Take a fresh look at your lifestyle.

ప్రపంచంతో పోటీ పడేలా నైపుణ్యం పెంపొందించుకోవాలి: మున్సిపల్‌ ‌శాఖ మంత్రి కేటీఆర్‌

  • ‌పీర్జాదిగూడలో ఉచిత కోచింగ్‌ ‌సెంటర్‌ ‌ప్రారంభం..
  • రూ.26 కోట్లతో రోడ్డు విస్తరణకు శంఖుస్థాపన..

మేడిపల్లి, ప్రజాతంత్ర విలేఖరి, మార్చి 14 : సాంకేతిక రంగంలో ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా చోటు చేసుకుంటున్న మార్పులు, ఆధునికతకు అనుగుణంగా యువత ఎప్పటికప్పుడు తమ నైపుణ్యానికి పదును పెడుతూ ధీటుగా ఉండాలని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు సూచించారు. పీర్జాదిగూడ కమాన్‌ ‌నుంచి పర్వతాపూర్‌ ‌వరకు రూ. 25.32 కోట్ల వ్యయంతో చేపట్టనున్న రోడ్లు విస్తరణ, ఫోర్‌ ‌లైన్‌ ‌రోడ్‌ ‌పనులకు శంఖుస్థాపనతో పాటు బుద్దానగర్‌లో ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షల శిక్షణ కేంద్రాన్ని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డితో కలిసి సోమవారం ఆయన ప్రారంభించారు.

Launch of Free Coaching Center at Peerjadiguda

పీర్జాదిగూడ నగర మేయర్‌ ‌జక్కా వెంకట్‌ ‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాల్లో కేటీఆర్‌ ‌మాట్లాడుతూ యువతకు సరైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు, అండగా ఉండేందుకు తమ సర్కార్‌ ఎన్నో అవకాశాలు కల్పిస్తుందన్నారు. ఉద్యోగాల్లో పోటీ పరీక్షలు ఎదుర్కునేందుకు ప్రభుత్వం టాస్క్ ‌సంస్థ ద్వారా కూడా ప్రభుత్వం శిక్షణ ఇస్తుందని, మేడ్చల్‌లో కూడా సెంటర్‌ ఏర్పాటు పరిశీలిస్తామన్నారు. కేంద్ర ఉద్యోగాలను సైతం భర్తీ చేయకతప్పదని, అవి భర్తీ చేస్తే రాష్ట్రానికి 60 నుంచి 70 వేల ఉద్యోగాలు వొచ్చే అవకాశం ఉంటుందన్నారు. రాష్ట్ర, కేంద్ర, ప్రైవేటు ఉద్యోగాలతో పాటు స్వయం ఉపాధి పొందేందుకు సైతం ప్రభుత్వం రుణాలు ఇప్పించి నిరుద్యోగం పారద్రోలేందుకు పాటుపడుతుందని పేర్కొన్నారు. శిక్షణ సంస్థలో ఏర్పాటు చేసిన వసతుల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ వీలైతే డిజిటల్‌ ‌లైబ్రరీ యోచన చేయాలని సూచించారు.

సర్కార్‌ ‌కొలువుల కుంబమేలా..
నిరుద్యోగుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ 90 ‌వేల ఉద్యోగాల భర్తీ ప్రకటించి కొలువుల కుంభమేలాతో సంచలనం సృష్టించారన్నారు. ఖజానాపై భారం పడినప్పటికీ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు సర్కార్‌ ‌సాహసోపేతమైన నిర్ణయం తీసుకుందన్నారు. అయితే ఇప్పుడు ప్రకటించిన ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలకు ప్రభుత్వమే ఉచిత కోచింగ్‌ ‌సెంటర్లు ప్రారంభించి నిరుద్యోగులపై ఎటువంటి ఆర్ధిక భారం పడకుండా ఊరట కల్పిస్తుందన్నారు. కోచింగ్‌ ‌సెంటర్లతో పాటు టీసాట్‌ ‌సంస్థ విద్య, నిపుణ చానళ్ళ ద్వారా కూడా ఈ తరహా శిక్షణ, విజ్ఞాన కార్యక్రమాలు అందిస్తుందని తెలిపారు. అయితే ఎవరైనా ఈ పరీక్షల్లో వెనకబడినా నిరాశకు గురి కావొద్దని, ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని సూచించారు. ప్రభుత్వం టీఎస్‌ఐ ‌పాస్‌ ‌ద్వారా 19 వేల ప్రైవేటు పరిమ్రల ఏర్పాటుకు అనుమతించిందన్నారు. నైపుణ్యాన్ని ఎప్పటికప్పుడు పెంపొందించుకుంటూ పోటీ పడాలన్నారు. ఉద్యోగాలు, స్వయం ఉపాధి కల్పించడంతో పాటు సొంతంగా పరిశ్రమలు స్థాపనకు ముందుకొచ్చే యువ ఔత్సాహికులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఆయన చెప్పారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలు సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలు సాధించేందుకు పోటీతత్వంతో ముందుకు సాగాలని సూచించారు.

ఉద్యోగాలు కావాలంటే దూకుడు పెంచాలే : మంత్రి మల్లారెడ్డి
కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ ఉద్యోగాలు సాధించాలంటే మన తాన సత్తా ఉండాలె, మన తాన కసి ఉండాలె.. దూకుడు పెంచాలన్నారు. మీరు కష్టపడితె మీకె లాభం..మీ జీవితం మీపైనే ఉంది.. మీ కోసం మీరు సీరియస్‌గా కష్టపడాలంటూ భవిష్యత్‌ అం‌తా మీదె.. మళ్ల జన్మ లేదు..ఈ జన్మలనే సాధించుకోవాలె అంటూ యువతకు హితభోద చేశారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించడమంటే ఆశామాషీ కాదని టెక్నాలజీతో పోటీ పడుతూ ముందుకు సాగాలన్నారు. సభలో ఆసాంతం తనదైన శైలిలో హాస్యోక్తులతో రంజింపజేస్తూ యువతలో మంత్రి జోష్‌ ‌నింపారు. ప్రపంచంతో పోటీ పడేలా తెలుగువారిలో ఎంతో మంది వివిధ రంగాలలో నిష్ణాతులైన మేధావులు ఉన్నారని ప్రశంసించారు. తెలుగువారికి ఎవరూ సాటిరారన్నారు. ఉన్న రాష్ట్రానికి ఐటీ కంపెనీల రాకలో ముఖ్యమంత్రి కేసీఆర్‌, ‌మున్సిపల్‌ ‌మంత్రి కేటీఆర్‌ల కృషి ఎంతో ఉందన్నారు.

పీర్జాదిగూడ అభివృద్ధికి ప్రభుత్వం ఇప్పటికే భారీ నిధులు మంజూరీ చేసిందని అన్నారు. మేయర్‌ ‌జక్కా వెంకట్‌ ‌రెడ్డి మాట్లాడుతూ కార్పొరేషన్‌లో ప్రభుత్వ పోటీ పరీక్షల శిక్షణ కేంద్రంలో అభ్యర్ధులకు ఉచితంగా స్టడీ మెటీరియల్‌, ‌భోజన వసతులు సైతం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. పీర్జాదిగూడ అభివృద్దిలో సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు కేటీఆర్‌, ‌మల్లారెడ్డిల సంపూర్ణ సహయ, సహకారాలు మెండుగా ఉన్నాయని అన్నారు. వారి సహకారంతో పర్వతాపూర్‌ ‌ఫోర్‌ ‌లైన్‌ ‌రోడ్‌ ‌కల సాకారమవుతుందని హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మేడ్చల్‌ ‌జిల్లా పరిషత్‌ ‌చైర్మన్‌ ఎం. ‌శరత్‌చంద్రా రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌, ఉప్పల్‌ ఎమ్మెల్యే బేతి సుభాష్‌ ‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్‌ ‌రెడ్డి జిల్లా కలెక్టర్‌ ‌హరీష్‌, ‌బోడుప్పల్‌ ‌మేయర్‌ ‌బుచ్చి రెడ్డి, డిప్యూటీ మేయర్లు కుర్ర శివకుమార్‌ ‌గౌడ్‌, ‌కొత్త లక్ష్మి రవి గౌడ్‌, ‌పీఎంసీ కమిషనర్‌ ‌రామకృష్ణా రావు, టీఆర్‌ఎస్‌ ‌పీర్జాదిగూడ అధ్యక్షుడు దర్గా దయాకర్‌ ‌రెడ్డి, స్థానిక కార్పొరేటర్లు, కో-ఆప్షన్‌ ‌సభ్యులతో పాటు నియోజకవర్గ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల మేయర్లు, చైర్‌పర్సన్‌లు పలువురు పాల్గొన్నారు.

Leave a Reply