- అంతు చూస్తామంటూ ఎడిటర్ వాట్సాప్‌కు మెసేజ్‌లు
- పోలీసులకు ఫిర్యాదు చేసిన దేవులపల్లి అజయ్
వినాయక చవితి సందర్భంగా ‘ప్రజాతంత్ర’ దినపత్రికలో ప్రచురించిన కార్టూన్‌పై హిందూ సంఘాల పేరుతో కొందరు ఎడిటర్ దేవులపల్లి అజయ్‌పై అసభ్య పదజాలంతో బెదిరింపులకు పాల్పడ్డారు. సభ్య సమాజం తలదించుకునే విధంగా పత్రికలో ప్రచురించడానికి, రాయడానికి కూడా వీల్లేని భాషలో వాట్సాప్‌లో వ్యక్తిగత దూషణలకు దిగారు. వివరాల్లోకి వెళితే….వినాయక చవితి రోజున ప్రస్తుత కొరోనా పరిస్థితుల నేపథ్యంలో సందర్భోచితంగా కైలాసం నుంచి వచ్చిన వినాయకుడిని రెండు వారాల పాటు క్వారంటైన్‌కు తరలించినట్లు ఇద్దరు పోలీసులు సరదాగా సంభాషిస్తున్నట్లు కార్టూన్ ప్రచురితమయింది.. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ భజరంగ్‌దళ్ పేరుతో ఓ వ్యక్తి, మరో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా నరికేస్తాం…అంతుచూస్తాం అంటూ హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఎడిటర్ అజయ్ తనకు కార్టూన్ విషయంలో వచ్చిన బెదిరింపులకు పాల్పడ్డ వ్యక్తులపై ఎల్బీనగర్ పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. తనకు బెదిరింపు కాల్స్ చేసిన, వాట్సాప్‌లో అసభ్య పదజాలంతో దూషించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ వారి నంబర్లను ఆ ఫిర్యాదుకు జత చేశారు. అలాగే రాచకొండ పోలీస్ కమిషనర్‌కు కూడా ఫోన్ ద్వారా పరిస్థితిని వివరించారు. దీంతోపాటు హిందూ సంఘాల పేరుతో తీవ్రంగా స్పందించంతో పాటు భౌతిక దాడులు చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డ వ్యక్తులపై పోలీసులు వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని జర్నలిస్టు సంఘాల నేతలు డీజీపీ మహేందర్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు.
ఎవరి మనోభావాలు కించపరిచే ఉద్దేశ్యం లేదు .!
ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితి తీవ్రతను తెలియజేసే విధంగా సందర్భోచితంగా ప్రజాతంత్ర దిన పత్రిక ఆగస్టు 22 సంచికలో వేసిన కార్టూన్ కు కొందరు మతం రంగు పూయడం దురదృష్టకరం ..ఎవరి మనోభావాలు కించపరిచే ఉద్దేశ్యం పత్రికకు లేదు..కానీ ఎవరి మనసులయినా గాయపడితే చింతిస్తున్నాము.