Take a fresh look at your lifestyle.

కరువుపై ఎన్నికల రాజకీయం!

అధికార, విపక్ష నేతల విమర్శలెలా ఉన్నా ప్రస్తుతం తెలంగాణలో భూగర్భజల మట్టం రోజురోజుకీ దిగజారుతూ గతేడాది కంటే మరింత కనిష్ఠ స్థాయికి పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. దీనికి విరుగుడు కనిపెట్టాలి. వాన నీటిని ఒడిసి పట్టే చర్యలకు పూనుకోవాలి. చెరువును పూడికతీసి పునరుద్దరించాలి.

పార్లమెంటు ఎన్నికల ప్రచారం ఇప్పుడు కరువు, రైతుల చుట్టూ తిరుగుతుంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో కరువు కోరలు చాస్తోంది. చాలా ప్రాంతాల్లో రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు అడుగంటుతుండటంతో పంటలపై ప్రభావం పడుతోంది. కాంగ్రెస్‌ తెచ్చిన కరువు అంటూ..విపక్ష బిఆర్‌ఎస్‌ ప్రచారం మొదలు పెట్టింది. ఓ వైపు ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం సీరియస్‌గా దర్యాప్తు సాగుతోంది. అందులో కెసిఆర్‌, కెటిఆర్‌ల పేర్లు ఉన్నాయంటూ లీకులు వొస్తున్నాయి. ఈ క్రమంలో తమ పాపాలను పక్కన పెట్టి ప్రజల దృష్టి మళ్లించడానికి, ఎన్నికల్లో లబ్ది పొందడానికి బిఆర్‌ఎస్‌ నానా తంటాలు పడుతోంది. తెలంగాణలోనే కాదు..దేశం యావత్తూ కరువుతో అల్లాడుతోంది. కర్ణాటకాలో  మంచినీటికి అల్లాడుతున్నారు. మేడిగడ్డ కుంగిపోవడంతో అందులో నీళ్లు నింపడానికి లేకుండా పోయింది.

ఈ క్రమంలో కాళేశ్వరం  అవినీతిపైనా, మేడిగడ్డ కుంగుబాటుపైనా విచారణ సాగుతోంది. దీనినుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కరువు కలిసి వొచ్చిందన్న సంతోషంలో బిఆర్‌ఎస్‌ ఉంది. దీనికితోడు పార్టీలో ఉన్న నేతలు జంప్‌ అవుతున్నారు. టిక్కెట్‌ ఇచ్చినా మాకొద్దీ టిక్కెట్‌ అంటూ జారుకుంటున్నారు. ఈ స్థితిలో బిఆర్‌ఎస్‌ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారయ్యింది. అందుకే పార్టీ మారిన వారిని చిల్లరగాళ్లు అంటూ విమర్శలు అందుకుంది. కరువు వొస్తే నీళ్లు ఇవ్వడం లేదని, విద్యుత్‌ రావడం లేదనే పసలేని వాదనతో ప్రజల ముందుకు కెసిఆర్‌ ఆయన పరివారం బయలుదేరింది. ఇప్పుడు పంట చేతికి రావడంతో పాటు కొన్ని ప్రాంతాలలో పంటలు ఎండి పోయాయి. ఈఅంశాన్ని తెరపైకి తీసుకు వొచ్చి కాంగ్రెస్‌కు అంటగట్టాలని బిఆర్‌ఎస్‌ నానా తంటాలు పడుతోంది. ఇప్పటికే ముఖ్యనేతలు ఎండిన పంటపొలాలను పరిశీలించారు. మాజీ సియం కెసిఅర్‌ మొన్నటికి మొన్న ఎండిన పంటపోలాలను పరిశీలించారు.

అయితే నానా పాపాలు చేసిన బిఆర్‌ఎస్‌ తీరుపై అధికార పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.ఎందుకంటే ఇప్పటికే లోకసభ ఎన్నికల వేడి మొదలైంది.. నామినేషన్లకు గడువు రాకున్నా నేతలు తమ ప్రచార అస్త్రాలన్నీ బయటికి తీస్తున్నారు. ఇప్పుడు పలు ప్రాంతాలలో సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయి. మరో పదిహేను రోజులలో పంటలు చేతికి రానున్నాయి. అయితే కండ్ల ముందే ఈ సమస్య ఉండడంతో దీనిపైనే బిఆర్‌ఎస్‌ నేతలు దృష్టి పెట్టాయి. దీనిని ఓ సమస్యగా చేస్తే రాజకీయ లబ్ది పొందవచ్చన్న దురాలోచనలో ఆ పార్టీ ఉంది. బిజెపి ,బిఅర్‌ఎస్‌ పార్టీల నేతలు ఎండిన పంటపోలాలని పరిశీలించారు. ఈ రెండు పార్టీలు కూడా సాగునీటి సమస్యపై అందోళనలు నిర్వహించాయి. ఇప్పుడు రైతు సమస్యలపై మరింత ఫోకస్‌ పెట్టారు బిఅర్‌ఎస్‌ అధినేత, మాజీ సియం కెసిఅర్‌ ఎన్నికల వేళ క్షేత్రస్థాయిలో పరిశీలనకి వెళ్తున్నారు. తొలివిడత జనగామ, సూర్యాపేట పర్యటనలు ముగియడంతో.. ఈనెల 5న కరీంనగర్‌ లోక్‌సభ పరిధిలో వేములవాడ, సిరిసిల్ల, కరీంనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎండిపోయిన పంటపోలాలను పరిశీలించ నున్నారు. ఈ రెండు పార్టీలు రైతుల సమస్యల అధారంగానే ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి.

