Take a fresh look at your lifestyle.

ఖండాంతరాలు దాటిన కాకతీయ రామప్ప శిల్పకళా వైభవం

(‘యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడం’గా అరుదైన గుర్తింపు పొందిన సందర్భంగా)

1213లో నిర్మితమైన రామప్ప దేవాలయ శిల్పకళా వైభవానికి ముగ్దులైన యునెస్కో ప్రతినిధుల బృందం తెలంగాణలోని ప్రఖ్యాత రామప్ప ఆలయానికి ‘యునెస్కో వారసత్వ స్థలం’గా అంతర్జాతీయ గుర్తింపుకు ఎంపిక కావడం తెలంగాణ ప్రజలకు, దేశవాసులకు గర్వకారణంగా నిలిచింది. నీటిలో తేలియాడే ఇటుకలతో దాదాపు 800 ఏండ్ల క్రితం కాకతీయ రాజులు నిర్మించిన రామప్ప శిల్పకళా సంపదకు ఎనలేని గుర్తింపు రావడం హర్షదాయకం. 2019లో యునెస్కో ప్రతినిధులు రామప్పను సందర్శించి నిశితంగా పరిశీలంచడం, 2020లో తుది జాబితాకు రామప్పను నామినేట్‌ ‌చేయడం కూడా జరిగిన విషయం మనకు తెలుసు. ప్రపంచవ్యాప్తంగా జాబితాలో 42 వారసత్వ కట్టడాలను పరిశీలనకు ఎంపిక చేయగా, నేడు చైనా వేదికగా నిర్వహించిన వర్చువల్‌ ‌సమావేశంలో ‘రామప్పకు యునెస్కో వారసత్వ కట్టడం’గా ఎంపిక చేశామని యునెస్కో ప్రతినిధులు ప్రకటించారు. భారత్‌ ‌నుంచి ఎంపికైన ఏకైక వారసత్వ కట్టడంగా రామప్పకు అరుదైన గుర్తింపు రావడం విశేషంగా చెప్పవచ్చు.

ప్రశాంత ప్రకృతి ఒడిలో వెలసిన రామప్ప గుడిని రామలింగేశ్వర శివాలయంగా పిలుచుకుంటాం. ఇది ములుగు నగరానికి 19 కిమీ, వరంగల్‌కు 77 కిమీ, హాదరాబాద్‌?‌కు 209 కిమీ దూరంలో దక్షిణ భారత తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది. ములుగు జిల్లా వెంకటాపూర్‌ ‌మండలం పాలంపేట్‌ ‌గ్రామ సమీపాన 1213లో కాకతీయ గణపతి దేవా రాజు పాలనలో జనరల్‌ ‌రాచర్ల రుద్రా రెడ్డి నేతృత్వంలో నిర్మితమైన రామప్ప దేవాలయ కట్టడం నాటి శిల్పుల నైపుణ్యానికి ప్రతీకలుగా నిలుస్తున్నది.

Kakatiya Ramappa sculptural splendor across continents

మహాశివరాత్రి పర్వ దినాన రామప్ప దేవాలయంలో భారీ ఉత్సవాలు నిర్వహిస్తారు. శిల్పి రామప్ప నేతృత్వంలో భూమిజ శైలిలో 40 ఏండ్ల శ్రమతో నిర్మితమైన రామప్ప నాటి శిల్పకళా వైభవానికి ప్రతీకగా నిలుస్తున్నది. కాకతీయ పాలనలో ‘మార్కో పోలో’ రామప్పను సందర్శించి మంత్ర ముగ్దుడై ‘దేవాలయాల పాలపుంతలో అత్యంత ప్రకాశవంతంగా వెలిగే ధృవ తార రామప్ప’ అని కొనియాడారని గుర్తు చేసుకోవాలి. రామప్ప ఆలయం 6 అడుగుల ఎత్తైన నక్షత్ర ఆకారంలో అత్యద్భుత సాండ్‌స్టోన్‌ ‌శిల్పకళతో స్తంభాలు, గర్భాలయపై భాగాన నీటిలో తేలే ఇటుకల శిల్పకళా సంపదలు చూపరులను కట్టి పడేస్తాయి.

Kakatiya Ramappa sculptural splendor across continents

శిల్పి రామప్ప పేరున నిర్మితమైన ఏకైక కట్టడంగా రామప్ప దేవాలయానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. దేవాలయ నిర్మాణాలలో పురాణాల ఆధారంగా మహిళా నృత్య సంగీత కళాకారులు, పలు జంతువులు, పలు మానవ శరీర భాగాలను అద్భుతంగా చెక్కగలగటం నమ్మశక్యంగా ఉండదు. ప్రధాన గుడికి ఇరువైపుల రెండు చిన్న శివాలయాలు, గుడి ఎదురుగా అందమైన నందీశ్వరుడు కొలువై ఉన్నారు. గుడిలోని నృత్యభంగిలను ఆధారంగా చేసుకొని నటరాజ రామకృష్ణ ‘పేరిణి శివతాండవం’ నాట్య రీతిని రూపొందించి బహుళ ప్రచారంలోకి తీసుకువచ్చారు.

గత 800 ఏండ్లుగా పలు రాజుల పాలనలు, ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాలను తట్టుకొని నిలిచిన రామప్ప గుడి 17వ శతాబ్దంలో కొంత భాగం ధ్వంసం కావడం విచారకరం. అర్కియలాజికల్‌ ‌సర్వే ఆఫ్‌ ఇం‌డియా నేతృత్వంలో కూలిపోయిన దేవాలయ భాగాల పునరుద్దరణ పనులు జరుగుతున్నాయి. రామప్ప ఆలయానికి 6 కిమీ దూరంలో ‘కోట గుళ్ళ’ వద్ద కూడా మరో శివాలయం ఉన్నది. తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ నేతృత్వంలో రామప్ప దేవాలయం సమీపానగల చెరువు వద్ద కాటేజీలు, రెస్టారెంట్ల సదుపాయాలు కూడా పర్యాటకులకు కల్పించబడ్డాయి. దేశంలోనే యునెస్కో వారసత్వ కట్టడం’గా ఎంపికైన రామప్ప శివాలయాన్ని దర్శించి, శివయ్య దీవెనలు తీసుకుందాం. అపూర్వ శిల్పి రామప్పకు ఘన నివాళులు అర్పిద్దాం.

Leave a Reply