Take a fresh look at your lifestyle.

ములుగులో ఘోర రోడ్డు ప్రమాదం. ఐదుగురి దుర్మరణం

  • కారును ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు
  • నలుగురు మృతి…ఒకరి పరిస్థితి విషమం

చిట్యాల/ములుగు, ఫిబ్రవరి 19(ప్రజాతంత్ర విలేఖరి): ములుగు జిల్లా కేంద్రానికి సమీపంలోని గట్టమ్మ దేవాలయం వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మేడారం నుంచి హనుమకొండకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు నెక్కొండ వైపు వెళ్తున్న కారును వేగంగా ఢీకొట్టింది. ఈ సంఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, ఒకరు చికిత్స పొందుతూ హాస్పిటల్‌లో మరణించారు. సంఘటన వివరాటలోకి వెళితే..వాజేడు మండలం ధర్మారం గ్రామానికి చెందిన శ్రీనివాస్‌, ‌సుజాత, రమేష్‌, ‌జ్యోతిలు వివాహ సంబంధ విషయమై నెక్కొండకు వెళ్తున్నారు. కారు డ్రైవర్‌ ‌బుద్దే కళ్యాణ్‌ ‌కారులో వారు బయలు దేరారు. మేడారం జాతర విధుల్లో భాగంగా వరంగల్‌ ‌డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు గట్టమ్మ దేవాలయం సమీపంలోకి రాగానే ఎదురుగా వొస్తున్న కారును వేగంగా ఢీకొట్టింది.

ఈ సంఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్‌ ‌కళ్యాణ్‌ ‌కొన ఊపిరితో ఉండగా స్థానికులు హాస్పిటల్‌కి తరలించారు. కళ్యాణ్‌ ‌హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. విషయం తెలియగానే పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. కారును బస్సు ఢీ కొనడంతో కారు పూర్తిగా ధ్వంసమైంది. ఈ సంఘటనలో అందులో ప్రయాణిస్తున్న నలుగురు చిక్కుకుపోయారు. కారులో ఇరుక్కున్న మృతదేహాలను బయటకు తీసేందుకు నానా తంటాలు పడ్డారు. బస్సు కూడా ఈ సంఘటనలో పాక్షికంగా ధ్వంసమైంది. కాగా ఆర్‌టిసి డ్రైవర్‌ ‌నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని మృతుల కుటుంబ సభ్యులు, స్థానికులు ఆరోపించారు. కాగా మృతదేహాలను ములుగు మార్చురీకి తరలించారు. మార్చురీ వద్ద మృతుల కుటుంబీకులు, ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధపడ్డారు. ఆర్టీసీ చైర్మన్‌ ‌వొచ్చి హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని మృతుల కుటుంబీకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటనతో ములుగు ప్రభుత్వ హాస్పిటల్‌ ‌వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది.

Leave a Reply