Take a fresh look at your lifestyle.

తీవ్రవాద కోరల్లో విశ్వమానవాళి..!

తీవ్రవాదం విచక్షణారహిత విధ్వంస రచన మాత్రమే. ఉగ్రవాద కోరలు అమాయకులను కబలించడానికే. ప్రపంచ దేశాలన్నీ తీవ్రవాద వేడికి మాడుతున్నాయి. సైనిక బలగాలతో పాటు అమాయక సామాన్య ప్రజలు కూడా తీవ్రవాద వేటుకు బలి అవుతున్నాయి. 2017 తర్వాత అత్యధికంగా తీవ్రవాదుల విష విధ్వంసానికి 2023లో 22 శాతం అధికంగా 8,352 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. 9/11 తీవ్రవాద దాడి తర్వాత ఇటీవల 07 అక్టోబర్‌ 2023న హమాస్‌ దాడిలో అత్యధికంగా ఇజ్రాయిల్‌ సైన్యంతో పాటు సామాన్య జనం కూడా 1,200 మంది మరణించడం, 250 మంది వరకు బందీలుగా హమాస్‌కు పట్టుబడడం చాలా విచారకరం. 2023లో ప్రపంచ తీవ్రవాద ప్రభావంలో 94 శాతం వరకు సబ్‌-సహారా ఆఫ్రికా, మిడిల్‌ ఈస్ట్‌, నార్థ్‌ ఆఫ్రికా, దక్షిణ ఆసియా ప్రాంత దేశాల్లో మాత్రమే నమోదు కావడం విచారకరం. ‘‘గ్లోబల్‌ టెర్రరిజమ్‌ ఇండెక్స్‌-2024’’ వివరాల ప్రకారం అత్యధిక తీవ్రవాద దాడులు, మరణాలు నమోదు చేసుకున్న దేశాల జాబితాలో భారత్‌ 14వ స్థానంలో నిలిచింది. భారత్‌లో 2020-21లో 49 మరణాలు, 2021-22లో 45, 2022-23లో 18 వరకు మరణాలు తగ్గడం గమనించారు.

తీవ్రవాద దాడులు తగ్గినా మరణాలు పెరిగాయా..!
2023 ఏడాదిలో తీవ్రవాద దాడుల సంఖ్య 22 శాతం (3,350) వరకు తగ్గినప్పటికీ మరణాలు మాత్రం అధికంగానే నమోదు అయ్యాయని ఇటీవల విడుదలైన ‘‘గ్లోబల్‌ టెర్రరిజం ఇండెక్స్‌ – 2024’’ నివేదిక చేసిన స్పష్టం చేస్తున్నది. హమాస్‌ దాడికి ప్రతిచర్యగా ఇజ్రాయిలీ మిలిటరీ చేస్తున్న దాడుల్లో 25,000 మంది వరకు పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోవడం గమనించాం. అత్యధికంగా పాకిస్థాన్‌లో 490 తీవ్రవాద దాడులు జరిగాయని, దాడులు తగ్గుముఖం పట్టినప్పటికీ జరుగుతున్న తీవ్రమైన ఆధునిక ఆయుధ దాడులు అత్యధిక ప్రాణ, ఆస్తి నష్టాలను మిగుల్చుతున్నాయి. 2015లో 57 దేశాలు, 2022లో 44 దేశాలు, 2023లో 41 దేశాలు తీవ్రవాద దాడులను చవిచూచాయి. సాధారణంగా అఫ్ఘానిస్థాన్‌, ఇరాక్‌ దేశాల్లో తీవ్రవాద నష్టాలు అధికంగా ఉంటూ వస్తున్నప్పటికీ నేడు తాజాగా విడుదలైన 11వ గ్లోబల్‌ టెర్రరిజమ్‌ ఇండెక్స్‌ వివరాల ప్రకారం ‘బుర్కినా ఫాసో’ అను దేశంలో అత్యధికంగా 258 దాడుల్లో దాదాపు నాలుగవ వంతు ప్రపంచ మరణాలు, అనగా 2,000లకు పైగా ప్రజలు ప్రాణాలు అర్పించారు. 2023లో  ‘బుర్కినా ఫాసో’ దేశంలో దాడులు 17 శాతం తగ్గినప్పటికీ 68 శాతం వరకు మరణాలు పెరిగాయని తెలుస్తున్నది. గతంలో ఇరాక్‌ దేశం తీవ్రవాద జాబితాలో తొలి 10 స్థానాల లోపు ఉండేదని, 2023లో ఆ 10 స్థానాల నుంచి బయట పడి 99 శాతం మరణాలు, 90 శాతం దాడులు తగ్గినట్లు గమనించారు. అఫ్ఘానిస్థాన్‌లో కూడా 2007 తర్వాత 84 శాతం మరణాలు, 75 శాతం  దాడులు తగ్గడం హర్షదాయకమే.

