Take a fresh look at your lifestyle.

తంతుగా మారిన పార్లమెంట్‌ ‌సమావేశాలు

  • ప్రజా సమస్యలపై కానరాని ఆరోగ్యకర చర్చలు
  • వాద, ప్రతివాదనలకు…వ్యక్తిగత దూషణలకే పరిమితమవుతున్న ప్రతినిధులు
  • విలువలకు, సత్సంప్రదాయాలకు తిలోదకాలు
  • ప్రజా ప్రయోజనాల కన్నా రాజకీయ ప్రయోజనాలకే ఆయా పార్టీల ప్రాధాన్యం

వి. రామ్‌మోహన్‌ ‌రావు, ప్రజాతంత్ర ప్రతినిధి: హైదరాబాద్‌, ‌జూలై 22 : గత మూడు, నాలుగు టర్మ్‌లకు సంబంధించి ముఖ్యంగా 2009 తర్వాత జరుగుతున్న పార్లమెంట్‌ ‌సమావేశాల తీరును పరిశీలిస్తే ప్రజా సమస్యలపై చర్చలకు, మారుతున్న పరిస్థితులను అనుసరించి చట్టాల రూపకల్పనకు, చట్ట సవరణలు తదితర అంశాలకు కాకుండా చాలా వరకు కేవలం అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ, వ్యక్తిగత  విమర్శలకు వేదికగా మారాయి. వర్షాకాల సమావేశాలు, శీతాకాల సమావేశాలు, బడ్జెట్‌ ‌సమావేశాలు అంటూ లాంఛనంగా నిర్వహించే తంతుగా ఇవి మారడం ఆందోళనను కలిగిస్తున్నది. పార్లమెంట్‌ ‌సత్సంప్రదాయాలకు, విలువలకు క్రమంగా తిలోదకాలిచ్చేశారు. హుందాతనం, పరస్పరం గౌరవించుకోవడమన్నది నేడు మచ్చుకైనా కనిపించని పరిస్థితి. విభిన్న మతాలు, భాషలు, సంస్కృతులు, ఆచారాలు, వ్యవహారాలతో భారత దేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా, పటిష్టమైన ప్రజాస్వామ్య దేశంగా ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. అటువంటి ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలలో మొదటిదిగా పేర్కొనబడిన శాసనాలను నిర్మించే చట్ట సభలలో ఇటువంటి పెడ ధోరణులు నెలకొనడం దేశానికి ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు.


గతంలో సమావేశాలు ఎంతో హుందాగా సుహృద్భావ, ఆహ్లాదకర వాతావరణంలో ప్రజా సమస్యల పరిష్కారానికి, అనేక చట్టాలు, చట్ట సవరణలకు వేదికగా నిలచి ప్రజలకు శ్రేయస్కరంగా, దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసే విధంగా కొనసాగేవి. స్వాతంత్య్రం అనంతరం మొదటిసారి ప్రధాన మంత్రి పదవిని చేపట్టిన జవహర్‌లాల్‌ ‌నెహ్రూ మొదలు 2004 వరకు ప్రధాని పదవిలో కొనసాగిన అటల్‌ ‌బిహారీ వాజ్‌పేయి వరకు ఎంతో మంది ఉద్ధండులు పార్లమెంటులో వ్యవహరించిన తీరు ముదావహం. ఆయా సందర్భాన్ని, ఔచిత్యాన్ని అనుసరించి పరస్పరం చలోక్తులు, చతురోక్తులతో ఎంత మాత్రం భేషజం లేకుండా, హుందాగా పొగడ్తలను, విమర్శలను స్వీకరించేవారు..గుప్పించేవారు. బాంగ్లాదేశ్‌ ‌యుద్ధం అనంతరం మాజీ ప్రధాని ఇందిరా గాంధీని కాళీ మాతగా పొగిడినా…ఎమర్జెన్సీ సందర్భంగా తీవ్రంగా విమర్శించినా సహేతుకంగా అనిపించడమే కాకుండా వారి హుందాతనానికి ఆదర్శంగా నిలిచి నేటికీ మనము గుర్తుచేసుకునే విధంగా వారి గౌరవాన్ని పెంచాయి. ఇక ఈ మధ్యన జరుగుతున్న పార్లమెంట్‌ ‌సమావేశాలను గమనిస్తే మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు ఒక్క రోజు కూడా పూర్తి కాలం నడిచిన పరిస్థితి లేదు. ప్రజా సమస్యలపై చర్చ జరుగడమన్నది చాలా అరుదు. ఆది నుంచి అంతం వరకు వాయిదాలే..వాయిదాలు. ఎవరి పట్టు వారిదే…ఎవరి ప్రయోజనాలు వారివే. ఒకసారి రైతు చట్టాలపై, ఇంకోసారి ఇంకోదానిపై ఇలా ప్రతిపక్షం చర్చకు పట్టు బట్టటం అధికార పక్షం నిరాకరించడం ఆనవాయితీగా మారింది. సమస్య ఎంత జటిలమైనదైనా, ప్రజల ప్రయోజనాలకు ముడిపడి ఉన్నదైనా అధికార పక్షం జవాబివ్వలేకనో, తమదే పై చేయి కావాలన్న ఉద్దేశం చేతనో కారణమేదైనా తమ సంఖ్యాబలంతో చర్చకు అవకాశమివ్వకుండా ఎప్పటికప్పుడు దాటవేసే ధోరణిని అవలంబించడం నిజంగా శోచనీయం.

