Take a fresh look at your lifestyle.

మోదీ, కెసిఆర్‌ ‌తోడు దొంగలు..!

నాణానికి బొమ్మ బొరుసు లాంటి వాళ్ళు
పరిపాలనలోనూ ఇద్దరిని వేర్వేరుగా చూడలేం
గత డిసెంబర్‌లో కేసిఆర్‌ను బొందపెట్టినట్లే మే13న మోదీకి బుద్ధి చెప్పాలి
నిరుద్యోగులకు 2 కోట్ల ఉద్యోగాలు రాలేదు..
రైతుల ఆత్మహత్యలు ఆపలేదు..నల్లధనాన్ని బయటికి తేలేని దద్దమ్మ మోదీ
హరీష్‌ ‌రావు…రాజీనామా లేఖ జేబులో పెట్టుకో
ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం…రైతులకు రుణమాఫీతో ఆర్థిక స్వాతంత్రం
ఓరుగల్లు జన జాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి

హనుమకొండ, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 24 : ‌ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇద్దరూ తోడు దొంగలేనని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. ప్రజా వ్యతిరేకతలో వారిద్దరూ ఒకే నాణానికి ఉన్న బొమ్మ బొరుసులాంటి వాళ్ళని ఎద్దేవా చేశారు. గత డిసెంబర్‌లో కెసిఆర్‌ ‌నియంత పాలనకు చరమగీతం పలికిన విధంగానే మే నెలలో జరగబోయే లోక్‌ ‌సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు మోదీకి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. బుధవారం ఓరుగల్లు జనజాతర సభ వరంగల్‌ ‌పశ్చిమ శాసనసభ్యులు నాయిని రాజేందర్‌ ‌రెడ్డి అధ్యక్షతన జరిగింది. లోక్‌ ‌సభ అభ్యర్థి కడియం కావ్యకు మద్దతుగా జరిగిన ఈ సభకు అశేష జన ప్రజానీకం హాజరయ్యారు. ఈ సభలో ప్రజలనుద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి తన సుదీర్ఘ ప్రసంగంలో…10 ఏళ్ల నరేంద్ర మోదీ పాలన అస్తవ్యస్తంగా ఉన్నదన్నారు. నల్ల చట్టాలను అమలు చేసి రైతుల ఆగ్రహానికి గురై మోదీ తోక ముడిచారని గుర్తు చేశారు. దేశంలో జరుగుతున్న రైతు వ్యతిరేక విధానాలతో వేలాది మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నియంత పాలనకు చరమగీతం పలికినట్లే వొచ్చే లోక్‌ ‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీకి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.

నరేంద్ర మోదీ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇద్దరు ఒకే నాణానికి బొమ్మ బొరుసు లాంటి వాళ్ళన్నారు. ఈ తోడు దొంగల రాజ్యంలో ప్రజలు పేదరికం, దాడులు, దౌర్జన్యాలు అనుభవించారని వివరించారు. ప్రజా పాలనకు మరోసారి మద్దతిచ్చి లోక్‌ ‌సభ బరిలో నిలిచిన కడియం కావ్యను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. కేంద్రంలో కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారంలోకి వొస్తే బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని నిర్మిస్తామన్నారు. సోనియా ఆదేశాలతో ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేస్తే మోదీ ద్రోహం చేశారని గుర్తు చేశారు. వరంగల్‌ ‌రైల్వే కోచ్‌ ‌ఫ్యాక్టరీ కూడా ఆనాటి మన్మోహన్‌ ‌సింగ్‌ ‌ప్రతిపాదనలు పంపిస్తే మహారాష్ట్రకు తీసుకెళ్లారని విమర్శించారు. త్రిబుల్‌ ఐటీ విషయంలో నరేంద్ర మోదీ ద్రోహం చేశాడని రేవంత్‌ ‌రెడ్డి దుయ్యబట్టారు. గడచిన పదేండ్ల బిజెపి ప్రభుత్వ హయాంలో లీటర్‌ ‌పెట్రోల్‌ ‌ధర రూ. 50 నుంచి రూ. 90కి చేరిందని గుర్తు చేశారు. గ్యాస్‌ ‌ధర కాంగ్రెస్‌ ‌ప్రభుత్వ హయాంలో రూ. 400 ఉండగా నేడు రూ. 1200కు చేరిందన్నారు. చేనేత రంగం పైన, అగరు బత్తిలపైన కూడా జీఎస్టీ వేయకుండా వదలలేదని మోదీని విమర్శించారు. పేద ప్రజల భూములు లాక్కున్న భూ బకాసురుడు ఆరూరి రమేష్‌ ఏ ‌విధంగా అర్హుడో ఆలోచించాలన్నారు. బిజెపి అభ్యర్థి ఆరూరి రమేష్‌ను ప్రజల పాలిట అనకొండగా రేవంత్‌ ‌రెడ్డి అభివర్ణించారు. ఆయన పార్లమెంటుకు వెళితే ప్రజల ఆస్తులు రక్షించుకోవడానికి సమయం సరిపోతుందని విమర్శించారు.

కడియం శ్రీహరి రాజకీయ దక్షత, పరిపాలన చూసి పార్టీలోకి ఆహ్వానించామన్నారు. శ్రీహరి 30 ఏళ్లుగా నిజాయితీగా రాజకీయాల్లో ఉన్నారని, ఆయన కూతురు కావ్య సేవా మార్గంలో వెళ్తున్నారని అన్నారు. భారతీయ జనతా పార్టీ దేవుళ్ల పేరుతో, దేవాలయం పేరుతో వోట్లు రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నదన్నారు. కులాలను, మతాలను, వర్గాలను, ప్రాంతాలను విభజించి వోట్లు రాబట్టుకునేందుకు కుటిల యత్నాలు చేస్తున్నదని ఆరోపించారు. దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలని, రాజకీయాలతో పూజలు చేయడం, వోట్లు దండుకోవడం తగదని హితవు పలికారు. మాజీ మంత్రి హరీష్‌ ‌రావు రైతులకు రుణమాఫీ విషయంలో సవాల్‌ ‌విసిరాడని, ఆయన సవాల్‌కు స్పందిస్తూ ఆగస్టు 15 నాటికి రుణమాఫీ చేయడం నూటికి నూరు శాతం నిజమేని మరోసారి స్పష్టం చేశారు.

హరీష్‌ ‌రావు సవాల్‌ను స్వీకరిస్తున్నానని, అయితే హరీష్‌ ‌రావు రాజీనామా లేఖ జేబులో పెట్టుకుని సిద్ధంగా ఉండాలని అన్నారు. జిల్లాలోని సమ్మక్క సారలమ్మ సాక్షిగా, రామప్ప శివుడి సాక్షిగా రైతుల రుణమాఫీ చేస్తానని రేవంత్‌ ‌హామీ ఇచ్చారు. ఆగస్టు 15 నాడు రాజీనామా లేఖ ప్రకటించేందుకు సిద్ధంగా ఉండాలని హరీష్‌ ‌రావుకు ప్రతి సవాల్‌ ‌విసిరాడు. ఈ కార్యక్రమంలో ఏఐసిసి జనరల్‌ ‌సెక్రటరీ రోహిత్‌ ‌చౌదరి, అస్మదుల్లా, రాష్ట్ర మంత్రులు దుద్దిల్ల శ్రీధర్‌ ‌బాబు, సీతక్క, కొండా సురేఖ, వరంగల్‌ ‌పార్లమెంట్‌ ఇం‌చార్జ్, ‌పరకాల ఎంఎల్‌ఏ ‌రేవూరి ప్రకాశ్‌ ‌రెడ్డి, ఎమ్మెల్యేలు కేఆర్‌ ‌నాగరాజు, కడియం శ్రీహరి, గండ్ర సత్యనారాయణ రావు, యశస్విని రెడ్డి, మాజీ ఎంపీ పసునూరి దయాకర్‌, ‌రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్‌ ‌రెడ్డి, కాంగ్రెస్‌ ‌పార్టీ నాయకులు, తెలంగాణ జేఏసీ మాజీ చైర్మన్‌ ‌కోదండరామ్‌, ‌దొమ్మాటి సాంబయ్య, పుల్ల పద్మావతి, ఎర్రబెల్లి స్వర్ణ, నమిన్ల శ్రీనివాస్‌, ‌మార్క విజయ్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply