Take a fresh look at your lifestyle.

హస్తినకు పాండవులు

బాలల భారతం
డా।। పులివర్తి కృష్ణమూర్తి

ద్రోణాచార్యుడూ, కృపాచార్యుడూ పాండవాదులకు స్వాగతం పలికి తోడ్కొని వెళ్ళారు. ద్రౌపదిని దుర్యోధనుడి భార్య కురువంశస్త్రీలు అందరూ వచ్చి ఆహ్వానించారు. హస్తినాపుర ప్రజలు లక్షల సంఖ్యలో వచ్చి పాండవులను చూసి ఆనందభరితులయ్యారు. రోజులు గడిచిపోతున్నాయి. ఒక  రోజున ధృతరాష్ట్రుడు పాండవులను సభాభవనానికి రప్పించి, తన కొడుకులకూ వారికి విద్వేషాలు పెరగకుండా ఉండేందుకు గాను, వారంత వెళ్ళి ఖాండవప్రస్థనంలో, అర్ధరాజ్యాన్ని అనుభవిస్తూ వుండమన్నాడు. వ్యాసుడూ, కృష్ణుడూ కూడా వచ్చి ధర్మరాజుకు రాజ్యాభిషేకం గావించారు. ఖాండవ ప్రస్థాన్ని గతంలో పురూరవుడూ, నహుషుడూ, యాయాతి వంటివారు రాజధానిగా చేసుకుని రాజ్యపాలన గావించారు. ధర్మరాజును అభిమానించే వారందరూ ఆయన వెంట నూతన రాజధానికి తరలివెళ్ళారు.

ఖాండవ ప్రస్థం ఒక మహారణ్యంలా ఉంది. కృష్ణుడు, అమరావతీ నగరంలో తులతూగే నగరంగా నిర్మించమని విశ్వకర్మకు చెప్పాడు. వ్యాస మహర్షి చేయవల్సిన శాంతి చేశాడు. నగరం సర్వాంగ సుందరంగా నిర్మించబడింది. మంగళవాద్యఘోష వినిపిస్తూ వుంటే ధర్మరాజు నగర ప్రవేశంగావించి, నగరానికి ఇంద్రప్రస్థనం అనేపేరు  పెట్టారు. కృష్ణుడు కొన్ని రోజులు వారి వద్దనే ఉండి ద్వారకా నగరానికి బయలుదేరుతూ ఉంటే కుంతీదేవి ఆయనను సమీపించి ‘నీ అనుగ్రహంతో నా బిడ్డలకు రాజ్యం దక్కింది. ఎల్లప్పుడూ వారిని కనిపెట్టుకుని వుండు’ అంటూ కోరింది.  కృష్ణుడు తలూపాడు. జనరంజకంగా ధర్మరాజు రాజ్యపాలన గావిస్తున్నాడు.

ప్రజలు ఎంతో ఆనందంగా జీవిస్తున్నారు. ధర్మరాజు పాలనలో ఒకనాడు నారదులవారు ఇంద్రప్రస్థానికి వచ్చారు. రావడమేగాక వారికొక సలహాకూడా ఇచ్చారు. సుందోపసుందులనేవారు ఒకే నారీ మణిని మోహించిన కారణంగా ఏ విధంగా ఒకరినొకరు చంపుకుకున్నారో చెప్పాడు. పాండవులు కూడా నియమబద్దంగా సాగడం మంచిదన్నాడు. ధర్మరాజు వారి అన్నదమ్ములు పెట్టుకున్న నియమాన్ని ఇలా తెలియజేశాడు.

(మిగతా..వొచ్చేవారం)

Leave a Reply