ఇక ఈ నెల 20న మొదలైన ప్రస్తుత పార్లమెంట్‌ ‌వర్షాకాల సమావేశాల విషయానికొస్తే సమావేశాలు ప్రారంభమైన రోజు నుంచి రెండు రోజుల పాటు ఆనవాయితీగా వాయిదాల పర్వం కొనసాగి రేపు సోమవారం వరకు వాయిదా పడ్డాయి. అయితే ఈ సారి కారణం ఈ సందర్భంలోనే మణిపూర్‌లో చోటుచేసుకున్న అత్యంత హేయమైన, అనాగరికమైన, క్రూరమైన సభ్యసమాజం తలదించుకనే విధంగా నెల క్రితమే చోటు చేసుకున్న ఘటన వెలుగులోకి రావడం. అంతర్జాతీయంగా కూడా ఇలాంటి ఘటనలు దేశ ప్రతిష్టను ప్రభావితం చేస్తాయి. సాంకేతికంగా క్షణాల్లో ఏ సమాచారమయినా ప్రపంచం మొత్తం తెలియపరిచే వ్యవస్థ ఉన్న ఈ రోజుల్లో ఇంత దారుణమైన ఘటన జరిగిన సమాచారం నెల రోజుల దాకా వెలుగులోకి రాకపోవడం విచారకరం. ఇది ఖచ్చితంగా పార్లమెంటులో చర్చకు రాదగిన అంశమే. ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమాచారాన్ని సేకరించి అధికార పార్టీ ఖచ్చితంగా దాని పూర్వాపరాలు, తీసుకున్న చర్యలు మొదలైన అంశాలతో కూడిన వివరాణాత్మక సమాధానం ఇవ్వాలి. ప్రతిపక్షాల సూచనలు, సలహాలు పరిగణనలోకి తీసుకోవాలి. దేశ ప్రజలకు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇవ్వాలి. కానీ కారణమేదైనా అధికార పార్టీ అందుకు సిద్ధంగా లేనట్లు కనిపిస్తున్నది. ఇక ఇదే పార్లమెంటు సమావేశాలలో ప్రవేశ పెట్టాలని చూస్తున్న, ప్రజల మతాచారాలకు, విశ్వాసాలకు, సంప్రదాయాలకు సంబంధించిన అత్యంత సున్నితమైన, దేశ సమైక్యతకు సంబంధించిన అంశానికి ముడిపడిన యుసిసి బిల్లుకు సంబంధించి కనీసం ముసాయిదా బిల్లు కూడా ఇంత వరకు తయారయిందా లేదా తెలియదు. దీనిపై చాలా మంది ప్రజలకు కనీసమైన అవగాహన లేదు. ఇది మన ప్రజాస్వామ్యానికి ఎంత మాత్రం అభిలషణీయం కాదు.

దీనికంతటికీ కారణం చట్టసభలు వాటి పవిత్రతను కోల్పోవడమే. పార్లమెంటు ఉభయ సభలు ఎగువ సభ రాజ్య సభ, దిగువ సభ లోక్‌ ‌సభల్లో ప్రస్తుతం లోక్‌ ‌సభకు ప్రాతినిధ్యం వహించాలంటే సమర్థత, అర్హతలు కాకుండా డబ్బు, పలుకుబడులే అత్యధిక ప్రభావవంతంగా పనిచేస్తున్నాయి. ఆయా పార్టీలు అభ్యర్థుల ఎంపికను వీటి ఆధారంగానే చేస్తుండడంతో ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు గెలిచిన నాటి నుండి పదవీ కాలం ముగిసే వరకు ప్రజా సమస్యలపై కాకుండా వారు ఖర్చు పెట్టిన దానికి పదింతలు వెనకేసుకునేందుకే కృషి చేస్తున్నారు. ఈ విషయంలో ఖచ్చితంగా ప్రజలను తప్పు పట్టాల్సిందే. ఎందుకంటే అత్యంత శక్తివంతమైన తమ వోటును వినియోగించుకునే సందర్భంలో ప్రలోభాలకు లోనుకాకుండా ఆలోచించి ప్రతినిధులను ఎన్నుకుంటే  ఈ సమస్య ఉండదు. ఇక ఎగువ సభ రాజ్య సభ లేదా పెద్దల సభ విషయానికొస్తే పేరులోనే ఉన్న విధంగా సమాజంలో ఉన్న వివిధ రంగాల పెద్దలకు, నిపుణులకు, మేధావులు ప్రాతినిధ్యం వహించాల్సింది పోయి ఆయా రాజకీయ పార్టీలకు ఇది పునరావాస కేంద్రంగా మారడ•ం శోచనీయం. ఏదేమైనా ఇప్పుడంతా గజిబిజిగా, గందరగోళంగా, ఏది తప్పు ఏది ఒప్పు అని తెలుసుకోలేని ఒక అసంధిగ్ధ, నిస్సహాయ  స్థితిలో, విషవలయంలో సమాజం, వ్యవస్థలు చిక్కుకుని విలవిలలాడుతున్నాయి. భవిష్యత్తులోనైనా చట్ట సభలతో సహా అన్ని వ్యవస్థలు పునర్‌వైభవాన్ని సంతరించుకుంటాయని ఆశిద్దాం.

Leave a Reply