Take a fresh look at your lifestyle.

దిల్లీ కేంద్రంగా తెలంగాణ రాజకీయాలు

తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు దిల్లీ  కేంద్రంగా కొనసాగుతున్నాయి. ఒక్క కాంగ్రెస్‌ ‌పార్టీలోనే ఇలాంటి పరిస్థితి గతంలో ఉందనుకునేవారు. ప్రతీ చిన్న విషయానికి రాష్ట్ర (అప్పటి ఉమ్మడి) ముఖ్యమంత్రి దిల్లీ నాయకత్వంతో సంప్రదిస్తేగాని పనిజరిగేది కాదు. పాలనా విషయంలో నైతేనేమీ, పార్టీ మనుగడ విషయంలో నైతేనేమీ అంతా అధిష్టానం అనుమతితోనే సాగేది. ఆఖరికి  ఎన్నికల్లో అభ్యర్ధుల నిలబెట్టే విషయంలో కూడా కేంద్రంనుండి వొచ్చే సీల్డ్ ‌కవరు కోసం ఎదురు చూపులుండేవి. ఆనాటి నుండి నేటికీ కాంగ్రెస్‌లో అదే పరిస్థితి కొనసాగుతున్నది. అయితే ఇప్పుడు తెలంగాణలో నువ్వా నేనా అని పోటీ పడుతున్న బిజెపి పరిస్థితికూడా అలానే మారింది.  పూర్వం బిజెపిలో ఇలా బహిరంగంగా అలకలుండేవికావు. క్రమ శిక్షణగల పార్టీగా దానికి పేరుండేది. కీలక విషయాలు మినహాయిస్తే  రాష్ట్రంలో పార్టీ నాయకత్వానికి చాలావరకు స్వేచ్ఛ ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితిలో చాలా మార్పు కనిపిస్తుంది. అందుకు కారణం కేంద్రంలో ఆపార్టీ అధికారంలోకి వొచ్చిన తర్వాత దేశ వ్యాప్తంగా తమ పార్టీని విస్తరింపజేయాలన్న లక్ష్యంగా ముందుకు పోతున్న క్రమంలో ఇతర పార్టీ నేతలను ఆహ్వానించడం, వారు పార్టీలో మనగలగలేకపోవడం కారణంగా పార్టీలో కొంత అలజడి మొదలైంది.

తెలంగాణ విషయానికొస్తే.. దక్షిణాదిలో బిజెపిని విస్తరించాలన్న లక్ష్యంగా ఆ పార్టీ భగీరథ యత్నాలు చేస్తోంది. కర్ణాటక తో  దక్షిణాదినంతా కాషాయమయం చేయాలనుకుంది. కాని విధి వక్రీకరించి అనూహ్యంగా కర్ణాటక ను కాంగ్రెస్‌ ఎగురేసుకుపోయింది. దాంతో దెబ్బతిన్న పులిలా ఇప్పుడు తెలంగాణపై విరుచుకు పడుతోంది. వివిధ పార్టీలకు చెందిన కొందరు నాయకులు బిజెపి చేరుతుండడంతో ఇక తమకు తిరుగలేదని బిజెపి భావించింది. కాని కర్ణాటక  ఎన్నికల తర్వాత ఈ చేర్పులకు బ్రేక్‌ ‌పడింది. ఇతర పార్టీలకు చెందిన ఒక్క బడా నాయకుడు కూడా ఆ పార్టీలో చేరడానికి ముందుకు రాకపోవడం ఆ పార్టీ వర్గాలను కలవర పెడుతున్నది. ఇదిలా ఉంటే ఇప్పటికే ఆ పార్టీలో చేరిన కొందరు నేతలు ఆ పార్టీలో కొనసాగే విషయంలో పునరాలోచనలో పడ్డారు. ఇది బిజెపి కేంద్ర నాయకత్వానికి ఇబ్బందికరంగా మారింది. ముఖ్యంగా కెసిఆర్‌తో విభేదించి , హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో గెలిచిన ఈటల  రాజేందర్‌, ‌సొంత• పార్టీపై అలిగి బిజెపి తీర్థంతీసుకుని సొంత  నియోజకవర్గంలో ఓటమి చవిచూసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిలు తమ పార్టీకి మంచి ఎసెట్‌గా మారుతారనుకుంది బిజెపి. కాని వారుకూడా  పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు  వార్తలు బిజెపి  కేంద్ర నాయకత్వాన్ని కలవరపెట్టింది.

