Take a fresh look at your lifestyle.

పది ఫలితాలలో సత్తా చాటిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు!

తెలంగాణా లో ఈ సారి విడుదల అయిన పదవ తరగతి ఫలితాలలో రాష్ట్ర వ్యాప్తంగా 86.60 శాతం సాధించి విద్యార్థులు  చరిత్ర తిరగ రాశారు.బాలురు 84.68 శాతం,బాలికలు 88.53 శాతం సాధించి ముందు నిలిచారు.2,793 పాఠశాల్లో వంద శాతం పాస్‌ ‌కాగా 25 బడుల్లో సున్నా ఫలితాలు వచ్చాయి.6,163 మందికి పది జీ.పి. ఏ సాధించారు. ప్రయివేటు పాఠశాల విద్యార్థులను తలదన్నేలా ర్యాంకుల వర్షం కురిపించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు చరిత్ర తిరగ రాశారు.ఈ సంవత్సరం పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు తమ సత్తా చాటి ర్యాంకుల వర్షం కురిపించడం ఎంతైన హర్షణీయం. ఒక విధంగా చెప్పాలంటే వేలాది రూపాయల ఫీజులు కట్టి ప్రయివేటు పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను సైతం తలదన్నెలా రాష్ట్ర వ్యాప్తంగా మోడల్‌ ‌స్కూల్‌, ‌కస్తూరిబా, మైనారిటీ పాటశాల,బి.సి ,ట్రైబల్‌ ‌వెల్ఫేర్‌ , ‌విద్యార్థులు తమకు లభించిన అరకొరవసతులతోనే నెగ్గుకువచ్చి తమ అసాధారణ ప్రతిభ తో ఈ సరస్వతి పుత్రులు సత్తా చాటారు. అంటే వారి కృషి, పట్టుదల, ఏకాగ్రత ఏపాటిదో మనం ఇట్టే ఊహించవచ్చు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను  ఆభ్యశించే బాలురులతో పోలిస్తే బాలికలు పరీక్ష ఫలితాల్లో ఓక మెట్టు పైచేయి సాధించడం ఓక కొసమెరుపు.

అన్నింటికి మించి ఇలాంటి ఆశాజనకమైన ఫలితాలు ఆడపిల్లలు గల తల్లిదండ్రులకు ఓక సరికొత్త ఆశలను రేకేత్తించడంతో పాటు తమ ఆడపిల్లలను ఇంటిపట్టున ఉంచే బదులు వారిని ఎలాగోలా తిప్పలు పడి  ఉన్నత చదువులు చదివించాలనే కోరిక  వారిలో కలుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.కరీంనగర్‌ ‌జిల్లా శంకర. పట్నం లో ను మోడల్‌ ‌స్కూల్‌ ‌లో చదివిన కవలలు శార్వాణి, ప్రజ్ఞాని 10 జీ.పి.యే సాధించడం గొప్ప విషయం. అదేవిధంగా ప్రస్తుతం అధికారంలో వున్న మన రాష్టప్రభుత్వం వారు కూడా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సైతం ప్రైవేట్‌ ‌పాఠశాలలకు దీటుగా నాణ్యమైన విద్య అందేలా మంచి నైపుణ్యం గల ఉపాధ్యాయులచే వారికి తర్పీదు ఇప్పిస్తుండటంతో పాటు వారు విద్యలో ముందడుగు వేయడానికి అవసరమైన అన్ని వసతి సౌకర్యాలను ఏర్పాటు చేయడం, అల్పాహారం అందించి ఉదయం సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించారు. ఇలాంటి ఆశాజనకమైన ఫలితాలు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు రావడానికి కారణభూతమైంది అని నిస్సందేహంగా చెప్పవచ్చు. అంతేకాదు ప్రభుత్వ పాఠశాల విద్యార్థి, విద్యార్థినీలు కూడా తమను బాగా చదివించడం కోసం అరకోర ఆదాయం మాత్రమే వున్న తమ తల్లిదండ్రులు పడుతున్న కష్టనష్టాలకు శాశ్వతంగా చరమగీతం పాడాలంటే తాము ఉన్నత చదువులు చదివి ఏదేని ఓక పెద్ద స్థాయి ఉద్యోగం సంపాదించడమే ఏకైక మార్గం అని భావించి తద్వారా తమ తల్లిదండ్రుల పేదరికాన్ని నామరూపాల్లెకుండా చేసి వారి కళ్లలో ఆనందాన్ని చూడాలనే,వారిని సుఖ పెట్టాలనే ఏకైక గొప్ప ఆశయం తో ఈ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు చదువులమ్మ తల్లి పై ఎనలేని శ్రద్ధాసక్తులు కనబరుస్తుండటం కూడా ఇప్పుడు ఇలా ప్రభుత్వ పాఠశాలల్లో మంచి ఉత్తిర్ణత శాతం రావడానికి ఒక మంచి సువర్ణ అవకాశం ఏర్పడింది.

ఏదిఏమైన ఇలా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అన్ని హంగులతో కూడిన ప్రయివేటు పాఠశాలలకు దీటుగా ర్యాంకుల సునామి సృష్టించడం ఎంతైన ఓక గొప్ప ఆహ్వానించదగ్గ పరిణామం. దీన్నిబట్టి చూస్తే కృషి, పట్టుదల,సాదించాలనే తపన వుండాలే గాని చదువు చదివేందుకు పేదరికం ఏమాత్రం అడ్డంకి కాదు అనే అక్షర సత్యాన్ని ఈ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు నిరూపించిన తీరు నభుతో న భవిష్యత్‌ అని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఏమైనా ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలకు వచ్చిన మంచి ఫలితాలు రాబోయే కాలంలో సైతం వచ్చేలా అన్ని ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయులు తమ విద్యార్థులను మంచి విద్య కుసుమాలుగా, చదువులమ్మ సరస్వతీ పుత్రులుగా మార్చగలిగితే అంతకుమించిన గొప్పతనం లేదు. ఈ ప్రత్యేక సందర్బంగా పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో మంచి స్ఫూర్తిదాయకమైన, ఆదర్శమైన మార్కులు, ర్యాంకులు సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు జేజేలు పలుకుదాం.! వారికి మనమంతా మనస్ఫూర్తిగా హ్యాట్సాఫ్‌ ‌చెబుదాం.కొన్ని ప్రాంతాల్లో ఫెయిల్‌ అయిన విద్యార్థులు ఆత్మహత్య లకుపాల్పడ్డారు.క్షణిక ఆవేశంలో యే నిర్ణయం తీసుకోవద్దు.ఎంతో మంది ఫెయిల్‌ అయి మళ్ళీ పరీక్ష రాసి ఉన్నత ఉద్యోగులు అయిన వారు కూడా ఉన్నారు.నేటి ఓటమి రేపటి గెలుపు కు నాంది కావాలి. పదవ తరగతి ఫలితాలలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు,ఉత్తమ భోధన చేసిన ఉపాధ్యాయులు,మార్గ నిర్దేశనం చేసిన ప్రధానోపాధ్యాయులకు ప్రత్యేక అభినందనలు….

-కామిడి సతీష్‌ ‌రెడ్డి
జయశంకర్‌ ‌భూపాలపల్లి జిల్లా,
తెలంగాణ సామాజిక రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు.
9848445134

Leave a Reply