Take a fresh look at your lifestyle.

అభయమిచ్చిన ‘తల్లులు’!

Tentative nymphs who cater to the wishes of many

  • నాలుగు రోజులు దర్శనమిచ్చి తిరిగి వనాలకు..
  • తల్లులను తరలిస్తుండగా భావోద్వేగానికి గురైన జనం
  • జాతర పరిసమాప్తం
  • అయినా ఆగని భక్తుల రాక

మేడారం: కోట్లాదిమంది కోరికలను తీర్చిన మేడారం వనదేవతలు శనివారం సాయంత్రం తిరిగి వనప్రవేశం చేయడంతో నాలుగురోజులుగా ఎంతో ఘనంగా కొనసాగిన జాతర పరిసమాప్తమైంది. బుధవారం సారలమ్మ రాకతో ప్రారంభమైన ఈ జాతర ఆ మరునాడు సమ్మక్కతల్లి గద్దెకు చేరుకుని రెండు రోజులపాటు భక్తజనానికి దర్శనమివ్వడంతో ఈ జాతరకు సంపూర్ణత చేకూరింది. శనివారం వనప్రవేశం చేయడంతో గత మూడు నాలుగు నెలలుగా మహాకోలాహలంగాఉన్న మేడారం యథావిధిగా ప్రశాంతవాతావరణానికి చేరుకుంటోంది. రెండేండ్లకోసారి జరిగే ప్రతి జాతరకు అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్న భక్తులసంఖ్య పెరుగుతుండడంతో రద్దీకి తట్టుకోలేని భక్తులు జాతర ప్రారంభానికి ముందే లక్షల సంఖ్యలో వచ్చి ముందస్తుగానే మొక్కులను తీర్చుకున్నారు. ఇప్పుడు అమ్మవార్లు వనప్రవేశం చేసిన తరువాత రాక కూడా భక్తుల రాక ఆగలేదు. ఇంకా తండోపతండాలుగా వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. తిరుగువారంలోపుగా ఇంకా అనేకమంది గద్దెలదర్శనానికి రావడం ఇక్కడ సహజం. కోయవడ్డెలు తమ ఆచారం ప్రకారం వనదేవతలను తిరిగి వనానికి తరలించారు. అయితే చిలుకలగుట్ట ప్రాంతానికి సమ్మక్కను తిరిగి తీసుకువెళ్లడానికి పూజారులు వచ్చినపుడు భక్తులు భావోద్వేగానికి గురైనారు. తమ ఇష్టదేవతను తమనుండి బలవంతంగా వేరుచేస్తున్నట్లుగా వారు ఉద్వోగానికి లోనైనారు.అయినా వనం నుండి జనంలోకి ఎలా వచ్చిందో అలానే జనం నుండి వనంలోకి వెళ్ళే దృశ్యాన్ని చూడడం కూడా తమ అదృష్టంగా భావించి భక్తులు అశేషంగా గద్దెల వద్దకు చేరుకున్నారు.

అమ్మను గద్దెకు తెచ్చినప్పుడు ఎలానైతే వారి సంప్రదాయాల ప్రకారం పూజాధి కార్యక్రమాలు నిర్వహించారో అదేవిధoగా తీసుకువెళ్ళేప్పుడుకూడా వారి ఆచార, సంప్రదాయాలను పాటిస్తూ, వాయిద్యాలు, మేళతాళాల మధ్య వనప్రవేశం చేయించారు. సమ్మక్కను చిలుకలగుట్టకు చేర్చగా, సారలమ్మను కన్నెపల్లికి, పగిడిద్దరాజును పూనుగండ్లకు, గోవిందరాజును కొండాయికి తీసుకువెళ్ళారు. గడచిన ఏడు శతాబ్దాలుగా పూజలందుకుంటున్న ఈ నలుగురు వనదేవతలు గద్దెలపై దర్శనమిచ్చిన శుక్ర, శనివారాలు రద్దీ అధికమైంది. భారీజనసమూహాలతో ఈ ప్రాంతమంతా ఎంతో కోలహలంగామారింది. మొత్తంమీద ఈసారి భక్తుల సంఖ్య కోటి సమీపానికి చేరి ఉంటుందన్నది అంచనా. దక్షిణాది కుంభమేళాగా పిలుస్తున్న మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర గడచిన ఏడు శతాబ్దాలుగా ప్రజల గుండెల్లో నిలిచిపోయింది. ఇక్కడ విగ్రహారాధనలేదు.. మంత్రాలు, జపాలు, పూజలు, అభిషేకాలు లాంటివేమీ ఉండవు. అయినా క్రమం తప్పకుండా ప్రతీ రెండేళ్ళకు ఒకసారి మాఘ శుద్ధ పౌర్ణమి ముందు జాతర నిర్వహిస్తూనే ఉన్నారు. ఈసారి జాతరకు ఇద్దరు గవర్నర్లు రావడం విశేషం, తెలంగాణ గవర్నర్‌ ‌తమిళ సై తోపాటుగా, హిమాచల్‌ ‌ప్రదేశ్‌ ‌గవర్నర్‌ ‌బండారు దత్తాత్రేయ అమ్మవారిని దర్శించుకున్నారు. గత జాతరలతో పోల్చిచూస్తే ఈసారి అధికార యంత్రాంగం ఏర్పాట్ల విషయంలో చాలా కష్టపడినే చెప్పాలి. గతంలోలాగా ఎక్కడ ట్రాఫిక్‌ ఇబ్బందులుగాని, విద్యుత్‌, ‌మంచినీళ్ళ అసౌకర్యంగాని ఇప్పుడు పెద్దగా కనిపించలేదు. అయితే అమ్మవార్లను దర్శించుకునే విషయంలో మాత్రం ప్రజలు అనేక ఇబ్బందులకు గురైనారు మామూలుగా భక్తుల దర్శనానికి ఏర్పరిచిన క్యూలతోపాటు విఐపి, వివిఐపి క్యూలను ప్రత్యేకంగా పెట్టినా, సమ్మక్క గద్దెకు వచ్చినరోజు మాత్రం ఆ క్యూలను సక్రమంగా నిర్వహించలేకపోయారు. వివిఐపి పాస్‌లున్నవారుకూడా మామూలు క్యూల్లో నిలబడి తోపులాటలకు గురైనారు. ఫలితంగా మహిళలు చాలా ఇబ్బంది పడ్డారు. రద్దీ ఎక్కువ కావడం, సిఎం, గవర్నర్లు రావడం కారణంగా కొంతసేపు క్యూలైన్‌లను నిలిపివేయడంకూడా తొక్కిసలాటకు కారణమైంది.

గద్దెల చుట్టూ వేసిన ఇనుప కంచెలకు ఆవల అంతా బెల్లంతొ పాటు, భక్తులు తమకు తోచిన చోట కొబ్బరికాయలు కొట్టి విసిరేయడంతో దర్శనంచేసుకునేవారి కాళ్ళకు కొబ్బరిచిప్పలు కుచ్చుకోవడం, వాటిమీద కాళ్ళుపడడంతో తోపులాటతో కిందపడబోవడం లాంటి సంఘటలు జరిగాయి. ఈ అనుభవాలు దృష్ట్యా ప్రతీ జాతరకు భక్తుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా ఆ ప్రాంగణాన్ని విస్తృత పర్చాల్సిఉంది. గత జాతర సందర్భంగా ముఖ్యమంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రకటించినప్పటికీ రెండేళ్ళకాలంలో అందులో ఏ ఒక్కదాన్నికూడా పూర్తిచేయలేకపోవడం విచారకరం. ఇప్పటికే రాష్ట్రస్థాయి పండుగగా ప్రకటించిన ఈ జాతరకు జాతీయ హోదాను తీసుకువస్తానని ప్రకటించారు. అలాగే ముందుగా అనుకున్నట్లు ఈ స్థలం సరిపోవడలేదు కాబట్టి దీన్ని రెండువందల ఎకరాలకు విస్తరిస్తామని, జాతర హడావుడి ముగిసినతర్వాత తానే స్వయంగా ఇక్కడి వచ్చి సర్వే చేయిస్తానని హామీ ఇచ్చారు. మరోకుంభమేళాగా విస్తృతమవుతున్న ఈజాతర నిర్వహణకు దాదాపుగా రె•ండు వందల కోట్లను వెచ్చిస్తామన్నారు. కాని, గత జాతరకు కేటాయించిన దానికన్నా తక్కువగానే నిధులనే ఈసారి కేటాయించడంతో పనులన్నీ అపంపూర్తిగా నిలిచిపోయాయి. జాతరకు జాతరకు రెండేళ్ళ సమయమున్నప్పటికీ, రెండు రోజుల్లో జాతర ప్రారంభంకానుందనే వరకుకూడా పనులు చేస్తూండడంతో పనుల్లో నాణ్యతలోపిన్తున్నది. వచ్చే జాతరవరకైన రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ముందస్తుగానే దృష్టిపెడుతుందని ఆశిద్దాం.

Leave a Reply