Take a fresh look at your lifestyle.

పేదలను కొట్టి పెద్దలకు పంచే చట్టం

ప్రధాని నరేంద్రమోడీ పంతం నెగ్గింది. దేశంలోని ప్రతిపక్షాలు, ప్రజాహిత సంస్థలు, ముఖ్యంగా రైతు శ్రేయస్సు కోరేవారు వ్యతిరేకిస్తున్నా, వ్యవసాయ బిల్లులను రాజ్య సభ చేత ఆమోదింప జేయించారు. అక్టోబర్ ఒకటవ తేదీనుంచి కొత్త వ్యవసాయ చట్టం అమలులోకి వొస్తుంది. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ మిత్ర పక్షం అయిన అకాలీదళ్ తమ పార్టీ ఎంపీ చేత కేంద్ర మంత్రివర్గం నుంచి రాజీనామా చేయించింది. ఇది తేనె పూసిన కత్తి వంటిదని తెరాస అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అభివర్ణించారు. తెరాస ఎంపీలు రాజ్య సభలో ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే, తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్, మరికొందరు ప్రతిపక్ష సభ్యులు డిప్యూటీ చైర్మన్ వేదిక వద్దకు వెళ్ళి ఈ బిల్లు పత్రాలను చించి వేసి విసిరివేశారు. వారు చేసింది తప్పే. కానీ, బిల్లులో ఉన్న రైతు వ్యతిరేక విధానాలు వారిలో ఆగ్రహావేశాలను పెంచడం వల్ల అంతటి తీవ్ర స్థాయిలో వారు నిరసన తెలిపారు. పార్లమెంటులో ఇలాంటి సందర్భాలు కోకొల్లలు. వస్తు,సేవా పన్ను (జిఎస్ టి)ని బలవంతంగా ఆమోదింప జేసినప్పుడు, త్రిపుల్ తలాక్ బిల్లును అదే రీతిలో ఆమోదింప జేసినప్పుడు ప్రతిపక్ష సభ్యులు ఇదే రీతిలో ఆగ్రహావేశాలను వ్యక్తం చేశారు. అయితే, వ్యవసాయ బిల్లును చర్చకు అనుమతించకుండా ఆమోదింప జేసిన తీరు రాజకీయాలకు అతీతంగా అందరినీ విస్మయానికి గురి చేసింది. ఈ ప్రభుత్వానికి ఎందుకింత తొందర అని విమర్శించిన వారే ఎక్కువ మంది ఉన్నారు. అయితే , ఈ బిల్లు వల్ల రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందంటూ ప్రధానమంత్రి మోడీ మరోసారి తన నిర్ణయాన్ని సమర్ధించుకున్నారు. ఆయన గతంలో కూడా తాను తెచ్చిన బిల్లులకు ఇదే రీతిలో సమర్ధింపు వాదాన్ని వినిపించారు. అయితే, గతంలో ఆమోదించిన బిల్లులపై చర్చ జరిగింది. ఈ సారి చర్చకు ఎందుకు అనుమతి ఇవ్వలేదో ప్రభుత్వం కానీ, సభాధ్యక్షుడు కానీ తెలియజేయలేదు. అధికారంలో ఉన్న ప్రభుత్వం తన అజెండా ప్రకారం బిల్లులను ఆమోదింపజేసుకోవడం, ప్రతిపక్షాల అభ్యంతరాల ను తోసిరాజనడం ఒక హక్కుగా భావిస్తూ ఉంటుంది. అందులో నిజం ఉండవచ్చు. కానీ, ప్రతిపక్షాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడం ప్రజాస్వామ్యయుతం. అంతేకాకుండా, మిత్ర పక్షమైన అకాలీదళ్ బీజేపీకి ఎన్నో దశాబ్దాలుగా వెన్నంటి ఉంటూ వస్తోంది. ఆ పార్టీ ఎంపీ మంత్రి పదవిని కూడా తృణప్రాయంగా వదులుకోవడం , బీజేపీ హితైషులు కూడా ఈ బిల్లుపై తొందరొద్దని సలహా ఇచ్చినా లక్ష్య పెట్టకపోవడం మోడీ పట్టుదలకు నిదర్శనం. దేశంలో కోట్లాది రైతుల ప్రయోజనాలను ఈ బిల్లులోని అంశాలు దెబ్బతీస్తాయని వ్యవసాయ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సన్న,చిన్నకారు రైతుల హక్కులను హరించి వారిని బానిసలుగా చేస్తాయని హెచ్చరిస్తున్నారు.

