Take a fresh look at your lifestyle.

ఇష్టారాజ్యంగా ప్రైవేటు బస్సులు ..!

ఏపీ తెలంగాణ మధ్య ఆర్టీసీ బస్సులు పునరుద్ధరణపై తొలగని ప్రతిష్టంభన

‌తెలంగాణ ఏపీ రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సుల ప్రారంభంపై ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతూనే ఉంది. రెండు రాష్ట్రాల అధికారులు బెట్టు సడలించకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. కిలోమీటర్ల ప్రాతిపదికన బస్సులు తిప్పే అంశంపై ఏపీఎస్‌ఆర్టీసీ, టీఎస్‌ఆర్టీసీ మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో అసలు ఈ సమస్య ఎప్పటికి పరిష్కారం అవుతుందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొరోనా వైరస్‌ ‌నియంత్రణలో భాగంగా అమలులోకి వచ్చిన లాక్‌డౌన్‌ ‌కారణంగా రెండు రాష్ట్రాల మధ్య గత మార్చి నుంచి బస్సుల నిర్వహణను నిలిపివేశారు. దేశంలో కొరోనా వైరస్‌ ఉధృతి కొనసాగుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలతో ఆయా రాష్ట్రాలు బస్సులు నడుపుకోవచ్చని అనుమతించింది. దీంతో రెండు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసుల నిర్వహణపై పలుమార్లు చర్చలు జరిగాయి. అయినప్పటికీ ఏకాభిప్రాయం కుదరలేదు. తాజాగా, ఆర్టీసీ ఎండీల స్థాయిలో జరిగిన చర్చలు సైతం విఫలమయ్యాయి. ఈ చర్చలు సఫలమైన పక్షంలో రెండు రాష్ట్రాల రవాణా శాఖా మంత్రుల చర్చలు నిర్వహంచాలని నిర్ణయించారు. అదే జరిగితే ఇరు రాష్ట్రాల మధ్య బస్సుల నిర్వహణకు ఉన్న ఆటంకాలు తొలగిపోయేవి. కానీ, ఇరు రాష్ట్రాల మధ్య ఎండీల స్థాయిలో జరిగిన చర్చలలో భాగంగా తమ భూ భాగంలో తిప్పే బస్సులను 1.10 లక్షల కి.మీ.లు తగ్గించుకోవాలని టీఎస్‌ఆర్టీసీ అధికారులు పట్టుబట్టారు.

అందుకు తాము 50 వేల కి.మీ.మేర మాత్రమే బస్సులను తగ్గిస్తామని టీఎస్‌ఆర్టీసీ తమ భూ బాగంలో 50 వేల కి.మీ.లు పెంచుకోవచ్చని ఏపీఎస్‌ఆర్టీసీ అధికారులు సూచించారు. అయితే, ఈ ప్రతిపాదనకు టీఎస్‌ఆర్టీసీ అధికారులు అంగీకరించలేదు. రెండు రాష్ట్రాల ఆర్టీసీ అధికారుల మధ్య ఇప్పటికే పలుమార్లు జరిగిన చర్చలు విఫలం కావడం, బస్సులు నడిచే విషయంపై స్పష్టత లేకపోవడంతో ఇదే అదనుగా ప్రైవేటు బస్సుల నిర్వాహకులు స్పీడ్‌ ‌పెంచారు. రెండు రాష్ట్రాల మధ్య ప్రస్తుతం 750 దాకా ప్రైవేటు బస్సులు నడుస్తున్నాయని అంచనా. ముఖ్యంగా ఏపీలోని విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్టణం నుంచి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు వందల సంఖ్యలో ప్రైవేటు బస్సులు నడుస్తున్నాయి. ఇక తెలంగాణ నుంచి సైతం ఇవే పట్టణాలకు ప్రైవేటు బస్సులు అంతే సంఖ్యలో నడుస్తున్నాయి. హైదరాబాద్‌ ‌నగరంలో ఏపీ ప్రజలు ఎక్కువగా నివసించే కూకట్‌పల్లి, లక్డీకాపూల్‌, అమీర్‌పేట, ఎల్బీనగర్‌, ‌హయత్‌నగర్‌, ఎస్సార్‌నగర్‌, ‌జీడిమెట్ల, దిల్‌సుఖ్‌నగర్‌ ‌వంటి ప్రాంతాల నుంచి ఏపీకి ప్రైవేటు బస్సులు ఎక్కువగా నడుస్తున్నాయి. ఆర్టీసీకి బదులుగా ప్రైవేటు బస్సులలో ప్రయాణికుల నుంచి ఇష్టారాజ్యంగా చార్జీలు వసూలు చేస్తున్నప్పటికీ ఏ రాష్ట్ర ప్రభుత్వమూ చర్యలు తీసుకోలేదు. దీంతో ప్రైవేటు బస్సుల యజమానులు సాధ్యమైనంత ఎక్కువ సంఖ్యలో సర్వీసులను నడుపుతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇదే అదనుగా ప్రైవేటు బస్సుల నిర్వాహకులు ప్రయాణికుల నుంచి ఇష్టారాజ్యంగా చార్జీలు వసూలు చేస్తున్నారు. అయినప్పటికీ గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రయాణికులు అడిగినంత ఇచ్చి ప్రయాణం చేయాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply