Take a fresh look at your lifestyle.

తెలంగాణ కుంభమేలాకు వేళాయే..

నేటి నుంచి సమ్మక్క-సారలమ్మ జాతర
నేడు గద్దె చేరనున్న సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు..
భారీ సంఖ్యలో తరలివస్తున్న భక్తజనం
మేడారంలో రూ.105 కోట్లతో జారత పనులు..అన్ని ఏర్పాట్లు పూర్తి
17 ఇన్‌ ఫిల్టరేషన్‌ వెల్స్‌, 495 ప్రాంతాలలో 5000 ట్యాప్స్‌
పారిశుధ్యంపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి
50 పడకల హాస్పిటల్‌,
25 మంది వైద్యులు 120 మంది వైద్యాధికారులు
857 పారా మెడికల్‌ సిబ్బంది
అన్ని శాఖల అధికారుల నిరంతర పర్యవేక్షణ
300 ఎల్‌ఈడీ స్క్రీన్‌లు, 300 సిసి కెమెరాలు
12 వేల పోలీస్‌ సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రత
హెలికాప్టర్‌ సేవలను ప్రారంభించిన పర్యాటక శాఖ
భక్తులకు అసౌక్యం కలగకుండా పటిష్ట చర్యలు

మేడారం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20 : తెలంగాణ కుంభమేలాగా పిలుచుకునే సమ్మక్క-సారలమ్మ మహాజాతరకు అంతా సిద్ధమైంది. బుధవారం నుంచి మేడారం జారత ప్రారంభం కానుంది. అశేష భక్తజనవాహిని మధ్య నేడు కన్నెపల్లి నుంచి సారలమ్మ తల్లిని పూజారులు జయ జయధ్వానాల మధ్య మేడరంలోని గద్దెపైకి తీసుకురానున్నారు. ఈ అపూర్వ ఘట్టంతో జతర మొదలు కానుంది. కాగా.. కాగా.. నేడు కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దె పైకి తీసుకురానున్న నేపథ్యంలో.. అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. అమ్మవార్లకు తులాభరంతో బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అదేవిధంగా వడిబియ్యం, చీర, సారెతో పూజలు చేశారు. భక్తులు పూనకాలతో పరవశిస్తు అమ్మవార్ల దీవెనల కోసం  గద్దెల వద్దకు  చేరుకుంటున్నారు మేడారం జనసందోహం తో ఆధ్యాత్మి క భక్తి భావనతో పులకించిపోతుంది. రాష్ట్ర ప్రభుత్వం మేడారం సమ్మక్క-సారలమ్మ మహా  జాతరను  గిరిజన సాంప్రదాయాల నడుమ  అంగరంగ  వైభవంగా నిర్వహించేందుకు అన్ని  ఏర్పాట్లను పూర్తి చేసింది. భక్తులకు ఎటువంటి లోటుపాట్లు జరగద్దనే  సంకల్పంతో రాష్ట్ర ముఖ్య మంత్రి 105 కోట్ల నిధులను మంజూరు చేశారు.

తెలంగాణలో మహా కుంభమేళగా ప్రసిద్ధి గాంచిన అతి పెద్ద గిరిజన జాతర రెండేళ్లకొకసారి మాఘ మాసంలో నాలుగు రోజుల పాటు జరుగుతుంది. ఈ జాతరకు రాష్ట్రం నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి సైతం భక్తులు తండోపతండాలాగు తరలివస్తారు.  ప్రతి ఏడాది  భక్తుల తాకిడి పెరుగుతూనే వుంది. ఇప్పటికే  58 లక్షలకు పైగా భక్తులు తల్లులను దర్శించుకున్నారు. ఈ ఏడాది సుమారు రెండు కోట్ల మంది తల్లులను దర్శించుకొనున్నట్లు ప్రాథమిక అంచనా వేశారు. భక్తుల తాకిడికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్నీ ఏర్పాట్లు చేసింది. మేడారంలో  తాత్కాలిక  ఏర్పాట్లతో పాటు ఈ ఏడాది శాశ్వత ఏర్పాట్ల పైనే ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే భక్తులకు వివిధ శాఖల ద్వారా నివాసానికి ఉన్న షెడ్లుతో పాటు అదనంగా షెడ్ల నిర్మాణం చేశారు. వరంగల్‌ నుండి మేడారం మార్గంలో మూడు షెడ్లు ఒక్కోటి 1.65 కోట్లతో నిర్మాణం చేపట్టారు. మేడారం లో తల్లులు గద్దెలకు చేరడానికి ముందు రోజు నుండి తిరిగి వనం లోకి వెళ్లేవరకు భక్తులు  నాలుగు రోజుల పాటు గుడారాలు వేసుకొని అమ్మవార్ల సన్నిధిలో  ఉండడం ఎప్పటి నుండో వస్తున్న ఆనవాయితీ.  ఈ మేరకు గుడారాలతో భక్తులు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం,  జిల్లా యంత్రంగం  ముందుచూపుతో మేడారం లో భక్తులు ఉండేందుకు నివాసానికి ఏర్పాట్లు చేశారు.
ఆదివాసీ సంస్కృతి సంప్రదాయలను గౌరవిస్తూ జాతరకు వొచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టి మహజతరకు సిద్ధంగా ఉంది.

జాతర నిర్వహణకు. త్రాగు నీరు, మరుగుదొడ్లు, అదనపు స్నాన ఘట్టాలు, బ్యాటరీ ట్యాప్స్‌, అంతర్గత రోడ్లు, వైద్యం, వసతి, పారిశుద్ధ్యం, నిరంతర విద్యుత్‌ సరఫరా, రహదారుల అభివృద్ధి , క్యూల్కెన్‌ ఏర్పాటు తదితర అనేక  ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లా యంత్రాంగం క్షేత్రస్థాయిలో అనేక మార్లు  పర్యటించి గత జాతర అనుభవాలను పరిగణనలోకి తీసుకొని లోపాలను సరిదిద్దుకుంటూ  ఏర్పాట్లను విస్తృత పరిచారు. భక్తులకు సులువైన దర్శనమే లక్ష్యంగా జిల్లా, రాష్ట్ర యంత్రాంగం  ప్రత్యేక దృష్టి సారించి పక్కా ప్రణాళికతో జాతరకు ముందే అన్ని పనులు పూర్తి చేసి సిద్ధం చేశారు. జాతరకు ముందు ఏర్పాట్లను పంచయత్‌ రాజ్‌, గ్రామీణాభివృద్ధి , స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ప్రత్యేక శ్రద్ద తో పనులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అవసరమైన సూచనలు చేస్తూ పనులు పూర్తి చేశారు.  ఉన్నతాధికారులు  పలుమార్లు క్షేత్ర స్థాయిలో  పర్యటించి పనులను పర్యవేక్షించారు. రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, దేవాదాయ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, బీసి సంక్షేమ శాఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రత్యేకంగా మేడారం పర్యటించి పనులను పరిశీలించడం  ద్వారా ప్రభుత్వం జాతరకు ఇచ్చిన ప్రాముఖ్యత స్పష్టం అవుతోంది.  మొత్తంగా భక్తులకు అసౌకర్యం కలగకుండా జాతరను విజయవంతం  చేసేందుకు అన్నీ శాఖలు సమన్వయంతో పనులు పుర్తి చేశారు. రవాణా వ్యవస్థను నియంత్రించేందుకు యంత్రాంగం వాహనాల పార్కింగ్‌ స్థలాలను గద్దెల కు దూరంగా  ఏర్పాటు చేయడం, రోడ్ల వెడల్పు, నూతన రోడ్లు, మరమ్మత్తులు చేసి   ట్రాఫిక్‌ సమస్యలను అధిగమించేందుకు చర్యలు తీసుకున్నారు.
జాతరలో నిరంతర నిఘా
జాతర మొత్తంలో 300 ఎల్‌ఈడీ స్క్రీన్‌ లను ఏర్పాటు చేశారు. జాతర నిర్వహణను  పర్యవేక్షించేం 300 సి సి కెమెరాలు,  డ్రోన్‌ కెమెరాలను  ఏర్పాటు చేసి సెంట్రల్‌ కంట్రోల్‌ రూమ్‌ ద్వారా నిరంతర  పర్యవేక్షిస్తున్నారు.  భక్తులకు ఎక్కడా  అసౌకర్యం  కలగకుండా మెరుగైన సేవలు అందించేందుకు  ఆలయ పరిసర ప్రాంతాలను 10 జోన్లు, 38 సెక్టార్లు, 60 సబ్‌ సెక్టర్లుగా విభజించి సెక్టార్ల వారీగా అధికారులు సిబ్బందిని నియమించారు.  సెక్టోరల్‌ అధికారులకు ఇచ్చిన వాకిటాకీ ద్వారా  వివరాలు తెలుసుకుంటూ సమస్యలను ఎప్పటికప్పుడు  పరిష్కరిస్తూన్నారు. దాదాపు 16 వేల మంది ఉద్యోగులు  మేడారం విధులు నిర్వహిస్తున్నారు.
రవాణా శాఖ ద్వారా 6000 బస్సులు
భక్తుల రవాణాకు ఆర్టీసీ ద్వారా 6000 బస్సులను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం  రవాణా సౌకర్యాలు కల్పించేందుకు 2 కోట్ల 25 లక్షల నిధులు మంజూరు చెసింది. తాత్కాలిక బస్‌ స్టాండ్‌ ఏర్పాటు చేసి సీసీ కెమెరాల,  టికెట్‌ బుకింగ్‌ కౌంటర్లు, ల్కెటింగ్‌, రైలింగ్‌, త్రాగు నీటి సౌకర్యం తదితర ఏర్పాట్లు చేసి రవాణాకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టారు.
13 కోట్ల 50 లక్షలతో ఆర్‌ డబ్ల్యుఎస్‌ పనులు
ఆర్‌ డబ్ల్యు ఎస్‌ శాఖ ద్వారా 13 కోట్ల 50 లక్షలతో పనులు చేపట్టారు. 17 ఇన్‌ ఫిల్టరేషన్‌ వెల్స్‌ , 495 ప్రాంతాల్లో  5000 ట్యాప్స్‌ ఏర్పాటు చేశారు. విద్యుత్‌ అంతరాయం కలగకుండా 40 జనరేటర్లు ఏర్పాటు చేశారు. అదే విధంగా 8400 తాత్కాలిక మరుగుదొడ్లు 500 ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. అలాగే 7 ఓవర్‌ హెడ్‌ ట్యాంకులు ఏర్పాటు చేసి తాగునీరు అందిస్తున్నారు. మరుగుదొడ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసేందుకు 300 మంది పారిశుద్ధ్య సిబ్బందిని నియమించారు.
4 వేల కార్మికులతో పంచాయతీ రాజ్‌ శాఖ పారిశుద్ధ్య ఏర్పాట్లు
జాతరకు లక్షల సంఖ్యలో భక్తులు వస్తున్న నేపథ్యంలో పారిశుధ్యం ఇక్కడ పెద్ద సవాలు. పారిశుధ్యం పై జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. పారిశుధ్య నిర్వహణకు 4 వేల కార్మికులను ఏర్పాటు చేసింది. పారిశుధ్య నిర్వహణకు మేడారంకు ఆవల  డంపింగ్‌ యార్డులు  అదే విదంగా మేడారం పరిసర ప్రాంతాల్లో 300 మిని డంపింగ్‌ యార్డులు ఏర్పాటు చేశారు.   పారిశుద్ధ్య కార్మికులతో గద్దెల వద్ద, పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.
విద్యుత్‌ శాఖ :
మేడారం జాతరలో నిరంతరం విద్యుత్‌ సరఫరాకు 3 కోట్లు 97 లక్షలతో పనులు చేపట్టారు. నుతనంగా 210 ట్రాన్స్ఫార్మర్ల  విద్యుత్‌ శాఖ ప్రత్యేకంగా ఏర్పాటు చేసి నిరంతర విద్యుత్‌ అందిస్తుంది.
వైద్య శాఖ :
భక్తుల ఆరోగ్య పరిరక్షణకు వైద్య ఆరోగ్య శాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది. మేడారం కల్యాణ మండపంలో  కోటి రూపాయలతో 50 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేసి 25 మంది  వైద్యులు అలాగే 120 మంది వైద్యాధకారులు, 857 పార  మెడికల్‌ సిబ్బందిని నియమించారు. అదే విధంగా మేడారం పరిసర గ్రామాల్లోను 75 వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి అవసరమైన మందులు అందుబాటులో ఉంచారు.  అంతే కాకుండా క్యూ ల్కెన్ల వద్ద మినీ క్యాంపులు ఏర్పాటు చేశారు. తాడ్వాయి లో 10 పడకలు, పస్ర లో 5 పడకల హాస్పిటల్‌  తోపాటు 11 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేశారు. ఈ జాతరలో ప్రత్యేకంగా 30 మొబ్కెల్‌ అంబులెన్స్‌ లను ఏర్పాటు చేశారు.
పోలీస్‌ శాఖ :
మేడారంలో శాంతి బద్రతల పరిరక్షణకు, జాతరలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా  పోలీస్‌ శాఖ పకడ్బందీ చర్యలు చేపట్టింది. 12 వేల పోలీస్‌ సిబ్బందితో 300 సిసి కెమెరాలు, డ్రోన్‌ కెమెరాలతో జాతర పరిసర ప్రాంతాల్లో 33 పార్కింగ్‌ స్థలాలను  ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు  పర్యవేక్షిస్తున్నారు.అమ్మవార్ల దర్శనానికి పోటెత్తిన భక్తజనం
తల్లులకు ముందస్తు మొక్కులు..జాతరకు ముందే కిక్కిరిసిపోతున్న రహదారులు
గాయమైన భక్తురాలికి చికిత్స చేయించిన సింగరేణి రెస్క్యూటీమ్‌
ములుగు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20 : తెలంగాణ కుంభమేలా మేడారం నేటి నుంచి ప్రారంభయి కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెపైకి తీసుకురానున్న నేపథ్యంలో మంగళవారం అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. తల్లులకు తులాభారంతో బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. వడిబియ్యం, చీర, సారెతో పూజలు చేశారు. భక్తులు పూనకాలతో పరవశిస్తు అమ్మవార్ల దీవెనల కోసం గద్దెల వద్దకు చేరుకుంటున్నారు. మేడారం జనసందోహంతో ఆధ్యాత్మిక భక్తి భావనతో పులకించిపోతుంది. మంగళవారం సారలమ్మ రాక సందర్భంగా  అమ్మవారి గద్దెల ప్రాంగాణాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు.  నేడు సమ్మక్క-సారలమ్మ గద్దెల వద్ద భక్తులు కొబ్బరికాయలు కొడుతున్న సందర్భంలో మహబూబాబాద్‌ జిల్లాకు చెందిన శ్రీజ అనే భక్తురాలి పెదవికి గాయమైంది. దీంతో అక్కడే ఉన్న సింగరేణి రెస్క్యూ టీమ్‌ వైద్య సిబ్బంది వెంటనే శ్రీజని తిరుమల తిరుపతి కళ్యాణ మండపంలోని హాస్పిటల్‌కి తీసుకువెళ్లి ప్రథమ చికిత్స చేయించారు.

 లక్ష్మీపురంంలో 25 లక్షలతో పగిడిద్ద రాజు పూజారుల విడిది కేంద్రం ప్రారంభించిన మంత్రి సీతక్క
ములుగు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20 : 25 లక్షల రూపాయల నిధులతో పగిడిద్ద రాజు పూజారుల నూతన విడిది కేంద్రాన్ని నిర్మించినట్లు పంచాయతీ రాజ్‌ మంత్రి సీతక్క తెలిపారు. మంగళవారం పగిడిద్ద రాజు పూజరుల విడిది కేంద్రాన్ని సీతక్క జిల్లా కలెక్టర్‌ ఇలా త్రిపాఠితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…మహబూబాబాద్‌ జిల్లా ములుగు నియోజకవర్గం పోనుగొండ్ల గ్రామం నుంచి మంగళవారం సాయంత్రం పెనక వంశీయుల పూజారుల ఆదివాసి గిరిజన సంస్తృతి సాంప్రదాయాల నడుమ మేడారనికి కాలి బాటన పగిడిద్ద రాజు పడిగెతో పూజారులు పయనం కానున్నారని..ఈ సందర్భంగా ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం లక్ష్మీపురం గ్రామంలో ప్రభుత్వం పూజరులా కోసం 25 లక్షల రూపాయల నిధులతో విడిది కేంద్రాన్ని నిర్మించిందని తెలిపారు. రాత్రి పూజారులు విడిది కేంద్రంలో బస చేసి బుధవారం సాయంత్రం మేడారానికి చేరుకుంటారని దీంతో జాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతం ఔతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్‌ ఈఈ అజయ్‌ కుమార్‌, అజిత్‌, తదితరులు పాల్గొన్నారు.
విఐపి దర్శనంతో హెలికాప్టర్‌ సర్వీసులు
ఆదివాసి ఛాయా చిత్ర ప్రదర్శన, పర్యాటక సమాచార కేంద్రం
మేడారం మహా జాతరకు పర్యాటక శాఖ విస్తృత ఏర్పాట్లు

మేడారం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20 : మేడారం మహా జాతరకు పర్యాటక శాఖ తరపున సకల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే కుంభమేలా వంటి మేడారం మహా జాతరలో పర్యాటక శాఖ తరఫున అనేక ఏర్పాట్లు చేసినట్లు పర్యాటక శాఖ తన ప్రకటనలో తెలిపింది. ఇక మహా జాతర సందర్భంగా హైదరాబాద్‌ నుంచి మేడారం వరకు విఐపి దర్శనం చేయించి, మళ్ళీ హైదరాబాద్‌లో దించేటట్లు హెలికాప్టర్‌ సర్వీసులను భక్తుల సౌకర్యార్థం పర్యాటక శాఖ ఏర్పాటు చేయడం జరిగింది. దేశంలో ఈ స్థాయిలో జరిగే మరే జాతరలో కూడా ఇలాంటి హెలికాప్టర్‌ సర్వీసులు లేవని, మేడారం జాతరలో మాత్రం ఐదవ సారి సైతం హెలికాప్టర్‌ సేవలను ఏర్పాటు చేశారు. మహా జాతరకు వొచ్చే వివిఐపీ, విఐపీల వసతి, భోజన ఏర్పాట్లను హరిత మేడారం వద్ద ఏర్పాటు చేశారు. పర్యాటకశాఖ ఆధ్వర్యంలో ఉన్న హరిత రామప్ప, హరిత గట్టమ్మ, హరిత లక్నవరం, హరిత తాడ్వాయి, హరిత భవత హోటల్‌లో ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. హరిత హోటల్‌ మేడారం వద్ద గల ఆదివాసి మ్యూజియం ప్రాంగణంలో  పర్యాటకశాఖ ఆధ్వర్యంలో ఛాయాచిత్ర ప్రదర్శన, పర్యాటక సమాచార కేంద్రం ఏర్పాటు చేశారు. హరిత గ్రాండ్‌ హోటల్‌ ప్రాంగణంలో ఆదివాసుల జీవన విధానం తెలిసే విధంగా ట్రైబల్‌ హట్స్‌ ఏర్పాటు చేశారు. అదే విధంగా మేడారం హరిత హోటల్‌ గ్రాండ్‌ సమావేశం మందిరంలో కేంద్ర ప్రభుత్వ టెక్స్‌ టైల్‌, హ్యాండ్లూమ్‌ మంత్రిత్వ శాఖ ద్వారా చేనేత వస్త్ర ప్రదర్శన ఏర్పాటు చేశారు.
 నేటి నుండి మేడారం జాతర..భక్తులకు కొన్ని సూచనలు
హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20 : నేటి నుండి 24 వరకు ములుగు జిల్లా, ఎస్‌ఎస్‌ తాడ్వాయి(మం) మేడారంలో భారీ ఆదివాసీ కుంభమేలా  జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రజారోగ్య సంసిద్ధతలో భాగంగా, తెలంగాణ ప్రభుత్వం మేడారం జాతర మరియు పరిసర ప్రాంతాలలో 72 వైద్య శిబిరాలను 150 మంది వైద్యులతో పాటు అంబులెన్స్‌ సేవలతో పాటు భక్తుల అవాంఛనీయ సంఘటనలు లేదా ఆరోగ్య అత్యవసర పరిస్థితులను పరిష్కరించడానికి విస్తృత ఏర్పాట్లు చేసింది. జాతరలో పాల్గొనే  భక్తులకు రాష్ట్ర ప్రజా ఆరోగ్య మరియు కుటుంబ శాఖ  కొన్ని చేయవలసినవి మరియు చేయకూడని సూచనలు చేసింది.
చేయవలసిన పనులు :
ద్రవపదార్థాలు పుష్కలంగా త్రాగండి : జాతర సమయంలో వాతావరణం వేడిగా మరియు తేమగా ఉంటుంది, కాబట్టి హైడ్రేటెడ్‌గా ఉండటం ముఖ్యం. మీకు దాహం అనిపించకపోయినా, బాటిల్‌/ప్యాక్డ్‌, ఉడికించిన లేదా క్లోరినేట్‌ చేసిన నీటిని మాత్రమే తాగండి.
వదులుగా ఉండే, సౌకర్యవంతమైన దుస్తులను ధరించండి : శ్వాస క్రియకు అనుకూలమైన బట్టలతో తయారు చేయబడిన దుస్తులను ఎంచుకోండి మరియు మీరు స్వేచ్ఛగా కదలడానికి వీలు కల్పిస్తుంది.
చేతులను తరచుగా కడుక్కోండి : ముఖ్యంగా దగ్గు మరియు తుమ్మిన తర్వాత, మరుగుదొడ్లు ఉపయోగించిన తర్వాత, ఆహారాన్ని నిర్వహించే మరియు తీసుకునే ముందు మరియు జంతువులను తాకిన తర్వాత, సబ్బు మరియు నీటితో చేతులు కడుక్కోండి
దయచేసి ఎల్లవేళలా మాస్క్‌ ధరించండి : బాగా వండిన, తాజాగా తయారుచేసిన ఆహారాన్ని మాత్రమే తినాలి. తినడానికి ముందు అన్ని పండ్లు మరియు కూరగాయలను జాగ్రత్తగా కడగాలి.
కొన్ని లక్షణాలను కలిగినప్పుడు వైద్య సంరక్షణను కోరండి : జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, ముక్కు కారటం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, శరీర నొప్పులు మరియు తలనొప్పి వంటి ఏవైనా ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో ఫ్లూ/ఇన్‌ఫ్లుఎంజా ఉంటే…అలాగే, లూజ్‌ మోషన్స్‌, కడుపు నొప్పి మొదలైనవాటిని కలిగినప్పుడు దయచేసి సమీపంలోని ప్రభుత్వం నిర్వహించే వైద్య శిబిరానికి నివేదించండి లేదా హెల్ప్‌లైన్‌ 108 అంబులెన్స్‌ సేవలను ఉపయోగించుకోండి మరియు ఎటువంటి ఆలస్యం లేకుండా ఆరోగ్య సేవలను పొందండి.
చేయకూడనివి :
మద్యం లేదా ఇతర మత్తు పదార్థాలు తాగవద్దు : ఆల్కహాల్‌ మిమ్మల్ని డీహైడ్రేట్‌ చేసి, వేడి సంబంధిత అనారోగ్యానికి గురి చేసేలా చేస్తుంది.
వీధి ఆహారాన్ని తినవద్దు : సరిగ్గా నిల్వ చేయని ఆహారాన్ని తినడం మానుకోండి. రోడ్‌ సైడ్‌ స్టాల్స్‌ నుండి కట్‌ చేసిన పండ్లు మరియు కూరగాయలను తినడం మానుకోండి. ఐస్‌ క్యూబ్స్‌, పచ్చి పాలు లేదా బ్రాండెడ్‌ పాల ఉత్పత్తులు మరియు పచ్చి లేదా తక్కువ ఉడికించిన పౌల్ట్రీ లేదా మాంసం ఉత్పత్తులను తీసుకోవడం మానుకోండి.ఎక్కడా ఉమ్మి వేయకూడదు…బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జన చేయవద్దు పబ్లిక్‌ టాయిలెట్ల కోసం శోధించండి.
ఇక 65 ఏళ్లు పైబడిన వారు లేదా సీనియర్‌ సిటిజన్లు, గర్భిణీ స్త్రీలు, 10 ఏళ్లలోపు పిల్లలు, మరియు రక్తపోటు, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులు వంటికొమొర్బిడిటీలు ఉన్నవారు దీనిని నివారించాలి మరియు అనివార్యమైతే, ఈ సమయంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. జాతర. రద్దీగా ఉండే ప్రాంతాలను వీరు నివారించాలి. జంపన్న వాగులో పుణ్యస్నానం చేసేందుకు సిద్ధమైతే, ఎక్కువ సేపు చల్లని దుస్తుల్లో ఉండకండి.

Leave a Reply