అవును! మేము కర్పూరాలమే!
కాలిపోతూ కరిగి పోతున్నాం !

ఆరతి అయిపోతున్నాం! కానీ
ఏ దేముడికో తెలీదు!
వెలుగు పంచుతున్నాం కానీ
ఎవ్వరి బ్రతుకులకో తెలీదు!

జగమంతా వెలుగుపంచిన సూరీడు
మా చీకటిబ్రతుకుల్లో చూడకపోయినా!
సందేవేళ చుక్కలన్నీ కలసి
మా ఇంట రంగుదీపాల్ని రంగరించాయి!

గోడలకు పట్టిన బూజులన్నీ
తోరణాలై స్వాగతం పలికితే!
ఇరుకు జిలుగు రవికలు,
పట్టు పావడా పీలికలు
సింగారాలు సంతరించుకున్నాయి!

మా కంపు బతుకుల్లో అత్తరుల
ఆలింగనం అప్పుడే!
మా బీడు జీవితాల్లో మల్లెల
వికసింపు అక్కడే!
ఉపవాసం పగలు కడుపు మాడిస్తే
మిఠాయి పొట్లం రాత్రి ఆకలితీర్చింది!
ఒకరి ఆవేశం పరాచకం ఆడితే
ఇంకొకరి పైశాచికం పరిచయం అయ్యింది!

మాదగ్గర లజ్జతనానికి తావు  లేదు
మా బ్రతుకుల కన్నా ఏహ్యం
మరోటి లేదు!

వెచ్చటి ఖుషి వారికి కలిగితే
చిక్కటి నుసి మాకు మిగిలితే
యవ్వనం పడమరకు ఒరిగింది!
జీవితం తెల్లారి పోయింది!

అవును! మేము కర్పూరాలమే!
సిగ్గు పారేసుకుని అలుసై పోతున్నాం!
అగ్గి లేకపోయినా ఆవిరై పోతున్నాం!

-ఉషారం
9553875577

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *