Take a fresh look at your lifestyle.

అట్టహాసంగా.. ఆడంబరంగా..

  • పంచాయతీరాజ్‌ ‌సమ్మేళనాలు
  • అడుగు ముందుకు కదలని పల్లె ప్రగతి – ఎక్కడి సమస్యలు అక్కడే
  • పెచ్చులూడుతున్న పాఠశాల భవనాలు, చెట్లకింద సర్కార్‌బడులు
  • మంచినీటి కష్టాలు యథాతథం 

రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా, ఆడంబరంగా ప్రారంభించిన పంచాయతీరాజ్‌ ‌సమ్మేళనాలు ఆడంబరాలకు, ఫోటోలకే పరిమితమయ్యాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రుల ఉపన్యాసాలతో, వాగ్దానాలతోనే కడుపులు నిండుతున్నాయని, గ్రామాల్లో అభివృద్ధి ఒక్క అడుగు కూడా ముందుకు జరగడం లేదని నెహ్రూ యువజనసంఘం, తెలంగాణ యువజన కాంగ్రెస్‌ ‌నాయకులు విమర్శాస్త్రాలను సంధిస్తున్నారు. అయితే గత జనవరి మాసంలో చేపట్టిన పనులే పూర్తి కాలేదని, మళ్లీ మంత్రులు వచ్చి 25 రోజుల్లో పనులు పూర్తి కావాలని ఆదేశాలు ఇవ్వడం ఏ విధంగా సమర్ధనీయమనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రతీ చోట పెచ్చులూడిన పాఠశాలల భవనాలు, డాక్టర్లు, నర్సులు, సిబ్బంది లేని ప్రాథమిక వైద్యశాలలు, కనీస సదుపాయాలు లేని వెటర్నరీ హాస్పిటాళ్లు, గుంతలుపడిన రోడ్లు, అసంపూర్తిగా ఉన్న ప్రభుత్శ భవనాలు వెల్లువెత్తుతున్న భూమిసమస్యలు గ్రామాలో మంత్రులను అధికారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.రంగారెడ్డి జిల్లా కల్లూరు మండలంలో మంచినీటికి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. గత రెండు సంవత్సరాలుగా ఈ మండలంలోని నీటి ఎద్దడి గురించి వరుసగా గ్రామాల ప్రజలు అధికారులకు , ప్రజాప్రతినిధులకు విన్నవించారు.ఆదిలాబాద్‌ ‌జిల్లా కందలగ్రామంలో ఒకేఒక్క బావి గ్రామస్తులందరీ దాహానికి దిక్కైంది. వనపర్తి జిల్లా కేంద్రానికి సమీపంలోని గ్రామంలో ప్రాథమికపాఠశాలయ ఐదు తరగతులకు ఒకేఒక్క గది ఉన్నది. మిగతా తరగతులన్నీ చెట్లకింద నడిపిస్తున్నారు.ఈ పాఠశాల దుస్థితిపైన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డికి చాలాసార్లు విజ్ఞాపనలు అందించారు.జనగాం పట్టణ కేంద్రంలో బాలికల ప్రాథమికోన్నత పాఠశాల భవనం పై నుంచి పెచ్చులూడుతూ కిందపడుతున్నాయి,..విద్యార్థులు, ఉపాధ్యాయులు భయపడుతూ తిరుగుతున్నారు. జనగాం కలెక్టర్‌కు ఫిర్యాదు కూడా చేశారు. రాష్ట్రంలోని అనేక పాఠశాలలల దుస్థితికి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. గురువారం సిరిసిల్ల బాలికల హాస్టల్‌లో బాలికల ఇబ్బందులను స్వయంగా రాష్ట్ర మంత్రి కేటిఆర్‌ ‌చూసి ఆశ్చర్యపడ్డారు.

వెంటనే భవనాన్ని మార్చాలని అధికారులకు ఆదేశాలను ఇచ్చారు. కరీంనగర్‌లోని అజ్వర్వేటర్‌ ‌హోం దారుణాలపై రాష్ట్ర హైకోర్టు జోక్యం చేసుకొని నివేదికను ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రతీ జిల్లాలటో సమస్యలు యథాతథంగా ఉన్నాయని, ఎటువంటి మార్పులు లేవని సర్పంచ్‌లు, డ్వాక్రా మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గత డిసెంబర్‌లో కరీంనగర్‌లో తాను చదువుకున్న పాఠశాలలో మాట్డాడిన శాసనసభ్యులు రసమయి బాలకిషన్‌ ‌పాఠశాల పదేళ్ల క్రితం తాను పదోతరగతి చదువుకున్నప్పుడు ఎట్లుండెనో, అట్లే ఉన్నదని ఆదేవన వ్యక్తం చేశారు. తెలంగాణ తెచ్చుకొని ఐదేళ్లు గడిచినా పాఠశాలలు బాగు చేసుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.గమనించాల్సిన విషయమేమిటంటే కరీంనగర్‌లో మంత్రి ఈటెల రాజేందర్‌, ఆదిలాబాద్‌లో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, మహబూబాబాద్‌లో మంత్రి సత్యవతిరాథోడ్‌, ‌మహబూబ్‌నగర్‌లో శ్రీనివాస్‌గౌడ్‌ ‌పంచాయతీరాజ్‌ ‌సమ్మేళనాలు నిర్వహించారు.పల్లెప్రగతి కార్యక్రమాలతో గ్రామాల్లో పర్యటిస్తున్నారు. అయితే ప్రచారం జరుగుతున్నంతగా పనులు జరగడంలేదని గ్రామాల్లో మట్టిదిబ్బలు అదేవిధంగా ఉంటున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. మంత్రులు విమర్శలను పట్టించుకోకుండా వేదికలమీద ఉపన్యాసాలను చెప్పి, అధికారులకు ఆదేశాలను ఇచ్చి గ్రామాల్లో కాసేపు పాదయాత్ర చేసి స్థానిక విలేకరులతో మాట్లాడి తిరిగి ప్రయాణమవుతున్నారు.నేరేడుచర్ల మండలం గుండెబోయిన గ్రామంలో కృష్ణానది గ్రామం నుండే ప్రవహిస్తున్నది. అయినా ఆ గ్రామానికి ఇంకా మిషన్‌భగీరథ మంచినీరు అందలేదని మండల యువజన సంఘం నాయకులు పేర్కొన్నారు.మరోవైపున గ్రామాల్లో ముమ్మరంగా వ్యవసాయం పనులు జరుగుతున్నందున ఏ గ్రామానికి వెళ్లినా అధికారులు, మంత్రులే మాట్లాడుకొని తిరుగుప్రయాణం అవుతున్నారు. గ్రామసభలు నిర్వహిస్తామన్నా ప్రజలు అందుబాటులో ఉండటంలేదని స్వయంగా పంచాయతీరాజ్‌ ‌జిల్లా అధికారులు పేర్కొంటున్నారు. మాఘమాసం మంచిరోజులు వచ్చినందున పెళ్లిళ్ల సీజన్‌ ‌కావడంతో ప్రతీపల్లెలో మహిళలు తమ ఇంటి శుభకార్యం కోసం అందిరికి పనులు చెప్తూ మిగతా విషయాలను పట్టించుకోవడంలేదు. పల్లెల్లో పరిస్థితులు ఇలా ఉంటే గ్రామపంచాయతీ కార్యదర్శుల కష్టాలు వర్ణణాతీతంగా ఉన్నాయి. గ్రామస్తులు, అధికారులు గ్రామపంచాయతీరాజ్‌ ‌కార్యదర్శులను ప్రశ్నలతో ముంచెత్తుతున్నారు. గత జనవరిలో నిర్వహించిన పల్ల్పెప్రగతి కార్యక్రమంలో నల్లగొండ జిల్లాలో ఒత్తిడికి గురైన ఒక మహిళా పంచాయతీకార్యదర్శి పల్లెప్రగతి కార్యక్రమం జరుగుతుండగానే నీరసించి వేదికమీదనే సొమ్మసిల్లింది. కొంతమంది కార్యదర్శులు ముందుగానే పసికట్టి సెలవుపై వెళ్తున్నారు. ప్రతీజోట చెరువుల కబ్జాలపైన అధికారులకు ప్రజలు ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ కబ్జాలో ఎక్కువభాగం అధిక•ర టీఆర్‌ఎస్‌ ‌పార్టీ నాయకులదే ఎక్కువ భాగస్వామ్యం ఉండటంతో అధికారులునిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. నల్లగొండలోని మూసీపరీవాహకమంతా ఇసుకదందా చెలరేగింది. అధికారపార్టీ నాయకులే ఇందులో భాగస్వాములనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక అధికారులు సతమతమవుతున్నారు. ఈ సమస్యలన్నింటినీ పక్కదారి పట్టించేందుకు అట్టహాసంగా పత్రికల్లో వచ్చే విధంగా పంచాయతీరాజ్‌ ‌సమ్మేళనాలు, పల్లెప్రగతి జరుగుతున్నదని, సమస్యల పరిష్కారం కాదని పల్లెజనం అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.