Take a fresh look at your lifestyle.

బీజేపీ మేనిఫెస్టోలో విశ్వసనీయత ఎంత?

  • తెలంగాణ పుట్టుకని ప్రశ్నించారు, తల్లిని చంపి బిడ్డను వేరు చేశారని అంటే ఎన్నికల కోసం అని భావించాం కానీ, పది సంవత్సరాలుగా అధికారంలో
  • ఉండి విభజన హామీలను ఏ ఒక్కటి అమలు చేయనందున మోదీని వర్తమానం భరించినా, భవిష్యత్తు క్షమించదనే ప్రచారం ఊపందుకుంది.
  • ప్రతికూలతను ఎదుర్కొంటున్న మోదీని కాపాడడానికి అయోధ్య రాముడే దిక్కని విశ్లేషకులు భావిస్తున్నారు.  

రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలలో గుప్పిస్తున్న హామీలకు అడ్డూ అదుపూ ఉండడం లేదు. అలవికానీ హామీలతో జాతీయ పార్టీల ఎన్నికల మేనిఫెస్టోల వంట కాలను ప్రజల్లోకి పోటాపోటీగా వదులుతున్నారు. వాగ్దానాల వరద పారిస్తున్నారు, ఎన్నికలు ఏరు దాటగానే మేనిఫెస్టోల తెప్పను తగలెయ్యడం పరిపాటిగా మారింది. ఆయా ప్రభుత్వాల డబ్బుతో వోటర్లను ప్రలోభ పెట్టేందుకు ఉచితలను ప్రకటించి ప్రజలను ప్రభావితం చేసి నాలుగు వోట్లు దండుకోవడం రాజకీయ హక్కుగా మారింది. రాజకీయ పార్టీలు తమ విధి, విధానాలకు తగిన వాగ్దానాలు చేసుకునే స్వేచ్ఛను కోరడం తప్పు కాదు. అయితే జవాబుదారీతనము లేని మేనిఫెస్టోలకు అడ్డుకట్ట వేయడానికి వారు సిద్ధం కావాలి. చాలా దేశాలలో పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టో పాటు తమ పార్టీ ద్రవ్య ప్రణాళికను విధిగా జతపరుస్తున్నాయి. తాము చేసిన వాగ్దానాలకు అయ్యే అదనపు ఖర్చు వివరాలు ఈ నిధులను ఎలా సేకరిస్తారు? ఎక్కడ పనులు పెంచుతారు? ఎక్కడ కోతలు పెడతారు? అన్న వివరాలన్నీ తమ ద్రవ్యప్రణాళికలో నిర్దిష్టంగా వివరిస్తారు.

ఎన్నికల సంఘం కొన్ని మార్గదర్శకాలను ప్రకటించినప్పటికీ, పార్టీలు మాత్రం ఎన్నికల ముంగిట్లోకి వచ్చేసరికి గెలిచాకా గాలికి వదిలేసే హామీలను తమ మేనిఫెస్టోల్లో గుప్పిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారు. ఈ తరహా మేనిఫెస్టోల తీరుపై గతంలో సుప్రీంకోర్టు ఘాటుగా స్పందించింది. దీనిపై చట్టం చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించే వీళ్లేనందున, దేనికి గల ప్రాధాన్యత రీత్యా ఎన్నికల కమిషన్‌ తక్షణమే గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సంప్రదించి పార్టీల ఎన్నికల మేనిఫెస్టోలకు మార్గదర్శకాలను రూపొందిం చాలని ఆదేశించింది.
2014లో ముక్త కాంగ్రెస్‌ పేరుతో అధికారంలోకి వస్తే స్వీస్‌ బ్యాంకుల్లో ఉన్న నల్లధనం వెనక్కి తీసుకొస్తామనే బూటకపు వాగ్దానాలతో కేంద్రంలో బిజెపి మొదటి సారి సొంతంగా అధికారంలోకి వచ్చింది.కానీ ఇప్పటివరకు అలాంటిదేమీ జరగలేదు ప్రతి ఒక్కరి బ్యాంక్‌ అకౌంట్లో నగదు జమ చేస్తామన్నారు అది చేయాలి పెద్ద నోట్లు రద్దు చేస్తామని చెప్పి ఏకంగా రెండు వేల నోట్లు తీసుకొచ్చారు,ఏమైందో ఏమోకానీ రెండువేల పెద్ద నోట్లు రద్దు కూడా చేయడం మూలంగా దాదాపు 15 లక్షల మంది ఉపాధి కోల్పోయారని గణాంకాలు చెపుతున్నాయి.

దేశంలో ప్రజలను ఇబ్బందుల పాలు చేసింది.పాలకుల మాటలు నమ్మి 51.95 కోట్ల మేరకు జనధన ఖాతాలు తెరిచి,దింపుడు కల్లం ఆశతో ఎదిరిచూస్తున్నారు. 2019 ఎన్నికల్లో సంకల్పపత్రం పేరుతో వోటర్ల దృష్టిని ఆకర్షించగలదని భావిస్తున్న 10 వాగ్దానాలు మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రధాన అంశంలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చింది. నిరుద్యోగం లేకుండా చేస్తామని ఏడాదికి రెండుకోట్ల ఉద్యోగాల ఏర వేసి 303 సీట్లతో విజయ దుందుభి మ్రోగించింది. రెండవసారి అధికారం చేపట్టిన తర్వాత దేశానికి వెన్నెముకైన రైతన్న నడ్డివిరిచింది. ఏడువందల రైతులను పొట్టన పెట్టుకుంది.వ్యవసాయ అభివృద్ధి 5.2 నుంచి 3.3 శాతం పడిపోయింది. ఏడాదికి రెండు కోట్లు దేవుడెరుగు కానీ ఖాలీ ఉన్న 80లక్షల ఉద్యోగాలను నింపలేదనే అపవాదు ఉంది. మన రాజ్యాంగంలో జమ్ము కాశ్మీర్‌ కు ప్రత్యేక స్వయం ప్రతిపత్తి ఉంది అలాంటిది ప్రతిపక్షాల అభిప్రాయాలు తీసుకోకుండా ఏకపక్షంగా పార్లమెంట్లో బలం ఉందని ఆమోదింప చేసుకొని భారత రాజ్యాంగాన్ని ఖూనీ చేశారు.370 ఆర్టికల్‌ రద్దు ద్వారా ప్రత్యేక హక్కులు కలిగిన రాష్ట్రాల సార్వభౌమత్వాన్ని సర్వనాశనం చేసి,అదే రీతిలో అన్ని రాష్ట్రాలపై అధికారిక ఆధిపత్యం చెలాయించాలని ప్రయత్నిస్తుందనేది జగద్విదితం.

అభివృద్ధి, సంక్షేమం రెండుకళ్ళుగా వికసిత్‌ భారత్‌ లక్ష్యంగా ‘సంకల్పపత్రం’ పేరుతో 24 కీలక అంశాలతో బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసింది. దాదాపు 15 లక్షల మంది సలహాలు,సూచనలు స్వీకరించామని గొప్పలు చెపుతున్న బీజేపీ యువత, మహిళలు, రైతులకు, బడుగులకు  తీవ్ర అన్యాయం చేసిందనే అభిప్రాయం నెలకొంది.మహిళా రిజర్వేషన్‌ బిల్లు తెచ్చినా 2029వరకు పోటీ చేయకుండా నివారించింది.యువతకు ఖాలీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయలేదు కదా? రైతులను ఉద్దరించేది ఏముంది? నల్ల చట్టాలు తెచ్చి నట్టేట ముంచింది ఎవరని ప్రశ్నిస్తున్నారు. కులగణన పేరుతో అధికారంలోకి వచ్చిన బీజేపీ  దశాబ్దంగా ఓబీసీలను నిర్లక్ష్యం చేసింది. హామీల మాయలో ఇప్పటికే ఎన్నోసార్లు మోసపోయిన ప్రజలను ‘వికసిత్‌ భారత్‌’ 2047 పేరుతో  మరోమారు మభ్యపెడుతూనే ఉన్నారు. సుప్రీంకోర్టు అభిప్రాయపడ్డ విధంగా ప్రలోభ ఉచితాలు సమాజాభివృద్ధి కోసం పుట్టుకొచ్చినవి కావు ఇవి అడ్డదారిలో అధికారాన్ని పొందడానికి రాజకీయ పార్టీలు చేసిన విశ్వామిత్ర సృష్టి, ఇదే కొనసాగితే పేదరికం శాశ్వతం అవుతుంది అందరికీ తెలిసే అవకాశాలు త్రిశంకు స్వర్గంలో చిక్కుకుంటాయనే విమర్శ ఉంది.ఈ అంశాలతో మేనిఫెస్టోలో జవాబు దారి చట్టం చేయాలి.

ఇచ్చిన హామీలను గాలికొదిలేసిన పార్టీలను తదుపరి ఎన్నికల్లో పోటీ చేయకుండా బ్లాక్‌ లిస్టులో పెట్టాలి. అప్పుడు వాగ్దానాలు చేసే హక్కు పార్టీలకు అమలు జరిపించుకునే హక్కు ప్రజలకు ఉంటుంది. ఎక్కడోకక్కడ, ఎవరో ఒకరు ఈ దిగజారుడును నిలువరించకపోతే ప్రజాస్వామ్యం నామమాత్రానికే మిగులుతుంది. 138 ఏండ్ల చరిత్ర గల కాంగ్రెస్‌ తెలంగాణ ఆరు గ్యారెంటీల మాదిరిగా జాతీయ కాంగ్రెస్‌ న్యాయ్‌ పాత్ర పేరుతో మేనిఫెస్టోలో ప్రకటించిన యువత, మహిళలు ,రైతులు, కూలీలు, కులగణన  హామీలు గేమ్‌ ఛేంజర్‌ గా మారనున్నాయి. అసలు వ్యవస్థల్లో స్పష్టమైన ఆరోగ్యకరమైన మార్పులు కనపడనన్నాళ్లు ప్రత్యామ్నాయం కోసం చూడడం సహజం. మేక్‌ ఇన్‌ ఇండియా పాలనలో పరిస్థితులు గతంలో కంటే భిన్నంగా ఉన్నాయా అన్న ప్రశ్నలు ఉత్పన్నమ వుతున్నాయి, తెలుగు రాష్ట్రాల్లో నాలుగు వోట్లు  సంపాదించుకునేందుకు తెలంగాణ పుట్టుకని ప్రశ్నించారు, తల్లిని చంపి బిడ్డను వేరు చేశారని అంటే ఎన్నికల కోసం అని భావించాం కానీ, పది సంవత్సరాలుగా అధికారంలో ఉండి విభజన హామీలను ఏ ఒక్కటి అమలు చేయనందున మోదీని వర్తమానం భరించినా, భవిష్యత్తు క్షమించదనే ప్రచారం ఊపందుకుంది. ప్రతికూలతను ఎదుర్కొంటున్న మోదీని కాపాడడానికి అయోధ్య రాముడే దిక్కని విశ్లేషకులు భావిస్తున్నారు.                                   ˜
డా. సంగనిమల్లేశ్వర్‌
విభాగాధిపతి, జర్నలిజం శాఖ,
కాకతీయ విశ్వవిద్యాలయం,
వరంగల్‌,
సెల్‌ : 9866255355

 

Leave a Reply