Take a fresh look at your lifestyle.

కాంగ్రెస్‌ పాలనలో కోతల స్కీమ్‌లు

బీజేపీ, కాంగ్రెస్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత
ప్రజలకు కేసీఆర్‌ పాలనకు, కాంగ్రెస్‌ పాలనకు తేడా తెలిసింది..
రేపు సంగారెడ్డిలో భారీ బహిరంగ సభ
కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ రావు

జహీరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 14 : రాష్ట్రంలో అధికారంలోకి వొచ్చిన కాంగ్రెస్‌ పార్టీ కొత్త స్కీమ్‌లను తీసుకురాకుండా కోతల స్కీమ్‌లను తీసుకొచ్చిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ రావు ఎద్దేవా చేశారు. ఈ నెల 16న సంగారెడ్డిలో జరగనున్న బీఆర్‌ఎస్‌ పార్టీ మెదక్‌, జహీరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాల బహిరంగ సభ ఏర్పాట్లపై ఆదివారం జహీరాబాద్‌లో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హరీష్‌ రావు మాట్లాడుతూ..బీఆర్‌ఎస్‌ పార్టీ మెదక్‌ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, జహీరాబాద్‌ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్‌ కుమార్‌లకు మద్దతుగా సంగారెడ్డిలో జరిగే బహిరంగ సభకు మద్దతుగా భారీ ఎత్తుగా కార్యకర్తలు, ప్రజలు తరలిరావాలని కోరారు. ఈ బహిరంగ సభకు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ హాజరవుతారని తెలిపారు. కరీంనగర్‌, చేవెళ్ల సభలు విజయవంతంగా జరిగాయని, అదే స్ఫూర్తితో సంగారెడ్డి సభకు స్వచ్ఛందంగా వొచ్చి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. బీజేపీ పదేళ్ల పాలనపై, కాంగ్రెస్‌ నాలుగు నెలల పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిరదని, కేసీఆర్‌ పాలనకు, కాంగ్రెస్‌ పాలనకు తేడాను ప్రజలు అర్థం చేసుకున్నారని తెలిపారు.

మోసం చేసిన కాంగ్రెస్‌పై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని, పార్లెమెంటు ఎన్నికల్లో కసి తీర్చుకుని బుద్ధి చెప్పాలని ఎదురు చూస్తున్నారని హరీష్‌ రావు చెప్పారు. పదేళ్ల బీజేపీ పాలనలో ఏ ఒక్క వర్గానికి కూడా మేలు జరగలేదని పెట్రోల్‌, డీజిల్‌, సిలిండర్‌ ధరలు భారీగా పెరిగాయని విమర్శించారు. దేశంలో 150 మెడికల్‌ మంజూరు చేసినా తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదని, ఒక్క నర్సింగ్‌ కాలేజీ, నవోదయ కాలేజీని కూడా కేటాయించలదేని అన్నారు. ఈ కారణాలతో బీజేపీకి తెలంగాణ ప్రజలు వోట్లేయడానికి సిద్ధంగా లేరన్నారు.

పదేళ్లలో 20 కోట్ల ఉద్యోగాలిస్తామన్న బీజేపీ 6 లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్‌ పాలనలో కోతల స్కీమ్‌లు వొచ్చాయని హరీష్‌ రావు ఎద్దేవా చేశారు. కల్యాణ లక్ష్మికి కోత పడిరది..ఆసరా పింఛన్లలో కోత, కేసీఆర్‌ కిట్‌కు కోత..రోజూ వొచ్చే తాగునీటికి కూడా కోత పడిరదని, దళితబంధు పథకాన్ని ఆపేశారని హరీష్‌ రావు దుయ్యబట్టారు. ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయిన రైతులు వడ్లను తమ కల్లాల్లోనే రూ.1700కు అమ్ముకుం టున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్ల కేసీఆర్‌ పాలనలో ఇలాంటి దుస్థితి ఎన్నడూ లేదని అన్నారు.

రైతులకు అభయ హస్తం ఇస్తామని చెప్పిన కాంగ్రెస్‌ రిక్తహస్తం చూపిందని, రైతులకు ఇచ్చిన ఆరు హామీల్లో ఏదీ అమలు కాలేదని, రైతుబంధు 15 వేలు, కౌలు రైతులకు 15వేలు, వ్యవసాయ కూలీలకు 12 వేలు, ఉచిత కరెంటు, మక్కలకు, వడ్లకు 500 బోనస్‌.. ఏ ఒక్క హామీ కూడా అమలు కాలేదన్నారు. రైతులకు ఇచ్చిన హామీలపై తాను చర్చకు సిద్ధమని, కాంగ్రెస్‌ వైపు నుంచి ఎవరు వొస్తారో రావాలని హరీష్‌ రావు సవాల్‌ విసిరారు.

పార్లమెంటు ఎన్నికల్లోపు వడ్లకు, మక్కలకు 500 బోనస్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. నిరుద్యోగ యువతకు 4 వేలు ఇస్తామని మోసం చేశారని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు 4 డీఏలు పెండిరగ్‌లో ఉన్నాయని, వాటిని వెంటనే చెల్లించాలని హరీష్‌ రావు డిమాండ్‌ చేశారు. రైతులు, మహిళలు, నిరుద్యోగులు, ఉద్యోగులు, పేదలు.. అన్ని వర్గాల ప్రజలు బీజేపీ, కాంగ్రెస్‌లపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, మళ్లీ కేసీఆర్‌ పాలన కోరుతున్నారని తెలిపారు. బీఆర్‌ఎస్‌ గెలిస్తే రాష్ట్రం కోసం దిల్లీలో పోరాడతామని, అసెంబ్లీలోనూ కొట్లాడతామని ఎమ్మెల్యే హరీష్‌ రావు చెప్పారు. సంగారెడ్డి సభకు కార్యకర్తలు స్వచ్ఛందంగా భారీ సంఖ్యలో హాజరుకావాలని ఆయన కోరారు.

Leave a Reply