ప్రపంచ అత్యంత ఘోరమైన తీవ్రవాద సంస్థలు
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రమాదకర తీవ్రవాద సంస్థలుగా ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐఎస్‌), దాని అనుబంధ సంస్థలు జమాత్‌ నుస్రత్‌ అల్‌-ఇస్లామ్‌ వాల్‌ ముస్లిమీన్‌ (జెఎన్‌ఐఎం), హమాస్‌, అల్‌-షబాబ్‌ అనబడే గ్రూపులు ఉన్నాయి. గత తొమ్మిదేళ్లుగా అత్యంత ఘోరమైన తీవ్రవాద సంస్థగా ఐఎస్‌ రికార్డుల్లోకి ఎక్కుతూ అత్యధిక దాడులు, మరణాలకు కారణం అవుతున్నది. గతంలో 30 దేశాల్లో అల్లకల్లోలం సృష్టించిన ఐఎస్‌ సంస్థ 2023లో మాత్రం 20 దేశాల్లో మాత్రమే తమ ఉనికిని చాటుకుంది. 2009లో 141 తీవ్రవాద గ్రూపులు వివిధ దేశాల్లో దాడులు చేయగా, 2023లో మాత్రం 66 గ్రూపులు మాత్రమే దాడులు నమోదు చేసుకున్నాయి. నేడు జరుగుతున్న ప్రతి తీవ్రవాద దాడిలో అధిక ప్రాణాపాయ రేటు నమోదు అవుతున్నట్లు స్పష్టం చేశారు. 2023లో సంక్షోభాలు ఎదుర్కొన్న దేశాల్లో ప్రాణాపాయ రేటు  2.7 ఉండగా, ఇతర దేశాల్లో 0.48 మాత్రమే రికార్డు అయ్యింది.

10 అత్యధిక తీవ్రవాద దేశాలు
2023లో ఐదు పశ్చిమ దేశాల్లో గత ఏడాది కన్న 55 శాతం తగ్గి 23 తీవ్రవాద దాడులు (యూఎస్‌లో 16 దాడులు) జరిగాయని, 2017లో 176 దాడులు జరిగాయని గమనించాలి. పశ్చిమ దేశాల్లో తీవ్రవాద దాడులు గణనీయంగా తగ్గినప్పటికీ 07 అక్టోబర్‌ హమాస్‌ దాడులతో యూరోప్‌ దేశాల్లో రాజకీయ ఉద్రిక్తతలు పెరగడం కొంత కలవరానికి కారణం అవుతున్నది. అత్యధిక తీవ్రవాద ప్రభావం ఎదుర్కొన్న 10 దేశాల్లో వరుసగా బుర్కీనా ఫాసో(1వ స్థానం), ఇజ్రాయిల్‌(2), మాలి(3), పాకిస్థాన్‌(4), సిరియా(5), అఫ్ఘానిస్థాన్‌(6), సొనాలియా(7), నైజీరియా(8), మయన్మార్‌(9), నైగర్‌(10వ స్థానం)లు ఉన్నాయి. 11వ స్థానంలో ఇరాక్‌, 14వ స్థానంలో ఇండియా, 26వ స్థానంలో ఇరాన్‌, 30వ స్థానంలో యూఎస్‌, 32వ స్థానంలో బంగ్లాదేశ్‌, 33వ స్థానంలో శ్రీలంక, 35వ స్థానంలో రష్యా, 37వ స్థానంలో జర్మినీ, 41వ స్థానంలో యూకె64వ స్థానంలో జపాన్‌, 73వ స్థానంలో చైనా, 88వ స్థానంలో ఐర్లాండ్‌ ఉండగా ఇతర 75కు పైగా దేశాల్లో ఒక్క తీవ్రవాద కేసు కూడా నమోదు కాలేదు.

తీవ్రవాదం రక్తపాతానికి, ఉగ్రవాదం ఘోరమైనహేయమైన చర్య అని తెలుసుకుంటూ రక్తపాతాన్ని మరిచి ప్రపంచ శాంతికి ఉగ్ర సంస్థలు ఊతం ఇవ్వాలి. ఇస్లామిక్‌ తీవ్రవాదం ప్రపంచ మానవాళి అంతానికి సంకేతమని తెలుసుకొని మసలు కోవాలి. డిజిటల్‌ యుగంలో మతాల మంటలు, కులాల కుతంత్రాల ద్వారా రక్తపుటేర్లు మాత్రమే మిగులుతాయని బుద్ది తెచ్చుకోవాలి. దారికి రాని, చెబితే వినని ఇక్లామిక్‌ తీవ్రవాద సంస్థలపై సైనిక దాడులు చేసి కలుపు మొక్కల్ని నిర్దయగా పెకిలించాల్సిందే. ఈ క్రమంలో శాంతి పావురాలు భూగోళం చుట్టు స్వేచ్ఛగా ఎగరాలని కోరుకుందాం, తీవ్రవాదాన్ని సదా వ్యతిరేకిద్దాం.
-డా. బుర్ర మధుసూదన్‌ రెడ్డి
కరీంనగర్‌, 9949700037 

Leave a Reply