Take a fresh look at your lifestyle.

సమగ్ర ఆదివాసీ అభివృద్ధి- రాజ్యాంగ పరిరక్షణే నా లక్ష్యం!

“ఒక రాజకీయ నాయకురాలిగా ప్రతి ఒక్కరి హక్కును గుర్తించేలా పనిచేయటం, వాటిలోని వైరుధ్యాలను సున్నితంగా పరిష్కరించటం నా బాధ్యతగా వుంటుంది. సబ్బండ వర్గాల అభివృద్ధి జరిగేలా పనిచేయాలి. ఇక్కడ వుండే ఎస్టీ, ఎస్సీ, బీసీ, వోబీసీ, మైనారిటీల అభివృద్ధి కోసం పనిచేయాలి. అందరినీ సమానంగా కలుపుకుంటూ, అందరి హక్కులనూ గుర్తించి, వాటి రక్షణ కోసం పనిచేస్తూ, సమానత్వ భావన ఏదైతే కాంగ్రెస్ పార్టీ వాగ్ధానం చేస్తుందో ఆ లక్ష్యంతో పనిచేయటం నా బాధ్యత..”

ఆదిలాబాద్ లోక్ సభ నియోజక వర్గం  కాంగ్రెస్ పార్టీ   అభ్యర్థి  ఆత్రం సుగుణ

(నిన్నటి తరువాయి)

సజయ: అదిలాబాద్ ప్రధానంగా అటవీ ప్రాంతం. కానీ ఈ అటవీ ప్రాంతం రోజురోజుకీ తగ్గిపోవటం స్పష్టంగా కనిపిస్తోంది? దీనికి కారణాలు ఏమై వుంటాయి?

ఆత్రం సుగుణ: అడవి తగ్గిపోవటానికి ఆదివాసీలు కారణం కాదని నేను స్పష్టంగా చెప్పదలచుకున్నాను. ఆదివాసీలు అడవి మీద ఆధారపడి జీవించేవారు. అడవి అంటే వారికి తల్లికీ- బిడ్డకీ ఎలాంటి సంబంధం వుంటుందో అలాంటిది. ఆదివాసీలు అడవిలో వుండే చెట్టును, పుట్టను, పక్షినీ… అడవిలో వుండే అన్ని జంతువులనూ పూజిస్తారు. అడవిని నరికి ఇండ్లు కట్టుకోవడాలూ, ఇతరులకు అమ్ముకోవడాలూ అస్సలు చేయరు. వాళ్లకు అవసరం ఎంతయితే వుందో అంతే తీసుకుంటరు. అది కూడా వ్యవసాయానికి, పొట్టకూటి కోసం కొట్టుకున్న భూమే తప్పించి, వందల కొద్దీ ఎకరాలు కొట్టివేయడం అనేది వుండదు. ఇది నాకే సొంతం అనుకోవడం వుండదు. ఆదివాసీలు ఎవరయినా ఎక్కడినుంచి వలస వచ్చినా గానీ వారికి ఆశ్రయం ఇచ్చి, భూమి ఇచ్చి మాతోపాటు వుండండి, బతకండి అనే చెబుతారు. అంతే కానీ అమ్ముకోవటం, కొనటం వంటివేమీ వుండవు. మర్యాదపూర్వకంగానే వాళ్లు వుండటానికి స్థలం ఇద్దాం, దున్నుకోవటానికి స్థలం చూపిద్దాం అనుకుంటారు. ఆదివాసీలకు భూమంటే వస్తువు కాదు.

సంస్కృతి, సాంప్రదాయం, ఆచార వ్యవహారాలతో కూడుకుని వుండేది వ్యవసాయం. ఆదివాసీలు వ్యవసాయం మీద బాగా ఆధారపడి జీవిస్తారు. కానీ, ఇప్పుడు మీరు గూడాలకు వెళ్లి చూస్తే ఏ ఒక్క ఆదివాసీ ఇంట్లో కూడా ఫర్నీచర్ వుండదు. కనీసం పడుకోవటానికి మంచం కానీ, గడపలకి తలుపులు కానీ వుండవు. తడకలు వుంటాయి. మరి ఆదివాసీలు అడవిని నాశనం చేసినారని అనటం తప్పు. ఇవి చేస్తున్నది ఆదివాసీలు కాదు. వారి పేరు మీద చాలా రకాలైనవి జరుగుతున్నాయి. స్మగ్లింగ్ జరుగుతోంది. అందుకే అడవి నాశనం అవుతోంది. ఈ అడవి మీది, మీకే హక్కు వుంది, కాపాడుకోండి అంటే ఆదివాసీలు తప్పకుండా కాపాడుకుంటారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్లు మాత్రమే చేయలేరు. కానీ, ఆదివాసీకి తప్పించి అందరికీ హక్కు వుందన్నట్టు చేస్తారు. నా ఇంటికి నేనే రక్షణ కానీ, వేరేవాళ్లు కాదు. ఆదివాసులకు- అడవికి విడదీయలేని సంబంధం కాబట్టి ఆదివాసీలనే అడవికి రక్షణగా పెట్టివుంటే వాళ్ల అడవిని వాళ్లే కాపాడుకునేవారు. కానీ, అలా చేయకుండా వుండటం వల్ల చాలా నష్టమే జరిగింది. వాస్తవానికి ఎంతోమంది స్మగ్లర్లు అడవి లోపలి నుంచి దోచుకుపోయినరు. అది మాత్రం బయటకు తీసుకురానివ్వరు. ఎప్పుడు చూసినా గానీ ఆదివాసీలు మాత్రమే అడవిని నరుకుతున్నరు అని చెబుతరు. గూడెంలో యాభై ఇళ్లు వుంటే అందరికీ కలిపి రెండెకరాల భూమి కూడా వాళ్ల స్వంతానికి వుండది. వాళ్ల దగ్గర ఏమీ వుండదు. పర్యావరణం నష్టం అవుతుందంటే దానికి కారణం ఆదివాసీలు మాత్రమే కాదు. దానికి ప్రతి ఒక్కరూ ప్రభుత్వంతో సహా బాధ్యత వహించవలసిందే!.

సజయ: రాజకీయంగా ఆదిలాబాద్ ఒక సున్నితమైన ప్రాంతంగా పేరుపడింది. ఆదివాసీ మూల సమూహాలకు, లంబాడా తెగలకు మధ్య వివిధ అంశాలలో ఘర్షణపూర్వక వాతావరణం వుంది. విద్యా, ఉద్యోగ అవకాశాల మీద ఈ ఘర్షణ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. దానికి పరిష్కారం ఏమనుకుంటున్నారు? మీరు వాటిని ఎలా సమన్వయం చేయాలనుకుంటున్నారు? ఆదివాసీ యువతకు మీరిచ్చే మార్గదర్శకత్వం ఎలా వుండబోతోంది?     

 

ఆత్రం సుగుణ: ఇది బాగా వెనుకబడిన ప్రాంతం. మహారాష్ట్ర బోర్డర్లో వుంటుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సుమారు 16 లక్షల దాకా జనాభా వుంటుంది. దాంట్లో మూల ఆదివాసీ తెగలు తొమ్మిది వుంటాయి. లంబాడా తెగతో కలిపి పది. మూల ఆదివాసీ తొమ్మిది తెగల జనాభా దాదాపు మూడులక్షల వరకూ వుంటారు. లంబాడా తెగ లక్షా ఇరవై వేల వరకూ వుంటారు. ఇంకా మిగిలిన దానిలో ఎస్సీ, బీసీ, వోబీసీ, మైనారిటీలు అందరూ కలిపి వుంటారు.

 

గతంలో మూల ఆదివాసీ, లంబాడా తెగల మధ్య ఘర్షణలు జరిగిన మాట వాస్తవం. లంబాడాలు మహారాష్ట్రలో బీసీ కిందకు వస్తరు. ఇక్కడ ఎస్టీ కిందకు వస్తరు. దీనివల్ల అక్కడినుంచి ఎక్కువగా వలసలు వున్నాయి. తరతరాల నుండీ వుంటూ ఇక్కడే పుట్టిన లంబాడా సోదరులకు రావలసిన అవకాశాలు కూడా ఇలా వలస వచ్చినవాళ్లు తీసుకోవటం, అది ఘర్షణగా మారుతోంది. 2008 డిఎస్సీలో ఇక్కడి నార్నూర్ మండలం భీంపూర్ లంబాడా సోదరులే ఆ విషయాన్ని బయటకు తెచ్చినరు. ఉద్యమాలు కూడా జరిగాయి. వీటికి సంబంధించి కేసులు కూడా న్యాయస్థానంలో నడుస్తున్నాయి. మూల ఆదివాసీలకు, లంబాడాలకు కొన్ని అంశాలలో ఘర్షణలు వున్నప్పటికీ లంబాడాలలో ప్రధానంగా వలస వచ్చిన వారితోనే ఎక్కువ వున్నాయి. లంబాడా సోదరులకు నేను ఈ విషయంలో విజ్ఞప్తి చేస్తున్నా, జరుగుతున్న విషయాలను అర్థంచేసుకోమని.

 

ఇక్కడ అన్ని సమూహాల ఆదివాసీ యువతకు ఉపాధి నైపుణ్య శిక్షణలు అవసరం ఎక్కువ వుంది. చదువుకున్న యువత నిరుద్యోగులుగా వున్నారు. గత ప్రభుత్వాలు ఉద్యోగాలు కల్పించలేదు. ఇక్కడ ఆర్మూర్ నుంచి ఆదిలాబాద్ వరకూ గనుక ఒక రైల్వే లైన్ వస్తే స్థానిక రైతులు, విద్యార్థులు ఇంకా ఎంతోమందికి ఉపయోగంగా వుంటుంది. అన్ని రకాల రవాణా అందుబాటులోకి వస్తే మహిళలు కూడా కొత్త నైపుణ్య శిక్షణలకు బయటకు వెళ్ళటానికి సిద్ధపడతరు. నన్ను ఆదరించి గెలిపిస్తే రాబోయే రోజుల్లో పార్లమెంటులో ఇక్కడి ఉపాధి, నైపుణ్య శిక్షణల గురించి నేను మాట్లాడటానికి, సాధించటానికి ఎంతో అవకాశం వుంటుంది. పరిశ్రమలు వున్నాయి, అయితే అవి మూతపడ్డాయి. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వాటిని పునరుద్ధరించగలిగితే ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ప్రభుత్వపరమైన వ్యవస్థలను పెంచితే కూడా ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయి. ఇక్కడ ఎక్కువగా పత్తి పండిస్తున్నారు. దానికి అనుబంధ పరిశ్రమలు రావాల్సి వుంది.

 

ఇక్కడ స్వాతంత్ర్యం వచ్చిన ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడూ మహిళలు పోటీ చేయలేదు. ఒక మూల ఆదివాసీ మహిళగా నాకు ఆ అవకాశం కాంగ్రెస్ పార్టీ ద్వారా వచ్చింది. ప్రజల్లో ఆదరణ చాలా వుంది. అలానే నేను గతంలో అనేక అంశాల మీద హక్కుల కార్యకర్తగా, మహిళా కార్యకర్తగా బీడీ కార్మికుల కోసం, రైతుల కోసం, ఇంకా అనేక అంశాల మీద నిజాయితీగా పోరాటం చేయటం కూడా ప్రజలు గుర్తించారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఐదు న్యాయాలు, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గారెంటీలు అన్నీ కలిపి నాకు విజయం చేకూరుస్తాయని నేను బలంగా నమ్ముతున్నాను.

ఒక రాజకీయ నాయకురాలిగా ప్రతి ఒక్కరి హక్కును గుర్తించేలా పనిచేయటం, వాటిలోని వైరుధ్యాలను సున్నితంగా పరిష్కరించటం నా బాధ్యతగా వుంటుంది. సబ్బండ వర్గాల అభివృద్ధి జరిగేలా పనిచేయాలి. ఇక్కడ వుండే ఎస్టీ, ఎస్సీ, బీసీ, వోబీసీ, మైనారిటీల అభివృద్ధి కోసం పనిచేయాలి. అందరినీ సమానంగా కలుపుకుంటూ, అందరి హక్కులనూ గుర్తించి, వాటి రక్షణ కోసం పనిచేస్తూ, సమానత్వ భావన ఏదైతే కాంగ్రెస్ పార్టీ వాగ్ధానం చేస్తుందో ఆ లక్ష్యంతో పనిచేయటం నా బాధ్యత.

 

ప్రజల సమస్యల మీద పోరాటం చేసినందుకే నామీద గత ప్రభుత్వాలు యాభైరెండు కేసులు బనాయించాయి. అయితే, ప్రజల మధ్య నిలబడి వారి సమస్యల మీద పోరాటం చేస్తూ పనిచేస్తున్న నన్ను కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఈ ఎన్నికలలో అవకాశం ఇచ్చింది. ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఒక పేద కుటుంబానికి చెందిన అభ్యర్థికి అవకాశం ఇచ్చి గెలిపించుకున్నారు. అంటే, నిజాయితీగా ప్రజల్లో వుండాల, ప్రజల సమస్యల మీద పనిచేయాల అనే లక్ష్యం కాంగ్రెస్ పార్టీ పెట్టుకుంది కాబట్టే మాలాంటి వారికి అవకాశం వచ్చింది. దేశంలోని ప్రజలందరి హక్కులకు బాధ్యత పడుతూ బాబాసాహెబ్ అంబేడ్కర్ నేతృత్వంలో రూపొందించిన రాజ్యాంగాన్ని ఈరోజు కాపాడుకోవటం అత్యంత ముఖ్యమైన బాధ్యత. మేము గెలిస్తే నిర్బంధం లేకుండా అందరూ స్వేచ్ఛగా పనిచేసే వాతావరణం కల్పిస్తామని మాట ఇస్తున్నా.

సజయ: ఈ ప్రాంతంలో జరిగిన ఇంద్రవెల్లి సంఘటన గురించీ కాంగ్రెస్ పార్టీ మీద వున్న విమర్శలకు మీ సమాధానం ఏమిటి? మీ మానిఫెస్టోలో అంశాలు ఎలా అమలు చేయాలనుకుంటున్నారు?

ఆత్రం సుగుణ: గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారు ఇక్కడికి వచ్చినపుడు కొంతమంది ఇదే ప్రశ్న వేశారు. భూమి, భుక్తి, విముక్తి కొరకు జరిగిన ఇంద్రవెల్లి పోరాటంపై కాంగ్రెస్ పార్టీ అధికారంలో వున్నప్పుడే కాల్పులు జరిగాయి కదా అని? అప్పుడు ఆయన ఏమన్నరంటే, గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుంటం, అక్కడ మరణించినవారి కుటుంబాలను ఆదుకోవాలనుకుంటున్నాము, వారికి ఇండ్లు ఇవ్వటం, ఉద్యోగాలు కల్పించటం, ఉపాధి కల్పించటం, భూమి లేనివారికి భూమి ఇవ్వటం వంటివి చేస్తాము. సంఘటన జరిగింది, కాదనటం లేదు. అది తప్పు. అప్పటి పరిస్థితుల్లో అలా జరిగివుండవచ్చు, కానీ దాన్ని ఇప్పుడు సరిదిద్దుకుంటాము. ప్రాణత్యాగం చేసినవారికి భరోసా ఇస్తున్నాము అని చెప్పారు. ఇప్పుడు వెనుకబడివున్న ఈ ప్రాంత అభివృద్ధి కొరకు కాంగ్రెస్ పార్టీగా బాధ్యత పడుతున్నాం అని చెప్పారు.

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆరు గారెంటీలతో ముందుకి వచ్చింది. అవి దాదాపుగా అన్నీ అమలులోకి వస్తున్నాయి. గడప గడపకు అందుతున్నాయి. బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం ఇప్పటికే అమలవుతోంది. రెండువందల యూనిట్ల ఉచిత కరెంటు, ఐదు వందలకు సిలిండర్ కూడా అందుతున్నాయి. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వున్నప్పుడు నాలుగువందల యాభైకి సిలిండర్ వచ్చేది. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది పన్నెండువందలకి అంటే డబల్ పైన చేసిన్రు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు వందలకే అందించటం ప్రజలకు పెద్ద వూరట. ఈ ప్రాంతంలో అయితే, అన్ని సమూహాల్లో కుటుంబాలు పెద్దవి. అడవిలో కట్టెలు తెచ్చుకుందామంటే లోపలికి పోనీయరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్లు. అడవి మీద పూర్తిగా హక్కు కోల్పోయారు ఆదివాసీలు. కందకాలు తవ్వేసి ట్రెంచీలు వేసేశారు. లోపలికి వెళ్లటం రావటం చాలా కష్టం. అలాంటి పరిస్థితిలో పన్నెండు వందలు పెట్టి సిలిండర్ కొనటం చాలా భారమైపోయింది. కుటుంబంలో ఏడెనిమిదిమంది వుంటే మరీ కష్టం. ఇక్కడ అందరూ ఎక్కువ రొట్టెలు తింటారు. అవి కాల్చాలంటే ఎక్కువ సమయం పడుతుంది. ఒక సిలిండర్ ఇరవై రోజులు కూడా రాకపొయ్యేది. ఐదు వందలకు సిలిండర్ వస్తుందంటే మహిళలందరికీ ఆనందంగానే వుంది. సెల్ఫ్ హెల్ప్ సంఘాలలోని మహిళలకు వడ్డీ లేని రుణం, ఆరోగ్యం బాలేకపోతే బీమా వంటి విషయాల మీద కూడా ఆదరణ వుంది. రైతుబంధు కూడా డెబ్భైశాతం పూర్తి అయింది. మిగతాది ప్రాసెస్లో వుంది. ఇప్పుడు ఎలెక్షన్ కోడ్ వల్ల కొంత జాప్యం అవుతోంది. ప్రజల్లోకి నేను వెళుతున్నప్పుడు ఏమంటున్నరంటే, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష రూపాయల ఋణమాఫీ చేసింది, అయితే గత పదేళ్లల్లో బియ్యారెస్ ప్రభుత్వం ఋణమాఫీ అనటమే కానీ చేయలేదు అని చెబుతున్నరు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఎలెక్షన్ ముందే చేసివుంటే మాకు ఇంకా ఆనందంగా వుంటుండే అని చెప్పటం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారు భద్రాచలంలో జరిగిన సభలో ఆగస్ట్ పదిహేను లోపల ఋణమాఫీ చేస్తానని దేవుని సాక్షిగా ప్రమాణం చేసి చెప్పారు.

ఇప్పుడు కేంద్రస్థాయిలో కాంగ్రెస్ ఐదున్యాయాలతో ముందుకి వస్తోంది. ముఖ్యంగా వందరోజుల ఉపాధి పనిలో రోజుకి నాలుగువందల రూపాయలు తప్పనిసరిగా ఇస్తామని చెబుతున్నాం. గత ప్రభుత్వాని కన్నా ఎక్కువే ఇస్తామని చెబుతున్నాం. అలానే పూర్తిగా వందరోజుల పని తప్పకుండా ఇస్తామని కూడా చెబుతున్నాం. అదేవిధంగా పేదవర్గాల మహిళలకు సంవత్సరానికి ఒక లక్షరూపాయలు తప్పనిసరిగా ఇస్తాం. చదువుకునే అమ్మాయిలకు వారి చదువు కొనసాగటం కోసం భరోసా ఇస్తున్నాము. రాహుల్ గాంధీగారు ప్రధానమంత్రిగా కేంద్రంలో అధికారంలోకి వస్తే తప్పనిసరిగా అమలుచేస్తామని మేము హామీ ఇస్తున్నాము. ప్రజలు మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకుంటున్నారు.

నరేంద్రమోడీగారు తాము నాలుగువందల సీట్లు గెలుచుకుంటే రాజ్యాంగాన్ని మారుస్తామని సంకేతం ఇవ్వడంతో ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ గారు రాజ్యాంగంలో భారతదేశంలో వుండే సబ్బండ వర్గాలందరికీ కూడా ఉపయోగపడేలా రిజర్వేషన్లు పెట్టారు. ఆ రిజర్వేషన్ ఈరోజు మారిస్తే ఇక్కడున్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, మైనారిటీలకు చాలా ఇబ్బంది. రాజ్యాంగాన్ని మార్చటం అంటే వీరందరి బతుకులనూ ప్రమాదంలోకి నెట్టడమే అవుతుంది. రాజ్యాంగాన్ని మారిస్తే అందరూ సమానం అనే భావన ఎట్లుంటుంది? ఉన్నోడు వున్నట్టే, లెనోడు లేనట్టే కదా! ఈ దేశంలో మనందరం ఈక్వల్ గా లేము. రాజ్యాంగాన్ని మారిస్తే అసమానతల్ని మరింత పెంచటమే, మరింత పేదరికంలోకి నెట్టటం తప్ప మరేమీ కాదు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే సమానత్వ భావన, సెక్యులరిజం నిలబడతాయని అందరూ బలంగా నమ్ముతున్నరు.

సజయ: మోదీగారి ‘తాళి లాగేసుకుంటారు’ అనే వ్యాఖ్యలపై మీ స్పందన ఏమిటి?

ఆత్రం సుగుణ: ప్రస్తుత ప్రధాన మంత్రి మోదీ గారు మా గూడాలకు గానీ, ప్రజలకు గానీ ఇచ్చిందేమీ లేదు. నేను వోటు ఆడగటానికి వెళుతున్నప్పుడు “మేము ఈ ఐదు న్యాయాలు తప్పకుండా చేస్తామని చెబుతున్నా, అందుకే వోటు అడుగుతున్నా. మరి బీజేపీ వాళ్లు, బిఆర్ఎస్ వాళ్లు మీ వూర్లకు ఏమిచ్చినరు? అని అడుగుతుంటే అయ్యో అక్కా ఏమివ్వలే..” అని చెబుతున్నరు. “మోడీ గుప్పెడు అక్షింతలు తప్పించి మా గడప ముందుకు ఒక్క పథకం కూడా తీసుకురాలేదు, ఎలాంటి అభివృద్ధి కూడా లేదు” అని చెబుతున్నరు. కానీ, మోడీగారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీ తాళిని తీసుకుపోతారు అని ప్రజల్ని రెచ్చగొట్టాలని చూస్తున్నరు. అయినా గానీ కొంతమంది చదువుకున్న ఉపాధ్యాయులు, మహిళలు, ఉద్యోగులు ఈ విధమైనవాటిని ప్రశ్నిస్తున్నరు. భారతదేశ స్వాతంత్ర్య పోరాటం నుంచీ త్యాగాల కుటుంబం అంటే రాహుల్ గాంధీ కుటుంబమే. తాళిని త్యాగం చేసిన కుటుంబం. దేశం కొరకు ఇందిరమ్మ, రాజీవ్ గాంధీ ప్రాణత్యాగం చేశారు. జవహర్ లాల్ నెహ్రూ, మోతీలాల్ నెహ్రూ స్వాతంత్ర్యపోరాటంలో జైలు పాలయ్యారు. దుఖ్ఖం దిగమింగి సోనియమ్మ దేశం కోసమే నిలబడ్డరు. త్యాగాల చరిత్ర ఆ కుటుంబానిది. ఆ కుటుంబంలో పుట్టిన రాహుల్ గాంధీగారు ఒక సాధారణ జీవితం గడుపుతూవున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీ తాళిని తీసుకుపోతారు అని అనటం తప్పు.

సజయ: కాంగ్రెస్ పార్టీ పాలన ఎలా ఉండబోతోంది?

సుగుణ: కాంగ్రెస్ పార్టీ పాలన నిజాయితీగా, పారదర్శకంగా వుంటుందని మేము హామీ ఇస్తున్నాము అక్కా! ఇక్కడ రేవంత్ రెడ్డిగారు, మంత్రిగా ఉన్న మా సీతక్క గారు, ఇంకా ఇతర పెద్దలు చాలా పనిచేస్తున్నరు. ప్రజల అభివృద్ధి మొట్టమొదటి లక్ష్యంగా వుంది. సీతక్క గారు కూడా ఉద్యమాల నుంచి వచ్చిన వ్యక్తి. పేద ప్రజల దగ్గరకు వచ్చినపుడు ఏదైనా సమస్య తన దృష్టికి తీసుకువెళితే, అక్కడి పరిస్థితులను తెలుసుకుని వెంటనే ఆ సమస్య పరిష్కారానికి అధికారులతో చర్చించి ఆదేశాలు ఇస్తారు.

