Take a fresh look at your lifestyle.

కార్మికులను కష్టాలపాల్జేసిన ప్రభుత్వాలు

కొరోనా వ్యాధి విస్తృతిపై ముందస్తు సమాచారమున్నా కేంద్రం ముందుచూపుతో వ్యవహరించకపోవడం వల్లే దేశ వ్యాప్తంగా ప్రజలు అనేక కష్టాలను ఎదుర్కోవాల్సివచ్చింది. ఈ మహమ్మారి విషయంలో వరల్డ్ ‌హెల్త్ ఆర్గనైజేషన్‌ ‌ముందుగానే హెచ్చరించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం దాని తీవ్రతను గుర్తించలేకపోయింది. ఫలితంగా దేశవ్యాప్తంగా ముఖ్యంగా వలస కార్మికులు, విద్యార్థులు, పర్యాటకులు తీవ్ర అవస్థలు పడాల్సివచ్చింది. ప్రపంచ దేశాల్లో ప్రాణాంతకమైన ఈ వ్యాధి లక్షణాలు బయటపడడంతో అకస్మాత్తుగా లాక్‌డౌన్‌ ‌ప్రకటించడమే ఈ దురవస్థకు కారణమైంది. వాస్తవంగా వరల్డ్ ‌హెల్త్ ఆర్గనైజేషన్‌ ఈ ‌విషయాన్ని మార్చ్ 11‌నే ప్రకటించింది. అప్పటికే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు వంద దేశాల్లోకి ఈ వైరస్‌ ‌పాకింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం జనతా కర్ఫ్యూను ప్రకటించింది.

ఒక విధంగా తెలంగాణ ప్రభుత్వమే ముందుగా మేల్కొన్నదని చెప్పాలి. ఈ మహమ్మారికి దూరంగా ఉండడమే తప్ప మరో మందులేదన్న విషయాన్ని ధృవీకరించుకున్న తెలంగాణ సర్కార్‌ ఈ ‌వ్యాధి లక్షణాలను సోదాహరణంగా ప్రజలకు వివరించి దానిబారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించింది. ఆతర్వాత రెండు రోజులకు కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ ‌ప్రకటించింది. అయితే లాక్‌డౌన్‌ ‌ప్రకటించే ముందు దేశ ప్రజలకు కొంత సమయాన్నైనా కేంద్రం ఇవ్వలేదు. ఇలాంటి ఉపద్రవమేదో ముంచుకొస్తుందని ముందస్తుగా ఊహించలేకపోయిన పర్యాటకులు తమకు తెలియకుండానే చిక్కుల్లో పడ్డారు. మార్గమధ్యంలోనే ఎక్కడివారక్కడే నిలిచిపోవాల్సి వచ్చింది. వాళ్ళు అర్దాంతరంగా తమ పర్యటనను ముగించుకుని వచ్చే సమయం కూడా లేకుండాపోయింది. రైళ్ళు, విమానాలు, చివరకు రోడ్డుమార్గంతో సహా రవాణా వ్యవస్థ అంతా కేవలం ఒకటిరెండు రోజుల్లోనే స్థంబించిపోవడంతో వలస కార్మికులు, విద్యార్థుల పరిస్థితి కూడా అగమ్యగోచరంగా మారింది. రెండు విడుతలుగా సుమారు నలభై అయిదు రోజులుగా లాక్‌డౌన్‌ ‌కొనసాగుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం మరో రెండువారాల పాటు మూడవ విడుత లాక్‌డౌన్‌ను కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. దానితోపాటు వలసకార్మికులకు ప్రత్యేక వెసులుబాటును కలిగించింది. వారితోపాటు విద్యార్థులు, పర్యాటకులు తమ గ్రామాలకు వెళ్ళేందుకు ప్రత్యేక రైళ్ళను ఏర్పాటు చేసింది. అలా మొదటి విడుతగా వలసకార్మికులు, విద్యార్థులు వెళ్ళింది కూడా తెలంగాణ నుండి కావడం కూడా ఒక విశేషమే. అయితే వీరిని తరలించేందుకు ప్రత్యేక రైళ్ళను ఏర్పాటుచేసే శ్రద్ధ ఏదైతే తీసుకున్నారో లాక్‌డౌన్‌ ‌ప్రకటించడానికి ముందే అలాచేసి ఉంటే దేశవ్యాప్తంగా ఇంతపెద్ద సంఖ్యలో కార్మికులు ఆందోళనకు గురయ్యే వారు కాదు. ప్రాణాలు పోగొట్టుకునే వారూ కాదు. వివిధ దేశాలనుండి విమానాల్లో ఇతరత్రా రవాణా సదుపాయాలతో దేశానికి, వివిధ రాష్ట్రాలకు చేరుకున్న వారికి ఎలాగైతే వైద్య పరీక్షలు చేసి, క్వారంటైన్‌కు పంపిన తర్వాతగాని వారి గ్రామాలకు పంపారో అదే క్రమంలో ఇతర ప్రాంతాల్లో చిక్కుబడి వలస కార్మికులు, విద్యార్థులు, పర్యాటకులకు కూడా అలాంటి అవకాశాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించకపోవడం నిజంగా విచారకరం. పోనీ వారున్న ప్రాంతాల్లోనైనా ఇబ్బంది లేకుండా చూసుకున్నారా అంటే అదీలేదు. కాలినడకన తమ గ్రామాలకు బయలుదేరినవారొక్కక్కరిది ఒక్కో వ్యధలాగా మారింది. ఎవరన్నా దయతలిచి ఇంత పెడితే తిన్నాం, లేకపోతే మంచినీళ్ళు తాగి నడకసాగించామంటూ వారు గోడు వెళ్ళబోసుకున్నారు.

