Take a fresh look at your lifestyle.

నిన్నటి వరకు ఒకే గూటి పక్షులు..నేడు ప్రత్యర్థులు

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో విచిత్ర పరిస్థితి
వరంగల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో
బిఆర్‌ఎస్‌ సీటిచ్చినా కాదని కాంగ్రెస్‌లో చేరిన కావ్య..
సీటివ్వలేదని అలిగి బీజేపీలో చేరిన ఆరూరి

ఎట్టకేలకు బిఆర్‌ఎస్‌ పార్టీ డాక్టర్‌ మారెపల్లి సుధీర్‌ కుమార్‌ను తమ అభ్యర్థిగా ప్రకటించడంతో వరంగల్‌ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి విషయంలో గత కొంతకాలంగా జరుగుతున్న చర్చకు తెరపడిరది. డాక్టర్‌ సుధీర్‌కుమార్‌ హనుమకొండ జడ్‌పి చైర్మన్‌(బిఆర్‌ఎస్‌)గా కొనసాగుతున్న వ్యక్తి. ఎన్నికల పక్రియ మొదలైనప్పటి నుండి వరంగల్‌ అభ్యర్థి విషయంలో ఆనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. చాలా మంది పేర్లు వెలుగులోకి వొచ్చాయి. కాని, ప్రజల నోళ్లలో నానుతున్న పేర్లకు భిన్నంగా బిఆర్‌ఎస్‌ అధినేత సుధీర్‌కుమార్‌ను ఎంపిక చేశారు. ఇక్కడ విచిత్ర విషయమేమంటే పోటీ పడుతున్న మూడు ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులంతా నిన్నటి వరకు ఒకే గూటి పక్షులు కావటం. తాజా శాసనసభ ఎన్నికలనాటి వరకు వర్థన్నపేట బిఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎంఎల్‌ఏగా ఉన్న అరూరి రమేష్‌ ఇవ్వాళ బిజెపి అభ్యర్థిగా పోటీలో ఉన్నాడు. వర్థన్నపేటలో కాంగ్రెస్‌ అభ్యర్థి నాగరాజు చేతిలో ఓటమి చవిచూసిన రమేష్‌ వరంగల్‌ పార్లమెంటు అభ్యర్థిగా బిఆర్‌ఎస్‌ అధిష్టానం తననే ఎంపిక చేస్తుందనుకున్నారు. ఆమేరకు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం దక్కకపోవడంతో కాషాయ కండువ కప్పుకున్నాడు. ఒక విధంగా తనకు వరంగల్‌ పార్లమెంటుకు పోటీచేసే అవకాశం ఇస్తేనే పార్టీలో చేరుతానన్న ఒప్పందంతోనే ఆయన బిజెపిలో చేరడమైంది.

అరూరి రమేష్‌కు బిఆర్‌ఎస్‌ నుండి పోటీచేసే అవకాశం దక్కక పోవడంతో అలిగి బీజేపీలో చేరితే, బిఆర్‌ఎస్‌ తనకు అవకాశం ఇచ్చినప్పటికీ పార్టీకి గుడ్‌ బై చెప్పి కాంగ్రెస్‌లో చేరింది కడియం కావ్య. ఇప్పుడు ఆమె కాంగ్రెస్‌ అభ్యర్థినిగా వరంగల్‌ పార్లమెంటు నియోజకవర్గంలో పోటీ పడుతుంది. రాజకీయాల్లో తలపండిన కావ్య తండ్రి కడియం శ్రీహరి బిఆర్‌ఎస్‌ నుండి స్టేషన్‌ఘనపూర్‌ ఎంఎల్‌ఏ ఎన్నికై మూడు నెలలైనా కాకముందే కూతురుతో పాటు కాంగ్రెస్‌లో చేరిపోయిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితిలో వరంగల్‌ పార్లమెంటు ఎస్సీ నియోజకవర్గానికి అభ్యర్థిని ఎంచుకోవడంలో బిఆర్‌ఎస్‌ పెద్ద ఎత్తున కసరత్తు చేయాల్సి వొచ్చింది. చివరకు తమ అభ్యర్థిగా డాక్టర్‌ సుధీర్‌కుమార్‌ను ఎంపిక చేసింది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు మొదటి నుండి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఒకనాడు కాకతీయ రాజధానిగా విలసిల్లిన ఈ జిల్లా స్వాతంత్య్రానంతరం ప్రజాస్వామ్య రాజకీయ రంగంలో ప్రధాన భూమికను పోషిస్తూ వొచ్చింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ తర్వాత స్థానం వరంగల్‌కే దక్కింది. అంతటి చైతన్యవంతమైన ఈ (ఉమ్మడి) జిల్లాలోని రెండు పార్లమెంటు స్థానాలను గెలుచుకునే విషయంలో మూడు ప్రధాన పార్టీలు తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ప్రధానంగా వరంగల్‌ నియోజకవర్గం విషయానికొస్తే విచిత్రంగా ముగ్గురు అభ్యర్థులు కూడా నిన్నటి వరకు బిఆర్‌ఎస్‌ నేతలే అయినప్పటికీ ఎవరికి వారు తామే గెలుస్తామన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఈ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ స్థానాల్లో ఒక్క స్టేషన్‌ఘనపూర్‌ తప్ప మిగతా నియోజకవర్గాలన్నీటినీ కాంగ్రెస్‌ గెలుచుకుంది.

కాని, పార్లమెంటు ఎన్నికలు వొచ్చేసరికి ఆ ఒక్క నియోజకవర్గాన్ని కూడా బిఆర్‌ఎస్‌ చెయ్యి జార్చుకుంది. స్టేషన్‌ ఘనపూర్‌ నుంచి గెలిచిన కడియం శ్రీహరి కాంగ్రెస్‌ కండువా కప్పుకోవడంతో ఆ ఒక్క నియోజకవర్గం కూడా బిఆర్‌ఎస్‌ ఆధీనంలో లేకుండా పోయింది. దానికితోడు బిఆర్‌ఎస్‌ చాలా ఆలస్యంగా రెండు రోజుల క్రితం అభ్యర్థిని ప్రకటించింది. కాంగ్రెస్‌, బిజెపిలు ముందుగానే అభ్యర్థిని ప్రకటించడంతో వారు ప్రచారంలో ముందుకు దూసుకుపోతున్నారు. వీరంతా మొదటిసారిగా లోకసభ ఎన్నికల్లో పోటీపడుతున్నవారు కాగా, మహబూబాబాద్‌లో పాతకాపుల మధ్య పోటీ తీవ్రతరంగా మారింది. ఇక్కడ కూడా విచిత్రకర విషయమేమంటే కాంగ్రెస్‌ నుంచి పోటీపడుతున్న ప్రొఫెసర్‌ సీతారామ్‌నాయక్‌, బిఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేస్తున్న మాలోతు కవిత ఇద్దరు కూడా బిఆర్‌ఎస్‌ నాయకులు కావడం. 2014లో బిఆర్‌ఎస్‌ ఎంపిగా మహబూ బాబాద్‌ నుండి సీతారామ్‌ నాయక్‌ ఎంపికై నారు.

అయితే సిట్టింగ్‌ ఎంపిని కాదని కవితకు 2019 ఎన్నికల్లో మహబూబాబాద్‌ సీటు కేటాయించారు. అయినా ఇంతకాలం పార్టీని అంటిపెట్టుకుని ఉన్న తనను కాదని మరోసారి కవితకే అవకాశం ఇవ్వడంతో అలిగిన సీతారామ్‌నాయక్‌ కాంగ్రెస్‌లో చేరి, ఆ పార్టీ అభ్యర్థిగా మహబూబాబాద్‌లో కవితతో పోటీ పడుతున్నారు. ఇక పోతే కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపి బలరామ్‌ నాయక్‌ను పోటీకి నిలిపింది. ఆయన మొదటి సారిగా ఉమ్మడి ఆంధప్రదేశ్‌లో 2009లో 15వ లోకసభకు మహబూబాబాద్‌ నుండి ఎన్నికైనారు. మన్‌మోహన్‌ సింగ్‌ క్యాబినెట్‌లో ఆయన కేంద్ర మంత్రిగా పనిచేశారు. మహబూబాబాద్‌ పార్లమెంటు నియోజవర్గం పరిధిలో కూడా ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో భద్రాచలం మినహా మిగతా వాటిల్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాలను కాంగ్రెస్‌ గెలుచుకుంది. ఇక్కడ కూడా భద్రాచలం ఎంఎల్‌ఏ డాక్టర్‌ తెల్లం వెంకట్రావ్‌ తాజాగా కాంగ్రెస్‌లో చేరిపోవడంతో ఈ రెండు పార్లమెంటు నియోజకవర్గాల్లో ఒక్క ఎంఎల్‌ఏ కూడా లేకుండా పోయాడు. దీంతో ఈ రెండు స్థానాల కోసం బిఆర్‌ఎస్‌ తీవ్రస్థాయిలో కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడిరది.

 -మండువ రవీందర్‌రావు
సీనియర్‌ జర్నలిస్ట్‌

Leave a Reply