ఖచ్చితమైన సమాచారం ఉంది
సోషల్ మీడియా వేదికగా మత ఘర్షణలు, విద్వేశాలు సృష్టించే ప్రయత్నం
ఎంతటివారైనా కఠిన చర్యలు తప్పవు
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
మీడియాతో డీజీపీ మహేందర్రెడ్డి
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను ఆసరా చేసుకొని హైదరాబాద్ నగరంలో, తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని చోట్ల కొంత మంది విధ్వంసక శక్తులు మత ఘర్షణలు, విద్వేశాలు సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, తమకు ఖచ్చితమైన సమాచారం ఉందని డీజీపీ మహేందర్రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..శాంతిభద్రతల విషయంలో తెలంగాణ పోలీస్ వ్యవస్థ అప్రమత్తంగా ఉందన్నారు. అన్ని జిల్లాల పోలీస్ అధికారులు, కమిషనర్లు, కింది స్థాయి సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారన్నారు.
అంసాఘిక, మతత్వశక్తులు, రౌడీ షీటర్స్పై నిరంతరం నిఘా పెట్టినట్లు తెలిపారు. విధ్వంసక శక్తుల విషయంలో పోలీస్ శాఖ అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. ఎవరైనా, ఎంతటివారైనా వెనుకాడేది లేదని డీజీపీ స్పష్టం చేశారు. సోషల్ మీడియా వేదికగా ప్రజల మనోభావాలను దెబ్బతీసి, సామరస్యపూర్వక వాతావరణాన్ని భగ్నం చేసే కుట్రలు జరుగుతున్నాయని డీజీపీ పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సోషల్ మీడియాపై పోలీసు శాఖ నిఘా పెట్టిందని తెలిపారు. అనేక రకాల నూతన టెక్నాజీని వినియోగించి రొచ్చగొట్టే పోస్టులు వచ్చినప్పుడు గుర్తించి, ప్రభావాన్ని తగ్గించి, నిజానిజాలను ప్రజలకు తెలియజేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.