గూడులేని చెంచుల‌కు 10 వేల ఇందిర‌మ్మ ఇండ్లు

ఐటిడిఎ ప‌రిధిలోని ఎస్టీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు అద‌నంగా మంజూరు
గ‌వ‌ర్న‌ర్ , సిఎం ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా నిర్ణ‌యం
రెవెన్యూ, హౌసింగ్‌ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి

త‌ర‌త‌రాలుగా సొంత ఇండ్ల‌కు నోచుకోని ఆదిమ గిరిజ‌న తెగ‌ల‌లోకి అతి బ‌ల‌హీన వ‌ర్గ‌మైన చెంచుల‌ సొంతింటి క‌లను  ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ఇందిర‌మ్మ ప్ర‌భుత్వం సాకారం చేయ‌బోతోంద‌ని  రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి ప్ర‌క‌టించారు. రాష్ట్రంలోని ఉట్నూరు, భ‌ద్రాచ‌లం, మున్న‌నూర్‌,  ఏటూరు నాగారం నాలుగు స‌మ‌గ్ర గిరిజ‌నాభివృద్ధి సంస్థల ప‌రిధిలో స‌చ్యురేష‌న్ ప‌ద్ద‌తిలో దాదాపు 10 వేల చెంచు కుటుంబాల‌ను గుర్తించామని, వీరంద‌రికీ ఇందిర‌మ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామ‌ని వెల్ల‌డించారు. ఇందిర‌మ్మ ఇండ్ల‌పై మంగ‌ళ‌వారం స‌చివాల‌యంలో అధికారుల‌తో స‌మీక్షించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. గిరిజ‌న ప్రాంతాల్లో శాశ్వ‌త గృహాల‌ను నిర్మించాల‌ని గ‌వ‌ర్న‌ర్  జిష్ణుదేవ్ వ‌ర్మ ప‌లు సంద‌ర్బాల‌లో సూచించారని అలాగే ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కూడా అనేక సంద‌ర్బాల‌లో గిరిజ‌న ప్రాంతాల‌లో అభివృద్ధి, ముఖ్యంగా వారి నివాస గృహాల నిర్మాణంపై అనేక సూచ‌న‌లు చేశార‌ని  గ‌వ‌ర్న‌ర్, ముఖ్య‌మంత్రి సూచ‌న‌లు స‌ల‌హాల మేర‌కు గిరిజ‌న ప్రాంతాల్లో చెంచులకు ఇందిర‌మ్మ ఇండ్ల‌ను మంజూరు చేస్తున్నామ‌ని తెలిపారు.

అడవులను నమ్ముకొని జీవించే గిరిజనులలో చెంచులు ఒక జాతి అని. వీరు అడవుల్లో వేటాడటం, అటవీ ఫలసాయం సేకరించి అమ్ముకొని జీవనం సాగిస్తున్నార‌ని . చిన్నచిన్న గుడిసెలు తప్ప వీరికి పక్కా ఇల్లు ఎలా ఉంటుందో ఊహకు అందని విషయమ‌ని, అలా అని ఆ అడవి ప్రాంతాల్ని వదలి వారు బతక లేరు. అందుకే వీరు జీవించే ప్రదేశంలోనే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింద‌ని. దశాబ్దాలుగా ఏ ప్రభుత్వం ఈ దిశగా ఆలోచన కూడా చేయలేద‌న్నారు. ఉట్నూరు ఐటిడిఎ ప‌రిధిలో ఆసిఫాబాద్ 3551, బోధ్ 695, ఖానాపూర్ 1802,  సిర్పూర్ 311, అదిలాబాద్ 1430, బెల్లంప‌ల్లి 326, భ‌ద్రాచ‌లం ఐటిడిఎ ప‌రిధిలో అశ్వ‌రావుపేట 105, మున్న‌నూర్ చెంచు స్పెష‌ల్ ప్రాజెక్ట్ లో
అచ్చంపేట్ 518, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ 153, ప‌రిగి 138, తాండూర్ 184 మొత్తం 9,395 ఇండ్ల‌ను మంజూరు చేస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు. ఈ ఏడాది రాష్ట్రంలో   ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గానికి 3500  ఇందిర‌మ్మ ఇండ్లును మంజూరు చేస్తున్నామ‌ని, అయితే ఐటిడిఎ ప‌రిధిలోని  గిరిజ‌న నియోజ‌క‌వ‌ర్గాల‌కు అద‌నంగా 500 నుంచి 700 ఇండ్లు ఇవ్వాలని నిర్ణ‌యించిన‌ట్లు వెల్ల‌డించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇందిర‌మ్మ ఇండ్ల ల‌బ్దిదారుల ఎంపిక ప్ర‌క్రియ కొలిక్కి వ‌చ్చింద‌ని అయితే ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో 3500 ఇండ్ల‌కు గాను 20 శాతం ఇండ్ల‌ను బ‌ఫ‌ర్ కింద పెట్టుకోవ‌డం జ‌రుగుతుంద‌న్నారు.

ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో ముఖ్యంగా జిహెచ్ఎంసీ ప‌రిధిలో ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణంపై ప్ర‌త్యేక దృష్టి సారించిన‌ట్లు తెలిపారు. ప‌ట్ట‌ణంలోని ముఖ్య ప్రాంతాల‌లోని మురికి వాడ‌ల్లో జీవ‌నం కొన‌సాగిస్తున్న పేద‌లు అక్క‌డే ఉండ‌డానికి ఇష్ట‌ప‌డుతున్నార‌ని, హైదరాబాద్ కు దూరంగా ఇండ్లు నిర్మించి ఇస్తే తీసుకోవ‌డానికి ఆస‌క్తి చూప‌డం లేద‌న్నారు.  గ‌త ప్ర‌భుత్వం కొల్లూరులో డ‌బుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి హైద‌రాబాద్‌లో ఉన్న‌పేద‌ల‌కు కేటాయిస్తే వాటిని తీసుకోవ‌డానికి ఎవ‌రూ ముందుకు రావ‌డం లేద‌న్నారు. వీట‌న్నింటినీ దృష్టిలో పెట్ట‌కొని పేద‌లు గుడిసెలు వేసుకొని నివ‌సిస్తున్న ప్రాంతంలోనే జీ ప్ల‌స్ త్రీ ప‌ద్ద‌తిలో అపార్ట్‌మెంట్లు నిర్మించాల‌ని  భావిస్తున్న‌ట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *