నేడు రాష్ట్రమంతా అవినీతి లంచగొండితనం అన్ని రంగాలలో పేరుకుపోయింది. వివిధ ప్రభుత్వ కార్యాలయాలలో, కార్పొరేట్ సంస్థలలో, ప్రైవేట్ రంగాలలో, రాజకీయరంగంలో అవినీతి, లంచగొండితనం కుప్పలు తెప్పలుగా పేరుకుపోయింది. అవినీతి అనేది ఒక రకమైన నిజాయితీ లేని చర్య లేదా క్రిమినల్ నేరం. అవినీతి కేవలం మన రాష్ట్రానికే పరిమితం కాదు. దేశంలో, ప్రపంచదేశాల్లో వివిధ రూపాల్లో కొనసాగుతోంది. ఇక మన రాష్ట్రం విషయానికి వస్తే ప్రభుత్వ కార్యాలయాల్లో ఇదొక నిత్యకృత్యంగా మారింది. ప్రభుత్వ పాలనలో ఉద్యోగులు భాగం. పాలన సక్రమంగా నడవాలంటే ఉద్యోగుల పాత్ర కీలకం. ప్రభుత్వ పథకాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ, వివిధ అభివృద్ధి కార్యక్రమాలు కానీ, రాష్ట్రంలోని వివిధ డిపార్ట్మెంట్లలో పథకాలు ప్రజలకు సక్రమంగా అందాలంటే, ఉద్యోగులు సక్రమంగా నిజాయితీగా తమ విధులను నిర్వర్తించక తప్పదు. అప్పుడు మాత్రమే ప్రభుత్వ పథకాలు ప్రజలకు సక్రమంగా చేరతాయి.
ప్రభుత్వానికి మంచిపేరుతో పాటు ప్రజల్లో విశ్వసనీయత పెరుగుతుంది. వివిధ స్థాయిల్లో పనిచేసే ఉద్యోగుల్లో కొందరు, పనులకోసం తమవద్దకు వచ్చిన వారి వద్దనుంచి పనిని బట్టి వెల నిర్ణయించి వసూలు చేయడాన్నే లంచం అంటున్నాం. నిజానికి ఈ పనులను వారు ఉచితంగా చేయాల్సి వుంటుంది. తాము నిర్ణయించిన లంచం కోసం ప్రజలను పీడించడమనేది తెలంగాణ వ్యాప్తంగా దాదాపుగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో జరుగుతున్న తంతు. జిల్లా స్థాయి అధికారులకు, పెద్ద, మధ్యతరగతి,చిన్న ఉద్యోగులకు రాజకీయ నాయకుల అండదండలు పుష్కలంగా వుంటున్నాయి. ఫలితంగా వీరి అక్రమాలు, లంచగొండితనానికి అడ్డే లేకుండా పోతున్నది. ఈ క్రమంలో ఉద్యోగంలో చేరిన కేవలం ఐదు నుంచి పదేళ్ల కాలంలోనే జిల్లా స్థాయి అధికారులు, తహసీల్దార్ స్థాయి, సబ్ రిజిస్ట్రార్ స్థాయి అధికారులు( గ్రూపు -1,గ్రూపు-2) అక్రమ మార్గంలో కోట్లు సంపాదిస్తూ, పెద్ద ఎత్తున స్థిర, చరాస్తులు సంపాదించుకుంటున్నారు. పట్టణాలలో పెద్ద పెద్ద భవనాలను నిర్మించుకుంటూ, ఓపెన్ ప్లాట్లు, ఫ్లాట్ (అపార్ట్మెంట్), పొలాలు,బంగారం, వెండి ఆభరణాలు, విలాసవంతమైన కార్లు సమకూర్చుకుంటున్నారు.
ఆస్తులు ఎక్కువైతే (బినామీల) బంధువుల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. అక్రమ ఆదాయ మార్గాలు ఎక్కువగా ఉన్న రెవెన్యూశాఖ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ, రవాణా శాఖ, ఇంజనీరింగ్ శాఖ, రోడ్లు అండ్ బిల్డింగ్, నీటి పారుదల శాఖ, బిల్డింగ్ అండ్ పర్మిషన్, విద్య, వైద్యం , ఇతర శాఖల ఉన్నత, మధ్య , చిన్న స్థాయి ఉద్యోగుల్లో ఈ అవినీతి ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా సర్పంచ్ స్థాయి నుంచి ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పిటిసి, జెడ్పి చైర్మన్,కార్పొరేటర్, మున్సిపల్ చైర్మన్, మేయర్, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ, రాష్ట్ర మంత్రులు, ఎంపీల వరకు రాజకీయ నాయకులు యదేచ్ఛగా అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ, అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ఈ లంచగొండితనాన్ని, అవినీతిని ప్రోత్సహిస్తున్నారు.
