Take a fresh look at your lifestyle.

విప్లవ కవితాఝరి శాఖమూరి..!

  • ప్రజా చైతన్యమే రవి లక్ష్యం
  • అట్టడుగు వర్గాల హక్కులను కాపాడటమే ధ్యేయం
  • అనతి కాలంలోనే విప్లవ రచయితల సంఘంలో గుర్తింపు
  • జనం పక్షాన నిలిచే పోరాట యోధుడు శాఖమూరి రవి జీవన గమనం

రచనలు అందరూ రాస్తారు.. పాటలు కూడా అందరూ రాయగలరు.. అందులో కొందరు మాత్రమే గుర్తింపు పొందుతారు. సినీ, జానపద గేయాలు రాస్తూ గుర్తింపు పొందాలనుకునే వారు కొందరైతే..అట్టడుగు వర్గాలకు న్యాయం జరగాలని, సమాజంలో పీడనకు గురవుతున్న జనాలకు హక్కులు నెరవేరాలని ఆకాంక్షించేవారు మరికొందరు.. తమ రచనల ద్వారా సమాజాన్ని చైతన్యం చేస్తూ, పాలకుల దౌర్జన్యాలను ఎండగడుతూ పేదల కోసం రచనలు చేసేవారు ఇంకొందరు..అందులో చివరి కోవకు చెందిన వాడే వర్ధమాన విప్లవ రచయిత శాఖమూరి రవి.. అనతి కాలంలోనే రచయితగా, విప్లవ రచయితల సంఘం సభ్యులుగా రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందిన రవి జీవిత ప్రస్థానం ‘‘ప్రజాతంత్ర’’ పాఠకుల కోసం.. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా లోని చిట్యాల మండలం గుంటూరుపల్లి గ్రామానికి చెందిన శాఖమూరి రవి 1973లో జన్మించాడు. వెంకాయమ్మ, చెల్లయ్య దంపతులకు ఏడుగురి సంతానంలో చివరివాడు శాఖమూరి రవి. దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన రవి అనేక ఒడిదుడుకుల మధ్య విద్యాభ్యాసం చేశాడు. చిన్నతనం నుంచి అతనిని అనారోగ్యం కూడా వెంటాడిరది. అనారోగ్యాన్ని, ఆర్థిక సమస్యలను అధిగమించిన రవి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశాడు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన రవికి సోదరుల ప్రోత్సాహం ఎంతగానో లభించింది. ఇంటర్మీడియట్‌ నుంచే హన్మకొండలో ఉండి చదువుకుంటూ రవి బిఎస్సి పూర్తి చేశాడు.

ఆయన విద్యాభ్యాసంలో ముగ్గురు సోదరుల ప్రోత్సాహం ఎంతగానో ఉంది. సమాజం పట్ల తాను అనుసరిస్తున్న విధానంలో తనకు ఎదురైన అవాంతరాలను ఛేదించడంలోనూ ముగ్గురు సోదరులు వెన్నంటి ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో విప్లవ రచయితల సంఘం ఏర్పాటైన ఏడాదే రవి కూడా పుట్టడం కాకతాళీయమే అయినప్పటికీ విరసంలో సభ్యుడుగా చేరడం విశేషం. డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే విప్లవ భావజాలం అందిపుచ్చుకున్న రవి రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు, గ్రామాల్లో భూస్వాముల ఆగడాలు చూసి చలించి పోయేవాడు. ఈ నేపథ్యంలోనే రవి అసహజంగా విప్లవ కార్యక్రమాల పట్ల ఆకర్షితుడై స్వగ్రామంలో చిన్న చిన్న సమస్యలు ఉత్పన్నమైనప్పుడు సామరస్యంగా పరిష్కరించుకోవాలని గ్రామస్తులకు సూచించేవాడు. కాగా రైతు ఆత్మహత్యల పట్ల తీవ్రంగా స్పందించే రవి 1998 ప్రాంతంలో చిట్యాలలో రైతు సేవా సమితి రైతుల పక్షాన నిలబడి పోరాడుతున్న సమయంలో అనుకోకుండా పీపుల్స్‌ వార్‌ పార్టీ కి చెందిన అజ్ఞాత వ్యక్తులను కలవాల్సి వచ్చింది. అప్పుడే తనలో విప్లవ రచనలు చేయాలని ఆలోచన కూడా తట్టింది. తనకున్న కొద్దిపాటి రచనా పరిజ్ఞానంతో రైతుల సమస్యలు, పెట్టుబడిదారులు చేస్తున్న దోపిడీలు, రైతులు గురవుతున్న అన్యాయాలను గ్రహించి రైతు సంఘాలు చేస్తున్న లోపాలను కూడా ప్రశ్నించే స్థాయికి ఎదిగాడు. రైతు సమస్యల పరిష్కారం, రైతు సంఘాల బాధ్యతపై పలు వ్యాసాలు రవి రచించారు. శాఖమూరి రవి ఆర్టికల్స్‌ విషయం ఆనోట ఈ నోట పీపుల్స్‌ వార్‌ పార్టీ నాయకులకు చేరింది.

ఈ క్రమంలోనే అప్పటి పీపుల్స్‌ వార్‌ పార్టీ రవిని చేరదీసినట్లు సన్నిహితులు చెప్పారు. రవిలో ఉన్న రైతు చైతన్య స్ఫూర్తిని అజ్ఞాత నక్సలైట్లు గుర్తించగా, సంఘంలోని దౌర్జన్యాల పట్ల దృఢ సంకల్పంతో స్పందించే రవి అనుకోకుండా విప్లవం వైపు అడుగులు వేశాడు. అనంతరం కేసులు, జైలు జీవితం, పోలీసుల వేధింపులు అనుభవించడం రవికి మొదలైంది. ఒకపక్క కుటుంబ సభ్యుల ఒత్తిళ్లు మరోపక్క ప్రజల ఇబ్బందులు రవిని చాలా ఒత్తిడికి గురిచేసాయి. ఈ క్రమంలోనే ఆయనలో ఉన్న విప్లవకవి బయటకు వచ్చి రచనలు చేయడం ప్రారంభించాడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో పీపుల్స్‌ వార్‌ పార్టీ జనసభను ప్రారంభించగా అందులో క్రియాశీలకంగా పనిచేశాడు. జనసభ కార్యకలాపాలలో ప్రజలను భాగస్వాములను చేయడంలోనూ రవి ముఖ్య భూమిక పోషించారనడంలో అతిశయోక్తి లేదు. అప్పుడే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతుండగా గ్రామాల్లో వంటవార్పులు, రహదారుల దిగ్బంధాలు, నిరసనలు పెద్ద ఎత్తున జరుగుతున్న క్రమంలో ధూమ్‌ ధామ్‌ సభలు ఏర్పాటు చేసేందుకు రవి సన్నద్ధుడయ్యాడు. చిట్యాల మండలంలో మొట్టమొదటిసారి జూకల్‌ గ్రామంలో ధూమ్‌ ధామ్‌ సభను ఏర్పాటు చేయించాడు. అప్పటివరకు మండలంలో కనీసం తెలంగాణ జె ఏ సి కమిటీలు లేకపోగా రవి నేతృత్వంలో ధూమ్‌ ధామ్‌ సభ, తెలంగాణ ఉద్యమ కమిటీలు, జె ఎ సిలు ఏర్పాటయ్యాయి.

అనంతరం వెలిశాల తదితర గ్రామాల్లో ధూంధాం సభలను వెనకుండి నడిపించాడు. 2002 సంవత్సరంలో ఉన్నత విద్య కోసం రవి హైదరాబాద్‌ కు షిఫ్ట్‌ అయ్యాడు. అక్కడి ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ పూర్తి చేశాడు. ఎంఎస్సీ జాగ్రఫీ చదువుతున్న క్రమంలో ప్రభుత్వం ఆయన పైన ‘’పోటా’’ కేసు నమోదు చేసింది. ప్రభుత్వం పెట్టిన పోటా కేసుల్లో రవి పైన పెట్టిన కేసు రెండవది కావడంతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అప్పటి భారీ నీటిపారుదల శాఖ మంత్రి కడియం శ్రీహరి చిట్యాల మండల పర్యటన సందర్భంగా శాఖమూరి రవి పేలుడు పదార్థాలు పీపుల్స్‌ వార్‌ పార్టీకి సమకూర్చాడని మంత్రి హత్యకు కుట్రపన్నాడని పోటా కేసు ఉద్దేశం. పోలీసులు మోపిన ఈ కుట్ర కేసులో  నలబై రోజుల పాటు జైలు జీవితం గడిపిన రవి బెయిల్‌ పై విడుదలయ్యారు. అయినప్పటికీ విప్లవ సంబంధాలను దూరం చేసుకోకుండా ఉద్యమ స్ఫూర్తితో పని చేశాడు. 2004లో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రావడం,  తెలుగుదేశం ప్రభుత్వం తెచ్చిన పోట చట్టాన్ని ఎత్తివేయడం జరిగాయి. రవి పైన పోలీసులు నమోదు చేసిన పోటా కేసు కూడా కొట్టివేయబడిరది.

అనంతరం కాంగ్రెస్‌ ప్రభుత్వం నక్సలైట్లను చర్చలకు పిలవడం, నక్సల్స్‌ షరతులను కొన్నింటిని అమలు చేయడం తెలిసినదే. ఇదే తరుణంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి అధికారంలో ఉండగానే మృతి చెందడం, కాంగ్రెస్‌ పార్టీలో సంక్షోభం నెలకొనడంతో తిరిగి తెలంగాణ ఉద్యమం ఊపందుకున్నది. ఎన్నో ఆటు పోట్ల మధ్య తెలంగాణ ఉద్యమం విజయవంతం కావడం టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడటం చక చక జరిగిపోయాయి. కాగా కొత్తగా ఏర్పాటైన టిఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ‘అవ్వ జెప్పిన తొవ్వ’ అనే పుస్తకాన్ని రచించిన రవి విమర్శకుల ప్రశంసలు పొందారు. రాబోయే తెలంగాణలో అక్రమ అరెస్టులు, బూటకపు ఎన్‌ కౌంటర్లు ఉండవా? మానవ హక్కులు, ప్రజాసంఘాలు స్వేచ్ఛగా తిరగ గలుగుతారా? అని సూటిగా పాలకులను అందులో ప్రశ్నించాడు.  దీంతో రవి విప్లవరచయితల సంఘానికి మరింత దగ్గర అయ్యాడు. రవికి నిర్బంధాలు ఎదురై, కుటుంబ సభ్యుల ఒత్తిళ్లు పెరిగినప్పటికీ విప్లవ రచనల్లో వెనకడుగు వేయకుండా పాలకులను ప్రశ్నిస్తూనే ఉన్నాడు. గడచిన దశాబ్ద కాలంలో రవి అవ్వ జెప్పిన  తొవ్వ తో పాటు గురి, పాదముద్రలు మొదలైన పుస్తకాలను రచించి ప్రశంసలు పొందుతున్నాడు. ఆయన రచనల్లో స్పష్టం అవుతున్న యథార్థ సంఘటనలు ప్రజలను ఆలోచింపచేస్తాయని అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ప్రభుత్వాలను ప్రశ్నించడంలో రవి పాటలు..
గడచిన పదేండ్ల టిఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ వ్యతిరేక, ప్రజా చైతన్య పాటలు రవికి మంచి పేరును తెచ్చి పెట్టాయి. రవి రచించిన పాటలు కేవలం వేళ్ళ మీద లెక్కించవచ్చు. కానీ ఒక్కొక్క పాట ఒక్కోరకంగా ప్రజలను ఉత్తేజ పరుస్తాయి. ఎమ్మెల్యేలుగా పోటీ చేసే అభ్యర్థులు తమ ప్రచారంలో ఆ పాటలను ప్రత్యేకంగా వాడుకుంటున్నారు. 2018లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి  శాఖమూరి రవి రాసిన పత్రికల్లో చూస్తే కారు జోరుగున్నది.. పల్లెకొచ్చి చూస్తే టైరు పంచరైనది.. అనే పాట ఆయన గెలుపుకు దోహద పడిరదనడం అతిశయోక్తి కాదు. గడచిన ఎన్నికల్లోను రవి రాసిన ప్రభుత్వ వ్యతిరేక గీతాలు రాహుల్‌ గాంధీ, రేవంత్‌ రెడ్డి తదితరులు హాజరైన సభల్లో మారుమోగాయి. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, అవాంతరాలు చోటు చేసుకున్న శాఖమూరి రవి నిబద్దతతో విప్లవ భావజాల వ్యాప్తి కోసం కష్టపడుతూనే ఉన్నారు. ప్రస్తుతం వరంగల్‌ సీకేఎం కళాశాలలో ఉపన్యాసకుడిగా పని చేస్తున్న శాఖమూరి రవి భూపాలపల్లి ప్రాంత రైతాంగ సమస్యలపై, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల హక్కులపై, నిరుద్యోగ నియామకాలపై వాగ్బాణాలను ఎక్కుపెడుతూనే ఉంటాడని ప్రజల ఆకాంక్ష…

 -బి కొత్తపెల్లి రామచంద్రమూర్తి (రాము)       చిట్యాల, ప్రజాతంత్ర
-బి కొత్తపెల్లి రామచంద్రమూర్తి (రాము), చిట్యాల, ప్రజాతంత్ర

Leave a Reply