10 రోజులలో వరి ధాన్యం ఐకెపి సెంటర్లకి రావడం, అమ్మడం లాంటి కార్యక్రమాలు కొనసాగుతాయి. అయితే అదనంగా క్వింటాల్‌కి రూ. 500 బోనస్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఈరెండు పార్టీలు గళం విప్పుతున్నాయి. ప్రతిపక్ష పార్టీలకి ధీటుగానే అధికార పార్టీ సమాధానం చెబుతుంది. గత సంవత్సరం సరిjైున వర్షాలు లేకపోవడం, వేగంగా ప్రాజెక్టుల్లో నీటి మట్టం తగ్గిపోవడం కారణంగా కరువు ఏర్పడిరదని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. ఎన్నికల వేళా ప్రతిపక్ష పార్టీలు రైతు సమస్యలపైనా మాట్లాడుతున్నాయని చెబుతున్నారు. గత ప్రభుత్వం కారణంగానే రైతు సమస్యలు మరింత పెరిగాయని కాంగ్రెస్‌ నేతలు తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు.

మొత్తానికి లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఈ మూడు పార్టీలు రైతుల వైపే చూస్తున్నారు. అయితే రాష్ట్రంలో కరువు పరిస్థితులకు కాంగ్రెస్‌ ప్రభుత్వమే కారణమని బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ ఇటీవలే విమర్శించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పొలంబాట కార్యక్రమంలో పాల్గొన్న కేసీఆర్‌.. ఇది వొచ్చిన కరువు కాదని, కాంగ్రెస్‌ ప్రభుత్వం తెచ్చిన కరువని మండిపడ్డారు. రాష్ట్రంలో పంటలు ఎండిపోవడానికి, కరెంటు లో వోల్టేజ్‌ సరఫరాకు కారణం కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని కేసీఆర్‌ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి కంటే ముందు ఎనిమిదేండ్లు తాము ఇవ్వగలిగినప్పుడు కరెంటు ఇప్పుడెట్ల మాయమైందని కేసీఆర్‌ ప్రశ్నించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు మిషన్‌ భగీరథతో నీళ్లు అందించామని.. ఇప్పుడు మళ్లీ ఖాలీ  బిందెలు కనిపిస్తున్నాయని కేసీఆర్‌ ఆరోపించారు. ట్యాంకర్లు రావాల్సిన దుస్థితి ఎందుకు వొచ్చిందని ప్రశ్నించారు. కరెంట్‌ వొస్తూ పోతోంది కాబట్టే మోటార్లు కాలిపోతున్నాయన్నాయంటూ పేర్కొన్నారు.

అసమర్థ కాంగ్రెస్‌ తెచ్చిన కరువంటూ కేసీఆర్‌ చేస్తున్న వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు తెలంగాణ మంత్రులు. కేసీఆర్‌ మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే అని.. ఆయన డిప్రెషన్‌, ఫ్రస్టేషన్‌లో ఉన్నారని ఎద్దేవా చేశారు. పదేండ్లుగా గత బిఆర్‌ఎస్‌  ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యమే ప్రస్తుత పరిస్థితులకు కారణమన్నారు. అధికార, విపక్ష నేతల విమర్శలెలా ఉన్నా ప్రస్తుతం తెలంగాణలో భూగర్భజల మట్టం రోజురోజుకీ దిగజారుతూ గతేడాది కంటే మరింత కనిష్ఠ స్థాయికి పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. దీనికి విరుగుడు కనిపెట్టాలి. వాన నీటిని ఒడిసి పట్టే చర్యలకు పూనుకోవాలి. చెరువును పూడికతీసి పునరుద్దరించాలి. మిషన్‌ భగీరథ పేరుతో చెరువుల పూడికతీత పనులు ఉత్తిదే అని తేలింది. అది విచారించి దానిని తిరిగి చేపట్టాలి. శ్రీరాంసాగర్‌లో నీటిమట్టం పూర్తిగా తగ్గింనందున పూడికత ఎత్తే పనిచేయాలి. దీనివల్ల వొచ్చే వర్షాకాలంలో నీటి నిల్వలు పెంచుకునే అవకాశం ఉంటుంది. ఈ దిశగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎండాకాలం పనులకు పూనుకోవాలి.
 -ప్రజాతంత్ర డెస్క్‌ 

Leave a Reply