పెన్షన్ అనేది ఉద్యోగుల హక్కు,అది ప్రభుత్వాల భిక్ష కాదు

“ఇప్పటి వరకు మార్చి 2024 నుండి తమకు రావలసిన రిటైర్మెంట్ బకాయిలు అందక వివిధ ఆర్థిక ఇబ్బందులతో మానసికంగా కృంగిపోయి, ఆరోగ్యం క్షీణించి 76 మంది పెన్షనర్లు చనిపోయారు. భారత రాజ్యాంగం ప్రకారం మనది సంక్షేమ రాజ్యం(ఇండియా ఈజ్ వెల్ఫేర్ సొసైటీ). కాంగ్రెస్ జాతీయనేత రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకొని భారత్ జోడో యాత్ర నిర్వహించినప్పుడు వేలాది ఉద్యోగ, ఉపాధ్యాయులు, మరియు పెన్షనర్లు,నిరుద్యోగులు,ప్రజలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో యాత్రలో భాగస్వాములయ్యారు. మీ ప్రభుత్వం రావడానికి కారణమయ్యారు.అది మీరు మొదటగా గుర్తించుకోండి..”

ముఖ్యమంత్రి గారూ! ప్రజలకు తప్పుడు సమాచారం ఇవ్వకండి. 

-కందుకూరి దేవదాసు 
రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ 
బకాయిల సాధన కమిటీ రాష్ట్ర నాయకుడు
మొబైల్ :  9949937745.

మొన్న ఒక సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడానికి కూడా ఖజానా ఖాలీగా ఉంది. ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని, ప్రతి నెల వెయ్యిమంది ఆవరేజ్ గా రిటైర్ అవుతున్నారని వారికి ఒక్కొక్కరికి కోటి రూపాయల చొప్పున రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాల్సి వస్తుంది. అయినా ఏదో ఒక రకంగా సమన్వయం చేసుకొని ఈ ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్నాం అని అన్నారు. అయితే ముఖ్యమంత్రి గారు సమాచార లోపంతో కావచ్చు లేదా కావాలనే కావచ్చు కానీ తాను మాట్లాడిన మాటల్లో అవాస్తవం ఉంది. వారు మాట్లాడిన మాటలు ప్రజలందరూ విన్నారు.వారు మాట్లాడిన అవాస్తవం ఏమిటి అంటే… మొదటిది ‘రిటైర్ అయిన ఉద్యోగికి ఇచ్చేవి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావు. అవి రిటైర్ అయిన ఉద్యోగికి రావలసిన “రిటైర్మెంట్ బకాయిలు.” రెండవది ‘ప్రతి రిటైర్ అయిన ఉద్యోగికి ఇచ్చేది ఒక కోటి రూపాయలు అనేది అవాస్తవం’. ఒక్కొక్కరికి చిన్న ఉద్యోగి నుండి మొదలుకొని గ్రూప్ వన్ ఆఫీసర్ స్థాయి వరకు 35 లక్షల నుండి 70 లక్షల వరకే బకాయిలు ఉంటాయి.వాటిని ఆవరేజ్ చేసి నట్లైతే 50 లక్షల పెన్షన్ బకాయిలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుచున్నాము.

   ముఖ్యమంత్రి గారు కూడా సరైన సమాచారం తెప్పించుకుంటే బాగుంటుంది. పెన్షనర్ల బకాయిలు క్రింది విధంగా ఉన్నాయి. 

.*గ్రాట్యుటి* రిటైర్ అయిన ప్రతి ఉద్యోగి 30 నుండి 40 సంవత్సరాలు సర్వీస్ చేస్తే వారి సేవలకు ఫలితంగా ప్రభుత్వం గుడ్ విల్ గా ఇచ్చేది ఒక్క గ్రాట్యుటీ 16 లక్షలు మాత్రమే. మిగిలినవన్నీ పెన్షనర్లు తమ సర్వీసు కాలంలో దాచుకున్న తమ సొమ్ములు మాత్రమే! అవేంటో కాస్త వివరంగా తెలుసుకుందాం.

1.*జిపిఎఫ్*: తమ సర్వీసు కాలంలో తమ వేతనాల నుండి జనరల్ ప్రావిడెంట్ ఫండ్ లో బేసిక్ లో 6%చొప్పున నెల నెలా కొంత మొత్తం సొమ్మును దాచుకొంటారు. అట్లా జమ అయిన మొత్తాన్ని రిటైర్మెంట్ అయిన వెంటనే ప్రభుత్వం ఇవ్వాలి. దీన్నే జిపిఎఫ్ ఫైనల్ పేమెంట్ అంటారు. ఇది ఉద్యోగులు పొదుపు చేసుకున్న సొమ్మే.

  1. *లీవ్ ఎన్కాష్మెంట్: రెగ్యులర్ ఉద్యోగులకు(నాన్ వెకేషన్ డిపార్ట్మెంట్) సంవత్సరానికి వారు పనిచేసిన కాలానికి30రోజుల సంపాదిత సెలవులు ఇస్తారు. ఉపాధ్యాయులు వెకేషన్ డిపార్ట్మెంట్ కాబట్టి వారికి సంవత్సరానికి 6 రోజులు సంపాదిత సెలవులు ఉంటాయి. వేసవిలో ప్రభుత్వం ఉపాధ్యాయుల సేవలు ఉపయోగించుకున్నందుకు పరిహారంగా అప్పుడప్పుడు సంపాదిత సెలవులు మంజూరు చేస్తుంది. రిటైర్మెంట్ నాటికి వాడుకోకుండా మిగిలి ఉన్న సంపాదిత సెలవులు, అర్థవేతన సెలవులు అన్ని ప్రభుత్వానికి సరెండర్ చేయగా కొంత మొత్తం డబ్బు ప్రభుత్వం చెల్లిస్తుంది. దీన్నే లీవ్ ఎన్కాష్మెంట్ అంటారు. ఇది ప్రభుత్వం అదనంగా ఇచ్చేది కాదు. చట్ట ప్రకారం తమకు రావలసిందే!
  2. ఇక *కమ్యుటేషన్ ఆఫ్ పెన్షన్*: ఇది కూడ ప్రభుత్వం అదనంగా ఇచ్చేది ఏమీ కాదు. తమకు రావలసిన పెన్షన్ నుండి కొంత పెన్షన్ ను40% అమ్ముకోగా వచ్చేదే కమ్యుటేషన్ ఆఫ్ పెన్షన్. అమ్ముకోగా వచ్చిన మొత్తాన్ని సమాన వాయిదాల్లో నెల నెలా చెల్లించే పెన్షన్ నుండి ఎనిమిది శాతం వడ్డీతో 15 సంవత్సరాలు మినహాయిస్తారు. ఈ మొత్తాన్నే “కమ్యుటేషన్ వాల్యూ ఆఫ్ పెన్షన్” లేదా సివిపి అంటారు. ఒకరకంగా ప్రభుత్వం దగ్గర అప్పు తీసుకున్నట్లు. నెల నెలా CVP అంటే EMI రూపంలో పెన్షనర్ పెన్షన్ నుండి కట్ అవుతుంది. తీసుకున్న అమౌంట్ కు రెట్టింపు వసూలు చేస్తారు. ఈ సౌలభ్యం ఎందుకోసం పెట్టారంటే రిటైర్డ్ అయిన ఉద్యోగులకు గృహావసరాలు, పిల్లల పెళ్లిళ్లు, విద్యా అవసరాలకోసం ఫిక్స్ అయిన పెన్షన్ నుండి కొంత అమ్ముకొని వచ్చిన పెద్ద మొత్తం వాడుకోవడానికి ఈ వెసులుబాటు కల్పించారు. రిటైర్ అయిన ఉద్యోగులు పదవీ విరమణ అనంతరం ఇబ్బందులు పడవద్దని వారి సంక్షేమం కోసం పెట్టిందే ఇది.
  3. గ్రూప్ ఇన్సూరెన్స్(జిఐఎస్): ఈ నిధికి ఉద్యోగుల మూలవేతనం ఆధారంగా ప్రతినెల వాళ్ళ వేతనాలనుండి కొంత మొత్తం మినహాయిస్తారు. రిటైర్ అయిన నాడు జమ అయిన మొత్తం చెల్లించాలి.
  4. తెలంగాణ గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ (టిజీఎల్ఐ): ఇది కూడా ఉద్యోగుల కోసమే ఏర్పాటుచేసిన ఇన్సూరెన్స్ స్కీమ్. ప్రతినెల వారి వారి మూల వేతనాల ఆధారంగా వాళ్ళ వేతనాల నుండి మినహాయిస్తారు(డిడక్ట్ చేస్తారు).
  5. పి.ఆర్.సి.2020ఏరియర్స్ గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో పిఆర్సి ఏరియర్స్ ఉద్యోగి రిటైర్డ్ అయితే కానీ లేదా చనిపోయినట్లయితే చెల్లిస్తామన్నారు. ఈ ప్రభుత్వం ఫిబ్రవరి 2025 వరకు రిటైర్డ్ అయిన ఉద్యోగులకు పిఆర్సి ఏరియర్స్ చెల్లించారు. కానీ మార్చి 2025 తర్వాత రిటైర్డ్ అయిన వారికి పి.ఆర్.సి. ఏ‌రియర్స్ కూడా చెల్లించడం లేదు. ఇవి న్యాయంగా రిటైర్డ్ ఉద్యోగికి రావలసినవి. మరియు డి.ఏ. బకాయిలు, సరెండర్ లీవుల బకాయిలు ఉద్యోగ, ఉపాధ్యాయులకు వారు రిటైర్ అయినప్పుడు ఇవ్వాల్సినవన్నీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కాదు. అవి రిటైర్మెంట్ బకాయిలు మాత్రమే! కానీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి ప్రజల్లో అపోహలు కలిగేలా ఒక్కో రిటైర్ అయిన ఉద్యోగికి కోటి రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సి ఉంటుందని అనడం సరైంది కాదని, ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలను రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ బాధిత సంఘ రాష్ట్ర నాయకుడిగా ఖండిస్తున్నాం..

    పైన పేర్కొన్న బకాయిలు అన్ని ఉద్యోగి రిటైర్ అయినప్పుడు చట్టబద్ధంగా చెల్లించాల్సిన చెల్లింపులు తప్ప మరేం కావు. సుప్రీంకోర్టు ధర్మాసనం జస్టిస్ వై.వి.చంద్రచూడ్ గారి జడ్జిమెంట్ కూడా అనేక సందర్భాల్లో పెన్షన్ అనేది ఉద్యోగులకు ఇచ్చే భిక్ష కాదని, ‘పెన్షన్ అనేది వారి చట్టబద్ధ హక్కని’ నొక్కి వక్కాణించింది. ఇప్పటి వరకు మార్చి 2024 నుండి తమకు రావలసిన రిటైర్మెంట్ బకాయిలు అందక వివిధ ఆర్థిక ఇబ్బందులతో మానసికంగా కృంగిపోయి, ఆరోగ్యం క్షీణించి 76 మంది పెన్షనర్లు చనిపోయారు. భారత రాజ్యాంగం ప్రకారం మనది సంక్షేమ రాజ్యం(ఇండియా ఈజ్ వెల్ఫేర్ సొసైటీ). కాంగ్రెస్ జాతీయనేత రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకొని భారత్ జోడో యాత్ర నిర్వహించినప్పుడు వేలాది ఉద్యోగ, ఉపాధ్యాయులు, మరియు పెన్షనర్లు,నిరుద్యోగులు,ప్రజలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో యాత్రలో భాగస్వాములయ్యారు. మీ ప్రభుత్వం రావడానికి కారణమయ్యారు.అది మీరు మొదటగా గుర్తించుకోండి .ఇది దాచేస్తే దాగని సత్యం కదా! అలాంటి పెన్షనర్లకు అన్యాయం చేయకండి. పెన్షనర్లుగా మేము పడు పడుతున్న మనో వేదనను అర్థం చేసుకోండి. చనిపోయిన 76 మంది పెన్షనర్ల ఆత్మలకు శాంతి కలగాలని కోరుకుందాం. వీరి మరణాలకు బాధ్యత ఎవరు వహిస్తారు ముఖ్యమంత్రి గారు!.

