Take a fresh look at your lifestyle.

స్వచ్చంద సంస్థల సేవకు జీహెచ్‌ఎం‌సి బ్రేక్‌ అడ్డుకోవద్దని సీఎస్‌కు ప్రతినిధుల విజ్ఞప్తి

కొరోనా వైరస్‌ ‌కట్టడికి ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకుంటున్న స్వచ్ఛంద సంస్థల సేవలకు జీహెచ్‌ఎం‌సి బ్రేక్‌ ‌వేసింది. లాక్‌డైన్‌ ‌కారణంగా హైదరాబాద్‌ ‌నగరంలో ఎందరో అభాగ్యులు తిండి దొరకక ఎన్నో అవస్థలు పడుతున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని నిర్భాగ్యులు, రోజు వారీ కూలీలు పట్టెడన్నం దొరకక విలవిల్లాడుతున్నారు. తమ కుటుంబాలను ఎలా పోషించుకోవాలో తెలియక నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితులలో ఆపన్నులను ఆదుకునేందుకు మేము సైతం ఎన్నో స్వచ్చంద సంస్థలతో పాటు యువజన సంఘాలు, మిత్ర బృందాలు తమ వంతు సాయాన్ని అందిస్తున్నాయి. రోడ్లపై నివసించే కుటుంబాలు, అనాథలకు తమకు తోచిన సాయం అందజేస్తున్నారు. కొందరు వీరికి అన్నదానాలు ఏర్పాటు చేస్తుండగా, మరికొంత మంది నిత్యావసర వస్తువులను ఉచితంగా పంపిణీ చేస్తూ తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. అయితే, ఇలా స్వచ్చంద సంస్థలు, వ్యక్తులు ఎవరికి తోచిన విధంగా వారు ప్రజలకు నిత్యావసర సరుకులు అందజేస్తున్న క్రమంలో కొరోనా వైరస్‌ ‌విస్తరించే అవకాశం ఉందని పురపాలక శాఖ, జీహెచ్‌ఎం‌సి అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. జీహెచ్‌ఎం‌సి అడిషనల్‌ ‌కమిషనర్‌ ‌ప్రియాంక నేతృత్వంలో ఏర్పాటైన సెంట్రలైజ్డ్ ‌విభాగానికి మాత్రమే స్వచ్చంద సంస్థలు, వ్యక్తులు తాము సహాయం చేయదలుకున్న వస్తువులు, సరుకులు, ఆహారం పొట్లాలను అందజేయాలని స్పష్టం చేశారు. ఈ విభాగం ద్వారా మాత్రమే హైదరాబాద్‌ ‌నగరవ్యాప్తంగా ఆహార పొట్లాలు, నిత్యావసర, ఇతర సరుకులను పంపిణీ చేయడం జరుగుతుందనీ, ఈ నిబంధనను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించింది. దీంతో పలు స్వచ్చంద సంస్థలు, ప్రతినిధులు శనివారం జీహెచ్‌ఎం‌సి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు.

- Advertisement -

కొరోనా కట్టడికి ప్రభుత్వం లాక్‌డౌన్‌ ‌నేపథ్యంలో ప్రజలు ముఖ్యంగా నిరుపేదలు, అభాగ్యులు తినడానికి తిండి లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనీ, వారిని ఆదుకునేందుకు మానవతాదృక్పదంతో తమ వంతు ప్రయత్నం చేస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా తాము నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ఎలాంటి ఆటంకాలు కల్పించవద్దని విజ్ఞప్తి చేశారు. తాము ఆహార పొట్లాలు, నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్న సమయంలో సామాజిక వ్యత్యాసం పాటిస్తున్నామనీ, కొరొనా వైరస్‌ ‌వ్యాప్తిని నిరోధించేందుకు ప్రభుత్వం సూచించిన అన్ని మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటిస్తున్నట్లు వెల్లడించారు. తాము చేస్తున్న స్వచ్చంద సేవా కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకాలు తలపెట్టవద్దనీ, అవసరమైతే ఆయా ప్రాంతాలలో తమతో పాటు స్థానిక ప్రజాప్రతినిధి లేదా కార్పొరేటర్‌ ‌లేదా జీహెచ్‌ఎం‌సికి చెందిన అధికారిని తమ కార్యక్రమాల పర్యవేక్షణకు పంపించాలని విజ్ఞప్తి చేశారు. ఈమేరకు సీఎస్‌కు లేఖ రాసిన వారిలో అమన్‌ ‌వేదిక ప్రతినిధి అనురాధ, సామాజిక కార్యకర్త కె.సజయ, మకాం ప్రతినిధి ఆశాలత, న్యాయవాది వసుధా నాగరాజ్‌, ‌సామాజిక కార్యకర్తలు సంయుక్త, జర్నలిస్టు పద్మజాషా, సపా ప్రతినిధి రుబీనా ఉన్నారు.

Leave a Reply