Take a fresh look at your lifestyle.

నామినేటెడ్‌ పోస్టులపై సీనియర్ల నారాజ్‌..

ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు కేవలం 5 పదవులే
తమకు సరైన ప్రాధాన్యం ఇవ్వలేదని అసంతృప్తి
పార్టీకి వ్యతిరేకంగా పనిచేసివారికి  ఇచ్చారని గుర్రు
రెండో విడతలో అవకాశాలపై ఆశలు..

వరంగల్‌, ప్రజాతంత్ర, మార్చి 21 : ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నామినేటెడ్‌ పోస్టులపై సీనియర్లు ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాకు దక్కాల్సిన ప్రాధాన్యత దక్కలేదని  కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ మొదలైంది.  నామినేటెడ్‌ పదవుల కేటాయింపులపై ఎమ్మెల్యే లకు మంత్రులకు కనీసం సమాచారం లేదని నారాజ్‌ అవుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.   ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం  భర్తీ చేసిన నామినేటెడ్‌ పోస్టుల్లో  వరంగల్‌ జిల్లా చెందిన ఆరుగురికి నామినేటెడ్‌ పదవులను కేటాయించింది.  వీరిలో  ఐదుగురికి రాష్ట్ర స్థాయి కార్పొరేషన్‌ చైర్మన్లు పదవులు దక్కగా , ఒక్కరికి జిల్లాస్థాయి పదవి వచ్చింది.  ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు  చెందిన  జంగా రాఘవరెడ్డి, అయిత ప్రకాశ్‌ రెడ్డి, బెల్లయ్య నాయక్‌, మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య, టీపీసీసీ అధికార ప్రతినిధి ఎండీ రియాజ్‌ లకు  రాష్ట్ర స్థాయి నామినేటెడ్‌ పోస్టులు దక్కాయి.  మరోవైపు పరకాల నియోజకవర్గ ఇన్చార్జ్‌ గా ఉన్న ఇనుగాల వెంకట్రాంరెడ్డికి కాకతీయ అర్బన్‌ డెవలప్మెంట్‌ అథారిటీ (కుడా) చైర్మన్‌ జిల్లా స్థాయి పోస్టు  దక్కింది  ఇందులో మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్యకు పదవి  ఉమ్మడి ఖమ్మం జిల్లా కోటాలోకి వస్తుంది. దీంతో నామినేటెడ్‌ పదవులు భర్తీలో ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు అన్యాయం జరిగిందనే చర్చ జోరుగా సాగుతోంది.

ఈ నామినేటెడ్‌ పోస్టుల భర్తీ.. ఉమ్మడి వరంగల్‌ కు చెందిన పలువురు సీనియర్లను  అసంతృప్తికి గురి చేసింది.  మొదటి నుంచి కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి కృషి చేసిన నేతలు.. పార్టీ ఆదేశాలతో   తాజా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీనుంచి తప్పుకున్నవారు.. ఎమ్మె ల్యేగా ఓటమిపాలైన వారికి   నామినేటెడ్‌ పోస్టులను ఆశించారు. అయితే చాలా మందికి కాంగ్రెస్‌ అధిష్టానం మొండి చెయ్యి చూపించిందని లోలోపల మదనపడుతున్నారు.  మరోవైపు కొందరు ఎమ్మెల్యేలు అయితే కనీసం ఈ నామినేటెడ్‌ పదవులు నియామకాల్లో తమల సంప్రదించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు సంబంధించి ఆరు జిల్లాలు ఉంటే మూడు జిల్లాలకు నామినేటెడ్‌ పదవులు దక్కాయి ఈ మూడు జిల్లాల్లో నుంచి నామినేటెడ్‌ పదవులు పొందిన వారిలో ఆయా స్థానాల్లో పనిచేస్తున్న ఎమ్మెల్యేలకు కనీస సమాచారం లేకుండానే నామినేటెడ్‌ పదవులు ఇచ్చారని విమర్శలు ఉన్నాయి. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారికి కూడా నామినేటర్‌ పదవులు ఇవ్వడంపై ఓ ఎమ్మెల్యే ఏకంగా అదిష్టానం పెద్దల్ని నిలదీశాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక మంత్రులకు, సీనియర్‌ నేతలకు సమాచారం లేకుండా నామినేటెడ్‌ పదవులు కేటాయించిన తీరుపై చాలామంది గుర్రుగా ఉన్నారట.

కాంగ్రెస్‌ పార్టీ పటిష్టత కోసం చాలామంది సీనియర్లను అధిష్టానం పట్టించుకోలేదని నామినేటెడ్‌ పదవిలో పై ఆశలు పెట్టుకున్న సీనియర్‌ లందరూ నిరాశ గురవుతున్నారు. జనగామ, స్టేషన్‌ ఘన్పూర్‌ నుంచి ఎమ్మెల్యే లుగా పోటీ చేసి ఓటమి చెందిన  ప్రతాప్‌ రెడ్డి, సింగపురం ఇందిరలు నామినేటెడ్‌ పోస్టులపై ఆశలు పెట్టుకున్నారు.. వరంగల్‌ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, వర్ధన్నపేట టికెట్‌ ఆశించిన నమిండ్ల శ్రీనివాస్‌, డాక్టర్‌ కత్తి వెంకటస్వామి, బండి సుధాకర్‌ గౌడ్‌, బక్క జడ్సన్‌. ఈవీ శ్రీనివాస్‌ రావు, డాక్టర్‌ పెరుమాండ్ల రామకృష్ణ,  డాక్టర్‌ అనిల్‌, డాక్టర్‌ లక్ష్మీ నారాయణ నాయక్‌,  నామినేటెడ్‌ పోస్టుల పైనా ఆశలు పెట్టుకున్నారు వారి పేర్లు లిస్టులో లేకపోవడంతో అసంతృపికి లోనయ్యారు. ఇక పాలకుర్తి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు తీవ్ర ప్రయత్నం చేసి  చివరి నిమిషం లో పోటీ నుండి తప్పుకున్న  హనుమాండ్ల రaాన్సీరెడ్డికి ప్రొటోకాల్‌ కోసం రాష్ట్రస్థాయి పదవి వస్తుందని ఆశించినా అదీ జరగలేదు అంతే కాదు ములుగు, జనగామ, వరంగల్‌ జిల్లాలకు నామినేటెడ్‌ పోస్టుల్లో మొండిచేయి చూపారు. నామినేటెడ్‌ పోస్టుల్లో ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు తగిన ప్రాధాన్యత  ఇవ్వకపోగా పలువురు సీనియర్‌ నేతలను కాంగ్రెస్‌ అధిష్టానం కనీసం పట్టించుకోలేదనే విమర్శలు ఇప్పుడు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పెద్ద చర్చకు దారి తీసింది.

గత ప్రభుత్వం హయాంలో వరంగల్‌ జిల్లా నుండి 8 మందికి ఎమ్మెల్సీలు గా పదవులు దక్కగా మరో  11మంది రాష్ట్రస్థాయి కార్పొరేషన్‌ చైర్మన్‌ గా నామినేటెడ్‌ పోస్టుల్లో ఉన్నారు .. ఇదే ప్రాధాన్యత ప్రస్తుత  కాంగ్రెస్‌ ప్రభుత్వంలో  ఉంటుందని భావించిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలకు అధిష్టానం షాక్‌ ఇచ్చింది.  కేవలం ఐదు పోస్టులను మాత్రమే ఇవ్వడంపైనా పలువురు సీనియర్లు రగిలిపోతున్నారు.  అంతే కాదు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం నామినేటెడ్‌ పదవులు కాంగ్రెస్‌ నేతల మధ్య చిచ్చు పెట్టింది. నామినేటెడ్‌ పోస్టుల్లో జిల్లాకు దక్కాల్సిన ప్రాధాన్యత దక్కకపోగా పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారికి పదవులు ఇవ్వడం పైనా పలువు సీనియర్లు ఆగ్రహంతో ఉన్నారట. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారికి పదవులు వస్తాయనేలాగా నామినేటెడ్‌ పదవుల భర్తీ జరిగిందనే విమర్శలు ఉమ్మడి వరంగల్‌  జిల్లాలో హాట్‌ టాపిక్‌ గా మారింది. మరో వైపు ఉమ్మడి వరంగల్‌ జిల్లా నుండి మంత్రులు బాధ్యతలు నిర్వహిస్తున్న సీతక్క, కొండా సురేఖ ప్రాతినిథ్యం వహిస్తున్న జిల్లాలకు, వారి శాసనసభ నియోజకవర్గాల్లోని నాయకులకు పదవు  దక్కకపోవడంపై పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఉమ్మడి వరంగల్‌ నుంచి నామినేటెడ్‌ పదవులపై ఆశలు పెట్టుకున్న పలువురికి తొలి జాబితాలో చోటు దక్కకపోవడం నిరాశకు గురి చేసిన ఈనేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితోపాటు  జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యులను కలిసి మరోమారు అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. పలువురు ఆశావహులు. గత ప్రభుత్వం హయాంలో ఉమ్మడి వరంగల్లో పదకొండు కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులు దక్కగా, ఈసారి ఐదు పదవులే కేటాయించిన కారణంగా  మరో జాబితాలోనైనా తమకు అవకాశం దక్కుతుందని ఎదురుచూస్తున్నారు.

Leave a Reply