 మిస్ వరల్డ్ పోటీలు, ఫుట్ బాల్ ప్లేయర్ మెస్సి పోటీలు, తెలంగాణ గ్లోబల్ సమ్మిట్, వంటి కార్యక్రమాలు నన్ను కోసినా డబ్బులు లేవంటూనే మూసి సుందరీకరణకు లక్ష యాభై వేల కోట్లు, మూసీ నదిపై గాంధీ విగ్రహానికి 5000 కోట్లు మరియు మొన్ననే ప్రకటించిన కాలేజి విద్యార్థినిలకు ఇ.వి.స్కూటీలు ఈ పథకాలన్నీ అమలు చేయడానికి మీరు పూనుకుంటున్నారు. ఇత్యాది కార్యక్రమాలు చేస్తున్నా కానీ మా డబ్బులు మాకు ఇవ్వకుండా మీరు ఈ పెన్షనర్లకు ఎందుకు చెల్లించకుండా వేధిస్తున్నారు. ఇది మీకు న్యాయమేనా? ఇత్యాది కార్యక్రమాలు అన్నీ చేస్తున్నా మీకు ఈ రిటైర్ అయిన విశ్రాంత జీవుల సంక్షేమం పట్టదా! విశ్రాంతి తీసుకోవలసిన సమయంలో ధర్నాలు, ర్యాలీలు, నిరాహార దీక్షలు చేయాల్సి వస్తుంది. విశ్రాంత జీవితం కుటుంబ సభ్యులతో గడపాల్సిన సమయంలో ఆందోళన, ఆవేదనతో అసువులు బాయాల్సివస్తుంది. ఇది మీ పాలనకు క్షేమకరం కాదు. ప్రజా పాలన మరియు ఇందిరమ్మ పాలన అనిపించుకోదు. కాస్త మా వైపు ఒక చూపు, కనికరం చూపండి సార్! కోటి రూపాయలు అని మమ్మల్ని బద్నాం చేయకండి సార్! మమ్మల్ని ప్రజల ముందు అభాసు పాలు చేయకండి. మార్చి 2024 నుండి ఇప్పటి వరకు రిటైర్డ్ అయిన పెన్షనర్ల రిటైర్మెంట్ బకాయిలు ఏక మొత్తంలో చెల్లించి పెన్షనర్ల కుటుంబాలను కాపాడాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ బకాయిల సాధన కమిటీ రాష్ట్ర శాఖ పక్షాన వేడుకుంటున్నాం. ఈ నెలలో ప్రవేశపెట్టే రాష్ట్ర బడ్జెట్లో రిటైర్మెంట్ బకాయిలు రాని పెన్షనర్లకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించి ఏక మొత్తంలో రిటైర్మెంట్ బకాయిలు చెల్లిస్తారని వేలాది కుటుంబాలు ఎంతో ఆశతో ఎదురుచూస్తూ, మా పెన్షనర్ల కుటుంబాలను కాపాడుతారని విజ్ఞప్తి చేస్తున్నాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *