Take a fresh look at your lifestyle.

ఏలూరు నేర్పుతున్న పాఠం

“ఇవాళ ఏలూరు మన ముందు ఒక పాఠంగా నిలబడిందనే విషయాన్ని మాత్రం మనం గుర్తించాలి. విచ్చలవిడిగా పురుగు మందులు, రసాయనాలు వాడేస్తే ఏం జరుగుతుందో మన కళ్లకు కట్టింది. 1950, 60ల్లో అప్పుడు ఉన్న ఆహార కొరత సమస్యను అధిగమించటానికి హరిత విప్లవం ఒక పరిష్కారంగా కనిపించింది. ఆహార ఉత్పత్తిని, ఉత్పాదకతను పెంచే క్రమంలో రసాయనాలు, పురుగు మందుల వాడకం విపరీతంగా పెరిగింది. అవసరం లేకున్నా ఇప్పుడూ అదే కొనసాగుతోంది. వీటి వల్ల నేల, గాలి, భూ గర్భజలాలు కూడా 
కలుషితం అవుతాయని మనకు తెలిసిందే. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆహార పదార్ధాల ద్వారా మనుషుల్లోకి వెళతాయి. పురుగుమందులు, రసాయనాల వాడకాన్ని అదుపులో పెట్టకపోతే  ఏలూరు  వంటి విచిత్ర వ్యాధి సంఘటనలకు సిద్ధంగా ఉండాల్సిందే.”

Rehanaపశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు గత వారం రోజుల నుంచి వార్తల్లో నానుతోంది. ఎప్పుడూ చూడని వింత వ్యాధితో ఏలూరు పట్టణవాసులు బెంబేలెత్తుతున్నారు. ఫిట్స్‌ వచ్చి
ఉన్నపళంగా పడిపోవటం, నోట్లో నుంచి నురగ రావటం, చేతులు, కాళ్లు వంకర్లు పోవటం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. కొంత మంది కొద్ది సేపు స్పృహ కోల్పోతున్నారు.
అయితే ప్రాధమిక చికిత్స తర్వాత వెంటనే కోలుకుంటూ ఉండటం కాస్త ఊరట అని చెప్పాలి. హాస్పటల్‌లో సెలైన్‌ ఎక్కించి, కనిపిస్తున్న లక్షణాలకు చికిత్స అందించగానే కొద్ది
గంటల్లో డిశ్చార్జ్‌ అయ్యి ఇళ్ళకు వెళ్ళగలుగుతున్నారు. ఇప్పటి వరకు ఆరువందల పై చిలుకు ఇలా ఏలూరులో ఈ వ్యాధి బారిన పడ్డారు. ప్రస్తుతం వ్యాధి తీవ్రత తగ్గుమఖం
పట్టింది. హాస్పటల్‌కు వస్తున్న రోగుల సంఖ్య గణనీయంగా తగ్గింది.

అసలేం జరిగింది?