దేశ రాజధాని ఢిల్లీ మొదలు కన్యాకుమారి వరకు ఇదే పరిస్థితి నెలకొనడం నిజంగా శోచనీయం. ఇదొక విధంగా కార్మికులపట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరిని తెలియజేస్తున్నది. దినసరి కూలీతో బతుకెళ్ళబోసుకునే ఈ కూలీలు ఆహారంలేక, ఆశ్రయంలేక రోడ్లపైనే రోజుల తరబడిగడుపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముందు నుయ్యి, వెనుక గొయ్యి అన్నట్లు వందలాది కిలోమీటర్లను అడవి మార్గాలను దాటుకుంటూ నడువడానికి సిద్దపడిన వీరిని రాష్ట్ర ప్రభుత్వాలు వారిని ఎక్కడికక్కడే నిలిపివేసి కనీస సదుపాయాలులేని శిబిరాల్లో ఆశ్రమం పేరున నిర్బంధంగా ఉంచడంతో బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఇదిలా ఉంటే కేంద్రం తీసుకున్న నిర్ణయంతో వివిధ రాష్ట్రాల్లోని వలస కార్మికులంతా పోలోమంటూ తమ ఇంటిదారి పడుతున్నారు. ఇక్కడ వచ్చిన చిక్కల్లా ఇంతకాలం బైటివారినెవరినీ రానివ్వకుండా రాష్ట్ర బార్డర్లతోసహా, గ్రామ, పట్టణ సరిహద్దులను మూసివేసిన పరిస్థితిలో ఇప్పుడు వందల సంఖ్యలో వీరు గ్రామాల్లోకి చేరుకుంటే పరిస్థితెలా ఉంటుందన్నది ప్రధాన ప్రశ్న. ముళ్ళకంచలు, కందకాలుతీసి ఇతర వాహనాలను రానివ్వకుండా కాపలాకాసిన గ్రామాల్లోకి అంత సులభంగా బయటినుండి వస్తున్నవారినిరానిచ్చే అవకాశం లేదు. వీరందరికీ వైద్య పరీక్షలు చేయడం కూడా ఒక సవాల్‌గా మారనుంది. ఇరు రాష్ట్రాల అంగీకారంతోనే వారిని పంపించాలని కేంద్రం సూచించినప్పటికీ రాష్ట్ర బార్డర్లు దాటేవిషయంలో పలువురు అనేక ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం అనుమతించినా, ఏపి బార్డర్‌లో వారిని నిలిపివేసిన పలు సంఘటనలిప్పటికే చోటుచేసుకున్నాయి. ఇదిలా ఉంటే మరో రెండు వారాలపాటు పొడిగించిన లాక్‌డౌన్‌ను ఆతర్వాత ఎత్తివేస్తారా? అప్పుడు తెరుచుకునే పరిశ్రమల్లో పనిచేసేందుకు ఈ వలస కూలీలు భయపడకుండా వస్తారా అన్నది కూడా ఆలోచించాల్సిన విషయమే.

Leave a Reply