కెసిఆర్ దీక్షను గుర్తు చేసుకుంటూ కెటిఆర్, కవితల ట్వీట్
చరిత్రను మలుపు తిప్పిన నవంబర్ 29తేదీ చరిత్రలో చిరస్మరణీయ మైన రోజుగా నిలిచిపోతుందని మంత్రి కెటిఆర్ అన్నారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణ మలి దశ ఉద్యమాన్ని కీలక మలుపు తిప్పిన కేసీఆర్ దీక్ష 13 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఉద్యమ నాయకుడిగా ఆయన ‘తెలంగాణ తెచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ నినాదంతో 2009 నవంబర్ 29న ఆమరణ దీక్షకు దిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నాటి రోజుల్ని మంత్రి కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. ‘వి• పోరాటం అనితర సాధ్యం. ఒక నవశకానికి నాంది పలికిన రోజు. ఒక బక్క పలుచని వీరుడు బందూకై తన జాతిని మేలు కొలిపిన రోజు. తెలంగాణ వైపు దేశం దృష్టి మరల్చే విధంగా తెగించిన రోజు. చరిత్రను మలుపు తిప్పిన రోజు నవంబర్ 29, 2009. తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయమైన రోజు ఇది.’ అని ట్వీట్ చేశారు. 2009 నవంబర్ 29న కేసీఆర్ ‘తెలంగాణ తెచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ నినాదంతో ఆమరణ దీక్షకు దిగారు. ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను ప్రజ్వలింపజేసి, తెలంగాణ రాష్ట్ర సాధనకు అంకురార్పణ చేసిన రోజును టీఆర్ఎస్ దీక్షా దివస్‌గా పాటిస్తున్నది.
కరీంనగర్‌లోని ఉత్తర తెలంగాణభవన్ నుంచి దీక్షాస్థలి సిద్దిపేటకు కేసీఆర్ బయలుదేరగా, కరీంనగర్ మానేరు బ్రిడ్జి అలుగునూరు వద్ద పోలీసులు అరెస్టు చేశారు. అక్కడి నుంచి ఖమ్మం జైలుకు తరలించారు. ఆ తరువాత నిమ్స్ దవాఖానకు తరలించారు. అక్కడే కేసీఆర్ దీక్షను 11 రోజుల పాటు కొనసాగించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని డిసెంబర్ 9న యూపీఏ ప్రభుత్వం ప్రకటించిన తరువాతనే ఆయన దీక్షను విరమించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ… ‘కోట్లాది ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు, ‘తెలంగాణ వచ్చుడో..కేసీఆర్ సచ్చుడో‘ అంటూ ప్రాణాలను పణంగా పెట్టి, సమైక్య పాలకుల నిర్బంధాలను చేధించి, సిద్దిపేట కేంద్రంగా ఉద్యమ వీరుడు కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించిన చారిత్రక రోజు… నవంబర్ 29 దీక్ష దివాస్’ అంటూ కవిత ట్వీట్ చేశారు.