Take a fresh look at your lifestyle.

లాక్‌డౌన్‌ ‌పొడిగింపుకే మొగ్గు

కొరోనాను సంపూర్ణంగా పారదోలాలంటే మరికొంతకాలం లాక్‌డౌన్‌ను కొనసాగించాల్సిందే నంటున్నాయి పలు రాష్ట్ర ప్రభుత్వాలు. దేశ వ్యాప్తంగా మే 3వ తేదీవరకు అమలులో ఉన్న లాక్‌డౌన్‌ను ఎత్తివేసే విషయంలో ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్ర ప్రభుత్వాలతో తాజాగా సోమవారం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో వివిధ ముఖ్యమంత్రులు పొడిగింపువైపే మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. అయితే ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చుకునేందుకు నిత్యావసరాలతోపాటు మరిన్ని విభాగాలను అనుమతించాలని ప్రధానికి వారు సూచించినట్లు తెలుస్తున్నది. ఇదిలా ఉంటే కేంద్ర మంత్రుల అభిప్రాయాలను తీసుకోవడంతోపాటు, పలు నగరాల్లో క్షేత్రస్థాయిలో పరిస్థితులను మదింపుచేసిన కేంద్ర బృందాల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుని కేంద్రం త్వరలో ఒక అభిప్రాయానికి రానున్నట్లు తెలుస్తున్నది. అయితే దీనికి ముందే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరికొంతకాలం పొడిగింపుకు సిద్ధపడినట్లు సూచనప్రాయంగా అభిప్రాయడ్డట్లు కూడా తెలుస్తున్నది. ఇప్పటికే రెండు విడుతలుగా అమలవుతున్న లాక్‌డౌన్‌ ‌కారణంగా తెలంగాణలో కొరోనా వ్యాప్తిని చాలావరకు నిరోధించగలిగారు. అయినా దీన్ని సమూలంగా నిరోధించేందుకు మరికొంతకాలం ప్రజలు లాక్‌డౌన్‌లో ఉండడమే శ్రేయస్కరమన్న అభిప్రాయంలో రాష్ట్ర ప్రభుత్వముంది. ఆదివారం ప్రగతి భవన్‌లో కొరోనాపై అధికారులతో సమీక్ష జరిపిన సందర్భంగా సిఎం కెసిఆర్‌ ఇప్పటికే ఈ విషయంపై తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. వాస్తవంగా కొరోనా విషయంలో తెలంగాణ ప్రభుత్వం ముందుగానే అప్రమత్తమైంది. లాక్‌డౌన్‌ ‌చర్యలను పకడ్బందీగా అమలు చేయడంవల్లే ఈ వ్యాధి విస్తరించకుండా చాలావరకు అదుపుచేయగలిగింది. అయినా ఊహించని రీతిలో ఢిల్లీలోని నిజాముద్దీన్‌, ‌నిజామాబాద్‌, ఆ ‌తర్వాత సూర్యాపేట సంఘటనలు రాష్ట్రాన్ని కుదిపివేశాయి. ఇవ్వాళ రాష్ట్రంలో ఎక్కడైనా కేసులు వెలుగులోకి వస్తున్నాయంటే అవి పైనచెప్పిన వాటికి సంబంధించినవే కావడం గమనార్హం. అలాంటి పరిణామాలు కూడా ఇకముందు రాకుండా చూడాలంటే మరికొంతకాలం ప్రజలు లాక్‌డౌన్‌లో ఉండడమే శ్రేయస్కరమన్న అభిప్రాయంలో ప్రభుత్వముంది. ఏదిమైనా రాష్ట్రంలో తాజాగా కొరోనా వైరస్‌ ‌సోకినవారి సంఖ్య వెయ్యి దాటింది. ప్రస్తుతం 1001వ కేసు నమోదయింది.