 

ప్రజల అభివృద్ధి మనకు ప్రధాన బాధ్యతగా వుండాలి అని పనిచేస్తాము. దేశ సంపద పెరగాలి, ప్రజల అభివృద్ధి జరగాలి, న్యాయబద్ధంగా పాలించాలి అని ఒక లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పెట్టుకుంది. రాహుల్ గాంధీగారి లక్ష్యం కూడా అదే! దేశ సంపద ఆదానీ, అంబానీలకు దేశాన్ని కట్టబెట్టటం కాదు, ప్రజల మధ్య సమానత్వం వుండాలి, స్వేచ్ఛ వుండాలి, న్యాయం వుండాలి, రాజ్యాంగబద్ధంగా ఈ దేశం నడవాలి అనేవి మా విధానాలు. కులమతాల మధ్య చిచ్చుపెట్టే వ్యక్తికి వోటు వేద్దామా, ప్రజలందరూ సమానమే అనే న్యాయబద్ధమైన నినాదంతో ముందుకి వస్తున్న వ్యక్తికి వోటు వేద్దామా అని ప్రజలు కూడా ఆలోచించాలి.

సజయ: ఇప్పటి వరకూ ఒక మహిళా సంఘాల కార్యకర్తగా వున్న మీరు జెండర్ సమానత్వం అంశాన్ని రాజకీయ వేదికలపై ఎలా ముందుకి తీసుకెళ్లాలనుకుంటున్నారు?

ఆత్రం సుగుణ: గత పదేళ్లలో మోడీగారి ప్రభుత్వ హయాంలో స్త్రీల మీద ఎన్నిరకాల అత్యాచారాలు, అవమానాలు జరిగాయో మనం చూస్తూనే వున్నాం. సాక్షాత్తూ రాష్ట్రపతి ముర్ముగారినే అవమానించడం చూశాం. కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవంలో, అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో ఒక మూల ఆదివాసీమహిళగా ఉన్న రాష్ట్రపతి ముర్ముగారిని దూరంపెట్టడం అంటే మమ్మల్ని అవమానించినట్టుగానే భావిస్తున్నాము. ఎవరికీ అలా జరగకూడదు, మరీ ముఖ్యంగా ఆ స్థాయిలో వున్నవ్యక్తికి అలా జరగకూడదు. మణిపూర్ లో మహిళలను నగ్నంగా నడిపించిన సంఘటన మరచిపోగలమా? ప్రపంచమంతా దీన్ని వ్యతిరేకించింది. ఇక్కడ రాష్ట్రంలో కూడా అనేక సంఘటనలు, దిశ కేసులో ఎన్కౌంటర్ ని సమర్ధించలేము. ఇంకా ఇతర అత్యాచార సంఘటనల్లో కూడా ప్రభుత్వాల స్పందన సరిగా లేదు. అలాంటి సంఘటనలు జరిగినప్పుడు వెనువెంటనే చర్యలు తీసుకునే విధంగా విధానాన్ని రూపొందించి ఆచరణలో పెట్టటానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాము.

 

బాబాసాహెబ్ అంబేడ్కర్ ని భారతదేశ స్వాతంత్ర్య సమయంలో “మీరు స్వాతంత్ర్య పోరాటంలో వుంటారా, లేకపోతే బడుగు- బలహీన వర్గాల పక్షాన వుంటారా” అని అడిగితే, “స్వాతంత్ర్య పోరాటంలో సబ్బండవర్గాలు చాలా వున్నాయి. ఈ బడుగు బలహీన వర్గాలేమయితే వున్నాయో వారి పక్షాన పోరాటం చేసేవారు ఎవరూ లేరు. నేను వీరి పక్షానే వుంటాను” అని చెప్పిన సందర్భాన్ని ఇక్కడ తప్పనిసరిగా గుర్తు చేసుకోవాలి. అదే బాటలో నా గళం, నా లక్ష్యం ఎప్పుడూ అణగారిన వర్గాల, మహిళల పక్షాన్నే ఉంటాయని స్పష్టంగా చెప్తున్నాను!.

Leave a Reply