ఈ రాజకీయ నాయకులు ఒక్కసారి అధికారంలోకి వస్తే ఐదు సంవత్సరాలలో సర్పంచి స్థాయి నుంచి, ఎం.ఎల్.ఏ, మంత్రి స్థాయి వరకు తొంభయిశాతం మంది వేల నుంచి లక్షలకోట్లు అక్రమంగా సంపాదిస్తున్నారనేది నగ్న సత్యం. అదే కేవలం వేతనంపై ఆధారపడి జీవించే ప్రభుత్వ ఉపాధ్యాయులు, నిజాయితీగల చిన్న, మధ్య తరగతి ప్రభుత్వ ఉద్యోగులు మూడు దశాబ్దాల నుండి నాలుగు దశాబ్దాల వరకు ప్రభుత్వ సేవలు అందిస్తూ, పిల్లలను చదివించుకుంటూ, కుటుంబాన్ని పోషిస్తూ, ఇల్లు కట్టుకోవడానికి లోన్ కోసం బ్యాంకులను ఆశ్రయించి, దుర్భర జీవితాలను గడపడాన్ని కూడా చూస్తున్నాం. నిజాయతీగా పనిచేసే ఉద్యోగుల్లో చాలామంది రిటైరయిన తర్వాత కూడా సొంత ఇంటికి నోచుకోనివారున్నారంటే అశ్చర్యపోవాల్సిన పనిలేదు. అదే రెవెన్యూ, రిజిస్ట్రేషన్, సేల్స్ టాక్స్, కమర్షియల్ డిపార్ట్ మెంట్, రవాణా, ఇంజనీరింగ్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్, నీటిపారుదల, బిల్డింగ్ అండ్ పర్మిషన్, విద్యా, వైద్యం,మరియు ఇతర రంగాలలో నిత్యం ప్రతిరోజు అవినీతి, లంచగొండితనం అడ్డూ అదుపూ లేకుండా కొనసాగుతోంది.
ప్రభుత్వ కార్యాలయాలలో జరుగుతున్న అవినీతిని లంచగొండితనాన్ని నిర్మూలించడానికి ప్రభుత్వం అవినీతి నిరోధక శాఖను (ఏసీబీ) ఏర్పాటు చేసింది. అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు ఏదో ఒక జిల్లాలో కానీ , ఏదేని ప్రాంతంలో కానీ ప్రభుత్వ కార్యాలయాల్లో దాడులు నిర్వహిస్తూ, అవినీతి అధికారులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముఖ్యంగా రెవెన్యూ శాఖ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ,రవాణా శాఖలో, వివిధ ఇంజనీరింగ్ శాఖలలో, కమర్షియల్ డిపార్ట్మెంట్లలో పదేళ్ల క్రితం ఉద్యోగంలోకి వచ్చిన గ్రూప్ వన్ ,గ్రూప్ టు, తహసిల్దార్ స్థాయి అధికార్లు, సబ్ రిజిస్టర్ స్థాయి అధికార్లు, వివిధ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లలో ఏ.ఇ, డి. ఇ, ఇ.ఇ.లు ఇతర డిపార్ట్మెంట్లలోని అధికారులు నిత్యం అవినీతికి పాల్పడుతూ, కోట్లు సంపాదిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో గత నాలుగు సంవత్సరాల నుండి ఇప్పటి వరకు 66 ఏసీబీ కేసులు నమోదు చేశారు. వీరిలో ఎక్కువగా రెవెన్యూ శాఖలోని తహసీల్దారులు మరియు ఇతర అధికారులు ఎక్కువగా ఉన్నారు. ఇక స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో నిత్యం డాక్యుమెంట్ రైటర్ల ద్వారా ప్రతిరోజు రిజిస్ట్రేషన్ చేసే ఆస్తి విలువను బట్టి రేటు (మామూల్లు) నిర్ణయిస్తూ, డాక్యుమెంట్ రైటర్ల ద్వారా అధికారులు లంచాలు తీసుకుంటున్నారు. వీరిపై ఏసీబీ అధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరం వుంది. ఇంకా అవినీతి నిరోధక శాఖ వారికి దొరకని తహసీల్దారులు, సబ్ రిజిస్ట్రార్లు, ఇంజనీర్లు చాలామందే వున్నారు. ఇటువంటి అవినీతి తిమింగలాలను
అవినీతి నిరోధక శాఖ అధికారులు గుర్తించి, పట్టుకుని, కోర్టుకు సరెండర్ చేయించి, సస్పెండ్ చేయించి, ఉద్యోగాల నుండి తొలగించాలి. ఏసీబీకి చిక్కిన కొందరు పెద్ద అధికారులు, రాజకీయ నాయకుల అండదండలతో మళ్లీ వుద్యోగం లోకి వచ్చి, అక్రమ సంపాదన చేస్తున్నవారూ లేకపోలేదు. అలాంటి అధికారులపై మళ్ళీ దృష్టి పెట్టాలి. వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు లంచం అడిగితే ఏసీబీ అధికారులకు ప్రజలు తెలియపరచాలి. ఏసీబీ అధికారులు ఎవరైనా వ్యక్తులు ఫిర్యాదు చేసినట్లయితే వారి యొక్క వివరాలు గోప్యంగా వుంచుతారు. అందువల్ల ప్రజలు, పిర్యాదు దారులు చైతన్య వంతులై ఏసీబీ ని ఆశ్రయించాలి. అప్పుడు ప్రభుత్వం,రాజకీయ నాయకులు, ఉద్యోగ సంఘాల నాయకులు కూడా లంచగొండి అధికారుల పక్షాన ఉండకుండా, అవినీతి అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఏసీబీ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ, అవినీతి అధికారులను పట్టుకొని, వారిపై శాఖా పరమైన చర్యలు తీసుకొని వారిని ఉద్యోగాల నుండి సస్పెండ్ చేస్తూ, డిస్మిస్ చేస్తూ కఠిన చర్యలు తీసుకున్నట్లయితే ఇతర అధికారులు లంచాలకు పాల్పడకుండా జాగ్రత్త పడుతారు. తెలంగాణ రాష్ట్రంలోని యువతీయువకులు, ప్రజలు, ప్రజాస్వామిక వాదులు చైతన్యవంతంగా ఉండి అవినీతి, లంచగొండితనాన్ని నిర్మూలించడానికి కృషి చేయాలి. అప్పుడే ప్రభుత్వ కార్యాలయాలలో అవినీతి, లంచగొండితనానికి చరమగీతం పాడవచ్చు.