రోగ ప్రభావం తగ్గటం ఊరటే కాని అసలు ఈ వింత వ్యాధికి కారణం ఏంటనేది తేలాలి. అప్పుడే అసలు చికిత్స చేయటానికి అవకాశం ఉంటుంది. నేను ఏలూరులోని ప్రభావిత
ప్రాంతాలకు వెళ్ళి బాధితులు, వారి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడాను. ఏడెనిమిది మంది సభ్యులు ఉన్న కుటుంబంలో ఒకరో, ఇద్దరో మాత్రమే ఈ వ్యాధి బారిన పడ్డారు.
నీళ్లో, పాలో, ఆహార పదార్ధాలో కలుషితం అయితే ఇంటిల్లపాది వ్యాధి బారిన పడాలి కదా అన్న ప్రశ్నకు సమాధానం దొరకటం లేదు. పోనీ ఇమ్యూనిటీ కారణం అనుకుంటే
కొన్ని కుటుంబాల్లో 50, 60 ఏళ్లు పై బడిన వారు, పదేళ్ల లోపు ఉన్న వారిలో ఈ లక్షణాలు కనిపించకుండా అదే కుటుంబంలో 20, 25 ఏళ్ల వయస్సులో ఉన్న వారికి ఫిట్స్‌
వచ్చిన ఉదంతాలు ఉన్నాయి. కరోనా వల్ల ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ, కాచి చల్లార్చిన నీళ్లు తాగే అలావాటున్న కొంత మంది కూడా బాధితులయ్యారు.
అంత వరకు పూర్తి ఆరోగ్యంగా, యాక్టివ్‌గా ఉన్న వాళ్లు కూడా ఉన్నపళంగా పడిపోవటం విచిత్రంగానే ఉంది. వీటన్నింటి కంటే మించి అసలు కారణం ఏంటనేది ఇప్పటికీ
తేలకపోవటం. సాధారణ నీరు, ఆహార పదార్ధాల కాలుష్యం అయితే డయారియా లక్షణాలు వస్తుంటాయి. ఈ విచిత్ర వ్యాధి వ్యక్తుల నాడీ వ్యవస్థ పై పని చేస్తోంది. రాష్ట్ర స్థాయి
సంస్థలు, నిపుణులు మాత్రమే కాకుండా ఢిల్లీ ఎయిమ్స్‌, ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసన్‌, సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌
మాలుక్యులార్‌ బయాలజీ, ఈరీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు, శాస్త్రవేత్తలు, నిపుణులు ఈ విచిత్ర వ్యాధికి కారణాలను శోధించే పనిలో ఉన్నారు. అంతే కాదు ఏకంగా ప్రపంచ
ఆరోగ్య సంస్థ (WHO) కూడా రంగంలోకి దిగింది. రక్తం, నీళ్లు, కూరగాయలు, స్పైన్‌ ఫ్లూయిడ్స్‌, బియ్యం, పప్పులు …ఇలా అనేక శాంపిల్స్‌ తీసుకుని అవకాశం ఉన్న అన్ని
రకాల పరీక్షలు చేస్తున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ ఏలూరుకు వెళ్లి బాధితులను పరామర్శించటమే కాకుండా మూడు, నాలుగు సార్లు సమీక్షలు కూడా చేపట్టారు.
అయినా ఇప్పటికీ ఒక ఇతిమిద్ద కారణం బయటపడకపోవటం విచిత్రం. మరికొన్ని పరీక్షల తర్వాత స్పష్టత వస్తుందని నిపుణులు అంటున్నారు.

ప్రమాద ఘంటికలు:

ఇప్పటి వరకు చేసిన పరీక్షల్లో బాధితుల రక్తంలో లెడ్‌, నికెల్‌ వంటి భార లోహాలు మోతాదుకు మించి కనిపించాయి. ఎన్‌ఐఎన్‌ నివేదికల్లో బియ్యంలో మెర్య్కూరీ, కూరగాయల్లో
పురుగు మందుల ఆనవాళ్లు ప్రమాదకర స్థాయిల్లో. రక్త నమూనాల్లో ఆర్గనో ఫాస్ఫరస్‌ కూడా కనిపించాయి. అయితే ఇక్కడ ఉత్పన్నమయ్యే మరో కీలకమైన ప్రశ్న ఇవి
మనుషుల్లోకి ఎలా వెళ్లాయి అన్నది. సమాధానాలు వెతికే పనిలో సంస్థలు, నిపుణులు ఉన్నారు. ఈ ప్రశ్నలు, అనుమానాలు, అధ్యయనాలు ఎలా ఉన్నా…ఇవాళ ఏలూరు
మన ముందు ఒక పాఠంగా నిలబడిందనే విషయాన్ని మాత్రం మనం గుర్తించాలి. విచ్చలవిడిగా పురుగు మందులు, రసాయనాలు వాడేస్తే ఏం జరుగుతుందో మన కళ్లకు
కట్టింది. 1950, 60ల్లో అప్పుడు ఉన్న ఆహార కొరత సమస్యను అధిగమించటానికి హరిత విప్లవం ఒక పరిష్కారంగా కనిపించింది. ఆహార ఉత్పత్తిని, ఉత్పాదకతను పెంచే
క్రమంలో రసాయనాలు, పురుగు మందుల వాడకం విపరీతంగా పెరిగింది. అవసరం లేకున్నా ఇప్పుడూ అదే కొనసాగుతోంది. వీటి వల్ల నేల, గాలి, భూ గర్భజలాలు కూడా
కలుషితం అవుతాయని మనకు తెలిసిందే. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆహార పదార్ధాల ద్వారా మనుషుల్లోకి వెళతాయి. పురుగుమందులు, రసాయనాల వాడకాన్ని
అదుపులో పెట్టకపోతే ఏలూరు వంటి విచిత్ర వ్యాధి సంఘటనలకు సిద్ధంగా ఉండాల్సిందే.

బ్యాక్‌ టు ఆర్గానిక్‌:

మన సంప్రదాయ ఆర్గానిక్‌ ఫార్మింగే ఏలూరు లాంటి సమస్యలకు సరైన పరిష్కారం. ఈ అవగాహల కొంత మందిలో ఉన్నా ఆర్గానిక్‌ అనే అంశానికి రెండు భిన్నమైన సవాళ్లు
ఉన్నాయి. ఒకటి మందులు చల్లేస్తే చీడ పురుగులను తేలిగ్గా నివారించవచ్చు, రెండు పంట దిగుబడి పెరుగుతుంది అన్న ప్రాధమిక భావన ప్రజల్లో ఉండటం. రెండు ఆర్గానిక్‌
ఆహార ఉత్పత్తుల ధరలు సగటు మధ్యతరగతి బడ్జెట్‌కు అందనంత ఎత్తున ఉండటం. వాస్తవంగా పురుగు మందులు, రసాయనాల వాడకం తగ్గిస్తే ఆ మేరకు రైతుకు పెట్టుబడి
వ్యయం గణనీయంగా తగ్గుతుంది. ఆ లెక్కల మరింత తక్కువ ధరకు కూరగాయలు, పళ్లు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులు లభించాలి కదా. ఆర్గానిక్‌ ఫార్మింగ్‌ చేసే వారు చెప్పేది
ఏంటంటే నేల కూడా కెమికల్స్‌కు అలవాటుపడి ఉంటుంది కనుక పెస్టిసైడ్స్‌ గట్రా వాడకపోతే పంట దిగుబడి తగ్గుతుంది. కాబట్టి అన్‌ ఆర్గానిక్‌ ప్రొడక్ట్స్‌ కంటే ఎక్కువ ధరకు
అమ్మాల్సి వస్తుందని. అయితే సేంద్రీయ ఎరువులు, వేప నూనే వంటి సేంద్రీయ చీడ నివారణ మందులు వాడటం మొదలు పెడితే రెండు మూడేళ్లల్లో నేల కూడా దానికి
అనుగుణంగా స్వభావం మార్చుకుంటుంది. పంట దిగుబడి పెరుగుతుంది. ఈ గ్యాప్‌ను భర్తీ చేయాలంటే ప్రభుత్వాలు ముందుకు రావాలి. ఒక వైపు రైతుకు నష్ట భయం లేకుండా
చూడటం, అదే సమయంలో ఆర్గానిక్‌ ఉత్పత్తులనే తినాలనే అవగాహన, ఆసక్తి ప్రజల్లో కల్పించటం చేయాలి. దీని కోసం ప్రభుత్వం ఒక విధానాన్ని తీసుకుని వచ్చి చిత్తశుద్ధితో
అమలు చేస్తే విచిత్ర వ్యాధుల బారిన పడకుండా సమాజాన్ని కాపాడినట్లు అవుతుంది. అటు ప్రజలు కూడా వీలైనంత మేరకు ఇళ్లల్లో వంటింటి గార్డెన్లను ఏర్పాటు చేసుకోవటం
అలవాటు చేసుకోవాలి. అప్పుడు మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది.

Leave a Reply