ఆగమేఘాలమీద వారిని దిల్లీ కి  పిలిచి పార్టీలో జరుగుతున్న పరిణామాలపై కేంద్ర నాయకత్వం చర్చించింది. అంతటితోనే ఆగకుండా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని కూడా దిల్లీ కి  రప్పించుకోవడం, కేంద్రమంత్రి  కిషన్‌రెడ్డి, జాతీయ నేతలు అమిత్‌ ‌షా, జేపి నడ్డా ఒకరి తర్వాత ఒకరు సమాలోచనలు జరుపుతూ రాష్ట్ర పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలమధ్య సమన్వయం చేకూర్చే ప్రయత్నాలు ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అసంతృప్తి నేతలందరినీ ఒకేతాటిపైకి తీసుకురావలన్న దిశగా కేంద్ర నాయకత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది.  మొన్న కర్ణాటక  అయినా, నేడు తెలంగాణ అయినా ఎన్నిక) వ్యూహరచన అంతా కేంద్ర నాయకత్వం కనుసన్నల్లోనే జరుగుతోంది. ఈ క్రమంలో ముందుగా రాష్ట్ర నాయకత్వాన్ని పటిష్టపర్చే కార్యక్రమంలో కేంద్ర నాయకత్వం చేపడుతోంది.

ఇక కాంగ్రెస్‌ ‌విషయానికొస్తే కర్ణాటక  ఎన్నికలు ఆ పార్టీని ఒక మలుపు తిప్పిందనే చెప్పాలె. ఆ రాష్ట్ర ఎన్నికల్లో  గెలుపు  ఇచ్చిన ఉత్సా హంతో రానున్న అసెంబ్లీ ఎన్నికలకు కదనోత్సాహంతో అడుగులు వేస్తోంది. రానున్న ఎన్నికల్లో రాష్ట్ర పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాల విషయంలో కేంద్ర నాయకత్వం మంగళవారం దిల్లీలో సుదీర్థ మంతనాలు జరిపింది. ఇందులో రానున్న 120 రోజుల ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ ప్రణాళికను విజయవంతంగా నిర్వహించాలంటే ముందుగా పార్టీలోని నాయకుల మధ్య ఉన్న అంతర్ఘత కలహాలకు స్వస్తి పలకాలన్నది కాంగ్రెస్‌ ‌పెద్దలు తీసుకున్న ప్రధాన నిర్ణయం. అనైక్యత కారణంగా పార్టీ విజయావకాశాలు దెబ్బతింటాయని, కర్ణాటక  తర్వాత తెలంగాణ తమకు తప్పక కలిసివస్తుందన్న నమ్మకాన్ని అధిష్టానం రాష్ట్ర నాయకత్వానికి కలిగించే ప్రయత్నంచేసింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావులతో మాటు పదుల సంఖ్యలో కాంగ్రెస్‌ ‌కండువ కప్పుకోవడానికి ముందుకు వొస్తున్న తీరు రానున్న ఎన్నికల్లో విజయం దిశగా అడుగులు వేస్తామన్న నమ్మకాన్ని ఆ పార్టీ వర్గాలకు కలుగుతోంది.

అంతర్ఘత విభేదాలున్నా  కర్ణాటక•లో తమ ఈ సూచనమేరకు అక్కడి నాయకత్వం ఒకటిగా కలిసి పనిచేయడంవల్ల  విజయపతాకాన్ని ఎగురవేసిన విషయాన్ని పార్టీకి చెందిన రాష్ట్ర సీనియర్‌ ‌నాయకులకు  అధిష్టానం చెవికెక్కించే ప్రయత్నం చేసింది. తమ ఆదేశాలకు భిన్నంగా వ్యవహరించే వారి విషయంలో నేరుగా తమకే ఫిర్యాదు చేయాలెగాని మీడియా ముందుకు వెళ్ళడాన్ని ఎట్టిపరిస్థితిలో సహించేదిలేదంటూ ఆ పార్టీ ముఖ్యనేత రాహుల్‌ ‌గాంధీ  తో పాటు పలువురు రాష్ట్ర నాయకత్వానికి హితవు చెప్పారు. ఇక రానున్న ఎన్నికల విషయానికొస్తే అభ్యర్థుల ఎంపిక నిర్ణయాధికారాన్ని రాష్ట్ర నాయకత్వానికే వొదిలేస్తున్నట్లు చెబుతున్నప్పటికీ అంతిమంగా ఆమోద ముద్ర తమదేనంటోంది  ఆ పార్టీ కేంద్ర నాయకత్వం. ఈ విషయంలో సర్వే రిపోర్టులు, సామాజిక సమీకరణలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులను ఎంపికచేయాల్సి ఉంటుందన్న సూచనచేసింది. మొత్తానికి ఈ రెండు జాతీయ పార్టీలు కూడా దిల్లీ కేంద్రంగానే తమ రాజకీయాలను కొనసాగిస్తున్నాయి.

Leave a Reply