Take a fresh look at your lifestyle.

రహస్య భేటీ సమాచారాన్ని ప్రధాని వెల్లడించవచ్చా ?

తెలంగాణలో ఇంత కాలంగా తనకు ఎదురు లేదనుకున్న అధికార బిఆర్‌ఎస్‌ ఇప్పుడు ఆత్మరక్షణలో పడిరది. మరో రెండు మూడు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్‌ విడుదల అవుతుందనుకున్న సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ బాంబు లాంటి వార్త పేల్చడంతో గుక్క తిప్పుకోకుండా అయింది బిఆర్‌ఎస్‌ పరిస్థితి. దేశంలో ఎన్నో రాజకీయ పరిణామాలు జరుగుతుంటాయి. పార్టీల మధ్య కొన్నిసార్లు బహిరంగ సమావేశాలు, మరికొన్ని సార్లు రహస్య సమావేశాలు జరుగుతుంటాయి. ఈ సమావేశాల సమాచారాన్ని ఆయా పార్టీల నిర్ణయం ప్రకారం మీడియా ముఖంగా వెల్లడిరచడమన్నది ఆనవాయితీ. చర్చల సమాచారం బహిర్ఘతం కావద్దనుకున్న పక్షంలో కనీసం మీడియా కంటికి దొరకకుండా ఆయా పార్టీల నేతలు తప్పించుకుని వెళ్ళటం కూడా చూశాం. అలాగే వివిధ సమస్యలపైన రాష్ట్ర ముఖ్యమంత్రులు ప్రధానిని కలవడమన్నదికూడా అంతే సహజం.

అయితే కలిసిన ప్రతీవిషయాన్ని బహిరంగపర్చాలని ఉండదు.  వారి మధ్య ఏం జరిగిందన్నది ఎవరికీ అంతుబట్టని రహస్యంగానే ఉండిపోతుంది. ముఖ్యంగా ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తులు అలాంటి సమాచారాన్ని పబ్లిక్‌గా ప్రకటించడమన్నది సామాన్యంగా జరిగే విషయంకాదు. కాని, తాజాగా నిజామాబాద్‌ బహిరంగ సభలో ప్రధాని నరేంద్రమోదీ బిఆర్‌ఎస్‌ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ తనతో జరిపిన రహస్య సమావేశాన్ని వివరించిన తీరు ప్రకంపనలకు దారితీసింది. ఒకపక్క ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి రహస్యభేటీ అంశాన్ని తనవరకే పరిమితం చేసుకుని, దాని పరిణామాలకు తగ్గట్టుగా కార్యక్రమాన్ని రూపొందించుకోవడం గౌరవప్రదంగా  ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాని ప్రధాని మోదీ చర్యవల్ల ఇక ముందు ప్రధానితో తాము రహస్యంగా భేటీ కావాలనుకునే వారి పరిస్థితి ఏమిటన్న చర్చ జరుగుతోంది. ప్రధానితో ఎప్పుడైనా భిన్నాభిప్రాయం ఏర్పడితే ఆయన తమ రహస్య భేటీ విషయాలను ఇలానే వెల్లడిస్తే ఇప్పుడు బిఆర్‌ఎస్‌ డిఫెన్స్‌లో పడినట్లు తమ పరిస్థితి కూడా ఉంటుందన్న భయం ఆయా పార్టీ నేతల్లో ఏర్పడుతున్నది.

తెలంగాణపై కాషాయ జండాను ఎగురవేస్తామని చాలాకాలంగా చెబుతున్న బిజెపి, రాష్ట్రంలో తమ పార్టీ కార్యక్రమాలను విస్తృత పర్చింది. అయితే మునుగోడు ఎన్నికలు ఆ పార్టీ ఉత్సాహానికి బ్రేకులు వేసినా, ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర నాయకులతో సభలు ఏర్పాటు చేయడం ద్వారా పార్టీని ఉరకలెత్తించే ప్రణాళికలను రచించింది. అందులో భాగంగా ఈ నెల మొదటి వారంలోనే ప్రధాని నరేంద్రమోదీతో రెండు సభలను నిర్వహించడం ద్వారా కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపింది. దానికి తోడు ప్రజల్లో బిజెపి ప్రభుత్వంపట్ల నమ్మకాన్ని కలిగించే ప్రయత్నం చేసింది. అయితే అన్నిటికీ మించి ఈ సభల ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో మార్పును తీసుకురావాలనుకున్న ఆ పార్టీ ఆశయం  నెరవేరినట్లు  పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.  మోదీ నిజామాబాద్‌ సభ కేవలం రాష్ట్రంలోనే కాకుండా దేశ రాజకీయాల్లో కూడా ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా కెసిఆర్‌ విశ్వసనీయతపైన చర్చకు దారితీసింది. కాంగ్రెస్‌, బిజెపి పార్టీలకు అతీతంగా ఒక థర్డ్‌ ఫ్రంట్‌ లాంటి కూటమిని ఏర్పాటు చేయాలని, కాలుకు బలపం కట్టుకుని తిరిగిన కెసిఆర్‌ మాటలను ఎంతవరకు నమ్మవొచ్చన్న అనుమానం దేశంలోని  రాజకీయ పార్టీలకు  మోదీ మాటలవల్ల వ్యక్తమయ్యే పరిస్థితి ఏర్పడిరది.

బిజెపి అంటేనే ఒంటికాలుపై లేచిన కెసిఆర్‌ ఆ పార్టీతోనే పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నించాడన్న వార్త ఇప్పుడు దావానలంగా మారింది. ఇది సామన్య ప్రజల్లోకి కూడా వెళ్ళింది. నిజంగానే మోదీ, కెసిఆర్‌ మధ్య ఎలాంటి చర్చ జరిగిందన్న విషయాన్ని వారిద్దరికే తెలిసే అంశం. నరేంద్ర మోదీ చేసిన ప్రకటన అవాస్థవమని కెటిఆర్‌, ఇతరనేతలు ఆరోపిస్తున్నా దానిపై వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి కెసిఆర్‌కు ఏర్పడిరది. అయితే ఇక్కడ మరో విషయమేమంటే తన కుమారుడిని రాష్ట్ర ముఖ్యమంత్రిని చేస్తానని, అందుకు సహకారం అందించాలని కెసిఆర్‌ తనను కోరినట్లుగా మోదీ సభా ముఖంగా చెప్పారు. కాని, కెసిఆర్‌ కుమారుడు కెటిఆర్‌ ముఖ్యమంత్రి కావడానికి ప్రధానికి సహకార అవసరమేంటన్న ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల ప్రక్రియ ద్వారా చేపట్టే పదవికి ప్రధాని అవసరమేముంటుందని, ఇది ఒక విధంగా బిఆర్‌ఎస్‌పై గుడ్డకాల్చి వేయడమేనంటున్నారు బిఆర్‌ఎస్‌ నేతలు. కాని, కెసిఆర్‌ విన్నపాన్ని  తాను తోసివేయడంవల్లే  తెలంగాణకు వొచ్చినప్పుడల్లా కెసిఆర్‌ తనకు ముఖం చాటేస్తున్నాడంటూ మోదీ చేసిన గంభీరమైన ఆరోపణపై ఇప్పుడు కెసిఆర్‌ సమాధానం చెప్పుకోవాల్సి ఉంది.

అక్కడితో ఆగకుండా కెసిఆర్‌ అవినీతిపైన కూడా ఆయన వేలెత్తి చూపారు. ప్రజలు తమకు ఒక్కసారి అవకాశం ఇస్తే చాలు. తెలంగాణ అభివృద్ధితోపాటు, గత పదేళ్ళుగా బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అవినీతిని పైసాతో  సహా లాగుతామన్నారు. అయితే ఈ విషయాన్ని గత సంవత్సరం నుండి తెలంగాణలో పర్యటించినప్పుడల్లా ఆయన చెబుతూనే ఉన్నారు. లూటీపై లాఠీ ఎత్తుతానని, కుటుంబ పాలనను అంతమొందిస్తామంటూ పలు సందర్భాల్లో చెప్పుకొస్తున్నారు.పది సంవత్సరాల నుండి రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని తన కళ్ళ తో చూసిన అంటూ దేశ ప్రధాన మంత్రి అనడం ఆయన అసమర్థతను తెలియజేస్తున్నది.. ఎన్నికలు అతి సమీపిస్తున్న వేళ ఆయన చేసిన ఈ ఆరోపణలు మాత్రం ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా ఎన్డీయేతో చేతులు కలుపుతానన్నాడన్న మచ్చను కెసిఆర్‌ ఏవిధంగా చెరుపుకుంటాడన్నదే ఇప్పుడు ప్రజల్లో ఆసక్తిని కలిగిస్తున్న అంశం..

Leave a Reply