Take a fresh look at your lifestyle.

కెసిఆర్‌ అం‌తిమ ఫర్మానా ..!

భారతీయ జనతాపార్టీ వరంగల్‌లో సభను అడ్డుకునేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే ఫర్మానా జారీ చేశారో అదే ఆయన అంతిమ ఫర్మానా అవుతుందని బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా జ్యోస్యం చెప్పారు. గతంలో నిజామ్‌ ‌సర్కార్‌ ఇక్కడి ప్రజలు సభలు, సమావేశాలు పెట్టుకోకుండా, లైబ్రరీలు, పాఠశాలలు నిర్వహణపై అంకుశం మోపుతూ ఇలాగే ఫర్మానా జారీ చేస్తే, ప్రజలు ఆయన్ను ఇంటికి పంపించిన విషయాన్ని గుర్తు చేస్తూ, కెసిఆర్‌ను కూడా అలానే ప్రజలు ఇంటికి పంపించే రోజు వస్తుందన్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు మూడవ విడుతగా రాష్ట్రంలో చేపట్టిన సంగ్రామ యాత్ర శనివారం విజవంతంగా పూర్తి అయింది. శనివారం వరంగల్‌లోని భద్రకాళీ అమ్మవారి సన్నిధికి చేరుకోవడం ద్వారా ఈ యాత్ర పరిపూర్ణమయింది. గతంలో చార్మినార్‌ ‌భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుండి ప్రారంభించిన మొదటి సంగ్రామ యాత్ర, తర్వాత అలంపూర్‌ ‌జోగులాంబ ఆలయం నుండి కొనసాగిన రెండవ యాత్ర తరహాలోనే మూడవ యాత్రను కూడా ఆ పార్టీ వియవంతంగా పూర్తి చేసుకోగలిగింది.

దక్షిణ భారతదేశంలోకూడా తమ పార్టీ బలంగానే ఉందన్న విషయాన్ని బిజెపి ఈ ముగింపుద్వారా ప్రజలకు తెలియజేసింది. ఈ సందర్భంగా హనుమకొండ ఆర్టస్ అం‌డ్‌ ‌సైన్స్ ‌కళాశాల మైదానంలో బహిరంగసభలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి సునీల్‌ ‌బన్సల్‌తో పాటు పలువురు జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు తెరాస ప్రభుత్వాన్ని, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును తీవ్రంగా దుయ్యబట్టారు. తెరాస ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, అబద్దాలు చెప్పడంలో ఆరితేరిందని తీవ్రంగా విమర్శించారు. నీటి ప్రాజెక్టుల పేర నిధులను నీటిపాలు చేసి, ప్రజలకు కన్నీటిని మిగిలుస్తున్నారన్నారు. గొప్పగా చెప్పుకుంటున్న కాళేశ్వరం ప్రాజెక్టును 40లక్షల కోట్లలో నిర్మించాల్సి ఉండగా లక్ష కోట్లు అదనంగా ఖర్చు చేశారని, ఒక విధంగా కెసిఆర్‌కు ఇది ఏటిఎంగా పనిచేస్తున్నదని దుయ్యబట్టారు. మజ్లిస్‌కు మద్దతు పలుకుతూ, ప్రజలు ఎంతో సాహాసంతో పోరాడి నిజామ్‌ ‌నుండి సాధించుకున ఈ ప్రాంతంలో ప్రతీఏటా విమోచన దినాన్ని జరుపకపోవడానికి ఈ ప్రభుత్వం భయపడుతోందని, తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దాన్ని తప్పకుండా తామే నిర్వహిస్తామని జెపి నడ్డా ఆవేశపూరితంగా చేసిన ప్రసంగం ప్రజలను ఆకట్టుకుంది.

అలాగే కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికూడా కేంద్రం ఎలాంటి నిధులివ్వడంలేదనడంపై తీవ్రంగా స్పందిస్తూ, ఎన్ని వేల కోట్లను దేనికి కేటాయించిందన్న విషయాన్ని సోదాహరణగా వివరించారు. చాతనైతే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఖండించాలంటూ ఆయన సవాల్‌ ‌విసిరారు. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌పాదయాత్రకు రాష్ట్ర ప్రభుత్వం కలిగించిన ఆటంకాలపై పలువురు తీవ్రంగా స్పందించారు. ఇరవై ఒక్క రోజులపాటు నిర్వహించిన ఈ యాత్రలో సభలు, సమావేశాలు, విమర్శలు, ప్రతివిమర్శలు, ఛీత్కారాలు, దాడులు, అరెస్టులు లాంటి పలు సంఘటనలు చోటుచేసు కున్నప్పటికీ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌కుమార్‌ ‌కార్యక్రమాన్ని రూపొందించుకున్నట్లు తన లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తి చేయడంతో ఆ పార్టీ శ్రేణులు అమితోత్సహాన్ని ప్రదర్శిస్తున్నారు. శనివారం వరంగల్‌లోని మామునూరు గ్రామానికి చేరుకున్న పాదయాత్ర తిమ్మాపూర్‌,‌రంగశాయిపేట, నాయుడు పెట్రోల్‌పంప్‌, ‌గవిచర్ల క్రాస్‌రోడ్డు, శంభునిపేట, వరంగల్‌, ఎం‌జిఎం హాస్పిటల్‌ ‌సెంటర్‌ ‌నుండి భద్రఖాళీ ఆలయానికి చేరుకోవడం ద్వారా పూర్తి అయింది.

ఈ యాత్రలో బండి సంజయ్‌ ‌సుమారు 328 కిలో మీటర్ల దూరం పాదయాత్ర జరిపిన నేపథ్యంలో దాదాపు అయిదు జిల్లాలు, పదకొండు అసెంబ్లీ నియోజకవర్గాలను ఆయన చుట్టుముట్టారు. దీంతో మూడు విడుతల కలిపి దాదాపు పద్దెనిమిది జిల్లాలు నలభై ఒక్క నియోజకవర్గాల్లో ఆయన దాదాపు పదకొండు వందల 21 కిలోమీటర్ల దూరం ఆయన కాలినడకన ప్రజలను కలుసుకుని వారి బాధలను స్వయంగా తెలుసుకోగలిగారు. తమ సమస్యలపై వివిధ రంగాలవారు దాదాపు తొమ్మిదివేలకు పైగా విజ్ఞాసప పత్రాలను ఆయనకు అందజేశారు. ఈ యాత్రాకాలంలో ప్రభుత్వ యంత్రాంగం, అధికార పార్టీ కార్యకర్తలు అనేక అటంకాలు కలుగించిన దరిమిలా పలుసార్లు ఉన్నత న్యాయస్థానానికి వెళ్ళి పాదయాత్ర కొనసాగింపుకు అనుమతులు తెచ్చుకోవాల్సి వచ్చింది.

కాగా అధికార పార్టీకి, బిజెపి కారకర్తలకు మధ్య జరిగిన కొట్లాటతో పోలీసులు లాఠీలు ఝళిపించాల్సి రావడం, ఫలితంగా ఇరుపక్షాల కార్యకర్తలు గాయపడి హాస్పిటల్‌ ‌పాలైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఆగస్టు 2న యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధినుండి మూడవ ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభోత్సవానికి వచ్చిన కేంద్ర మంత్రులు గజేంద్రసింగ్‌ ‌షెకావత్‌, ‌కిషన్‌రెడ్డిలకు కనీసం ప్రోటోకాల్‌ ‌పాటించకపోవడంకూడా వివాదానికి దారితీసింది. వారిని ఆలయ పూజారులే తప్ప అధికారులెవరూ వారిని పట్టించుకోకపోవడం తీవ్ర విమర్శలకు కారణమయింది. కేంద్ర మంత్రుల పరిస్తితి ఇలాఉంటే సాక్షాత్తు రాష్ట్ర గవర్నర్‌ ‌తమిళసై సౌందరాజన్‌ ‌యాదగిరి నర్సింహస్వామిని దర్శించుకోవడానికి వచ్చనప్పుడు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురుకావడం రాష్ట్రంలోకాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

గెస్ట్ ఎడిట్‌ ‌….మండువ రవీందర్‌రావు

Leave a Reply