Take a fresh look at your lifestyle.

అసెంబ్లీ ఎన్నికల బరిలో 2898 మంది అభ్యర్థులు

  • రాష్ట్ర వ్యాప్తంగా 606 నామినేషన్ల తిరస్కరణ
  • ఉప సంహరణకు నేడు ఆఖరు రోజు……. స్పష్టం కానున్న తుది జాబితా

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 14 : ‌మంగళవారం నామినేషన్ల పరిశీలన తర్వాత అసెంబ్లీ ఎన్నికల పోరులో 2898 మంది అభ్యర్థులు మిగిలారు. సోమవారం జరిగిన పరిశీలనలో రాష్ట్రవ్యాప్తంగా 606 నామినేషన్లను తిరస్కరించారు. ఇదిలా ఉండగా..అత్యధికంగా గజ్వేల్‌లో 114 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. నేడు బుధవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు పూర్తైన తరువాత చివరగా బరిలో ఉన్న అభ్యర్థుల సంఖ్యపై స్పష్టత రానుంది. సిఎం కేసీఆర్‌ ‌పోటీచేస్తున్న గజ్వేల్‌లో అత్యధికంగా 114 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉండగా..మేడ్చల్‌లో 67, కామారెడ్డిలో 58 మంది, ఎల్బీ నగర్‌లో 50 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. రేవంత్‌ ‌రెడ్డి పోటీచేస్తున్న కొడంగల్‌లో 15 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా..నారాయణపేటలో అత్యల్పంగా కేవలం 7 మందే బరిలో ఉన్నారు.

బాల్కొండ నుంచి తొమ్మిది మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. కాగా..నామినేషన్ల ఉపసంహరణకు నేడు మధ్యాహ్నం వరకు గడువు ఉంది. రేపు కొందరు ఇండిపెండెంట్‌ అభ్యర్థులు, రెబల్స్ ‌కూడా నామినేషన్లు ఉపసంహరించుకుంటే.. పోటీలో ఉన్న వారి సంఖ్య ఇంకా తగ్గుతుంది.  రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు 4,798 మంది నామినేషన్లు వేయగా.. తాజాగా వాటిలో 606 మంది అభ్యర్థుల నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌ ‌భార్య జమున, కోరుట్లలో ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు, నాగార్జునసాగర్‌లో మాజీ మంత్రి జానారెడ్డి, మిర్యాలగూడలో మాజీ ఎమ్మెల్యే రేపాల శ్రీనివాస్‌ ‌వేసిన నామినేషన్లను ఎన్నికల సంఘం  తిరస్కరించింది. ఆ వివరాలను ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. శాసనసభ ఎన్నికల్లో నిబంధనల ప్రకారం.. ఒక్కో అభ్యర్థి రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు మించి పోటీ చేయకూడదు. అలాగే నాలుగు సెట్లకు మించి నామినేషన్లు దాఖలు చేయరాదు.

కానీ ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు మాత్రం రెండు కన్నా ఎక్కువ స్థానాల్లో నామినేషన్లు దాఖలు చేశారు. ఖమ్మం బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ‌సమర్పించిన అఫిడవిట్‌ ‌నిబంధనల మేరకు లేదంటూ.. వారం రోజుల క్రితం కాంగ్రెస్‌ ‌లేవనెత్తిన అభ్యంతరాలను ఈసీ అధికారులు తిరస్కరించారు. దేవరకద్రలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా నామినేషన్‌ ‌వేసిన మధుసూదన్‌రెడ్డికి రెండు నియోజకవర్గాల్లో వోటు హక్కు ఉందంటూ బీఆర్‌ఎస్‌ అభ్యంతరం తెలిపింది. అయితే రెండో వోటు రద్దు చేయాలంటూ ఆయన ఈసీకి దరఖాస్తు చేయడంతో..నామినేషన్‌ను అధికారులు ఆమోద ముద్ర వేశారు. పాలకుర్తి కాంగ్రెస్‌ అభ్యర్థి యశస్వినికి మూడు వేర్వేరు చిరునామాలు ఉన్నాయంటూ బీఆర్‌ఎస్‌ ‌ప్రతినిధులు అభ్యంతరం తెలుపగా.. ఎన్నికల నిబంధనల మేరకు అలా చిరునామాలు ఉండవచ్చని ఈసీ అభ్యంతరాలను రిజెక్టు చేసింది. అలాగే అలంపూర్‌ ‌బీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయుడు ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్‌ ఉద్యోగానికి రాజీనామా చేయకుండానే నామినేషన్‌ ‌వేశారన్న అభ్యంతరాలనూ అధికారులు పరిగణనలోకి తీసుకోలేదు. రాష్ట్రవ్యాప్తంగా బీఎస్పీకి చెందిన 8 మంది అభ్యర్థుల నామినేషన్లను కొన్ని కారణాలతో ఈసీ తిరస్కరించింది.

Leave a Reply