నక్షత్రాలను పూలదండలా గుచ్చి
లోకం గవాక్షానికి వేలాడదీయాలని
అనుకుంటానా
పూలతోటనెవరో గుర్రాలతో తొక్కిస్తరు
తెల్ల మబ్బులకు నీటిధారల తీగలు చుట్టి
వాన రాగాన్ని ఆలపించాలనుకుంటానా
శృతుల గతుల నెవరో తుఫాన్ లో కలిపేస్తరు
అలల పిల్లలకు ఆటలు నేర్పిస్తుంటానా
సుడిగుండాలతో చుట్టుముట్టి
అల్లకల్లోల పరుస్తరు
కూడలి ఐకమత్యాన్ని
నాలుగు దారులుగా చీల్చి, పలుచన చేస్తరు
గూటిని కళాత్మకంగా అల్లుకునే నేర్పు నేర్చుకున్న,
స్వేచ్ఛానందంలోని జీవిత పరమార్థాన్ని ఎగిరి చూపుతున్న
పిసికెడు పక్షిని, గిలగిలా కొట్టుకునేట్లు చేస్తరు
సుఖనిద్ర చుట్టూ కలల పహరా పెట్టుకుంటానా
పీడకలల్ని ఎగదోసి, పగ తీర్చుకుంటరు
గుణదోషాలనెట్లా వర్ణించాలో?
మెత్తని మనసులో, కత్తులు దూసే తత్వం
ఎట్లా ప్రవేశిస్తుందో
తియ్యటి లాలాజలమూరే నాలుకపై
రోతపురుగుల మాటలెట్లా పుట్టుకొస్తయో
చల్లని చూపుల కంట్లో మాడ్చే మంటలెట్లా జ్వలిస్తయో
ఆనందాలను విషాదాలుగా
సంతోషాలను సంతాపాలుగా
త్యాగాలను స్వార్థాలుగా
హక్కును కుట్రగా, ప్రశ్నను విద్రోహంగా
వాస్తవాన్ని వక్రీకరణగా
మారటం కాదు మార్చటం ఏం విలువో
పాలస్తీనాలు గాజాలు కశ్మీరాలు మయన్మార్లు సిరియాలు
ఎన్నని ఎన్నని చంపుకు తింటరో
భూగోళం కసికసిగా మండుతుంటది
తథాగతా। శరణు శరణు.
దాసరాజు రామారావు





ఈ రోజుల్లో డొల్ల సాహిత్యం ఇలాగే అమ్ముడుపోతోంది నాగిని కందాల