ఇక్కడ గమనించాల్సిన విషయమేమంటే కొత్తగా నమోదవుతున్న కేసుల్లో ఎక్కువ శాతం గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌పరిధిలోనే కావడం గమనార్హం. హైదరాబాద్‌లో ఇప్పటివరకు 540 కేసులు నమోదుకాగా, తాజాగా పెరిగిన కేసులతో సూర్యాపేట 83 కేసులతో రెండవ స్థానంలో ఉంది. ఆ తర్వాత 61 కేసులతో నిజామాబాద్‌ ‌మూడవ స్థానంలో నిలిచింది. ఒక్క కేసు కూడా నమోదు కాని జిల్లాల్లో వరంగల్‌ ‌రూరల్‌, ‌యాదాద్రి, వనపర్తి జిల్లాలుండగా, మిగతా అన్ని జిల్లాల్లో ఒకటి రెండు మొదలు 45 కేసులవరకు నమోదై ఉన్నాయి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మరణాల సంఖ్య కూడా తెలంగాణలో అంతగాలేదు. ఈ వ్యాధి కారణంగా నేటికి మరణించినవారి సంఖ్య 25గా నమోదైంది. ఇందుకు ప్రజల స్వీయ నియంత్రణే కారణం. ప్రభుత్వం, డాక్టర్లు, శాస్త్రవేత్తలు, సామాజికవేత్తలు నిత్యం మీడియా ద్వారా చెబుతున్న అనేక జాగ్రత్తలను పాటించడంలో ప్రజలు ఏమాత్రం అశ్రద్ధ చేయకపోవడంవల్లే ఈ వ్యాధి విస్తరణకు అవకాశంలే కుండాపోయింది. అదే విషయాన్ని ఆదివారం రాష్ట్రంలో కొరోనా కారణంగా నెలకొన్న పరిస్థితులపై సమీక్ష జరిపిన కెసిఆర్‌ ‌మరోసారి ఊటంకిస్తూ ప్రజలను ప్రమాదస్థాయి నుండి కాపాడుకోవడానికి మరికొంతకాలం లాక్‌డౌన్‌ ‌పొడిగిస్తేనే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సోమవారంనాటి ముఖ్యమంత్రుల సమావేశంలో దాదాపు పది రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు కూడా అదే అభిప్రాయాన్ని వెలిబుచ్చినట్లు తెలుస్తున్నది. దీనిపై ఇంకా ప్రధాని ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది పక్కకు పెడితే, రాష్ట్ర ముఖ్యమంత్రుల అభిప్రాయంవైపే మొగ్గుచూపే అవకాశాలున్నట్లు భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇంత పకడ్బందీగా లాక్‌డౌన్‌ అమలు పరుస్తున్న నేపథ్యంలోనే ప్రతీరోజు పదుల సంఖ్యలో కొత్తకేసులు వెలుగు చూస్తున్నాయి. దేశం మొత్తంమీద లెక్కవేసుకుంటే ఇప్పటికే మృతుల సంఖ్య వెయ్యికి చేరువులో ఉంది. ఇంకా మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీతోపాటు ఏపిలో కూడా రోజురోజుకు కొత్తకేసులు వెలుగుచూస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ ఎత్తివేత నిర్ణయం తీసుకుంటే మరింత ఇబ్బందికర పరిణామాలు ఏర్పడుతాయన్న అభిప్రాయలున్నాయి. అలా అని ఇంకా ఎంతకాలం ప్రజలను కట్టడిలో ఉంచుతామన్న ఆలోచన కూడా కేంద్రానికుంది. అందుకే ఈ నెల 20వ తేదీన లాక్‌డౌన్‌ను కొంత సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. అదే విధంగా మే 3వ తేదీన లాక్‌డౌన్‌ ‌సంపూర్ణంగా ఎత్తివేయకుండా, దేశ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని దశలవారిగా ఎత్తివేసే దిశలో కేంద్రం ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తున్నది. ఈ విషయంలో వివిధ దేశాలు ఆంక్షలను, ఎత్తివేత విషయంలో అనుసరించిన విధానాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తున్నది. అయితే ఎక్కువమంది గుమికూడే సినిమాలు, హోటళ్ళు, సాంస్కృతిక కార్యక్రమాలు, వివాహామహోత్సవాలపైన మాత్రం తప్కకుండా నిషధాన్ని కొంతకాలం కొనసాగించే అవకాశాలున్నాయి.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply