Take a fresh look at your lifestyle.

ఆరున్నరేండ్లలో… కేంద్రం నుంచి అణా పైసా సాయం అందలేదు

  • ఆత్మనిర్భర్‌ ‌భారత్‌తో రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేదు
  • విభజన చట్టం ప్రకారం పరిశ్రమలకు ప్రత్యేక రాయితీలు ఇవ్వలేదు
  • టీఎస్‌ ఐపాస్‌ ‌కింద 15,326 పరిశ్రమలకు ఆమోదం
  • ఫుడ్‌ ‌పార్క్ ‌కోసం నర్సంపేటలో భూ సేకరణ
  • అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి కెటిఆర్‌

‌కేంద్రంపై మరోసారి మంత్రి కేటీఆర్‌ ‌ఫైర్‌ అయ్యారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా టీఎస్‌ ఐపాస్‌ ‌కింద పరిశ్రమలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్‌ ‌సమాధానం ఇస్తూ.. ఏపీ పునర్విభజన చట్టంలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో పారిశ్రామికీకరణకు సహాయం చేయాలని, రాయితీలు ఇస్తామని పేర్కొన్నప్పటికీ ఎలాంటి సాయం అందలేదన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రాయితీలను ఇవ్వాలని ప్రభుత్వం కోరుతుందన్నారు. ఆరున్నరేండ్లలో తెలంగాణకు కేంద్రం అణా పైసా కూడా సహాయం చేయలేదన్నారు. కేంద్రం తెలంగాణకు చేసింది గుండు సున్నా అని ధ్వజమెత్తారు. వారు పార్లమెంట్‌లో చేసిన చట్టాన్నే తుంగలో తొక్కుతున్నారని నిప్పులు చెరిగారు. కేంద్రం తెచ్చిన రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ ఏమైందో ఎవరికీ తెలియదన్నారు.

ఆత్మనిర్భర్‌ ‌ప్యాకేజీ వల్ల తెలంగాణకు ఎలాంటి ప్రయోజనం కలగలేదన్నారు. కేవలం వీధి వ్యాపారులకు మాత్రమే రూ. 10 వేల లోన్లు ఇచ్చారని కేటీఆర్‌ ‌తెలిపారు. దీనివల్ల లబద్దిపొందిన వారెవరో కూడా తెలియడం లేదన్నారు. ప్రశ్నోత్తరాల సందర్భంగా టీఎస్‌ ఐపాస్‌ ‌కింద వచ్చిన పరిశ్రమలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్‌ ‌సమాధానం ఇస్తూ.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత ఆరు సంవత్సరాల్లో టీఎస్‌ ఐపాస్‌ ‌కింద 15,326 పరిశ్రమలు ఆమోదం పొందాయన్నారు. ఇందులో ఇప్పటికే 11,954 పరిశ్రమలు తమ కార్యకలాపాలను ప్రారంభించాయన్నారు. టీఎస్‌ ఐపాస్‌ ‌ద్వారా రూ. 2 లక్షల 13 వేల 431 కోట్ల పెట్టుబడులను ఆకర్షించామని తెలిపారు. కాగా ప్రస్తుతం రూ. 97,405 కోట్ల పెట్టుబడులు తమ కార్యక్రమాలను ప్రారంభించినట్లు చెప్పారు.

ఈ పెట్టుబడుల ద్వారా 15,52,672 మందికి ఉపాధి కల్పించొచ్చని అంచనా వేశామన్నారు. ప్రస్తుతం 7,67,729 మంది ఉపాధి పొందుతున్నారని మంత్రి పేర్కొన్నారు. 2014, నవంబర్‌లో టీఎస్‌ ఐపాస్‌ ‌చట్టాన్ని ఆమోదించుకున్నామని తెలిపారు. వెనుకబడిన జిల్లాలకు కూడా పరిశ్రమలను విస్తరిస్తామని మంత్రి తెలిపారు. ఏరోస్పేస్‌ ఇం‌డస్ట్రీ తీసుకుంటే ఆదిభట్ల ప్రాంతంలో ఉంది. ఎలక్ట్రిక్‌ ‌పరిశ్రమలు హైదరాబాద్‌కు దక్షిణం వైపు ఉన్నాయి. పరిశ్రమలును వికేంద్రీకరిస్తామని తెలిపారు. నైపుణ్య శిక్షణతోనే ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. టాస్క్ ‌సమర్థవంతంగా పని చేస్తూ..యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తుందన్నారు.

నర్సంపేటలో ఫుడ్‌ ‌పార్క్ ‌కోసం భూ సేకరణ
ఫుడ్‌ ‌పార్క్ ‌కోసం వరంగల్‌ ‌గ్రామిణ జిల్లాలోని నర్సంపేట గ్రామంలోని సర్వే నంబర్‌ 813‌లోని ప్రభుత్వ అసైన్డ్ ‌భూమికి సంబంధించి 46 ఎకరాల 29 గుంటల భూమిని గుర్తించామని మంత్రి కెటిఆర్‌ అన్నారు. జిల్లా కలెక్టర్‌ ‌త్వరలోనే భూసేకరణ పక్రియను పూర్తి చేస్తారని తెలిపారు. సీఎం కేసీఆర్‌ ‌నాయకత్వంలో ఇరిగేషన్‌ ‌ప్రాజెక్టులు పూర్తవుతున్నాయని, చిన్న నీటి వనరులను కాపాడుకుంటున్నామని చెప్పారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఈ విషయంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్‌ ‌సమాధానం ఇచ్చారు. సంబంధిత జిల్లా కలెక్టర్‌ ‌స్పెషల్‌ ‌ఫుడ్‌ ‌ప్రాసెసింగ్‌ ‌జోన్‌ ఏర్పాటు కోసం భూములను గుర్తించారు.

రాష్ట్రంలో అద్భుతంగా భూగర్భ జలాలు పెరుగుతున్నాయని స్పష్టం చేశారు. సిరిసిల్లలో 6 మిటర్లు భూగర్భ జలాలు పైకి వొచ్చాయన్నారు. నీటి వనరులను పెంచుకోవడంతో.. వ్యవసాయ దిగుబడులు, ఆహార ఉత్పత్తులు ఇబ్బడిముబ్బడిగా పెరగబోతున్నాయని, ఆగ్రో ప్రాసెసింగ్‌, ‌ఫుడ్‌ ‌ప్రాసెసింగ్‌పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఈ క్రమంలో కేబినెట్‌ ‌సబ్‌ ‌కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఫుడ్‌ ‌మ్యాప్‌ ఆఫ్‌ ‌తెలంగాణను కూడా ఇప్పటికే ఏర్పాటు చేశామన్నారు. హార్టికల్చర్‌, అ‌గ్రికల్చర్‌ ‌రంగాలపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. ఎక్కడ ఏ పరిశ్రమను ప్రోత్సహించాలి అనే అంశంపై ప్రభుత్వం పూర్తి అవగాహనతో ఉందని మంత్రి కేటీఆర్‌ ‌తెలిపారు.

Leave a Reply