Take a fresh look at your lifestyle.

దేశంలో ధనవంతుల పక్షానే పాలకవర్గాలు

విపక్షాల బలహీనతకు అనైక్యతే కారణం
అందుకే పట్టు సాధించలేకపోతున్న విపక్ష కూటమి ‘ఇండియా’
పార్టీ గత ఘన కీర్తితో కాంగ్రెస్‌ స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఉంది
పిటిఐకి ఇచ్చిన  ఇంటర్వ్యూలో  ప్రఖ్యాత ఆర్థికవేత్త అమర్త్యసేన్‌

ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌, ఏప్రిల్‌ 14 : అనైక్యత కారణంగా భారతదేశంలో ప్రతిపక్షాలు తమ శక్తిని చాలా వరకు కోల్పోయాయని ప్రఖ్యాత ఆర్థికవేత్త, నోబెల్‌ బహుమతి గ్రహీత అమర్త్యసేన్‌ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌కు అనేక సంస్థాగత సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆదివారం పిటిఐక్ని ఇచ్చిన ఇంటర్వ్యూలో అమార్త్య సేన్‌ మాట్లాడుతూ..కుల గణన అనేది పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశమే అయినప్పటికీ…దానికంటే ముందు దేశంలో మెరుగైన విద్య, ఆరోగ్య సంరక్షణ, లింగ సమానత్వం వంటి అంశాల్లో పేదలకు మరింత సాధికారత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
భారత్‌ వంటి ప్రజాస్వామ్య దేశపు పౌరుడిగా తాను ఎంతో గర్విస్తున్నానని అన్నారు. అయితే దేశంలో ప్రజాస్వామ్య పటిష్టతకు ఇంకా చాలా కృషి చేయాల్సి ఆవశ్యకత ఉందని అమర్త్యసేన్‌ అన్నారు. జెడియు, ఆర్‌ఎల్‌డి వంటి పార్టీలు వైదొలగడంతో ప్రతిపక్ష కూటమి నుంచి ‘ఇండియా’ పెద్దగా పట్టు సాధించలేకపోయిందని ఆయన అన్నారు. ప్రతిపక్షాలు ఐక్యంగా ఉంటే బిజెపిని ఎదుర్కునడంలో కావల్సిన బలం చేకూరి ఉండేదని అన్నారు. అనేక సంస్థాగత సమస్యలతో సతమతమవుతున్న కాంగ్రెస్‌ దాని ఘనమైన గత కీర్తితో స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. అదే విధంగా బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వ ఆర్థిక విధానాలపై అమర్త్యసేన్‌ విమర్శలు గుప్పించారు.
భారత అభివృద్ధికి నిరక్షరాస్యత, లింగ వివక్షత అడ్డంకులుగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. భారత పాలక వర్గాలు ధనవంతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుంటూ పాలన సాగిస్తున్నాయని అన్నారు. బిజెపి తిరిగి అధికారంలోకి వొస్తే రాజ్యాంగాన్ని మార్చవచ్చని ప్రతిపక్షాల వాదనపై ఆయనను అడిగినప్పుడు..దేశ రాజ్యాంగాన్ని మార్చడం వల్ల సామాన్యులకు చేకూరే ప్రయోజనం ఏమీ ఉండదని అమర్త్యసేన్‌ స్పష్టం చేశారు.

Leave a Reply