రైతు తాను పండించిన పంటను ఎక్కడైనా అమ్ముకునేందుకు ఈ చట్టం అనుమతిస్తుందంటున్నారు. రైతులు తమ పంటను పొరుగు రాష్ట్రం కాదు, జిల్లాలోనే అమ్ముకోలేని పేద స్థితిలో ఉన్నారు. పంటను ముందే కొనుగోలు చేసి తరలించుకుని పోయే దలారులు, పెద్ద రైతులు, కాంట్రాక్టు ఫార్మింగ్ కు అలవాటు పడిన వారు కాచుకుని కూర్చుంటారు. రైతు పంటతెగనమ్ముకుంటున్నారన్న వార్తలు ప్రతి సీజన్ లోనూ వొస్తుంటాయి. ప్రభుత్వం ప్రకటించే మద్దతు ధర మొక్కు బడిగా మిగిలిపోతున్నది. ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించే సమయానికే రైతు నుంచి పంటను పెద్ద కామందులు కొనుగోలు చేస్తున్నారు.అంటే, ప్రభుత్వం ప్రకటించే మద్దతుధర, ఇతర సదుపాయాలు పంటను దక్కించుకున్నవారికే లభిస్తున్నాయి. బక్క రైతులకు చేరడం లేదు. 70 శాతం మంది వ్యవసాయం పై ఆధారపడి జీవిస్తున్న మన దేశంలో సగానికి పైగా చిన్న, చితకా కమతాలను సాగు చేసుకునే రైతులే ఎక్కువ మంది ఉన్నారు. పంటలు వేయడానికి వారు ఎక్కడి నుంచో అప్పులు తెస్తుంటారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోతుంటారు. నష్టాలు రైతులవీ, లాభాలు పెద్ద రైతులవీ అనే నానుడి ఇప్పటికే స్థిరపడింది. చిన్న, సన్నకారు రైతులను ఆదుకునే వ్యవస్థ మన దేశంలో లేదు. మొదటి నుంచి కార్పొరేట్, కాంట్రాక్టు రైతుల ప్రయోజనాలను కాపాడే ప్రభుత్వాలే రాజ్యమేలుతున్నాయి.

ఏ పార్టీ అధికారంలోకి వొచ్చినా, బడుగు, బలహీన వర్గాల రైతులు, రైతు కూలీల పరిస్థితిలో అణుమాత్రం మార్పు ఉండటం లేదు.అందుకే, అప్పులు పాలైన రైతులు ఆత్మహత్యలకు ఒడిగడుతున్నారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు పరిహారం అందించినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు. రైతులకు నేరుగా సాయం అందించినప్పుడే సమస్య పరిష్కారం అవుతుంది. గతంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించి కొంతమేర కృషి చేసింది.అయితే, ఆ కూటమిలోని పార్టీలు తలోవైపూ లాగడం వల్ల రైతులకు ప్రయోజనం చేకూర్చే విధానాలను అమలు చేయలేకపోయింది. రాజకీయ పార్టీలు ఎన్నికల ముందు రైతులను ప్రసన్నం చేసుకోవడానికి స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల గురించి వల్లె వేస్తుంటారు . స్వామినాథన్ సిఫార్సులలో ఒక్కదానిని కూడా జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు అమలు చేయలేదు. మార్కెట్ కమిటీల రద్దు వల్ల రైతులకు నేరుగా లాభం జరుగుతుందని ప్రధాని అంటున్నారు. మార్కెట్ కమిటీలకు విక్రయిస్తున్నప్పుడే రైతుల కు కనీస మద్దతు ధర ల భించనప్పుడు, ఇతర రాష్ట్రాలకు పంటను తరలించే శక్తి ఎక్కడి నుంచి వొస్తుంది. అది కేవలం పెద్ద రైతుల , కార్పొరేట్ వ్యవసాయం చేసే వారికే సాధ్యమవుతుంది. ప్రభుత్వం ఈ విషయంలో స్పష్టత ఇవ్వకుండా తన పట్టుదలను నెగ్గించుకోవడం మొండి వైఖరి కాక మరేమిటి..? వ్యవసాయ బిల్లుల పై సమగ్రమైన చర్చకు అవకాశం ఇచ్చి ఉంటే మోడీ వల్లించే రైతు అనుకూల సూక్తులను జనం నమ్మడానికి అవకాశం ఉండేది. కానీ, ఆయన కన్యాశుల్కం నాటకంలో అగ్రహోత్రావధానులు తాంబూలాలిచ్చేశాను తన్నుకు చావండి అన్నట్టుగా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది. రైతు మేలు కాదు కీడు చేసే చట్టం ఇది. ఇది అన్ని పార్టీల కోరస్.

Leave a Reply