Take a fresh look at your lifestyle.

‌రెండు తెలుగు రాష్ట్రాల్లో ముందస్తు కలకలం..

ముందస్తు ఎన్నికలపై రెండు తెలుగురాష్ట్రాల్లో తీవ్రంగా చర్చ జరుగుతున్నది. రెండు రాష్ట్రాల్లో త్వరితగతిన జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఆ దిశగా చర్చకు దోహదపడుతున్నాయి. దానికి తగినట్లుగానే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధపడుతున్నాయికూడా.. ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు పర్చడంలో ఈ ప్రభుత్వాలు తొందరపడుతున్నాయి. షెడ్యూల్‌ ‌ప్రకారం ఏపిలో 2014 ఏప్రిల్‌లో ఎన్నికలు జరుగాల్సి ఉండగా, వైఎస్‌ఆర్‌సిపి పార్టీ ఏడాది ముందుగానే ఎన్నికలకు పోతుందన్నది అక్కడి నాయకులు చెబుతున్నారు. ప్రభుత్వాన్ని కొనసాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులేదని, అప్పు పుట్టడంకూడా గగనంగా మారుతున్న నేపథ్యంలో జగన్‌ ‌ప్రభుత్వానికి ముందస్తు వెళ్ళడం మినహా మరో దారిలేదని అదే పార్టీకి చెందిన రెబల్‌ ఎం‌పి రఘురామరాజు లాంటి వారు చెబుతున్నారు. షెడ్యూల్‌ ‌ప్రకారం వొచ్చే ఎన్నికల సమయం వరకు ప్రజా సంక్షేమ పథకాలను ప్రభుత్వం నిర్వహించే పరిస్థితిలేక పోవడం కూడా ఇందుకు కారణంగా ఆయన చెబుతున్నారు. నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గానికి చెందిన ఆ పార్టీ ఎమ్మెల్యే ఆనం నారాయణరెడ్డికూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు.

ప్రజలకు చెప్పుకోవడానికి ప్రభుత్వం దగ్గర ఏమీలేదన్నంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్‌ఆర్‌ ‌ప్రభుత్వం అధికారంలోకి వొచ్చి నాలుగేళ్ళు పూర్తి కావచ్చినా కనీసం సచివాలయాన్ని కూడా ఏర్పాటు చేసుకోలేకపోయిందని, రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉన్నాయంటూ ఆయన ఇటీవల సంచలనాత్మక ప్రకటన చేశారు. ఆయన పార్టీ వీడి పోయే క్రమంలోనే ఇలాంటి ప్రకటన చేసి ఉంటాడన్న వాదన ఉన్నప్పటికీ, ఆ పార్టీకి చెందిన ఒక్కో ప్రజానాయకుడు ప్రభుత్వ వైఫల్యాలను ఒక్కోక్కటిగా బయటపెడుతున్నాడు. ఈ పరిస్థితిని అధిగమించాలంటే ముందస్తుకు వెళ్ళడమే సరైనదిగా జగన్‌ ‌ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా తెలుస్తున్నది. ఇదే ఆలోచనతో ఇటీవల దిల్లీకి వెళ్ళినప్పుడు ప్రధాని, హోంశాఖ మంత్రిని కలుసుకుని దీనిపై చర్చించినట్లుగా వార్తలు వెలుడిన విషయం తెలియందికాదు. దీన్నిబట్టి బడ్జెట్‌ ‌సమావేశాల అనంతరం ఏప్రిల్‌లో అసెంబ్లీని రద్దుచేసే అవకాశాలున్నాయంటున్నారు.

ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్ళితే, ఏపీ ప్రభుత్వం కూడా అప్పుడే• ఎన్నికలకు సిద్ధపడుతుందన్నది ప్రచారంలోఉంది. కాగా ఏపి మంత్రులు మాత్రం అదేమీలేదని కొట్టిపారేస్తున్నా ప్రభుత్వం మాత్రం ఆ దిశగానే అడుగులు వేస్తోంది. ఇటీవల అనేక సంక్షేమ పథకాలను యుద్ధప్రాతిపదికన ప్రజలకు అందజేసే కార్యక్రామలను ఏపి ప్రభుత్వం విస్తృత పరుస్తోంది. అలాగే ప్రధాన ప్రతిపక్షం టిడిపి కూడా ఆ దిశగానే తన పార్టీ కార్యక్రమాలను విస్తృత పరుస్తోంది. ఏ క్షణానైనా ఎన్నికలు రావొచ్చని, అందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ క్యాడర్‌ను చంద్రబాబు అలర్ట్ ‌చేస్తున్నారు.

తెలంగాణలో కూడా ఇప్పుడు ముందస్తు ఎన్నికలపై విస్తృతంగా చర్చ జరుగుతున్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి, బిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ ‌ముందస్తు ఎన్నికలు ఉండవని స్పష్టంగా చెప్పారు. అయినా కెసిఆర్‌ అవునంటే కాదని, కాదంటే అవునన్నట్లు అవుతుందని ప్రతిపక్ష పార్టీలంటున్నాయి. అయన ఏనాడూ మాటమీద నిలబడడని, అందుకు ఎన్నికలు ఎప్పుడు వొచ్చినా ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉండాల్సిందేనని తమ కార్యకర్తలకు ఆయా పార్టీలు సమాయత్తం చేస్తున్నాయి. ఆ మేరకు రాజకీయపార్టీలన్నీ తమ కార్యక్రమాలను కొనసాగిస్తుండడంతో రాష్ట్రంలో ఇప్పుడు ఎన్నికల హడావుడి• కనిపిస్తున్నది. మిషన్‌ 90 ‌పేరున భారతీయ జనతాపార్టీ ప్రణాళికను సిద్ధం చేసింది. రాబోయే ఎన్నికల్లో కనీసం 90 స్థానాలనైనా కైవసం చేసుకోవాలన్నది ఆ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. కాంగ్రెస్‌ ‌పార్టీ జనవరి 26 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రలకు సిద్ధమవుతున్నది. ఇంకా ఈ విషయంలో ఆ పార్టీ కేంద్ర నాయకత్వం గ్రీన్‌ ‌సిగ్నల్‌ ఇవ్వాల్సి ఉంది. ఇప్పటికే తెలంగాణ చుట్టబెట్టిన వైఎస్‌ఆర్‌టిపి పార్టీ సంక్రాంతి తర్వాత మరో విడత పాదయాత్రకు సిద్ధమవుతున్నది. ఈ మూడు పార్టీలు కూడా ఎన్నికలు ఎప్పుడు వొచ్చినా సిద్ధంగా ఉన్నట్లు ప్రకటిస్తున్నాయి.

ఇకపోతే అధికార బిఆర్‌ఎస్‌ ‌ముందస్తు గురించి మాట్లాడకపోయినా అందుకు రంగం సిద్ధం చేసుకుంటోందన్నది రాష్ట్రంలో చేపడుతున్న కార్యక్రమాలే స్పష్టం చేస్తున్నాయి. ప్రతిపక్షాలు విమర్శలకు అడ్డుకట్ట వేస్తూ యువకులు, నిరుద్యోగులకు సంతోషం కలిగించే శుభ వార్తలను ముందుకు తీసుకువొచ్చింది. అందులో ప్రధానంగా వివిధ శాఖల్లో వేలాది ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇవ్వడంద్వారా యువతనందరినీ ఉద్యోగాల్లో బిజీ చేస్తోంది. గ్రూప్‌ 2, ‌నర్సింగ్‌, ‌వైద్య శాఖలో డాక్టర్లు ఇతర సిబ్బంది, గ్రూప్‌ 3, ‌వ్యవసాయరంగంలో, పాఠశాలలకు సంబంధించిన పలు పోస్టులకు నోటిఫికేషన్‌ ‌విడుదల చేసింది. ఈ పోస్టులన్నిటినీ ఒకటి రెండు నెలల్లో భర్తీ చేయనుంది. కెసిఆర్‌ ‌ప్రభుత్వం రెండవసారి అధికారం చేపట్టిన నాలుగుఏళ్ళ తర్వాత ఇంత పెద్ద స్థాయిలో ఒకదాని వెనుక ఒకటిగా నోటిఫికేషన్‌లు విడుదల చేయడం రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకునేనని ప్రతిపక్షాలంటున్నాయి. టిఆర్‌ఎస్‌ ‌పార్టీ బిఆర్‌ఎస్‌ ‌పేర జాతీయ పార్టీగా రూపు దిద్దుకున్న నేపథ్యంలో జరుగనున్న ఈ ఎన్నికలు దేశం సంగతి ఎలా ఉన్నా రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం రాజకీయాల్లో సంచలనాలు కలిగించేది మాత్రం స్పష్టం.

Leave a Reply