చట్టాలు, పథకాలు అమలు దగ్గరికి వచ్చేసరికి అందుకు పూర్తిగా భిన్నమైన దారిలో నడవడం, ప్రజా వ్యతిరేకంగా ఉండడం, లేదా ప్రత్యర్థి పార్టీల మీద కక్ష సాధింపు సాధనాలుగా ఉండడం మనకు చరిత్ర పొడవునా కనబడుతుంది. ముఖ్యంగా ప్రభుత్వం ఒక పార్టీకి చెందినది అయినప్పుడు, ఆ పార్టీకి రాజకీయ ప్రయోజనాలు ఉన్నప్పుడు, ఆ రాజకీయ ప్రయోజనాలు ఇతర పార్టీల రాజకీయ ప్రయోజనాలతో విభేదిస్తున్నప్పుడు సదుద్దేశాల చట్టాలను యథాతథంగా, తటస్థంగా, నిర్మమకారంగా అమలు చేయడం అధికారవర్గానికి సాధ్యం కాదు. ఆ చట్టాన్ని తమవారి మీద ప్రయోగించవద్దని, ప్రత్యర్థుల మీద ప్రయోగించమని ఒక్కోసారి పైనుంచి కచ్చితమైన ఆదేశాలు ఉండవచ్చు. ఒక్కోసారి ఆదేశాలు లేకపోయినా, పైన ఉన్న ఏలికల మెరమెచ్చుల కోసం అధికారవర్గం మితిమీరి అత్యుత్సాహంగా ప్రవర్తించవచ్చు. అధికార పార్టీ వారు చేసిన నేరాలను చూసీ చూడనట్టు పోనిచ్చి, ప్రతిపక్షాల, భిన్న స్వరాల పనులను నేరాలుగా చూపవచ్చు. “తీవ్రవాదులను అణచడానికి” అనే పేరుతో వచ్చిన చట్టం రైతుల మీద, కార్మికుల మీద, విద్యార్థుల మీద, భిన్న మతస్తుల మీద  ప్రయోగించిన వేలాది ఉదాహరణలు మన కళ్ళముందు ఉన్నాయి.

చట్టాన్ని అలా ప్రత్యర్థుల మీద ఉపయోగించడాన్ని కొందరు దుర్వినియోగం అనవచ్చు, కొందరు అసలు ఉపయోగమే దుర్వినియోగం అనవచ్చు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం తయారు చేసిన బిల్లులో కొన్ని పద ప్రయోగాలు, కొన్ని వివరణలు, కొన్ని సూచనలు ప్రభుత్వానికి చెప్పుకుంటున్నంత సదుద్దేశం లేదేమో, కేవలం ప్రత్యర్థులను, అసమ్మతివాదులను భిన్న స్వరాలను ఇబ్బంది పెట్టడానికే ఈ బిల్లు తెస్తున్నదేమో అని అనుమానించడానికి వీలు కలిగిస్తున్నాయి. ఒక మాటా, ఒక రచనా, ఒక వ్యక్తీకరణ “ద్వేషపూరిత ప్రసంగం” అని ఎవరు నిర్వచిస్తున్నారు, ఈ ప్రాతిపదిక మీద నిర్వచిస్తున్నారు అని చూసినప్పుడు, ఆ బాధ్యత ఉన్న అధికారి అధికారపక్షం ఏమి మాట్లాడినా “ద్వేషపూరిత” ప్రసంగం కాదనీ, ప్రతిపక్షం, అసమ్మతివాదులు ఏమి మాట్లాడినా “ద్వేషపూరిత ప్రసంగం” అని నిర్వచించి చట్టబద్ధ చర్యలకు పూనుకుంటే అడ్డుకునే అవకాశం ఉందా అనే ప్రశ్న మిగిలిపోతుంది.

నిజానికి అధికార యంత్రాంగం అలా నిరంకుశంగా అర్థం చెప్పడానికి, అధికారపక్ష వ్యక్తీకరణలను మినహాయించి, ప్రతిపక్ష, భిన్నస్వరాల వ్యక్తీకరణలను శిక్షార్హమైనవిగా ప్రకటించడానికి చట్టం తయారైన తీరులోనే వీలుంది. “ద్వేషపూరిత ప్రసంగం” అనే మాటకు ఈ బిల్లు ఇచ్చిన నిర్వచనం ఎంత విశాలంగా ఉన్నదంటే అందులో దేన్ని అయినా పెట్టవచ్చు. దేన్నయినా పెట్టకుండా ఉండవచ్చు. ఇటువంటి నిర్వచనాన్ని హోల్డాల్ నిర్వచనం అంటారు. గద్దె మీద ఉన్నవారికి కంటగింపు అయ్యే ప్రతి వ్యక్తీకరణనూ ఈ హోల్డాల్ లో తోసెయ్యవచ్చు. మౌఖిక, లిఖిత, సైగల, దృశ్య మాధ్యమాల, ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా చలామణీలోకి వచ్చే ఏ సందేశమైనా, ఏ సమాచార సంబంధమైనా అని కచ్చితంగా అంటూనే, “మరే ఇతర రకంగా” అని నిర్వచనాతీతమైన, అస్పష్టమైన మాటను కూడా ఈ బిల్లులో చేర్చారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల (నిరోధ) చట్టాన్ని – ఊపాను – దుర్మార్గమైన చట్టంగా విశ్లేషించిన వారందరూ అందులో కూడా సరిగ్గా ఇట్లాగే “మాట, రాత, సైగ, దృశ్య ప్రాతినిధ్యం” అని చెప్పి, “కాక మరేదైనా” అని పోలీసు అధికారి విచక్షణకు వదలడమే ప్రమాదకరంగా మారింది. పోలీసు అధికారి సాధారణంగా అధికారంలో ఉన్న ప్రభుత్వం మాట వింటారు గనుక ఈ అస్పష్ట నిర్వచనం తప్పనిసరిగా దుర్వినియోగం అయ్యే అవకాశమే ఉంటుంది. దుర్వినియోగం కూడా కాదు, వినియోగించిన ప్రతి సందర్భమూ ఒక నిరంకుశ దాడిగా మారిపోతుంది.

“ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఒక నిరంకుశ చట్టం. నిజానికి ద్వేషపూరిత ప్రసంగం వంటి నేరాలకు తగిన శిక్షలూ, విచారణా ప్రక్రియలూ అంతకు ముందు ఇండియన్ పీనల్ కోడ్ లో ఉండేవి, ఇప్పుడు భారతీయ న్యాయ సంహితలో ఉన్నాయి. వాటిని సక్రమంగా అమలు చేసినా, రాజకీయ పార్టీలు ద్వేష ప్రసంగాలు, విషవిద్వేష ప్రచారాలు చేయబోమని ఒక నాగరిక నిర్ణయం తీసుకున్నా ఈ సమస్య సమసిపోతుంది. అప్పటికీ ఎవరైనా వ్యక్తులు ఆ పనికి పూనుకుంటే ఉన్న చట్టాల కింద విచారించడానికి, శిక్షించడానికి అవకాశం ఉంది.”

అంటే ఒక ప్రసంగం, రచన, వ్యక్తీకరణ, సైగ, డిజిటల్ సందేశం నిజంగా ద్వేషపూరితమైనది కాకపోయినా, అది వ్యక్తీకరించినవారో, దానికి సహకరించినవారో ప్రభుత్వానికి గిట్టనివారైతే ఆ వ్యక్తీకరణను “ద్వేషపూరిత ప్రసంగం” అని ఒక పోలీసు అధికారి ముద్ర కొట్టవచ్చు. అంతే కాదు, ఈ బిల్లు అటువంటి నేరం చేసినవారిని వారంట్ లేకుండా అరెస్టు చేసే అధికారం పోలీసులకు ఇస్తున్నది. ఈ కేసును బెయిల్ ఇవ్వడానికి వీలు లేని కేసుగా మారుస్తున్నది. అంటే ఎవరి నోరయినా మూయించాలని, ఎవరి రచనలైనా, ఉపన్యాసాలైనా, యూట్యూబ్ వీడియోలైయా మూసేయించాలని ప్రభుత్వం అనుకుంటే వారి మీద ఈ చట్టం కింద కేసు పెట్టి జైల్లోకి తోయవచ్చు.

వారి సైట్ నో, యూట్యూబ్ చానల్ నో, పత్రికనో మూసి వేయించవచ్చు. విచారణ ఎప్పటికి జరుగుతుందో తెలియని అగమ్యగోచర స్థితిలో ఎన్ని సంవత్సరాలైనా వారిని జైలులో నిర్బంధించవచ్చు. విచారణ జరిగి, నేరం రుజువైతే మొదటిసారి నేరస్తులకైతే ఒకటి నుంచి ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష, యాబై వేల రూపాయల జరిమానా, మళ్లీ మళ్లీ అదే నేరం చేసినవారైతే రెండేళ్ల నుంచి పదేళ్ల జైలు శిక్ష, లక్ష రూపాయల వరకూ జరిమానా అని ఈ బిల్లు అంటున్నది. ఆ ద్వేషపూరిత ప్రసంగాన్ని ప్రచురించినది, ప్రసారం చేసినది ఒక సంస్థ అయితే ఆ సంస్థ డైరెక్టర్లు, మేనేజర్లు కూడా శిక్షార్హులవుతారు. దేన్నయినా ద్వేష ప్రసంగంగా గుర్తిస్తే డిజిటల్ వేదిక మీది నుంచి దాన్ని తొలగించే అధికారాన్ని కూడా ఈ బిల్లు ప్రభుత్వానికి ఇస్తుంది.

ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఒక నిరంకుశ చట్టం. నిజానికి ద్వేషపూరిత ప్రసంగం వంటి నేరాలకు తగిన శిక్షలూ, విచారణా ప్రక్రియలూ అంతకు ముందు ఇండియన్ పీనల్ కోడ్ లో ఉండేవి, ఇప్పుడు భారతీయ న్యాయ సంహితలో ఉన్నాయి. వాటిని సక్రమంగా అమలు చేసినా, రాజకీయ పార్టీలు ద్వేష ప్రసంగాలు, విషవిద్వేష ప్రచారాలు చేయబోమని ఒక నాగరిక నిర్ణయం తీసుకున్నా ఈ సమస్య సమసిపోతుంది. అప్పటికీ ఎవరైనా వ్యక్తులు ఆ పనికి పూనుకుంటే ఉన్న చట్టాల కింద విచారించడానికి, శిక్షించడానికి అవకాశం ఉంది. ఒక నిజమైన కారణం చూపి, ఒక భయంకరమైన నిరంకుశ సాధనం చేతుల్లో పెట్టుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *