Take a fresh look at your lifestyle.

మనసే  మందిరం…. మట్టి వినాయకుని పూజ శ్రేయస్కరం

ఏ పని తలపెట్టినా విఘ్నేశ్వరుణ్ణి పూజించడం భారతీయ  సంప్రదాయం. విఘ్నాలు రాకుండా చూడమని కోరుకోవడం కోసమే వినాయక చవితి ని  నవరాత్రులుగా తొమ్మిది రోజుల పాటు   వీధుల్లో పందిళ్ళు వేసి ఘనాతిఘనంగా జరుపుకోవడం కూడా ఆనవాయితీయే. ఈ సారి  ఆ ఆనవాయితీకి విఘ్నాలు ఎదురయ్యాయి.  ప్రపంచంలో మనమూ భాగమే కనుక, మానవజాతిని పట్టి పీడిస్తున్న  కొరోనా వైరస్   వల్ల   ఇంట్లోంచి బయటకు రాలేని పరిస్థితులు నెలకొన్నాయి.  కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ప్రచార, ప్రసార మాధ్యమాల ద్వారా    ఎవరూ బయటకు రావద్దని   పెద్ద ఎత్తున గడిచిన ఐదు నెలలుగా  ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాయి. ప్రజల కోసమే ఈ  ప్రకటనలు జారీ చేస్తున్నాయి. అందువల్ల ఈసారి  వినాయక చవితిని వీధుల్లో కాకుండా  ప్రతి ఇంట్లో ఎవరి మటుకు వారు జరుపుకోవాలని ప్రభుత్వం    ప్రజలకు విజ్ఞప్తి చేసింది. వివిధ పీఠాల అధిపతులు,    ఆలయాల నిర్వహాకులు కూడా ఇదే  విజ్ఞప్తి చేశారు.. చేస్తున్నారు. కలియుగ   వైకుంఠ నాథుడైన  తిరుమలేశుడు, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి,  అన్నవరం సత్యనారాయణ స్వామి వంటి ప్రసిద్ధ ఆలయాల్లో  భక్తుల దర్శనాలను   ఎన్నడూ లేని విధంగా  నిలిపి వేశారు..  తిరుమల దేవస్థానంలో    నూట  పాతిక సంవత్సరాల తర్వాత   భక్తులకు  స్వామి వారి దర్శన భాగ్యం కరువయింది .అసాధారణమైన  పరిస్థితులు  నెలకొన్నాయి కనుకనే అసాధారణంగా   ఆలయాల  తలుపులు మూసివేశారు,

దేవుడు ఎక్కడో లేడు మన హృదయంలోనే ఉన్నాడనే భావాన్ని వ్యాపింపజేయడానికి    బమ్మెర పోతనా మాత్యుడు,   భద్రాచల రామదాసు,  త్యాగరాజస్వామి, అన్నమాచార్యులు వంటి కవులు, వాగ్దేయ కారులే కాకుండా   వేమన,    భక్త కనకదాసు  వంటి   ఎందరో మహానుభావులు తమ కవితలు, గేయాల ద్వారా   భక్తిని వ్యాపింపజేశారు.ఇప్పటికీ చేస్తున్నారు. మనసే మందిరం, మది శారదా దేవి మందిరమే వంటి  పల్లవిలు  ఎంతో ప్రాచుర్యాన్ని పొందాయి..  ప్రస్తుత పరిస్థితులను బట్టి  వినాయక చవితిని నిరాడంబరంగా చేసుకోవడం  అందరికీ శ్రేయస్కరం.   తలచితినే గణనాథుని అనే  గీతాన్ని   ఆలపిస్తూ  మనసులో విఘ్నేశ్వరుని  రూపాన్ని ప్రతిష్టించుకుని ఇంట్లో పూజ  చేసుకుంటే     వీధుల్లో, బజార్లలో  వినాయక చవితి పూజలను నిర్వహించిన దానికన్నా వెయ్యింతల  ఫలం వొస్తుంది.     ఆదిత్యుడు అంటే సూర్యభగవానుడు   నమస్కార ప్రియుడు. విఘ్నేశ్వరుడు   ఉండ్రాళ్ళ ప్రియుడు. గణనాయకునికి  ఆకులు, పత్రితో పూజ చేసుకని ఉండ్రాళ్ళను నైవేద్యం పెడితే    పూర్తి ఫలం దక్కుతుంది.    వీధుల్లో   పందిళ్లలో విఘ్నేశ్వరుని ప్రతిష్ఠించి  తొమ్మిది రోజులు నవరాత్రి ఉత్సవాలు నిర్వహించే సంప్రదాయం  తరతరాలుగా  కొనసాగుతోంది. ఇది కేవలం దేవుని పూజ మాత్రమే కాకుండా, దీని వల్ల    అసంఖ్యాకంగా ఎంతో మందికి ఉపాధి లభిస్తోంది. మట్టి వినాయకుణ్ణి పూజించినా,  రంగురంగులతో    ప్లాస్టర్ ఆప్ పారిస్ తో తయారు చేసిన విఘ్నేశ్వరుణ్ణి పూజించినా ఒకటే ఫలం.   పర్యావరణానికి  ఇప్పుడు  అధిక ప్రాధాన్యం లభిస్తున్న తరుణంలో మట్టి వినాయకుణ్ణి పూజించడమే శ్రేయస్కరం.   అసలు  మట్టితో తయారు చేసిన విగ్రహాలను పూజించి వాటిని  నదుల్లో నిమజ్జనం చేయాలని శాస్త్రం చెబుతోంది.  గణేష్ నిమజ్జనం అనే మాట వాడుకలోకి రావడానికి కారణం అదే.  విఘ్నేశ్వరుడు భక్తుల కోర్కెలను  తీరుస్తాడు.. విఘ్నేశ్వరుని రూపంలో సమైక్యతా స్ఫూర్తి ఉంది.      బయో డైవర్సిటీ అనే ఆంగ్ల పదాలను ఇప్పుడు   ఎక్కువగా వినియోగిస్తున్నారు.  అంటే జీవ వైవిధ్యం మన ప్రకృతిలోనే ఉంది.        ప్రకృతి వైవిధ్యానికి ప్రతీక విఘ్నేశ్వరుడు.     విఘ్నేశ్వరుని  ఆకారం  సమైక్యతనూ, సంఘీభావాన్ని పెంపొందించే రీతిలో ఉంటుంది.    ఆధునిక సమాజానికి ఇప్పుడు కావల్సింది సమైక్యత, సంఘీ భావం. సమాజంలో అవి వెల్లివిరిస్తే     సమస్యలన్నీ    దూది పింజల్లా విడిపోతాయి. జాతీయోద్యమ కాలంలో   స్వరాజ్యం నా జన్మహక్కు అని నినదించిన లోకమాన్య  బాలగంగాధర తిలక్   పూణేలో  వినాయక చవితి ఉత్సవాల నిర్వహణ ద్వారానే ప్రజల్లో  జాతీయ భావాన్ని వ్యాపింపజేశారు.  బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా  ప్రజలను సమీకరించడం కోసం     వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించేవారు. అది అప్పటి అవసరం..! అదే సంప్రదాయం మనకు     పూణే నుంచి హైదరాబాద్ కూ, తెలుగు రాష్ట్రాల్లోని ఇతర ప్రాంతాలకూ   విస్తరించింది.   ఆనాడు  బ్రిటిష్ వారిని పారద్రోలడానికి విఘ్నేశ్వరుణ్ణి  తిలక్ ఉత్సవాలను నిర్వహించినట్టే, ఇప్పుడు మానవాళిని కబళిస్తున్న కొరోనా భూతాన్ని తరిమి కొట్టడానికి   వినాయకుణ్ణి సామూహికంగా కాకుండా వ్యక్తిగతంగా ఆరాధిద్దాం.  ప్రధానమంత్రి నరేంద్రమోడీ,  రాష్ట్రపతి రామనాథ్  కోవింద్,  తెలుగు రాష్ట్రాల గవర్నర్లు  హరిచందన్,   తమిళసైలు వేర్వేలు  సందేశాల్లో  చేసిన ఉద్బోధ ఇదే. ఈసారి   వినాయకుణ్ణి ఇళ్ళలోనే పూజిద్దాం. మన మనసే పందిరిగా భావించి అర్చిద్దాం.   వినాయక చవితి ఉత్సవాలను  వీధుల్లో నిర్వహించడంపై ప్రభుత్వం విధించిన నిషేధం మనకోసమే,  ఎవరి మటుకు స్వయం నియంత్రణ పాటిస్తుంటేనే  కొరోనా సామూహిక వ్యాప్తి జరుగుతోందంటున్నారు. ఇక ఉత్సవాలు నిర్వహిస్తే  ఎంతటి తీవ్రంగా  వ్యాప్తి చెందుతుందో  అర్థం చేసుకోవచ్చు.  స్వయం నియంత్రణ అనే పదంలోనే  అది మన కోసమే అన్న అర్ధం స్ఫురిస్తోంది.     హైదరాబాద్ లో  గణపతి బొప్పా మోరియా అనే నినాదాలతో  నిమజ్జనం ఊరేగింపులు    ఎంతఘనంగా జరుగుతాయో     యావత్ దేశానికీ తెలుసు. ఈసారి అలాంటి   దృశ్యాలు కనిపించనందుకు ప్రజల్లో నిరుత్సాహం  వ్యాపిస్తుందన్న మాటనిజమే,. కానీ రాజకీయాలకతీతంగా ..మనం మన కోసమే కాకుండా సమాజం కోసం జీవించాలన్న పెద్దల హితబోధను ఆచరణలో చూపుదాం.  సమాజ కల్యాణానికి దోహదం చేద్దాం.   నిరాడంబరంగా పూజిస్తేనే గణపతి అనుగ్రహిస్తాడు.  ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ  స్ఫురణలో ఉంచుకుంటే చాలు.  అదే సమాజ కల్యాణం అవుతుంది.

Leave a Reply