Take a fresh look at your lifestyle.

గులాబి పార్టీలో సిట్టింగ్‌ల చిచ్చు..

రోడ్డు ఎక్కిన వివాదాలు..
టికెట్ల కోసం పూజలు, వ్రతాలు

Manduva-Ravinder-Rao
– మండువ రవీందర్‌రావు

ప్రజాతంత్ర, వరంగల్‌: రానున్న ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించే విషయంలో అధికార పార్టీ ఒకపక్క కసరత్తు చేస్తుంటే, మరో పక్క అభ్యర్థులపైన స్థానిక కార్యకర్తలు, ప్రజలు ముందస్తుగానే తమ వ్యతిరేకతను వ్యక్తంచేస్తున్నారు. సిట్టింగ్‌లకే టికట్‌ ఇవ్వాలని ఒక వర్గం ఆందోళన బాటపడుతుంటే, అనేక ఆరోపణలను ఎదుర్కుంటున్న సిట్టింగ్‌లను మార్చాల్సిందేనని మరికొందరు రోడ్డెక్కటంతో పలు నియోజకవర్గాల్లో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. రానున్న ఎన్నికల్లో హ్యాట్రిక్‌ ‌సాధించాలని బిఆర్‌ఎస్‌ ఒక పక్క విశ్వప్రయత్నం చేస్తోంది. దానికిగాను చాలా ముందునుండే రంగం సిద్దం చేసుకుంటున్నది. గతంలో చేసిన వాగ్ధానాలతోపాటు, కొత్తగా అనేక ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడంద్వారా ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. దీనితోపాటు పార్టీని దేశ వ్యాప్తంగా విస్తరించే కార్యక్రమాన్ని చేపట్టింది. ముందస్తుగా మహారాష్ట్రపై తన సమ్మోహనాస్త్రాన్ని సంధించి  ఆ రాష్ట్రానికి చెందిన వివిధ రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలు, వివిధ సంఘాలు గులాబీ కండువ కప్పుకుంటున్న నేపధ్యంలో స్థానిక బిఆర్‌ఎస్‌ ‌నేతల్లోనే విభేదాలు  తారస్థాయికి చేరుకుంటున్నాయి.

నిన్నమొన్నటి వరకు సైలెంట్‌గా ఉన్న నియోజకవర్గాల్లో ఒక్కసారే గ్రూపు రాజకీయాలు గుప్పు మంటున్నాయి. వచ్చే ఎన్నికల్లో పోటీచేసేవారి జాబితాను ఈ నెల 21న పార్టీ అధినేత ప్రకటించబోతున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో ఈ ఆలజడి మరింత తారస్థాయికి చేరుకుంది. దాదాపు ఆరునెలలకిందే సిట్టింగ్‌లందరికీ తిరిగి టికెట్ల్లు కేటాయించ బోతున్నట్లు బిఆర్‌ఎస్‌ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌ప్రకటించిన నాటినుండి ముసలం బయలుదేరింది. చాలా కాలంగా పార్టీని అంటిపెట్టుకున్నప్పటికీ ఏ పదవులురాని వారికి ఈసారైనా అవకాశం లభిస్తుందన్న ఆశ ఉండింది. కెసిఆర్‌ ‌ప్రకటన వారిని వివశులను చేసింది. దీంతో కొందరు పక్కదారులు వెతుక్కునే పనిలో పడగా, మరికొందరు నిరసన గళాన్ని బాహాటంగానే వినిపిస్తున్నారు. ఇదిలాఉంటే సిట్టింగ్‌లకే టికెట్‌ట్ అని ప్రకటించిన కెసిఆర్‌, ‌వారిలో కొందరు అవినీతికి పాల్పడుతున్నారని, కమీషన్లకు కక్కుర్తి పడుతున్నా రంటూ బహిరంగంగానే ప్రకటించిన విషయం తెలియందికాదు. అలాంటివారి సంఖ్యతోపాటు కమీషన్‌ ‌పర్సంటేజ్‌ని కూడా కెసిఆర్‌ ‌వెల్లడించిన అంశాన్ని తీసుకుని విపక్షాలు అధికారపార్టీపైన విరుచుకుపడ్డాయి.

ఈ పరిణామాల నేపధ్యమో లేక గెలుపు గుర్రాలకే టికెట్‌ ఇవ్వాలన్న ఉద్దేశ్య మో గాని  బిఆర్‌ఎస్‌ అధినేత అభ్యర్థుల తీరుతెన్నులపైన పలు సర్వేలు జరిపినట్లు తెలుస్తున్నది. ఫలితంగా దాదాపు ఇరవై మంది సిట్టింగ్‌ ఎంఎల్‌లను మారుస్తారన్న వార్తలు గుప్పుమనడంతో సిట్టింగ్‌ ‌గుండెల్లో రైళ్ళు పరిగెత్తడం ప్రారంభమైంది. ఎక్కడ తమకు టికెట్‌  ‌దక్కకుండా పోతుందోనని గత కొద్దికాలంగా సిట్టింగ్‌లు తమ నియోజకవర్గాలకు పరిమితమయ్యారు. ఊరూరా తిరిగి ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసుకుంటున్నారు. అయితే ఈనెల 21న తొలిజాబితా విడుదల అవుతుందంటూ, వివిధ నియోజకవర్గాల్లో టికెట్‌  ‌లభించే అభ్యర్ధుల జాబితాలు ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌  ‌మీడియాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతున్నది. వీటిల్లో చాలా చోట్ల సిట్టింగ్‌ల పేర్లు గల్లంతు కావడంతో ఆయా నియోజకవర్గాల్లో ఒక విధంగా యుద్ధ వాతావరణం చోటుచేసుకుంటున్నది. ఆయా నియోజకవర్గాలకు చెందిన స్వీయ పార్టీ నాయకులే  ఒకరిపై ఒకరు విమర్శించుకోవడం, అవినీతి ఆరోపణలు చేసుకోవడం ప్రారంభించారు.

వీటిల్లో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది పూర్వపు వరంగల్‌ ‌జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. ముఖ్యంగా జనగామ జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో పార్టీ నాయకులమధ్య తీవ్ర విభేదాలు  చోటుచేసుకున్నాయి. జనగామ నియోజకవర్గం ఇప్పటికే హ్యాట్రిక్‌ ‌సాధించిన  ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సిట్టింగ్‌ ‌సీటుకు ప్రమాదం ఏర్పడడంతో ఆయన వర్గీయులు పెద్ద ఎత్తున ఆందోళన బాట పట్టారు.  తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటినుండి జనగామ శాసనసభ్యుడిగా ఉన్న ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిపైన  అవినీతి ఆరోపణలున్నాయి. ఆయన ఐఏఎస్‌ అధికారిని బెదిరించడంలాంటి సంఘటనలు పలు వెలుగులోకి వచ్చాయి. చివరకు భూ అక్రమణ కేసులో స్వంత కూతురే ఆయనకు వ్యతిరేకంగా నిలబడడంతో ఈసారి ఆయనకు టికెట్‌  ‌కష్టమనే అనుకుంటున్నట్లుగా కెసిఆర్‌కు అత్యంత సన్నిహితంగా ఉంటున్న ఎంఎల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డికి టికెట్‌  ‌ఖాయమన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో  ఇరు వర్గాల మధ్య తీవ్ర ఆరోపణలు ప్రత్యారోపణలతో నియోజకవర్గంలో యుద్ధవాతావరణం ఏర్పడింది. పల్లాకు టికెట్‌ ఇస్తే ఓడిస్తామని ముత్తిరెడ్డి వర్గీలయులు గోల పెడుతూ వేలాది మంది యువకులు ప్రదర్శలను చేపట్టారు. కాగా పల్లాకే మా మద్దతు అంటున్నారు మరికొందరు.

ఇదిలాఉంటే స్టేషన్‌ఘనపూర్‌ ‌నియోజకవర్గంలోకూడా ఇదేతంతు తయారైంది. సిట్టింగ్‌ ఎంఎల్యే డాక్టర్‌ ‌తాటికొండ రాజయ్యను కాదని ఎంఎల్సీ కడియం శ్రీహరికి టికెట్‌   ఇస్తున్నట్లుగా వస్తున్న వార్తలపైన ఇక్కడ పెద్ద దుమారమేలేచింది. నియోజవర్గంలోని పలు గ్రామాలు ఇరువర్గాలమధ్య రణరంగమైంది. మరో రెండురోజుల్లో ప్రకటిస్తారనుకుంటున్న   జాబితాలో తొలి జాబితాలో కడియం శ్రీహరి పేరు చోటుచేసుకునే అవకాశం ఉందంటూ మీడియాలో వస్తున్న వార్తల నేపథ్యంలో  ఈ గందరగోళం ఏర్పడింది. ఎస్సీ నియోజకవర్గమైన స్టేషన్‌ఘనపూర్‌ ‌టికెట్‌ ‌కోసం పోటీ పడుతున్న వీరిద్దరు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రులుగా చేసినవారే.  పార్టీ అధినేత తన రాజకీయపు ఎత్తుగడల్లో భాగంగా తమ ఉప ముఖ్యమంత్రి పదవులకు రాజీనామా చేయమనగానే బుద్దిగా చేసినవారే. ఇప్పుడు ఒకరు స్థానిక ఎంఎల్‌ఏ ‌కాగా, మరొకరు ఎంఎల్సీగా ఉన్నారు. వీరిద్దరు  మొదటినుండి ఉప్పులో నిప్పుగా ఉన్నవారే. అయితే డాక్టర్‌ ‌రాజయ్యపైన కొద్ది కాలంగా వివిధ రకాలైన ఆరోపణలు వస్తున్నాయి. వాటిని ఆయన కాదని కొట్టిపారేస్తున్నా, అధిష్టానం నిర్వహించిన సర్వేల ప్రకారం ఈసారి ఆయనకు టికెట్‌  అవకాశంలేదన్న వార్తలు చాలాకాలంగా వస్తున్నాయి.  దానికి తగినట్లుగా కడియం శ్రీహరి తన అనుమాయులతో నియోజకవర్గంలో ప్రచార కార్యక్రమాలను ముమ్మరంచేయడంతో వీరి విభేదాలు  తారస్థాయికి చేరుకున్నాయి. ఇప్పటికే మంత్రి కెటిఆర్‌ ‌వీరిద్దరిని పిలిచి పార్టీకి అప్రతిష్టతెచ్చే విధంగా  ప్రవర్తించవద్దని హెచ్చరించినట్లు తెలుస్తున్నది. తాజాగా విడుదల కానున్న జాబితాలో ఎవరి పేరు రానుందో తెలియదుగాని వీరిద్దరి మధ్య  మాటలయుద్ధం మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది.

మూడు దశాబ్దాలుగా తాను రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఒక్కటి అంటే ఒక్క అవినీతి ఆరోపణ తనమీద లేదని, తాను పదవిలో ఉన్నంత కాలం ప్రజలకోసం కష్టించి పనిచేశానని, ఇప్పుడుకూడా ప్రజలు ఆశీర్వదిస్తే స్టేషన్‌ఘనపూర్‌ ‌రూపు మారుస్తానని కడియం శ్రీహరి ప్రజలకు వాగ్ధానం చేస్తున్నారు. ఇవ్వాళ స్టేషన్‌ఘనపూర్‌ ఎంఎల్‌ఏ ఎవరంటే చెప్పుకోవడానికి ప్రజలు సిగ్గుపడుతున్నారంటూ ఆయన హాట్‌ ‌కామెంట్‌ ‌చేయడంతో ఇక్కడ రాజకీయాలు వేడెక్కాయి. తాను వస్తే అవినీతికి చోటుండదన్న భయం అవినీతిపరుల్లో ఉండడంవల్లే వ్యతిరేకిస్తున్నారన్నది ఆయన మాట. అందుకు డాక్టర్‌ ‌రాజయ్యకూడా ధీటుగా•నే సమాధానం చెబుతున్నారు. తెలంగాణ ఏర్పడకముందు తెలంగాణకోసం కాంగ్రెస్‌ ఎంఎల్‌ఏ ‌పదవిని త్యాగంచేసిన మొదటివ్యక్తిగా తాను నిలిచిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. తన నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తున్న తాను, మరింతగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంగానే ముందుకు పోతున్నానంటున్న రాజయ్య తాజాగా వరంగల్‌ ‌భద్రకాళీ దేవాలయంలో రాజశ్యామలయాగం నిర్వహించారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ తనపైన ఉన్న నరదృష్టి (పరోక్షంగా కడియం శ్రీహరిని ఉద్దేశించి) పోయ్యేందుకే ఈ యాగన్ని చేస్తున్నానని చెప్పాడు. వీరిద్దరి మధ్య కార్యకర్తలు, స్థానిక ప్రజలు నలిగిపోతున్నారు.

ఇదిలా ఉంటే పూర్వపు వరంగల్‌ ‌జిల్లాకు చెందిన  మరికొన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే వరుస. పాలకుర్తికి ప్రాతినిథ్యం  వహిస్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకుకూడా అసమ్మతి పొగరాచుకుంటోంది. ఆలాగే వర్ధన్నపేట,  డోర్నకల్‌, ‌మహబూబాబాద్‌,  ‌వరంగల్‌ ‌తూర్పు, భూపాలపల్లి,  పరకాల నియోజకవర్గాల్లో టికెట్ల  కోసం తీవ్ర పోటీ ఏర్పడింది.  తొలిజాబితాలో తమ పేరు ఉంటుందాలేదా అన్న  దిగులు సిట్టింగ్‌లకు పట్టుకుంది. దీంతో  టికెట్ల   కోసం పూజలు, వ్రతాలు చేస్తున్నారు. తమ  గాడ్‌ ‌ఫాదర్‌ల చుట్టూ తిరుగుతున్నారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి సమస్యతో బిఆర్‌ఎస్‌ ‌తలమునకలవుతున్నది.  పూర్వ మహబూబ్‌నగర్‌ ‌జిల్లాలోని కల్వకుర్తి, నల్లగొండ జిల్లాల్లోని నాగార్జునసాగర్‌, ‌కోదాడ, మునుగోడు, జగిత్యాల, కోరుట్ల,  ఉమ్మడి ఆదిలాబాద్‌ ‌జిల్లాలోని ఆసిఫాబాద్‌, ‌బెల్లంపల్లి, ఖానాపూర్‌, ఆలాగే ఖమ్మం జిల్లాలోని వైరా, కొత్తగూడెం, ఇల్లందు,  పూర్వ మెదక్‌ ‌జిల్లాలోని నర్సాపూర్‌, ‌జహీరాబాద్‌ ‌నియోజవర్గాలతోపాటు రాజధాని చుట్టుపక్కల ఉన్న ఉప్పల్‌, ‌ముషీరాబాద్‌, అం‌బర్‌పేటలో జరుగనున్న మార్పులపై స్థానికంగా విబేధాలు పొడసూపుతున్నాయి.

Leave a Reply